ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలింపు
Published Mon, Sep 30 2013 3:37 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
తాండూరు, న్యూస్‌లైన్: ఆర్‌ఎంపీపై దాడి చేసిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ ఆదివారం తెలిపారు. వివరాలు.. తాండూరు ఇందిరానగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ రియాజ్(38) పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో క్లినిక్ నడుపుతున్నాడు. ఈక్రమంలో ఆయన శనివారం రాత్రి 10 గంటల సమయంలో క్లినిక్ నుంచి బైకుపై వస్తున్నాడు. తాండూరు శివారు యాలాల మండలం ఖాంజాపూర్ గేట్ వద్ద సుమారు 30 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు దుండగులు మద్యం మత్తులో ఉండి రియాజ్ వాహనాన్ని అడ్డగించారు. ఆయన వద్ద డబ్బుల కోసం వెతుకుతుండగా ప్రతిఘటించాడు. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న కత్తులతో వైద్యుడి తల, కడుపు భాగాల్లో తీవ్రంగా దాడి చేసి డబ్బులు తీసుకున్నారు. అదే సమయంలో కందనెల్లికి చెందిన మహమూద్ తన ఆటోతో వస్తుండగా దుండగులు గమనించి తమ బైకుపై పరారయ్యారు.
మహమూద్ రియాజ్‌ను గుర్తించి వెంటనే పట్టణంలోని ప్ర భుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించా డు. రియాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. ఆది వారం ఘటనా స్థలాన్ని ఎస్పీ రాజకుమారి సందర్శించి వివరాలు సేకరించారు. దుండగులు తెలుగులో మాట్లాడినందున స్థాని కులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రియాజ్ పరిస్థితి మెరుగ్గానే ఉందని రూరల్ సీఐ రవి చెప్పారు. మేజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం తీసుకున్నారని సీఐ చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు డీఎస్పీ ఇస్మాయిల్ తెలిపారు.
అంతుకు ముందు రైతుపై..
పెద్దేముల్ మండలం కందనెల్లికి చెందిన రైతు ఎం. వెంకటయ్యకు మంబాపూర్‌లో రెండు ఎకరాల పొలం ఉంది. ఈయన శనివారం రాత్రి పొలానికి నీళ్లు పెట్టి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మంబాపూర్ సమీపంలోని రైస్‌మిల్లు వద్ద ముగ్గురు దుండగలు ఆయనను అడ్డగించారు.
డబ్బుల కోసం వెతకగా అతడి వద్ద లభించలేదు. దీంతో అతడిపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కొని బైకుపై పరారయ్యారు. దుండగుల ఆనవాళ్ల ప్రకారం ఆర్‌ఎంపీపై, రైతుపై ఒక్కరే దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement
Advertisement