dharmavarapu subramanyam
-
నచ్చని పనులు చాలా చేయించారు నాతో..!
-
డబ్బు కోసం చేసేవాడిని కాదు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం
-
సినిమా అవకాశాలు లేక చాలా కష్టపడ్డా..!
-
నన్ను హీరో అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి
-
బ్రహ్మానందం, తన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం
-
వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గొప్ప మాటలు
-
బ్రహ్మానందాన్ని ఇంటికి రానివ్వని ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎందుకంటే?
ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఆయన సజీవంగా లేకపోయినా వెండితెరపై ఆయన పంచిన నవ్వులు మాత్రం కలకాలం గుర్తుండిపోతాయి. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. అంటూ ఆయన నోటి నుంచి జారిన మాటల విరుపులు చాలు పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడానికి! ఎక్కువగా లెక్చరర్ పాత్రల్లో కామెడీ పండించిన ఆయన యజ్ఞం, ఆలస్యం అమృతం సినిమాలకు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డులు అందుకున్నారు. 1954లో జన్మించిన ఆయన 2013లో కాలేయ క్యాన్సర్‌తో కన్నుమూశారు. తాజాగా ఆయన తనయుడు రవి బ్రహ్మ తేజ.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం.. నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ నాన్న!) 'మా నాన్న కష్టమనేది తెలియకుండా పెంచారు. ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేమిప్పటికీ సంతోషంగా ఉన్నాం. ఇదంతా ఆయనిచ్చిందే! 2001లో 'నువ్వు నేను' సక్సెస్ పార్టీకి వెళ్లొస్తున్న సమయంలో నాన్నకు యాక్సిడెంట్ అయింది. బస్సు నాన్న కారు మీదకు ఎక్కి దిగింది. అక్కడున్నవాళ్లు నాన్నను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన బతికిబట్టకట్టారు. నాన్న తలపై 21 కుట్లు, కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్ వేశారు. ఆ తర్వాత 2005లో నాన్న ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనయ్యారు. సిగరెట్‌కు బానిస కావడంతో లంగ్స్ పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. పదిరోజులపాటు కోమాలో ఉన్నారు. అలా రెండుసార్లు నాన్నను కాపాడుకున్నాం, కానీ మూడోసారి కాపాడుకోలేకపోయాం. 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం దిగజారింది. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజీ అని చెప్పారు. 11 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. బ్రహ్మానందం నాన్నకు తరచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కసారి ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు. నన్ను చూస్తే తట్టుకోలేవు, ఆరు నెలలు ఆగు, నేనే వస్తా, మళ్లీ షూటింగ్ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే 2013 డిసెంబర్ 7న ఆయన చనిపోయారు. నాన్న చనిపోయినప్పుడు బ్రహ్మానందం ఇంటికి రాలేదు కానీ ఫిలించాంబర్‌లో చాలా ఏడ్చారు' అని చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ తేజ. (సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!) -
ఆయన మాట విరుపులు చాలు.. నవ్వులే నవ్వులు
Dharmavarapu Subramanyam Birth Anniversary: వెండితెరపై కొందరు పంచిన నవ్వులు ఎల్లకాలం గుర్తిండిపోతాయి. ఆ లిస్ట్‌లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘అబ్బా.. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. ఏంది నువ్వు..’ అంటూ చేతులు పిసుక్కుంటూ ఆయన నోటి నుంచి జారే మాటల విరుపులు ప్రేక్షకుల పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పాత్ర ఏదైనా పెద్దగా కష్టపడకుండా బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో అలరించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా లెక్చరర్ పాత్రల్లో ఆయన పంచిన నవ్వుల్ని అంత ఈజీగా మనం మరిచిపోగలమా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి ఇవాళ.. ►ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారాయన. ► విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం సైతం చేశారాయన. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో పరిచయం ధర్మవరపు జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ► కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ ఆయన నటన కెరీర్లో ప్రముఖంగా చెప్పుకోదగింది. అందులో నటించడమే కాదు.. కొన్ని ఎపిసోడ్స్‌ను సైతం డైరెక్ట్ చేశారాయన. 80వ దశకంలో దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ► ఆనందో బ్రహ్మ ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి పేరుతో పాటు సినిమా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి అడుగుపెట్టారాయన. అందులో కొడుకు, స్నేహితుడితో వైరం పెట్టుకునే తిక్క లెక్కల మాష్టార్ క్యారెక్టర్లో ధర్మవరపు నటన అలరిస్తుంది. ► బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్ గప్‌చుప్, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్, నీ స్నేహం, సొంతం, నువ్వే నువ్వే, జయం, మన్మథుడు, ఒక్కడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దొంగోడు, రెఢీ, వసంతం, వర్షం, వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, జై చిరంజీవా, డార్లింగ్, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, జల్సా, చిరుత, మహేష్ ఖలేజా, లీలా మహల్ సెంటర్.. ఇలా ఎన్నో చిత్రాలతో అలరించారు. ► క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ స్కోప్ ఉన్న పాత్రల్లో ఆయన నటనా ప్రస్థానం కొనసాగింది. ఈ క్రమంలో అగ్రహీరోల సరసన సైతం ఆయన నటించారు. ► మణ్ణిన్ మెయింధాన్, చెన్నై కాదల్.. తమిళ చిత్రాల్లోనూ నటించారాయన. ► ‘యజ్ఞం’, ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. ► జంధ్యాల, తేజ తీసిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లు ప్రత్యేకంగా నిలిచాయి. ► ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తోకలేనిపిట్ట’ ► రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్‌గానూ ఈయన పనిచేశారు. ► సాక్షి టీవీలో ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్ డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ► 2013 డిసెంబర్ 7న 59 ఏళ్ల వయసులో కాలేయ కేన్సర్‌తో ఆయన కన్నుమూశారు. తెలుగు ఆడియొన్స్‌కు మరిచిపోలేని హస్యానుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
నవ్వుల సుబ్బన్న
-
ఆనందో ధర్మ
-
ఈ అయిదు పాత్రలూ అదుర్స్!
సందర్భం: ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి కొందరు ‘నవ్వించడానికే’ అన్నట్లు భూమ్మీద పుడతారు. ఆ కోవకు చెందిన నటుడే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘ఆనందో బ్రహ్మ’ అనే సూక్తిని చివరి శ్వాస వరకూ పాటించి... నవ్వుతూ, నవ్విస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్న నటుడాయన. దబాయించి మరీ దశాబ్దాల పాటు కామెడీని తెరపై బజాయించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన వదిలి వెళ్లిన అయిదు తీపి జ్ఞాపకాలు మీ కోసం... 1 స్వాతికిరణం (1992) కాకా హోటల్‌తో కుటుంబాన్ని పోషించుకునే కళాభిమానిగా ఈ చిత్రంలో కనిపిస్తారు ధర్మవరపు. బాలగంధర్వుణ్ణి కన్నతండ్రిగా అనుక్షణం ఆనందాన్ని పొందుతుంది ఆయన పాత్ర. సంగీత ప్రపంచంలో త్రివిక్రమునిగా ఎదిగిపోతున్న కొడుకుని చూసి పొంగిపోతాడు. ఈర్ష్యా ద్వేషాలనే కాలసర్పాల కాటుకి బలైపోయిన కొడుకుని చూసి కృంగిపోతాడు. ధర్మవరపు నటజీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతే పాత్ర ఇది. 2 నువ్వు-నేను (2001) ఇందులో...ప్రిన్సిపాల్ పాత్ర పోషించిన ఎమ్మెస్ నారాయణ ప్రసంగాన్ని మక్కికి మక్కీగా ధర్మవరపు అనువదించడం ఎవ్వరూ మరిచిపోలేరు. ‘ది హోల్ కాలేజ్’.. అని ఎమ్మెస్ అంటే, ‘కాలేజీలో బొక్క పడింది’ అంటూ అనువాదం చేస్తాడాయన. పైగా హెయిర్స్టయిల్లో శోభన్‌బాబు రింగు ఒకటి. ఆ పాత్ర గుర్తొస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలు ఆనందంతో విచ్చుకుంటాయి. లెక్చరర్లను కామెడీగా చూపించే ట్రెండ్ ఈ సినిమాతో మరింత ఊపందుకుంది. ధర్మవరపును స్టార్‌ని చేసిన పాత్ర ఇది. 3 ఒక్కడు (2003) కథతో సంబంధం లేకపోయినా... ఒక్క సీన్లో అలా కనిపించి, ఏళ్ల తరబడి గుర్తిండిపోయేంత అభినయాన్ని పలికించడమంటే సాధారణమైన విషయం కాదు. ‘ఒక్కడు’లో ధర్మవరపు చేసిన ఫీట్ అదే. ఇందులో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా కనిపిస్తారాయన. ‘9 8 4 8 0... 3 2 9 1 9...’ అంటూ... తనదైన శైలిలో... ఆన్లైన్లో ఉన్న తన ప్రేయసికి రొమాంటిగ్గా ఆయన నంబర్ చెప్పే తీరు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది. 4 అమ్మ - నాన్న - ఓ తమిళమ్మాయి (2003) ‘ఏమిరా బాలరాజు.. ఏమిరా లాభం మీ వల్ల.. ఏమైనా పని చేసుకోరా బేవకూఫ్..’ ఈ డైలాగ్ వినగానే ‘అమ్మ నాన్న - ఓ తమిళమ్మాయి’ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తొస్తారు. కాదంబరి కిరణ్‌కు బ్రెయిన్ వాష్ చేసే ఆ సన్నివేశం కామెడీ ప్రియులకు నిజంగా విందుభోజనమే. ఇందులో నాట్యాచార్యుడైన తమిళియన్ పాత్ర ఆయనది. ఈ సినిమాపై ఆయనపై ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా... సినిమా ఆద్యంతం గుర్తుండిపోతుంది ధర్మవరపు పాత్ర. 5లీలామహల్ సెంటర్ (2004) థియేటర్లో ఏ సినిమా విడుదలైతే, ఆ గెటప్‌లో కనిపిస్తూ.... ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్‌కీ లేని మేనరిజంతో ఈ చిత్రంలో ధర్మవరపు రెచ్చిపోతారు. ‘మా బాబే కనుక సినిమా హీరో అయితే... ఈ పాటికి ఇండస్ట్రీ మొత్తం చేత ‘బాబూ బాబూ..’ అని పిలిపించుకునేవాణ్ణి...’ అంటూ ఇండస్ట్రీపై తనదైన శైలిలో సెటైర్ వేస్తారు. ‘లీలామహల్ సెంటర్’లో ఆయన పాత్ర చూసి నవ్వని వారుండటంటే అతి శయోక్తి కాదు. ధర్మవరపు పోషించిన పాత్రల్లో అదుర్స్ అనిపించినవి... ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. భౌతికంగా మాత్రమే ఈ రోజు ఆయన మన మధ్య లేరు. నటునిగా మాత్రం ఎప్పుడూ ధర్మవరపు మనతోనే ఉంటారు. పాత్రల రూపంలో తరచూ మనల్ని పలకరిస్తూనే ఉంటారు. పగలబడి నవ్విస్తూనే ఉంటారు. -
ఆయన మాట నవ్వు...ఆయన బాట నవ్వు
-
నవ్వుల రేడుకు కన్నీటి వీడ్కోలు
అద్దంకి, న్యూస్‌లైన్: ఊపిరితిత్తుల కేన్సర్‌తో హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం అద్దంకి మండలం శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. ధర్మవరపు భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ సందర్శించి నివాళులర్పించారు. ధర్మవరపు భార్య కృష్ణజ, కుమారులు రోహన్ సందీప్, బ్రహ్మతేజలను ఓదార్చారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌హౌస్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, ఏపీ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యుడు ఈదా శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సంది రెడ్డి రమేష్, నగర పంచాయతీ కమిషనర్ టీ వెంకటకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మవరపు కుమారుడు రోహన్ సందీప్ ఆయన చితికి నిప్పంటించారు. అంతిమయాత్ర సమయంలో ఆయన అభిమానులు పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. -
