వివరం: ప్రేమిస్తే | valentine's day of the week | Sakshi
Sakshi News home page

వివరం: ప్రేమిస్తే

Published Sun, Feb 9 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

వివరం:  ప్రేమిస్తే

వివరం: ప్రేమిస్తే

ఓటమికి వెరవనివాడే యుద్ధరంగంలోకి అడుగుపెట్టాలి.
గాయాలకు సిద్ధమైనవాడే ప్రేమించడానికి సాహసించాలి.
యుద్ధానికి, ప్రేమకు పెద్ద తేడా లేదు. రెండూ మన ప్రపంచాన్ని తలకిందులు చేసేవే.

 
 కలలు కళ్లు తెరిచిన వేళ, తరతరాలుగా మన జన్యువుల్లో నిక్షిప్తమైన ప్రాచీన స్మృతులేవో ఒక్కసారిగా గుప్పున లేచినట్టు, దేహంలోని హార్మోన్లన్నీ కుట్రపన్ని మనసు మీద దాడి చేసినట్టు, చూపులన్నీ దారి మరల్చుకుని ఒక్కచోటే కేంద్రీకరించినట్టు రక్తనాళాల్లో ఏదో భావ సంచలనం ప్రారంభమవుతుంది. నివారించలేని, నిరాకరించరాని గొప్ప శక్తి ఒకటి గుండె గోడల్ని ఫెటీల్మని తాకుతుంది. అది అంతకుముందెన్నడూ కలగని అద్భుతమైన అనుభవంలా తోస్తుంది. అదే ప్రేమ. అది మన సహజాత లక్షణం.
 
 చూపుల్లో పుట్టిన విద్యుత్తు, రక్తనాళాల్లోంచి మనసు పొరల్లోకి ప్రవహించి దేహాన్ని విస్ఫోటిస్తుంది. అది హృదయపు గోడల మధ్య అడ్డంగా ఉన్న హద్దుల్ని నిలువునా కూల్చేస్తుంది. దాంతో మల్లె తీగ పందిరిని అల్లుకున్నట్టు ప్రేమ పరిమళం మెల్లిగా మనసును ఆవరిస్త్తుంది.  పొద్దుతిరుగుడు పూల పాటలానో, చామంతుల తోటలానో జీవితంలోకి  కొత్త వసంతాల్ని ఆహ్వానిస్తుంది.
 
 అది మొదలు ఆ రూపు కోసం, ఆమె చూపు కోసం పరితపించిపోతాం. పసిపిల్లాడిలా తల్లడిల్లిపోతాం. చూస్తున్న ప్రతీ దృశ్యంలోనూ ఆమే. వింటున్న ప్రతీ శబ్దంలోనూ, నిశ్శబ్దంలోనూ ఆమే.   ఆమె చూపులు సూర్యకాంతులు, ఆమె వేళ్లు లేత చిగురుటాకులు, ఆమె మాటలు వడగట్టిన వెన్నెల ఊటలు. ఆమె ఉనికి, ఊహ, మాట, మౌనం, చూపు, చైతన్యం ప్రతిదీ మనల్ని మంత్రముగ్ధం చేస్తుంది. 360 డిగ్రీలలోఎటు చూసినా జీవితమంతా తను తప్ప మరేమీ కనిపించదు. అసలు మనమంటే ఆమే.


 ఆమె వాకిటిలో కాలం చైతన్య ప్రవాహమై కదిలిపోతుంది. ఆమె కౌగిటిలో అగ్నిపర్వతం హిమపాతంలా కరిగిపోతుంది. ఆమె కలలు మిణుగురులై మన రాత్రుల్ని మెరిపిస్తాయి. ఆమె ఊహలు వేకువ కిరణాలై మన పగళ్లను వెలిగిస్తాయి. తను కనిపించనంతవరకు ఈ ప్రపంచంలో మనమొక భాగం. పరిచయమయ్యాక తనే మన ప్రపంచం.
 
 మన ప్రేమాకాశంలో ఆమె నవ్వు నక్షత్రం. జాబిలి తన ప్రతిబింబం.  లోకమంతా నిద్రపోయే వేళ మనం ఆమె కలల్తో మేల్కొంటాం. సమూహంలో వున్నప్పుడు తన ఆలోచనలతో ఏకాంతంలోకి జారిపోతాం. నెమ్మదిగా నాజూకైన ఆమె కలల ప్రవాహంలో మునిగిపోయి, ఒక ఊహల ఊరేగింపులా కదిలిపోతుంటాం. ఆమె కావాలంటే తారల్ని తెచ్చి కాళ్లకు పారాణి దిద్దాలని ముచ్చటపడతాం. నెలవంకను తెచ్చి జడలో జాజిమల్లెలా తురమాలని కలగంటాం. ఆమె ఊ... అంటే గుండెల్లో గుడికట్టాలని ఆశపడతాం. ఆమె కోసం ఎంత సాహసానికైనా ఒడిగడతాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. ప్రేమలో పడ్డాక చుట్టూ అంతా అదృశ్యమై, ఆమె మాత్రమే యదార్థం. ఆమె ముద్దు మత్తు పదార్థం!
 
  డాక్టరో, యాక్టరో, క్రియేటరో, డిక్టేటరో, సైంటిస్టో, సైకాలజిస్టో, రాజో, పేదో, కార్మికుడో, కర్షకుడో... నువ్వుఎవరైనా కావచ్చు. ప్రేమ గాలి పీల్చకుండా జీవితాన్ని దాటలేవు. ప్రేమ గురుత్వాకర్షణ శక్తి ముందు దాసోహం అనాల్సిందే. యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కూలినా, భావాలు భాష నేర్చినా, కాలాలు కొత్త వర్ణాలు సంతరించుకున్నా ఆమె ప్రేమ కోసమే కదా!  ఆమె ప్రేమ మనల్ని కవులుగా, కళాకారులుగా, గాయకులుగా, తాత్వికులుగా, వీరులుగా, వేదాంతులుగా చేస్తుంది. అసలు మన ప్రతి కథ, కవిత, ఆటా పాటా, చిత్రం, శిల్పం అంతా ఆమే కదా. ఒక్కసారి నిశ్శబ్దంగా గుండె చప్పుడు విను. బాధపడ్డా, గాయపడ్డా, రాలిపోయినా, కాలిపోయినా సరే, ఆమె ప్రేమే కావాలంటుంది. దగ్ధమైనా సరే, ఒక్కసారి కాంక్షగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఆఖరికి రెండు చేతులూ చాచి ఆమె ముందు మోకరిల్లుతాం. మనసును కింద పరిచి  ప్రేమభిక్ష కోసం ఎదురుచూస్తాం. నిజంగా ఆమె ఒక్క నవ్వు కోసం మనం చేసే దండయాత్రల ముందు గజనీ మహమ్మద్ ఏపాటి! ఆమె ప్రేమకోసం మనం చేసిన ప్రయత్నాల ముందు భగీరథుడు ఏ లెక్కలోనివాడు!!
 
 మన ప్రేమకు ఆమె అంగీకరించిన క్షణం ఆకాశం మన చేతి రుమాలవుతుంది. భూగోళం మన కళ్లలో చిన్న మెరుపవుతుంది. ఆమె ఉనికి మన ఊపిరవుతుంది. ఆమె అడుగు మన గమనమవుతుంది. తన రాకతో మన గాలివాటు గమనానికో గమ్యం ఏర్పడుతుంది. మన ఆవేశం ఆశయంగా మారుతుంది. బరువు బాధ్యతగా రూపుదిద్దుకుంటుంది.
 
 ఆమె నిరాశా నిస్పృహల్లో వెన్నుదన్నులా నిలుస్తుంది. నేలకు వంగినపుడు నిటారుగా నిలబడే ధైర్యమిస్తుంది. ఆమె సాన్నిహిత్యం ఒంటరి సమయాల్లో వెలుగు నింపుతుంది. జీవన పోరాటంలో గెలుపోటముల్ని సమంగా చూడగలిగే సమతౌల్యతను నేర్పుతుంది. గడ్డిపూవును, గులాబీ పువ్వును ఒకేలా చూడగలిగే సమదృష్టిని అలవరుస్తుంది. ఎదుటివారికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పరిచయం చేస్తుంది. మన ప్రతి అడుగులో, ఆలోచనలో, ఆనందంలో, దుఃఖంలో మన తోడుగా నడుస్తుంది. ప్రేమ పట్ల మన దృక్పథాన్ని మారుస్తుంది. ప్రేమ పరిమితుల్ని కూలదోస్తుంది. ప్రేమను కేవలం భౌతిక వ్యవహారానికే పరిమితం చేయకుండా, అదొక ఆధ్యాత్మిక భావనగా తలచి మనల్ని మరింత మానవీయంగా చేస్తుంది. మన ప్రేమను కుటుంబానికీ, చుట్టూ ప్రపంచానికీ విస్తరిస్తుంది.
 
