రిలేషణం: నా తమ్ముడు మనసున్నవాడు!
ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకం, సాహిత్యం, టీవీ, సినిమా, రాజకీయం... అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయనదో ప్రత్యేక ముద్ర. ఆయనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. తెలుగు కళామతల్లికి వరపుత్రుడైన ఆయన గురించి అన్న సీతారామారావు చెబుతున్న విశేషాలు...
మాది ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం. నలుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాణ్ని. సుబ్రహ్మణ్యం చిన్నవాడు. నాన్నగారు నా పదో యేట చనిపోయారు. అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచారు. అమ్మకు పొలం పనుల్లో సహాయపడేవాళ్లం. మా అమ్మ పడిన కష్టం మరే తల్లీ అనుభవించకూడదు. సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటినుంచీ నాటకాల పిచ్చి. శ్రీరామనవమి, వినాయకచవితి పందిళ్లలో పౌరాణిక నాటకాలు చూసి తెలవారుతుండగా వచ్చేవాడు. పద్యాలు పాడటం నేర్చుకున్నాడు. సినిమాలంటే కూడా మోజు. అద్దంకిలో ఆరేడు తరగతులు చదువుతున్నప్పుడు రోజూ సినిమాలకు వెళ్లేవాడు. తను ఎన్.టి.ఆర్. ఫ్యాన్. నేను ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్. నాటకాల కరపత్రాల్లో వాడి పేరు పక్కన అపర ఎన్.టి.ఆర్. అని, నాకు అపర ఎ.ఎన్.ఆర్ అని రాసేవాళ్లు.
తరువాత తను ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ కాలేజీకి వెళ్లాడు. అక్కడ తనకు ఎస్.ఎఫ్.ఐ.తో అనుబంధం పెరిగింది. తమ్ముడు, టి.కృష్ణ, బి.గోపాల్, హరనాథరావు, వందేమాతరం శ్రీనివాస్ కలిసి నాటకాలు వేసేవాళ్లు. మద్రాస్‌లో వేసిన ‘మరో మొహెంజొదారో’ నాటకానికి బెస్ట్ కమెడియన్‌గా అవార్డ్ వచ్చింది. డిగ్రీ తరువాత గ్రూప్ 2 ఆఫీసర్‌గా సెలక్టయ్యాడు. హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా నాటకాలు వేసేవాడు. అప్పుడు అట్లూరి రామారావుగారు తమ్ముడి ప్రతిభను గమనించి, దూరదర్శన్‌వాళ్లకు పరిచయం చేశారు. తను రాసి డెరైక్ట్ చేసిన ‘అనగనగా ఒక శోభ’ అనే సీరియల్ చూసి దూరదర్శన్ డెరైక్టర్ హక్ మరో కొత్త సీరియల్ చేయమన్నారు. అప్పుడు తను చేసిన ‘ఆనందోబ్రహ్మ’ తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తరువాత ‘మర్యాద రామన్న’ చేశాడు. ఆదివారం వస్తే మా ఊరివాళ్లంతా సుబ్రహ్మణ్యం కనిపిస్తాడని టీవీల దగ్గర కూర్చునేవాళ్లు. అది మాకు చాలా గర్వంగా ఉండేది.
తను చాలా డైనమిక్. ఎవరినైనా సరే చొరవగా పరిచయం చేసుకుంటాడు. నేను హైదరాబాద్‌లో పి.యు.సి. ఫెయిలైనప్పుడు మా ఊరి రైతులు నన్ను వంశపారంపర్యమైన కరణీకాన్ని చేపట్టమని కోరారు. అప్పుడు సుబ్రహ్మణ్యం తాశీల్దారుతో మాట్లాడి, నాకు కరణంగా ఉద్యోగం ఇప్పించాడు. తరువాత జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి వి.ఎ.ఒ.గా ప్రమోషన్ ఇప్పించాడు. ఇద్దరం కలిస్తే సాహిత్యం, వ్యవసాయం, రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం. నేను కమ్యూనిస్ట్ అభిమానిని. తమ్ముడు కాంగ్రెస్‌లో చేరడం నాకు నచ్చలేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పటినుంచీ కాంగ్రెస్ అంటే నాకు అయిష్టత. కానీ వైఎస్సార్ గారికి తమ్ముడంటే వల్లమాలిన అభిమానం. ఆయన తనపై పెట్టిన బాధ్యతను సుబ్రహ్మణ్యం హుందాగా నిర్వర్తించాడు.
సుబ్రహ్మణ్యం నా భార్య చెల్లెలినే చేసుకున్నాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లను తన కొడుకులతో సమంగా చూసుకుంటాడు. మా చిన్నమ్మాయికి తనింట్లోనే ఓ ఫ్లోర్ ఇచ్చాడంటే వాడి మనసెలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నాకు అద్దంకిలో ఇల్లు కట్టించి ఇచ్చాడు. తమతో హైదరాబాద్‌లో ఉండమంటాడు కానీ నాకు ఊళ్లోనే ప్రశాంతంగా ఉంటుంది. తనక్కూడా పల్లెలంటే చాలా ఇష్టం. ఊరి దగ్గర కొంత పొలం కొనుక్కున్నాడు. సిటీలో ఏమాత్రం అసౌకర్యంగా ఫీలైనా పొలానికొస్తాడు. ఎంత కష్టమొచ్చినా తట్టుకోగల మానసిక దృఢత్వం వాడిది. అంతేకాదు, మనసున్నవాడు. అపకారం చేసినవాళ్లక్కూడా ఉపకారం చేయడం వాడి నైజం. సుబ్రహ్మణ్యం ఏ విషయమైనా నాకు చెప్పకుండా చేయడు. ప్రతి విషయంలోనూ నా సలహా తీసుకుంటాడు. కాకపోతే ఒక్కటే మార్పు. (నవ్వుతూ) వాడు సెలబ్రిటీ అయ్యాక మా మధ్య గౌరవాలు మొదలయ్యాయి!
నా బాధ్యతలూ తనే తీసుకున్నాడు: ధర్మవరపు
అన్నయ్య మొదటినుంచీ నన్ను ప్రోత్సహించాడు. నాతో పాటు నాటకాలు వేశాడు. నా బాధ్యతలు చాలా వరకు తీసుకున్నాడు. కాబట్టే నాకు నా మార్గంలో ముందడుగు వేయడం సులువైంది. తను ఊళ్లో ఉంటాడు గానీ, ఆయన పిల్లలందరూ నాకు దగ్గరగానే ఉంటారు. మేమందరం ఒకే కుటుంబంలా కలిసి ఉండటంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనొక అమాయకుడైన మంచివాడు.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి