మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
సాక్షి, హైదరాబాద్, అద్దంకి: మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ధర్మవరపు భౌతికకాయం హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి 9.30 గంటలకు ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఆయన స్వగృహానికి చేరింది. ఇక్కడి శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఉదయం 11.30 గంట లకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ హైదరాబాద్‌లోని స్వగృహం వద్ద ఉంచిన ధర్మవరపు పార్థివదేహాన్ని పెద్ద సంఖ్యలో రాజ కీయ, సినీ, ఇతర ప్రముఖులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి. వైఎస్సార్‌సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాం బాబు, శోభానాగిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, సినీ ప్రముఖులు రామానాయుడు, రాజేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి, గోపీచంద్, వందేమాతరం శ్రీనివాస్, సాంస్కృతికశాఖ సంచాలకుడు రాళ్లబండి కవితాప్రసాద్, ఏపీటీవీ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్ ధర్మవరపు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మవరపు మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి నరసింహారావు అంత్యక్రియలకు హాజరైన జగన్.. ఆదివారం ధర్మవరపు కుమారుడు సందీప్‌కు ఫోన్ చేసి ఓదార్చి, తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.