ప్రముఖ హాస్యనటుడు, ఆనందోబ్రహ్మగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి తాండూరుతో అనుబంధం ఉంది.
తాండూరు, న్యూస్‌లైన్: ప్రముఖ హాస్యనటుడు, ఆనందోబ్రహ్మగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి తాండూరుతో అనుబంధం ఉంది. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడవడంపై తాండూరులో ఆయనతో అనుబంధం ఉన్న వారిని విషాదానికి గురిచేసింది. ఆయనతో కలిసి పనిచేసిన వారు అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుబ్రహ్మణ్యం మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని తాండూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో ధర్మవరపుతో జనార్దన్ కలిసిమెలిసి ఉండేవారు. ఈ సందర్భంగా ఆయన పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
‘1982లో పంచాయతీ సమితిలో విలేజ్ లెవల్ వర్క్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(వీఎల్‌డబ్ల్యూఓ)గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏడాదిపాటు తాండూరులో పనిచేశారు. ఆయన ఎప్పుడూ కళల గురించే మాట్లాడుతుండేవారు. స్థానిక ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే ఆయన ఉండేవారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కు వెళ్లేవారు. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఆల్‌ఇండియా రేడియోలో మాటా మంతి తదితర కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎప్పుడూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మంచి కళాకారుడని, ఆయన ఇక్కడ పని చేస్తే తనలో ప్రతిభకు గుర్తింపు రాదని అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌కు నేను చెప్పాను. దీంతో సుబ్రహ్మణ్యంను చంద్రశేఖర్ ఇక్కడి నుంచి రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌కు వెళ్లారు.
రేడియోలో కార్యక్రమాలు చేస్తుండగానే ఆయనకు బుల్లితెర అవకాశం వచ్చింది. ఆనందోబ్రహ్మలో నటించినఆయనకు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన అనేక సీరియల్స్‌లో అవకాశాలు రావడంతోపాటు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. మంచి హాస్యనటుడిగా ఆయన ప్రేక్షకాదరణ పొందారు. ఒక ఏడాదిపాటు తాండూరులో ఆయన పని చేసినప్పుడు ఎదుటి వ్యక్తులను ఎంతో ప్రేమతో పలకరించేవార’ని జనార్దన్ వివరించారు.