పసిబిడ్డతో.. తల్లి నాగమ్మ
తాండూరు వికారాబాద్ : తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటలకు పైగా కరెంటు లేకపోవడంతో దవాఖానలో చికిత్స పొందుతున్న 200 మంది ఇన్‌పేషెంట్లతో పాటు, నవజాత శిశువులు అవస్థల పాలయ్యారు. పిల్లలకు ఊపిరి ఆగిపోతోంది.. ఎలాగైనా బతికించండి.. అంటూ చిన్నారుల కుటుంబ సభ్యులు వైద్యుల కాళ్లావేళ్లా పడ్డారు.
పరిస్థితి విషమిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే వైద్యులు మాత్రం.. కరెంటు పోయింది.. వస్తుందిలే అంటూ.. 12 గంటల పాటు కాలయాపన చేశారు. పరిస్థితి చేజారడంతో చిన్నారులను ఇతర ఆస్పత్రులకు తరలించాలని చెతులెత్తేశారు. దీంతో తమ బిడ్డలను తీసుకుని ఒక్కొక్కరుగా జిల్లా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేశారు. అసలే పేద, మధ్య తరగతి కుటుంబాలు కావడంతో చికిత్స కోసం ఎటు తీసుకెళ్లాలో తెలియని దీనావస్థలో మానసిక క్షోభకు గురయ్యారు.
తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రూ.లక్షలు వెచ్చించి జనరేటర్లు అందుబాటులో ఉంచారు. అయితే కరెంటు, జనరేటర్ కనెక్షన్లను ఒకే జంక్షన్ బాక్స్‌కు ఇచ్చారు. ఇది కాలిపోవడంతో కరెంటు సరఫరాక కాక.. జనరేటర్ నడవక సమస్య తలెత్తింది. రాత్రి 10 గంటలకు కరెంటు వచ్చింది.
డబ్బులు లేక పుట్టిన బిడ్డతో..
కర్ణాటక సరిహద్దు గ్రామం కల్లూర్‌కు చెందిన నాగమ్మకు గుజరాత్‌కు చెందిన ఉత్తతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. జిల్లా ఆస్పత్రిలో రెండో కాన్పు చేయించుకుంది. అయితే పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉందని నవజాత శిశుకేంద్రంలో ఉంచాలని చెప్పడంతో.. చిన్నారిని నాలుగు రోజులుగా ఐసీయూలో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక పోవడంతో వైద్యం నిలిచి పోయింది.
సాయంత్రం 5గంటల వరకు కరెంటు రాకపోవడంతో ఇతర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. భర్త అందుబాటులో లేకపోవడం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో బిడ్డతో బిక్కుబిక్కుమంటూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. తాండూరుకు చెందిన శాయదాబేగం బిడ్డ పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకెళ్లారు.
పసిపిల్లలకు అందని వైద్యం..
ఆస్పత్రిలో కొనసాగుతున్న నవజాత శిశుచికిత్స కేంద్రం(ఎన్‌ఐసీయూ)లో దాదాపు 10 మంది రెండు, మూడు రోజుల క్రితం జన్మించిన పసిపిల్లలు, బరువు తక్కువగా ఉన్నవరు, పచ్చకామెర్లు, ఇన్‌ఫెక్షన్ సోకిన చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. ఎన్‌ఐసీయూ యూనిట్‌కు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేలా వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి.
కానీ అదేది లేకుండా ఆస్పత్రి మొత్తానికి ఒకే కనెక్షన్ ఉండటంతో ఆదివారం జంక్షన్ బాక్స్ కాలిపోయింది. దీంతో పసిపిల్లలు చికిత్స పొందుతున్న నవజాత శిశుసంజీవిని కేంద్రానికి కరెంటు సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా లేక పోవడంతో ఆక్సిజన్, వెంటిలేషన్ ద్వారా చికిత్స పొందుతున్న చిన్నారులు శ్వాస అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నియోజకవర్గం, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న ఈ దుస్థితి తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ప్రత్యామ్నాయం ఏదీ...
నవజాత శిశు చికిత్స కేంద్రంలో చికిత్స పొందుతున్న పసిపిల్లల జీవితాలు ప్రమాదంలో పడ్డా.. ఆస్పత్రి వైద్యులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో పసిపిల్లల కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకొని ఉద్వేగానికి గురయ్యారు. అయినా కడా డ్యూటీలో ఉన్న వైద్యులు పట్టించుకోలేదు. 8 గంటలు గడిచిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి ఇప్పట్లో కరెంటు వచ్చేలా లేదని తాపీగా చెప్పారు. దీంతో కొంత మంది తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రులకు మరికొంత మంది హైదరాబాద్‌కు తరలించారు.
డయాలసిస్ కేంద్రానికి తాళం..
ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేక పోవడంతో రక్తశుద్ధి (డయాలసిస్) కేంద్రంలో వైద్య సేవలు నిలిచి పోయాయి. అదే అదనుగా భావించిన సిబ్బంది సేవలను నిలిపి వేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇంటికి పంపించారు. అనంతరం కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment