నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్. కామెడీ రూపంలో ఆ టానిక్‌ని ప్రేక్షకులకు అందిస్తున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంని ‘నవ్వుల డాక్టర్’ అంటే అతిశయోక్తి కాదు. హాస్య నటుడిగా, కేరక్టర్ నటుడిగా ఆయన స్కోర్ ఏడువందల యాభై సినిమాలు. ఇక, ఆయన వ్యక్తిగత స్కోర్‌కి వస్తే... నేటితో 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ధర్మవరపుతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ...
*** 60 ఏళ్ల ఈ జీవన ప్రయాణం మీకెలా అనిపిస్తోంది?
వ్యక్తిగతంగానే కాదు... వృత్తిపరమైన ప్రయాణం కూడా సంతృప్తికరంగానే ఉంది.
*** 750 చిత్రాల్లో నటించారు కదా.. ఇంకా ఫలానా పాత్ర చేయాలనే కోరికేమైనా ఉందా?
తీరని కోరికలు తీరే సమయం కాదిది. సినిమా పరిశ్రమ ఊహకందని వేగంగా వెళుతోంది. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితిలో ఫలానాది చేయాలనే కోరికలు పెట్టుకోవడం సరికాదు.
*** పరభాషల నటీనటులను తెలుగుకి తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం?
కచ్చితంగా బాధాకరమే. నాలాంటి ఓ ఆరేడు మందికి అవకాశాలకు కొదవ లేదు. కానీ, అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య చాలానే ఉంది. అలాంటప్పుడు మనవాళ్లకి అవకాశం కల్పించకుండా ఎక్కడో బాలీవుడ్ నుంచో మరో భాష నుంచో తారలను తీసుకురావడం ఎంతవరకు సమంజసం? కళకు భాషతో సంబంధం లేకపోయినా ఇతర భాషలవాళ్లు ఇక్కడికి రావడంవల్ల మనవాళ్లు ఇబ్బందులకు లోనవుతున్నారు కదా. ఇప్పుడసలు హీరోయిన్ అంటే.. మన తెలుగమ్మాయి ఎక్కడ కనిపిస్తోంది. అంతా బాలీవుడ్‌వాళ్లే. అంజలీదేవి, జమునలాంటి నటీమణులు జనహృదయాల్లో నిలిచిపోయారు. ఇప్పటి హీరోయిన్లు ఎప్పటికీ మనసుల్లో నిలవరు.
*** పరభాషల నుంచి మీకు అవకాశాలు వచ్చినప్పుడు చేశారు కదా?
రెండు, మూడు తమిళ చిత్రాల్లోనూ రెండు కన్నడ సినిమాల్లోనూ చేశాను. అది కూడా పెద్ద దర్శకులు అడగడంతో చేశాను. మనకి ఇక్కడ బాగున్నప్పుడు అంత దూరం వెళ్లి సినిమాలు చేయాల్సిన అవసరం ఏంటి? అనిపించింది.
*** రాష్ర్టంలో నెలకొన్న రాజకీయాల కారణంగా ఫ్యూచర్‌లో సినిమా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందేమో...
సినిమా అనేది మంచి వినోద సాధనం. దానిపై రాజకీయాల ప్రభావం పడటం బాధ కలిగించే విషయం. నిర్మాతలు, పంపిణీదారులు.. ఇలా చాలామంది నష్టాలపాలవుతున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. అసలే జయాపజయాలతో పరిశ్రమ కుంటుతోంది. కుంటుతూ నడుస్తున్న పరిశ్రమపై ఉద్యమాలు పడుతున్నాయి. ఈ కారణంగా పరిశ్రమ కొన ఊపిరితో ఉందనిపిస్తోంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది.
*** గతంలో ‘తోకలేని పిట్ట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ డెరైక్షన్ చేయకపోవడానికి కారణం?
ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తే, నటుడిగా పది సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అవి వదులుకోవడం ఇష్టం లేక డెరైక్షన్ వదిలేశా.
*** ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
ఆ మధ్య కాస్త అనారోగ్యంపాలయ్యాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటా.
*** ‘సాక్షి’ టీవీకి ‘డిండ్ డాంగ్’ షో చేస్తున్నారు కదా?
అది చాలా ఇష్టపడి చేస్తున్న ప్రోగ్రామ్. అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ‘గో ఎ హెడ్’ అన్నారు. ఎవర్నీ కించపరచకుండా అందర్నీ హాయిగా నవ్వించే కార్యక్రమం ఇది. జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ ప్రోగ్రామ్‌గా అవార్డులొచ్చాయి. అందుకే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాను. రోజు రోజుకీ ‘డింగ్ డాంగ్’ మీద ఇంకా మోజు పెరుగుతోంది.