 ఒకసారి మనను తనదిగా భావించడం మొదలెట్టాక ఆమె మన తప్పుల్ని క్షమిస్తుంది, మన పొరబాట్లను మన్నిస్తుంది, మనం నిరాశ పరిచినా, నిర్లక్ష్యం చేసినా తట్టుకుంటుంది.  మనం ఆవేశంతో విరుచుకుపడినప్పుడు మన భావోద్వేగాల అలల్ని నియంత్రించే తీరంలా నిలబడుతుంది. నెమ్మదించాక తన ఒడిలో మన తలపెట్టుకుని ప్రేమగా లాలిస్తుంది. అలసిన సూర్యుణ్ని ఒడిలోకి తీసుకునే సాయంకాలపు పొద్దులా,  శీతాకాలపు ఉదయాన్ని గాఢంగా తడిమే పొగమంచు తడిలా ఆత్మీయంగా హత్తుకుంటుంది. చీమలు పుట్టలు పెట్టినట్టుగా, పక్షులు గూడు కట్టినట్టుగా ఒక నిర్మాణాత్మక జీవితాన్ని మన చుట్టూతా అల్లుతుంది. ఆమె ప్రేమ ప్రవాహంలో పలుగురాళ్లు గులక రాళ్లుగా మారతాయి. ఎడారులు జీవనదులవుతాయి.  ఈ ప్రేమ ప్రయాణంలో ప్రతీ క్షణం కొత్త జన్మం.  ప్రతీ అనుభవం ఒక అద్భుతం. మధ్యలో చిన్న చిన్న అలకలు, అపార్ధాలు, గొడవలు, గాయాలు పూవులో రెక్కల్లా, చీకట్లో చుక్కల్లా కలిసిపోతాయి.  ప్రేమ తీవ్రత  హృదయాన్ని జ్వలించే వేళ, ఆ వెలుగులో వేల ప్రశ్నలు. ఈ కలలకు, బాసలకు, ఆశలకు, ఊహలకు అంతం ఎక్కడ. ఈ ప్రేమ ప్రస్ధానానికి గమ్యం ఏమిటి?
 
 ఆలోచనలు అనంతంగా రగులుతున్న క్షణాన మన జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది.  ఆమె తాలూకు మధురానుభవాన్ని శాశ్వతం చేయాలన్న తాపత్రయంలో, ఈ అపురూపాన్ని ఒక జీవితకాలం నిలబెట్టాలన్న ఆలోచనలోంచి తనతో కొత్త జీవితాన్ని కలలుగంటాం. కారణాలేమైనా కానీ, అప్పటిదాకా  కలగన్న స్వప్నం ఒక్కసారిగా ముక్కలవుతుంది. స్వేచ్చకూ, హక్కులకు మధ్య ఘర్షణలో ఇద్దరి నడుమ ఆకర్షణ అడుగంటిపోతుంది. ప్రేమ నిప్పు మీద నీటిబొట్టులా ఆవిరవుతుంది.   చేతిలో చేయి వేసి తిరిగిన వెన్నెల రాత్రులు, కాలాల్ని క్షణాలుగా కరిగించిన గుర్తులు, గుండెల్లో పదిలపరిచిన జ్ఞాపకాలు నెమ్మదిగా కరిగిపోతాయి. జీవితం పట్ల ఉత్సాహం సడలిపోయి, ఆసక్తి కోల్పోయి రోజుల యాంత్రికంగా, మనసులు జఢంగా తయారవుతాయి. ఆమె మాత్రం నిర్మించుకున్న ప్రపంచం ఎన్నిసార్లు కూలిపోయినా, నమ్మకం గోడల మీద తిరిగి ప్రేమగూడును నిర్మిస్తూనే వుంటుది.
 
 వాస్తవంగా ఇప్పుడు ఆమె ప్రేమకు ప్రతిరూపంలా వుందా, ఆమె ప్రేమలో ఏమైనా తడి మిగిలిందా అంటే, ప్రతిదీ వ్యాపారమైపోయిన ఈ వినిమయ ప్రపంచంలో ప్రేమ కూడా కొంత మసకబారిపోయుండొచ్చు. మానవ సంబంధాల నిర్వచనాలు, పరిధులు మారుతున్న ప్రస్తుత తరుణంలో పరిస్థితులకనుగుణంగా ప్రేమ తన రూపం మార్చుకుని ఉండొచ్చు. ఆమె ప్రేమలో కొన్ని ఖాళీలు ఏర్పడొచ్చు. ఆమె స్పర్శలో ఆత్మీయత కొరవడొచ్చు. అంతమాత్రాన మన ప్రాణం మనది కాకుండా పోతుందా! ఆమె తోడు లేకుండా మన ప్రపంచం ఒక్క అంగుళమైనా కదులుతుందా!
  ఒక పిల్లకాలువ తల్లి కాలువతో కలిసినంత సహజంగా ఆమెలో ఒదిగిపోవాలి గానీ, జీవితానికింత రాపిడెందుకు! ఒక కొమ్మకు రెమ్మ అమరినంత మామూలుగా ఆమెలో కలిసిపోవాలి గానీ మనసుకింత బాధెందుకు!
  ఐనా చలం ఎంత గొప్పగా చెప్పాడు.. ఆమె వచ్చాక ఎంతనవ్వు, ఎన్ని కన్నీళ్లు, ఎంత ఆనందం, ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు, ఎంత నిశ్శబ్దం! ఎంత శాంతి ఈ హృదయానికి.
 నిజమే కదా... ఆమె మన కల, కన్నీరు, ఊహ, వాస్తవం, మన ప్రకృతి, ప్రపంచం. మన సారం, సారాంశం. అసలీ ప్రపంచానికి కొనసాగింపు ఆమే!  తను లేకుంటే మనం శూన్యం. మన ఉనికే ప్రశ్నార్ధకం. ఆ ప్రేమ ప్రపంచాన్ని జాగ్రత్తగా పొదివి పట్టుకోవాల్సిన బాధ్యత మనదే!
 ఉదాత్తమైన ప్రేమలో రెండు హృదయాలు ఒకటిగా స్పందించాలి. ఇద్దరి కళ్లు కలిసి ఒకే కలగనాలి. చివరకు ఇద్దరు మనుషులు  ఒక్కరిగా మిగలాలి. చిరకాలం ప్రేమ వర్ధిల్లాలి.
 
 ఆమెకు జిందాబాద్!
 ఆమె ప్రేమకు జిందాబాద్!!
 (మనకు జన్మనిచ్చిన, జీవితాన్నిచ్చిన, ప్రేమనిచ్చిన ఆమెకు ప్రేమతో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని అంకితం చేద్దాం! ఆమె ప్రేమజల్లులో తడిసి తరించిపోదాం!!)
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి
 
 తన వల్ల నేను ‘కంప్లీట్’ అయ్యాను!
 తను నా జీవితంలోకి అడుగుపెట్టగానే, అప్పటిదాకా నేను కంటున్న కలలకు ఫుల్‌స్టాప్ పడింది. ముందు నేను చాలా కంప్లీట్ అనుకునేవాణ్ని. తను నాకు పరిచయమయ్యాక, నాకు నేను హాఫ్ సర్కిల్‌లా కనిపించసాగాను. తను లేక మునుపు ఎంతటి గొప్ప దృశ్యం చూసినా ఏదో లోపం కనిపించేది. తను వచ్చాక ప్రతి చిన్నదీ చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అందుకే ఏ దృశ్యాన్నయినా చూడటానికి నాలుగు జతల కళ్లు కావాలి. ఈ ప్రపంచంలో దేన్నయినా అనుభూతి చెందడానికి రెండు హృదయాలు కావాలి. చివరకు నిద్రను అనుభవించడానికి ఇద్దరు మనుషులు ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ పనైనా ఒక్కరు చేస్తే సంపూర్ణం కాదు. ఇద్దరు కావాలి. నా లోపాలు, బలహీనతలు పెళ్లి కాకముందు ప్రపంచానికి కనిపించేవి. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాకపోతే అవి కనిపించకుండా తను మేనేజ్ చేస్తుంది.
 - సుకుమార్, దర్శకుడు
 
