వేసవిలో మండుటెండల్లో ఖానా పూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే వారికి పట్టణానికి చెందిన జనార్దన్ అంబలి పోసి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా (లేఖరిగా) పనిచేస్తున్న పల్లికొండ జనార్దన్ తాను సంపాదించిన దాంట్లోంచి కొంత సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.
ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రాజకీయాలకతీతంగా తొమ్మిదేళ్లుగా సామాజిక సేవచేస్తూ అందరి మన్ననలు పొందుతూ పలువురికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఏటా వేసవి ప్రారంభం కాగానే మూడు నెలల పాటు ప్రజలకు అంబలిని అందిస్తున్నారు.
రద్దీ పెరిగినా వెనక్కి తగ్గకుండా..
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు గతంలో అంతగా జనం వచ్చేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ సేవలు పెంచడంతో రద్దీ పెరిగింది. అయినప్పటికీ ప్రతీరోజు వెయ్యిమందికి పైగా జనానికి ఉచితంగా అంబ లి అందిస్తున్నాడు. దీనికి తోడు రూ.50 వెచ్చించి ఆర్టీసీ బస్టాండ్‌లో కూల్ వాటర్ ఫ్రీజర్ ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నాడు. 7 పదుల వయస్సులోనూ అధైర్యపడకుండా తన సేవలు కొనసాగిస్తున్నాడు.
అంబలితో ఆరోగ్యం..
అంబలి తాగడం ద్వారా వేడిమి నుంచి చల్లద నం పొందడంతో పాటు ఎన్నో పోషక విలువలు అందుతాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా అంబలి సేవిస్తున్నారు.
భవిష్యత్‌లోనూ అందిస్తా..
నాటి కాలంలో ప్రతీ వేసవిలో అంబలి తాగడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వడదెబ్బల నుంచి ఉపశమనం పొందేవారు. తొమ్మిదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టా. భవిష్యత్తులోనూ అందిస్తా.
– పల్లికొండ జనార్దన్, అంబలి దాత
కొన్నేళ్లుగా తాగుతున్నాం..
ఆర్టీసీ బస్టాండ్‌లో జనార్దన్ ఉచితంగా అందించే అంబలిని కొన్నేళ్లుగా తాగుతున్నాం. వేసవి వచ్చిందంటే బస్టాండ్‌లో జనార్దన్ అంబలి ఉంటుందని గుర్తుకు వస్తుంది. ఎన్ని పనులున్నా వదిలివెళ్లి అంబలి తాగుతున్నాం.
– కరిపె రాజశేఖర్, ఖానాపూర్
ఇవి చదవండి: ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు.. కానీ అతను..!
Comments
Please login to add a commentAdd a comment