సుబ్బన్న జ్ఞాపకాలు
-
దర్మవరపు సుబ్రమణ్యం అంత్యక్రియలు
-
వెండి తెరకు నవ్వుల వరం
-
నీ నవ్వు పదిలం
-
నేడు ధర్మవరపు సుబ్రమణ్యం అంత్యక్రియలు
-
హాస్యబ్రహ్మకు నివాళి
అద్దంకి, న్యూస్‌లైన్: సినీ హాస్యనటుడు, సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయం ఆదివారం రాత్రి అద్దంకిలోని ఆయన స్వగృహానికి చేరింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఆయన పార్థివదేహానికి సోమవారం ఉదయం 11.30 గంటలకు మండలంలోని శింగరకొండపాలెం సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన అన్న ధర్మవరపు సీతారామయ్య తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయం అద్దంకి చేరగానే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికంగా ఉన్న స్నేహితులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
ధర్మవరపు అంత్యక్రియలు నేడు
సాక్షి, హైదరాబాద్, అద్దంకి: మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ధర్మవరపు భౌతికకాయం హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి 9.30 గంటలకు ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఆయన స్వగృహానికి చేరింది. ఇక్కడి శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఉదయం 11.30 గంట లకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ హైదరాబాద్‌లోని స్వగృహం వద్ద ఉంచిన ధర్మవరపు పార్థివదేహాన్ని పెద్ద సంఖ్యలో రాజ కీయ, సినీ, ఇతర ప్రముఖులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి. వైఎస్సార్సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాం బాబు, శోభానాగిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, సినీ ప్రముఖులు రామానాయుడు, రాజేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి, గోపీచంద్, వందేమాతరం శ్రీనివాస్, సాంస్కృతికశాఖ సంచాలకుడు రాళ్లబండి కవితాప్రసాద్, ఏపీటీవీ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్ ధర్మవరపు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మవరపు మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి నరసింహారావు అంత్యక్రియలకు హాజరైన జగన్.. ఆదివారం ధర్మవరపు కుమారుడు సందీప్‌కు ఫోన్ చేసి ఓదార్చి, తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మూడు నెలల్లో మూడు విషాదాలు..!
*అక్టోబర్ 9న రియల్ స్టార్ శ్రీహరి కన్నుమూత. *నవంబర్ 8న హాస్యనటుడు ఏవీఎస్ మృతి. *డిసెంబర్ 7న మరో మేటి హాస్యనటుడు ధర్మవరపు మరణం. మూడు నెలల కాలంలో ముగ్గురు సినీ ప్రముఖుల అకాల మరణం వారి కుటుంబ సభ్యులతోబాటు తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద లోటే! ముగ్గురూ కెరీర్ పరంగా ఇంకా ఉచ్చ స్థాయిలోనే ఉన్నారు. రకరకాల కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. అనారోగ్యం చుట్టుముట్టినా కూడా చివరిక్షణం వరకూ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. వీటిల్లో కొన్ని సినిమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో, నిజంగా ఆయా దర్శక నిర్మాతలకు టెన్షనే. ఇంకొందరేమో వాళ్లని మైండ్‌లో పెట్టుకుని పాత్రలను సృష్టించుకున్నారు. వాళ్లకి కూడా ఇది మింగుడు పడని పరిణామమే. శ్రీహరి చనిపోయే సమయానికి ఆయన చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. మహేశ్‌బాబు ‘ఆగడు’ సినిమాలో కీలకపాత్రను శ్రీహరితోనే చేయించాలనుకున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పుడా పాత్రకు సాయికుమార్‌ను ఎంచుకున్నట్లు వినికిడి. హిందీలో శ్రీహరి చేసిన ‘రాంబో రాజ్‌కుమార్’ గత వారమే విడుదలైంది. తెలుగులో ఆయన నటించిన వీకెండ్ లవ్, జాబిల్లి కోసం ఆకాశమల్లె, శివకేశవ్, పోలీస్ గేమ్, యుద్ధం, రఫ్ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా శ్రీహరి వర్క్ పూర్తయిపోవడంతో ఆయా దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్ లేనట్టే. ‘వీకెండ్ లవ్’ దర్శకుడు గవర నాగు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో శ్రీహరిదే కీలకపాత్ర. ఒకే ఒక్క సన్నివేశం మినహా ఆయన వెర్షన్ చిత్రీకరణ అంతా పూర్తయింది. షూటింగ్ సమయంలోనే ఆయన వాయిస్ కరెక్ట్‌గా రికార్డ్ కావడంతో దాన్నే సినిమాలో ఉపయోగిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట మిమిక్రీ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్లో మేనేజ్ చేయాలనుకుంటున్నాం’’అని చెప్పారు. శ్రీహరి నటించిన ఆఖరి చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ అని దర్శక, నిర్మాతలు రాజ్ నరేంద్ర, గుగ్గిళ్ల శివప్రసాద్ వెల్లడించారు. ‘‘శ్రీహరి పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. ఆయన ప్రోత్సాహంతోనే మేమీ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలిగాం. ఈ క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని వారు తెలిపారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా... నువ్వు లేని జీవితం’లో శ్రీహరిదే మెయిన్‌రోల్. శ్రీహరి మృతి చెందే సమయానికి ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దాంతో జగపతిబాబుతో ఆ పాత్ర మొత్తం రీషూట్ చేస్తున్నారు. ఒక్క ‘ఇంటింటా అన్నమయ్య’ మినహా ఏవీఎస్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా విడుదలైపోయాయి. కొత్త కమిట్మెంట్స్ కొన్ని ఉన్నా కూడా ఏవీ ఇంకా షూటింగ్‌కి వెళ్లకపోవడంతో పెద్ద ఇబ్బంది లేదు. ధర్మవరపుది కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఆయన సినిమాల వర్కులన్నీ పూర్తయిపోయాయి. ప్రేమా గీమా జాన్తానహీ, హమ్ తుమ్ చిత్రాల్లో ఆయన వర్క్ మొత్తం పూర్తయింది. కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదాయన. చివరిగా చెప్పేదేంటంటే... సినిమా అనేది కథా కథనాలు, స్టార్ వ్యాల్యూతోపాటు లక్‌తో కూడా కూడుకున్న వ్యవహారం. కేవలం సినిమా జయాపజయాలే నిర్మాత భవితవ్యాన్ని నిర్దేశించవు. ఆరంభం నుంచీ చివరి వరకూ.. నిర్మాణంలో ఉండే ప్రతిరోజూ నిర్మాత భవిష్యత్తుకి కీలకమే. ప్రస్తుతం సినిమాల్లోని ప్రతి చిన్న విషయాన్నీ ప్రేక్షకులు సునిశితంగా చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు సంభవించే ఆర్టిస్టుల మరణాలు ఉన్నట్టుండి కథలో మార్పులకు కారణమవుతున్నాయి. చనిపోయిన నటుడు డబ్బింగ్ చెప్పడం పూర్తి కాకపోయినా ఇక్కడ ఇబ్బందే. మిమిక్రీ ఆర్టిస్టులను సంప్రదించాల్సిన పరిస్థితి. చివరకు సినిమా దెబ్బతినడానికి అదే కారణం కూడా కావచ్చు. చిన్న నిర్మాతలకు ఇది నిజంగా శరాఘాతమే. ఎంత పెద్ద నిర్మాత అయినా రీషూట్ కి వెళ్లడమనేది ఆర్థికంగా పెనుభారమే! కానీ అనుకోకుండా జరిగే ఈ హఠాత్పరిణామాలను ఎవరూ ఆపలేరు కదా. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ... ఈ మూడునెలల్లో సంభవించిన పరిణామాలు ఇకముందు ఎన్నడూ తెలుగు సినిమాకు ఎదురు కాకూడదని కోరుకుందాం. ‘పిల్లా... నువ్వులేని జీవితం’ సినిమాకు శ్రీహరి పాత్ర వెన్నెముక లాంటిది. ఆయన వెర్షన్ 80 శాతం పూర్తయింది. ఈ లోగా ఘోరం జరిగిపోయింది. ఆయన చేసినన్నాళ్లూ ఎంత బాగా సహకరించారో. ఆయన పాల్గొన్న ఆఖరి తెలుగు సినిమా షూటింగ్ మాదే. ఆర్ఎఫ్సీలో యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నాం. ఆయన కారు డ్రైవ్ చేస్తూ, వేరే కారుని గుద్దేయాలి. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. శ్రీహరికి పెద్ద ప్రమాదమే జరిగిందనుకున్నాం. కంగారుగా పరిగెత్తుకెళ్లి ‘అన్నా... ఏం కాలేదుగా...’ అంటే ‘ముందు షాట్ బాగా వచ్చిందా లేదా చెప్పు’ అనడిగారు. అదీ ఆయన డెడికేషన్. ఇప్పుడా పాత్రను జగపతిబాబుతో రీషూట్ చేస్తున్నాం’’ -రవికుమార్ చౌదరి, దర్శకుడు -
తాండూరు యాదిలో ‘ఆనందోబ్రహ్మ’
తాండూరు, న్యూస్‌లైన్: ప్రముఖ హాస్యనటుడు, ఆనందోబ్రహ్మగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి తాండూరుతో అనుబంధం ఉంది. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడవడంపై తాండూరులో ఆయనతో అనుబంధం ఉన్న వారిని విషాదానికి గురిచేసింది. ఆయనతో కలిసి పనిచేసిన వారు అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుబ్రహ్మణ్యం మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని తాండూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో ధర్మవరపుతో జనార్దన్ కలిసిమెలిసి ఉండేవారు. ఈ సందర్భంగా ఆయన పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. ‘1982లో పంచాయతీ సమితిలో విలేజ్ లెవల్ వర్క్ డెవలప్మెంట్ ఆఫీసర్(వీఎల్‌డబ్ల్యూఓ)గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏడాదిపాటు తాండూరులో పనిచేశారు. ఆయన ఎప్పుడూ కళల గురించే మాట్లాడుతుండేవారు. స్థానిక ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే ఆయన ఉండేవారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కు వెళ్లేవారు. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఆల్ఇండియా రేడియోలో మాటా మంతి తదితర కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎప్పుడూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మంచి కళాకారుడని, ఆయన ఇక్కడ పని చేస్తే తనలో ప్రతిభకు గుర్తింపు రాదని అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌కు నేను చెప్పాను. దీంతో సుబ్రహ్మణ్యంను చంద్రశేఖర్ ఇక్కడి నుంచి రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌కు వెళ్లారు. రేడియోలో కార్యక్రమాలు చేస్తుండగానే ఆయనకు బుల్లితెర అవకాశం వచ్చింది. ఆనందోబ్రహ్మలో నటించినఆయనకు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన అనేక సీరియల్స్‌లో అవకాశాలు రావడంతోపాటు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. మంచి హాస్యనటుడిగా ఆయన ప్రేక్షకాదరణ పొందారు. ఒక ఏడాదిపాటు తాండూరులో ఆయన పని చేసినప్పుడు ఎదుటి వ్యక్తులను ఎంతో ప్రేమతో పలకరించేవార’ని జనార్దన్ వివరించారు. -
నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు సినీ ప్రముఖుల నివాళి
ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్‌షుక్‌నగర్‌లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ హాస్య సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన భౌతికాయాన్ని ఆదివారం సినీ,రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. -
సుబ్బన్న ఇక లేరు
-
‘ఆనందో బ్రహ్మ’ అంటూ వెళ్లిపోయారు...
1980ల్లో... టీవీ చూడడమే ఓ క్రేజ్. ముఖ్యంగా దూరదర్శన్‌లో వచ్చే ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్ చూడటమంటే ఇంకా ఇంకా క్రేజ్. వారం వారం అరగంట సేపు వచ్చే ఆ సీరియల్ కోసం వారమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు తెలుగు ప్రేక్షకులు. అన్నీ జోకులే. అవి చూసి పొట్ట పట్టుకోకుండా నవ్వనివాడుంటే ఒట్టే. ‘ఆనందో బ్రహ్మ’ అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ట్రేడ్‌మార్క్. ఒక కామెడీ సీరియల్‌తో తెలుగునాట సూపర్‌స్టార్ కావడమంటే ఒక్క ధర్మవరపుకే చెల్లింది. జోక్స్ అందరూ పేలుస్తారు. కానీ ధర్మవరపు జోక్స్ పేల్చే స్టయిల్, ఆ మాట విరుపు, ఆ ఎక్స్‌ప్రెషన్సూ చూస్తే నవ్వుకి కూడా తెగ నవ్వొచ్చేస్తుంది. హాస్యనటుడిగా బుల్లి తెరపై, వెండి తెరపై ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయం... సదా స్మయిలనీయం. 24 ఏళ్ల సినీ ప్రస్థానంలో వందలాది పాత్రలతో తెలుగు హృదయాల్లో శాశ్వత స్థానం సముపార్జించుకున్నారాయన.ఆరో తరగతిలో బీజం: ధర్మవరపు సొంతవూరు ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం. ఆ ఊరికి అయిదు కిలోమీటర్ల దూరంలోని వైదరలో ఆరో తరగతి చదువుతుండగా ‘దొంగ వీరడు’ అనే నాటకంలో మురళి అనే చిన్న పిల్లాడి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ స్కూల్లో 550 మంది స్టూడెంట్స్ ఉంటే, ఏరికోరి ధర్మవరపునే ఎంచుకున్నారు. అలా ఆయన మనసులో తొలి నటనా బీజం పడింది. అది ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా ఎదుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఒంగోలులో ప్రజా నాట్యమండలితో కలిసి చాలా నాటకాలు ప్రదర్శించారు. ఊహించని మలుపు: స్నేహితులతో కలిసి సరదాగా గ్రూప్-2 ఎగ్జామ్స్ రాస్తే, హైదరాబాద్‌లో ఉద్యోగం లభించింది. కేవలం సినిమాల్లో ప్రయత్నాల కోసం హైదరాబాద్‌లో ఉద్యోగిగా చేరారు. మొదట్లో అనేక రేడియో కార్యక్రమాలు చేశారు. అప్పుడే ‘దూరదర్శన్’ కొత్తగా మొదలైంది. కొన్నాళ్ల తర్వాత దూరదర్శన్‌లో సీరియల్స్ మొదలుపెట్టారు. తొలి తెలుగు, సీరియల్ ‘అనగనగా ఒక శోభ’ సృష్టికర్త ఆయనే. ఆ తర్వాత ‘బుచ్చిబాబు’ సీరియల్ కూడా ఆయనే రాశారు. ఇక ‘ఆనందో బ్రహ్మ’ అయితే ఆయన్ను స్టార్‌ని చేసేసింది. జయమ్ము నిశ్చయమ్మురా: జంధ్యాల పరిచయం ధర్మవరపుని వెండితెర మీదకు తీసుకొచ్చింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో జంధ్యాల బలవంతం మేరకు (1989) రంగనాథం పాత్ర చేశారు. నిజానికి అది సుత్తి వీరభద్రరావు చేయాల్సిన పాత్ర. ఆయన చనిపోవడంతో ధర్మవరపుతో చేయించారు. ఆ సినిమాకు ఆయన అందుకున్న పారితోషికం 7500 రూపాయలు. ఈ సినిమా విడుదల కాకముందే సీనియర్ నిర్మాత కె.రాఘవ ‘అంకితం’ సినిమాలో పిలిచి వేషం ఇచ్చారు. జంధ్యాలతో ధర్మవరపు అనుబంధం ప్రత్యేకమైంది. జంధ్యాల దర్శకత్వంలో ‘లేడీస్ స్పెషల్, బావా బావా పన్నీరు, బాబాయ్ హోటల్, జిందాబాద్, ష్ గప్‌చుప్’ తదితర సినిమాలు చేశారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తోనే హాస్యనటునిగా మంచి మార్కులు సంపాదించేశారు. అందులో స్కూలు టీచర్‌గా పరీక్ష పేపర్లు దిద్దే సన్నివేశాన్ని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుని మరీ నవ్వుతారు. తెలుగుదనమున్న హాస్యం: ధర్మవరపు తన కెరీర్లో ఎన్నడూ వెనుతిరిగి చూడాల్సిన సందర్భమే రాలేదు. తోటి హాస్యనటులకు దీటుగా తనదైన మార్కు హాస్యంతో పరిశ్రమలో నిలబడ్డారు. ఎక్కడా అతి లేకుండా, పరిధులు దాటకుండా, అశ్లీలతకు దూరంగానే హాస్యాన్ని పండించారు. వాచకంలో స్పష్టత, తెలుగుదనం ఉట్టిపడడం ఆయనలోని ప్రత్యేకత. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆయనకంటూ ఓ శైలిని సృష్టించిపెట్టింది. అసలు కొన్ని కొన్ని పాత్రలైతే ఆయనను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం. స్వాతికిరణం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, ఫ్యామిలీ సర్కస్, లీలామహల్ సెంటర్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, ఒక్కడు, ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు... తదితర చిత్రాల్లోని పాత్రలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ‘ఒక్కడు’ సినిమాలో ‘నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో’... అంటూ మొబైల్ నెంబర్ చెప్పే తీరు సూపర్. ‘తోక లేని పిట్ట’ సినిమాతో దర్శకునిగానూ తన ప్రతిభ కనబర్చారు. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.కొన్నాళ్లుగా కేన్సర్‌తో పోరాడుతున్నా, ఎక్కడా అధైర్యపడలేదు. చివరి క్షణం వరకూ నవ్వుతూ, నవ్విస్తూనే ఉన్నారు. సినిమాలకూ దూరం కాలేదు. ఆనందంగా బతకడమే తన ఫిలాసఫీ అని చెప్పిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి క్షణం వరకూ అదే పద్ధతిని అనుసరించారు. నవ్వుకి ఆనందయోగం పట్టించిన ధర్మవరపు ఎప్పటికీ చిరంజీవే! ‘సాక్షి’ టీవీలో ‘డింగ్‌డాంగ్’ ‘సాక్షి’ చానల్‌తో దర్మవరపు సుబ్రమణ్యంది విడదీయరాని అనుబంధం. అప్పుడెప్పుడో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఆనందో బ్రహ్మ’ కార్యక్రమంతో తెలుగులోగిళ్లలో నవ్వుల్ని పంచిన ధర్మవరపు... మళ్లీ ‘సాక్షి’ చానల్లో ప్రసారమవుతున్న.. ‘డింగ్ డాంగ్’ కార్యక్రమం ద్వారా మరోసారి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. సెటైరికల్‌గా సాగే ఈ కార్యక్రమం అటు చానల్‌కే కాక, ధర్మవరపుకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎంతో ఇష్టంతో ఆయన ఈ కార్యక్రమం చేసేవారు. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం దాదాపు 350 ఎపిసోడ్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. తొలినాళ్లలో వారానికి ఓసారి ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. అయితే... ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని వంద ఎపిసోడ్స్ తర్వాత నుంచి వారానికి రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది సాక్షి చానల్. ధర్మవరపు ప్రతిభ కారణంగా రెండు సార్లు ఈ కార్యక్రమం జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది. ధర్మవరపుకు ఈ కార్యక్రమంపై ఎంతటి మమకారం అంటే... మిగతా చానల్స్ వారు ఇలాంటి కార్యక్రమమే తమకూ చేసిపెట్టమని అడిగినా... ఆయన ససేమిరా అనేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, చివరకు ఫారిన్ షూటింగ్ ఉన్నా... ‘డింగ్ డాంగ్’ కార్యక్రమానికి ఇబ్బంది కలుగకుండా.... షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకునేవారు ధర్మవరపు. ఆయన మరణం సాక్షికి నిజంగా తీరని లోటే.