 
 నాకు ఆమే స్ఫూర్తి...
 కర్ర మీద కిరోసిన్ పోసి, అగ్గిపుల్ల అంటిస్తే పెద్ద వెలుగు వస్తుంది. దానికి వెలుతురు, నీలిరంగు జ్వాల ఉంటుందే తప్ప ఉష్ణం ఉండదు. కుర్రతనపు ఆవేశంలో కలిగే ప్రేమ కూడా అంతే! మంట ఆరిపోయిన తరువాత మిగిలిన నిప్పు కణికలకు ఉష్ణం, తీక్షణత ఎక్కువగా ఉంటుంది. ఇది పరిణతితో కూడిన ప్రేమ. ఈ దశలో ఆవేశానికి బదులు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. ఈ పదిహేనేళ్లలో మా ప్రేమ కూడా అలా పరిణతి చెందుతూ వచ్చింది.
 
 పెళ్లికి ముందు నాలో కవిత్వం మాత్రమే ఉండేది. పెళ్లయ్యాక సుచిత్ర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటిది మనుషుల్ని ఆదరించడం. కొత్తవాళ్లతో ఆత్మీయంగా మాట్లాడటం తెలుసు కానీ ఆదరించడం తెలియదు. తను పరిచయమయ్యాక, ఇంటికి వచ్చినవాళ్లను సంతోషపరచడం, చిన్న చిన్న బహుమతులివ్వడం, అతిథి దేవోభవ అన్న సూక్తిని ఆచరించడంతో ఆదరణకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నాను. రెండవది ఆరాధన. నాకు అమ్మానాన్నల్ని ప్రేమించడం తెలుసు కానీ ఆరాధించడం తెలియదు. తను నా తల్లిదండ్రులను దైవాలుగా ఆరాధిస్తుంది. తనను చూసే నేను ఆరాధన నేర్చుకున్నాను. మూడవది సహనం. తనకు విపరీతమైన సహనం. ఎన్ని బాధలొచ్చినా, కష్టాలొచ్చినా సహనం వీడకుండా, ఓర్పు వదలకుండా ఉండటం తన నుంచే అలవర్చుకున్నాను. నాలుగవది స్పష్టత. ఎవరినైనా కలవడం, ఏ పనైనా చేయడం, నిర్ణయాలు తీసుకోవడం లాంటి విషయాల్లో స్పష్టతతో ఉండటం తన నుంచే నేర్చుకున్నాను.
 వీటన్నిటితో పాటు పెద్దరికం కూడా తన నుంచే వచ్చింది. ఎందుకంటే తను నా కంటే పెద్దది కాబట్టి. ఇక అలకలు, కోపాలు, తాపాలు అన్నీ నావే. తనే నన్ను బతిమాలుతుంది. బుజ్జగిస్తుంది. కేవలం పాట రాయడమే నా పని. మిగిలిన ఇంటి వ్యవహారాలన్నీ తనే చూసుకుంటుంది.
 - చంద్రబోస్, గేయ రచయిత
 
 తన ప్రేమ చాలా విలువైంది
 తను నా జీవితంలో వెరీ స్పెషల్. నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా వున్నప్పుడే తనను ఇష్టపడ్డాను. మున్నా సినిమా తరువాత నా లైఫ్ చాలా గొప్పగా వుంటుందని, తనతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చని కలలుకన్నాను. కానీ సినిమా ఆశంచిన ఫలితం ఇవ్వకపోవడంతో నా ఆశలు తలకిందులయ్యాయి. నేను చాలా డిస్ట్రబ్డ్‌గా పెయిన్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలో తను నా వెంట నిలబడింది.  నేను డెరైక్టర్‌గా నిలబడతానని ఆరోజు తనేం ఆలోచించలేదు. నేను బాధలో వున్నప్పుడు తను నా జీవితంలోకి ప్రవేశించింది కాబట్టి మా మధ్య అనుబంధం మరింత బలపడింది. తను ఆ రోజు నా పక్కన నిలబడింది కాబట్టే, నేను బృందావనం, ఎవడులాంటి సినిమాలు తీయగలిగాను.
 నా అదృష్టం ఏమిటంటే నేను కోరుకున్న అమ్మాయిని రెండువేపులా ఒప్పించి చేసుకోగలగడం. నా బాధైనా, సంతోషమైనా తనతోనే. ఆమె నా లైఫ్ పార్ట్‌నర్‌గా దొరకడం  జీవితంలో నేను సాధించిన అతి పెద్ద విజయం.
 - వంశీ పైడిపల్లి, దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement