K. kranthikumar reddy
-
వివరం: ప్రేమిస్తే
ఓటమికి వెరవనివాడే యుద్ధరంగంలోకి అడుగుపెట్టాలి. గాయాలకు సిద్ధమైనవాడే ప్రేమించడానికి సాహసించాలి. యుద్ధానికి, ప్రేమకు పెద్ద తేడా లేదు. రెండూ మన ప్రపంచాన్ని తలకిందులు చేసేవే. కలలు కళ్లు తెరిచిన వేళ, తరతరాలుగా మన జన్యువుల్లో నిక్షిప్తమైన ప్రాచీన స్మృతులేవో ఒక్కసారిగా గుప్పున లేచినట్టు, దేహంలోని హార్మోన్లన్నీ కుట్రపన్ని మనసు మీద దాడి చేసినట్టు, చూపులన్నీ దారి మరల్చుకుని ఒక్కచోటే కేంద్రీకరించినట్టు రక్తనాళాల్లో ఏదో భావ సంచలనం ప్రారంభమవుతుంది. నివారించలేని, నిరాకరించరాని గొప్ప శక్తి ఒకటి గుండె గోడల్ని ఫెటీల్మని తాకుతుంది. అది అంతకుముందెన్నడూ కలగని అద్భుతమైన అనుభవంలా తోస్తుంది. అదే ప్రేమ. అది మన సహజాత లక్షణం. చూపుల్లో పుట్టిన విద్యుత్తు, రక్తనాళాల్లోంచి మనసు పొరల్లోకి ప్రవహించి దేహాన్ని విస్ఫోటిస్తుంది. అది హృదయపు గోడల మధ్య అడ్డంగా ఉన్న హద్దుల్ని నిలువునా కూల్చేస్తుంది. దాంతో మల్లె తీగ పందిరిని అల్లుకున్నట్టు ప్రేమ పరిమళం మెల్లిగా మనసును ఆవరిస్త్తుంది. పొద్దుతిరుగుడు పూల పాటలానో, చామంతుల తోటలానో జీవితంలోకి కొత్త వసంతాల్ని ఆహ్వానిస్తుంది. అది మొదలు ఆ రూపు కోసం, ఆమె చూపు కోసం పరితపించిపోతాం. పసిపిల్లాడిలా తల్లడిల్లిపోతాం. చూస్తున్న ప్రతీ దృశ్యంలోనూ ఆమే. వింటున్న ప్రతీ శబ్దంలోనూ, నిశ్శబ్దంలోనూ ఆమే. ఆమె చూపులు సూర్యకాంతులు, ఆమె వేళ్లు లేత చిగురుటాకులు, ఆమె మాటలు వడగట్టిన వెన్నెల ఊటలు. ఆమె ఉనికి, ఊహ, మాట, మౌనం, చూపు, చైతన్యం ప్రతిదీ మనల్ని మంత్రముగ్ధం చేస్తుంది. 360 డిగ్రీలలోఎటు చూసినా జీవితమంతా తను తప్ప మరేమీ కనిపించదు. అసలు మనమంటే ఆమే. ఆమె వాకిటిలో కాలం చైతన్య ప్రవాహమై కదిలిపోతుంది. ఆమె కౌగిటిలో అగ్నిపర్వతం హిమపాతంలా కరిగిపోతుంది. ఆమె కలలు మిణుగురులై మన రాత్రుల్ని మెరిపిస్తాయి. ఆమె ఊహలు వేకువ కిరణాలై మన పగళ్లను వెలిగిస్తాయి. తను కనిపించనంతవరకు ఈ ప్రపంచంలో మనమొక భాగం. పరిచయమయ్యాక తనే మన ప్రపంచం. మన ప్రేమాకాశంలో ఆమె నవ్వు నక్షత్రం. జాబిలి తన ప్రతిబింబం. లోకమంతా నిద్రపోయే వేళ మనం ఆమె కలల్తో మేల్కొంటాం. సమూహంలో వున్నప్పుడు తన ఆలోచనలతో ఏకాంతంలోకి జారిపోతాం. నెమ్మదిగా నాజూకైన ఆమె కలల ప్రవాహంలో మునిగిపోయి, ఒక ఊహల ఊరేగింపులా కదిలిపోతుంటాం. ఆమె కావాలంటే తారల్ని తెచ్చి కాళ్లకు పారాణి దిద్దాలని ముచ్చటపడతాం. నెలవంకను తెచ్చి జడలో జాజిమల్లెలా తురమాలని కలగంటాం. ఆమె ఊ... అంటే గుండెల్లో గుడికట్టాలని ఆశపడతాం. ఆమె కోసం ఎంత సాహసానికైనా ఒడిగడతాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. ప్రేమలో పడ్డాక చుట్టూ అంతా అదృశ్యమై, ఆమె మాత్రమే యదార్థం. ఆమె ముద్దు మత్తు పదార్థం! డాక్టరో, యాక్టరో, క్రియేటరో, డిక్టేటరో, సైంటిస్టో, సైకాలజిస్టో, రాజో, పేదో, కార్మికుడో, కర్షకుడో... నువ్వుఎవరైనా కావచ్చు. ప్రేమ గాలి పీల్చకుండా జీవితాన్ని దాటలేవు. ప్రేమ గురుత్వాకర్షణ శక్తి ముందు దాసోహం అనాల్సిందే. యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కూలినా, భావాలు భాష నేర్చినా, కాలాలు కొత్త వర్ణాలు సంతరించుకున్నా ఆమె ప్రేమ కోసమే కదా! ఆమె ప్రేమ మనల్ని కవులుగా, కళాకారులుగా, గాయకులుగా, తాత్వికులుగా, వీరులుగా, వేదాంతులుగా చేస్తుంది. అసలు మన ప్రతి కథ, కవిత, ఆటా పాటా, చిత్రం, శిల్పం అంతా ఆమే కదా. ఒక్కసారి నిశ్శబ్దంగా గుండె చప్పుడు విను. బాధపడ్డా, గాయపడ్డా, రాలిపోయినా, కాలిపోయినా సరే, ఆమె ప్రేమే కావాలంటుంది. దగ్ధమైనా సరే, ఒక్కసారి కాంక్షగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఆఖరికి రెండు చేతులూ చాచి ఆమె ముందు మోకరిల్లుతాం. మనసును కింద పరిచి ప్రేమభిక్ష కోసం ఎదురుచూస్తాం. నిజంగా ఆమె ఒక్క నవ్వు కోసం మనం చేసే దండయాత్రల ముందు గజనీ మహమ్మద్ ఏపాటి! ఆమె ప్రేమకోసం మనం చేసిన ప్రయత్నాల ముందు భగీరథుడు ఏ లెక్కలోనివాడు!! మన ప్రేమకు ఆమె అంగీకరించిన క్షణం ఆకాశం మన చేతి రుమాలవుతుంది. భూగోళం మన కళ్లలో చిన్న మెరుపవుతుంది. ఆమె ఉనికి మన ఊపిరవుతుంది. ఆమె అడుగు మన గమనమవుతుంది. తన రాకతో మన గాలివాటు గమనానికో గమ్యం ఏర్పడుతుంది. మన ఆవేశం ఆశయంగా మారుతుంది. బరువు బాధ్యతగా రూపుదిద్దుకుంటుంది. ఆమె నిరాశా నిస్పృహల్లో వెన్నుదన్నులా నిలుస్తుంది. నేలకు వంగినపుడు నిటారుగా నిలబడే ధైర్యమిస్తుంది. ఆమె సాన్నిహిత్యం ఒంటరి సమయాల్లో వెలుగు నింపుతుంది. జీవన పోరాటంలో గెలుపోటముల్ని సమంగా చూడగలిగే సమతౌల్యతను నేర్పుతుంది. గడ్డిపూవును, గులాబీ పువ్వును ఒకేలా చూడగలిగే సమదృష్టిని అలవరుస్తుంది. ఎదుటివారికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పరిచయం చేస్తుంది. మన ప్రతి అడుగులో, ఆలోచనలో, ఆనందంలో, దుఃఖంలో మన తోడుగా నడుస్తుంది. ప్రేమ పట్ల మన దృక్పథాన్ని మారుస్తుంది. ప్రేమ పరిమితుల్ని కూలదోస్తుంది. ప్రేమను కేవలం భౌతిక వ్యవహారానికే పరిమితం చేయకుండా, అదొక ఆధ్యాత్మిక భావనగా తలచి మనల్ని మరింత మానవీయంగా చేస్తుంది. మన ప్రేమను కుటుంబానికీ, చుట్టూ ప్రపంచానికీ విస్తరిస్తుంది. ఒకసారి మనను తనదిగా భావించడం మొదలెట్టాక ఆమె మన తప్పుల్ని క్షమిస్తుంది, మన పొరబాట్లను మన్నిస్తుంది, మనం నిరాశ పరిచినా, నిర్లక్ష్యం చేసినా తట్టుకుంటుంది. మనం ఆవేశంతో విరుచుకుపడినప్పుడు మన భావోద్వేగాల అలల్ని నియంత్రించే తీరంలా నిలబడుతుంది. నెమ్మదించాక తన ఒడిలో మన తలపెట్టుకుని ప్రేమగా లాలిస్తుంది. అలసిన సూర్యుణ్ని ఒడిలోకి తీసుకునే సాయంకాలపు పొద్దులా, శీతాకాలపు ఉదయాన్ని గాఢంగా తడిమే పొగమంచు తడిలా ఆత్మీయంగా హత్తుకుంటుంది. చీమలు పుట్టలు పెట్టినట్టుగా, పక్షులు గూడు కట్టినట్టుగా ఒక నిర్మాణాత్మక జీవితాన్ని మన చుట్టూతా అల్లుతుంది. ఆమె ప్రేమ ప్రవాహంలో పలుగురాళ్లు గులక రాళ్లుగా మారతాయి. ఎడారులు జీవనదులవుతాయి. ఈ ప్రేమ ప్రయాణంలో ప్రతీ క్షణం కొత్త జన్మం. ప్రతీ అనుభవం ఒక అద్భుతం. మధ్యలో చిన్న చిన్న అలకలు, అపార్ధాలు, గొడవలు, గాయాలు పూవులో రెక్కల్లా, చీకట్లో చుక్కల్లా కలిసిపోతాయి. ప్రేమ తీవ్రత హృదయాన్ని జ్వలించే వేళ, ఆ వెలుగులో వేల ప్రశ్నలు. ఈ కలలకు, బాసలకు, ఆశలకు, ఊహలకు అంతం ఎక్కడ. ఈ ప్రేమ ప్రస్ధానానికి గమ్యం ఏమిటి? ఆలోచనలు అనంతంగా రగులుతున్న క్షణాన మన జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె తాలూకు మధురానుభవాన్ని శాశ్వతం చేయాలన్న తాపత్రయంలో, ఈ అపురూపాన్ని ఒక జీవితకాలం నిలబెట్టాలన్న ఆలోచనలోంచి తనతో కొత్త జీవితాన్ని కలలుగంటాం. కారణాలేమైనా కానీ, అప్పటిదాకా కలగన్న స్వప్నం ఒక్కసారిగా ముక్కలవుతుంది. స్వేచ్చకూ, హక్కులకు మధ్య ఘర్షణలో ఇద్దరి నడుమ ఆకర్షణ అడుగంటిపోతుంది. ప్రేమ నిప్పు మీద నీటిబొట్టులా ఆవిరవుతుంది. చేతిలో చేయి వేసి తిరిగిన వెన్నెల రాత్రులు, కాలాల్ని క్షణాలుగా కరిగించిన గుర్తులు, గుండెల్లో పదిలపరిచిన జ్ఞాపకాలు నెమ్మదిగా కరిగిపోతాయి. జీవితం పట్ల ఉత్సాహం సడలిపోయి, ఆసక్తి కోల్పోయి రోజుల యాంత్రికంగా, మనసులు జఢంగా తయారవుతాయి. ఆమె మాత్రం నిర్మించుకున్న ప్రపంచం ఎన్నిసార్లు కూలిపోయినా, నమ్మకం గోడల మీద తిరిగి ప్రేమగూడును నిర్మిస్తూనే వుంటుది. వాస్తవంగా ఇప్పుడు ఆమె ప్రేమకు ప్రతిరూపంలా వుందా, ఆమె ప్రేమలో ఏమైనా తడి మిగిలిందా అంటే, ప్రతిదీ వ్యాపారమైపోయిన ఈ వినిమయ ప్రపంచంలో ప్రేమ కూడా కొంత మసకబారిపోయుండొచ్చు. మానవ సంబంధాల నిర్వచనాలు, పరిధులు మారుతున్న ప్రస్తుత తరుణంలో పరిస్థితులకనుగుణంగా ప్రేమ తన రూపం మార్చుకుని ఉండొచ్చు. ఆమె ప్రేమలో కొన్ని ఖాళీలు ఏర్పడొచ్చు. ఆమె స్పర్శలో ఆత్మీయత కొరవడొచ్చు. అంతమాత్రాన మన ప్రాణం మనది కాకుండా పోతుందా! ఆమె తోడు లేకుండా మన ప్రపంచం ఒక్క అంగుళమైనా కదులుతుందా! ఒక పిల్లకాలువ తల్లి కాలువతో కలిసినంత సహజంగా ఆమెలో ఒదిగిపోవాలి గానీ, జీవితానికింత రాపిడెందుకు! ఒక కొమ్మకు రెమ్మ అమరినంత మామూలుగా ఆమెలో కలిసిపోవాలి గానీ మనసుకింత బాధెందుకు! ఐనా చలం ఎంత గొప్పగా చెప్పాడు.. ఆమె వచ్చాక ఎంతనవ్వు, ఎన్ని కన్నీళ్లు, ఎంత ఆనందం, ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు, ఎంత నిశ్శబ్దం! ఎంత శాంతి ఈ హృదయానికి. నిజమే కదా... ఆమె మన కల, కన్నీరు, ఊహ, వాస్తవం, మన ప్రకృతి, ప్రపంచం. మన సారం, సారాంశం. అసలీ ప్రపంచానికి కొనసాగింపు ఆమే! తను లేకుంటే మనం శూన్యం. మన ఉనికే ప్రశ్నార్ధకం. ఆ ప్రేమ ప్రపంచాన్ని జాగ్రత్తగా పొదివి పట్టుకోవాల్సిన బాధ్యత మనదే! ఉదాత్తమైన ప్రేమలో రెండు హృదయాలు ఒకటిగా స్పందించాలి. ఇద్దరి కళ్లు కలిసి ఒకే కలగనాలి. చివరకు ఇద్దరు మనుషులు ఒక్కరిగా మిగలాలి. చిరకాలం ప్రేమ వర్ధిల్లాలి. ఆమెకు జిందాబాద్! ఆమె ప్రేమకు జిందాబాద్!! (మనకు జన్మనిచ్చిన, జీవితాన్నిచ్చిన, ప్రేమనిచ్చిన ఆమెకు ప్రేమతో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని అంకితం చేద్దాం! ఆమె ప్రేమజల్లులో తడిసి తరించిపోదాం!!) - కె.క్రాంతికుమార్‌రెడ్డి తన వల్ల నేను ‘కంప్లీట్’ అయ్యాను! తను నా జీవితంలోకి అడుగుపెట్టగానే, అప్పటిదాకా నేను కంటున్న కలలకు ఫుల్స్టాప్ పడింది. ముందు నేను చాలా కంప్లీట్ అనుకునేవాణ్ని. తను నాకు పరిచయమయ్యాక, నాకు నేను హాఫ్ సర్కిల్లా కనిపించసాగాను. తను లేక మునుపు ఎంతటి గొప్ప దృశ్యం చూసినా ఏదో లోపం కనిపించేది. తను వచ్చాక ప్రతి చిన్నదీ చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అందుకే ఏ దృశ్యాన్నయినా చూడటానికి నాలుగు జతల కళ్లు కావాలి. ఈ ప్రపంచంలో దేన్నయినా అనుభూతి చెందడానికి రెండు హృదయాలు కావాలి. చివరకు నిద్రను అనుభవించడానికి ఇద్దరు మనుషులు ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ పనైనా ఒక్కరు చేస్తే సంపూర్ణం కాదు. ఇద్దరు కావాలి. నా లోపాలు, బలహీనతలు పెళ్లి కాకముందు ప్రపంచానికి కనిపించేవి. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాకపోతే అవి కనిపించకుండా తను మేనేజ్ చేస్తుంది. - సుకుమార్, దర్శకుడు నాకు ఆమే స్ఫూర్తి... కర్ర మీద కిరోసిన్ పోసి, అగ్గిపుల్ల అంటిస్తే పెద్ద వెలుగు వస్తుంది. దానికి వెలుతురు, నీలిరంగు జ్వాల ఉంటుందే తప్ప ఉష్ణం ఉండదు. కుర్రతనపు ఆవేశంలో కలిగే ప్రేమ కూడా అంతే! మంట ఆరిపోయిన తరువాత మిగిలిన నిప్పు కణికలకు ఉష్ణం, తీక్షణత ఎక్కువగా ఉంటుంది. ఇది పరిణతితో కూడిన ప్రేమ. ఈ దశలో ఆవేశానికి బదులు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. ఈ పదిహేనేళ్లలో మా ప్రేమ కూడా అలా పరిణతి చెందుతూ వచ్చింది. పెళ్లికి ముందు నాలో కవిత్వం మాత్రమే ఉండేది. పెళ్లయ్యాక సుచిత్ర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటిది మనుషుల్ని ఆదరించడం. కొత్తవాళ్లతో ఆత్మీయంగా మాట్లాడటం తెలుసు కానీ ఆదరించడం తెలియదు. తను పరిచయమయ్యాక, ఇంటికి వచ్చినవాళ్లను సంతోషపరచడం, చిన్న చిన్న బహుమతులివ్వడం, అతిథి దేవోభవ అన్న సూక్తిని ఆచరించడంతో ఆదరణకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నాను. రెండవది ఆరాధన. నాకు అమ్మానాన్నల్ని ప్రేమించడం తెలుసు కానీ ఆరాధించడం తెలియదు. తను నా తల్లిదండ్రులను దైవాలుగా ఆరాధిస్తుంది. తనను చూసే నేను ఆరాధన నేర్చుకున్నాను. మూడవది సహనం. తనకు విపరీతమైన సహనం. ఎన్ని బాధలొచ్చినా, కష్టాలొచ్చినా సహనం వీడకుండా, ఓర్పు వదలకుండా ఉండటం తన నుంచే అలవర్చుకున్నాను. నాలుగవది స్పష్టత. ఎవరినైనా కలవడం, ఏ పనైనా చేయడం, నిర్ణయాలు తీసుకోవడం లాంటి విషయాల్లో స్పష్టతతో ఉండటం తన నుంచే నేర్చుకున్నాను. వీటన్నిటితో పాటు పెద్దరికం కూడా తన నుంచే వచ్చింది. ఎందుకంటే తను నా కంటే పెద్దది కాబట్టి. ఇక అలకలు, కోపాలు, తాపాలు అన్నీ నావే. తనే నన్ను బతిమాలుతుంది. బుజ్జగిస్తుంది. కేవలం పాట రాయడమే నా పని. మిగిలిన ఇంటి వ్యవహారాలన్నీ తనే చూసుకుంటుంది. - చంద్రబోస్, గేయ రచయిత తన ప్రేమ చాలా విలువైంది తను నా జీవితంలో వెరీ స్పెషల్. నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా వున్నప్పుడే తనను ఇష్టపడ్డాను. మున్నా సినిమా తరువాత నా లైఫ్ చాలా గొప్పగా వుంటుందని, తనతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చని కలలుకన్నాను. కానీ సినిమా ఆశంచిన ఫలితం ఇవ్వకపోవడంతో నా ఆశలు తలకిందులయ్యాయి. నేను చాలా డిస్ట్రబ్డ్‌గా పెయిన్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలో తను నా వెంట నిలబడింది. నేను డెరైక్టర్‌గా నిలబడతానని ఆరోజు తనేం ఆలోచించలేదు. నేను బాధలో వున్నప్పుడు తను నా జీవితంలోకి ప్రవేశించింది కాబట్టి మా మధ్య అనుబంధం మరింత బలపడింది. తను ఆ రోజు నా పక్కన నిలబడింది కాబట్టే, నేను బృందావనం, ఎవడులాంటి సినిమాలు తీయగలిగాను. నా అదృష్టం ఏమిటంటే నేను కోరుకున్న అమ్మాయిని రెండువేపులా ఒప్పించి చేసుకోగలగడం. నా బాధైనా, సంతోషమైనా తనతోనే. ఆమె నా లైఫ్ పార్ట్నర్గా దొరకడం జీవితంలో నేను సాధించిన అతి పెద్ద విజయం. - వంశీ పైడిపల్లి, దర్శకుడు -
తొలియత్నం: ఇదే నాలుగో సినిమా అయ్యుంటే...
సముద్రంలో కెరటం లేచిపడింది, పడి లేచిందా? ఆకాశంలో సూర్యుడు వెలిగి ఆరిపోయాడా, ఆరినవాడు తిరిగి వెలిగాడా? ఏది సత్యం, ఏదసత్యం... ఏది కొలమానం, ఏది గీటురాయి... జీవితం వృత్తమైనప్పుడు నిజం, అబద్ధం, గెలుపు, ఓటమి లాంటి విలువన్నీ పాక్షిక సత్యాలే. కానీ జీవితం ఆ జీవితంలోని కొన్ని క్షణాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తూ, సక్సెస్‌ను మాత్రమే కొలమానంగా లెక్కించే సినీ వెండితెర చతురస్రంలో విలువలు, లెక్కలకు అతీతంగా గమనం సాగించడం అంత సులువేమీ కాదు. అయితే ఒక విలువతో, నిబద్దతతో పనిచేసినప్పుడు ఈ భౌతిక విలువలకు అతీతంగా నచ్చిన మార్గంలో స్థిరంగా ముందుకు సాగడం సాధ్యమేనని నిరూపించిన దర్శకుడు కె.విజయభాస్కర్. ఆయన మొదటి సినిమా ‘ప్రార్థన’ ఆయనకే కాదు, ప్రేక్షకులకూ ఓ కొత్త అనుభవం. అలాంటి ప్రయోగం చేసే అవకాశం ఇప్పటికీ రాలేదంటున్న విజయభాస్కర్ అంతరంగమిది. బి.గోపాల్గారు ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ‘కానూన్ అప్నా అప్నా’గా హిందీలో తీస్తున్న సమయమది. ఆ సినిమాకు నేను ఆఖరి అసిస్టెంట్‌ని. తరువాత ‘లారీ డ్రైవర్’కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. గోపాల్‌గారికి చెప్పగానే, చెయ్యగలవా అన్నారు. తలూపాను. సరేనన్నారాయన. కందేపి సాంబశివరావు, సురేశ్ కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అప్పుడప్పుడే ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంటున్న సురేశ్‌ను హీరోగా ప్రమోట్ చేయడం కోసమే ఈ సినిమా చేయాలనుకుని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. హీరోను, బడ్జెట్ పరిధులను దృష్టిలో ఉంచుకుని, కథ రాసుకోవాలి. నాకేమో సినిమా కథ అనగానే రొటీన్‌కు భిన్నంగా ఉండాలనేది ఆలోచన. మా చిన్నప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతివారం ఒక పరభాషా చిత్రం చూపించేవారు. దాంతో ప్రపంచ సినిమాతో అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆ ప్రభావంతో వైవిధ్యమైన కథ రాయాలని తపించాను. రోజుల తరబడి ఇంటి డాబా మీద ఒంటరిగా కూర్చుని కథ రాశాను. ఎక్కడ ఏం రాయాలి, దేని తరువాత మరేం రావాలి లాంటి స్క్రీన్‌ప్లే రూల్స్ తెలీకుండా స్క్రిప్ట్ పూర్తి చేశాను. నిర్మాతకు, హీరోకు కధ వినిపించగానే ‘‘మనం ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇక ఆర్టిస్ట్‌లు ఎవరు అనుకున్నప్పుడు హీరో సురేశ్ పక్కన హీరోయిన్గా ఒక కొత్తమ్మాయిని తీసుకున్నాం. తను అప్పుడే విడుదలైన మణిరత్నం ‘అంజలి’ సినిమాలో ఆనంద్ పక్కన జంటగా నటించింది. అందులో ఒక పాటలో తన పెర్ఫామెన్స్ నచ్చింది. ఆమె పేరును అంజలిగా మార్చి, మా సినిమాలో పెట్టుకున్నాం. హీరో పక్కన స్నేహితులుగా సూర్యకిరణ్, జాకీ (తరువాత ఒకరు దర్శకుడిగా, మరొకరు నటుడిగా ఫేమ్ అయ్యారు) నటించారు. ఇక షూటింగ్ ఎక్కడ చేద్దాం అన్న చర్చ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మా గుంటూరులో అయితే షూటింగ్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అన్నారు. కథ ప్రకారం, మాకు కీలకంగా కావలసింది ఒక మెకానిక్ షెడ్. గుంటూరులో షెడ్ వేసిన తరువాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా సినిమా పూర్తిచేశాం. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా సినిమాలో క్వాలిటీ లేకపోయినా, కథ, కథనంలో నవ్యతే ‘ప్రార్థన’ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటి అద్భుతమైన అవకాశం నాకింతవరకూ రాలేదు, బహుశా మరెప్పటికీ రాకపోవచ్చు కూడా. సినిమా ప్రారంభంలోనే ఒక పాప, డ్రిపెషన్‌లో వున్న హీరో, పాప కోసం వెతుకుతున్న విలన్ ఇలా ఒకరికొకరు సంబంధం లేని పాత్రల మధ్య ఏదో సంబంధం వుందన్న ఆలోచన, ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగజేసాను. సరిగ్గా ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేసాను. మెకానిక్‌గా పనిచేసే హీరో, ఒక ధనవంతురాలయిన అమ్మాయి ప్రేమించుకుంటారు. హీరోయిన్ విధిలేని పరిస్ధితుల్లో తన తండ్రి దగ్గర పనిచేసే విలన్ బెనర్జీని పెళ్లి చేసుకుంటుంది. ఒక పాపకు జన్మనిచ్చి హీరోయిన్ చనిపోతుంది. ఇక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లోపే విలన్ ఉద్దేశం, హీరో లక్ష్యం ప్రేక్షకులకి తెలిసిపోతాయి. ఇక ఇక్కడి నుంచి ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తూ సెకండ్ హాఫ్ నడపాలి. అదీ ఛాలెంజ్. ఆస్తిని కాపాడుకోవడానికి బెనర్జీకి పాప కావాలి. సవతి తల్లి పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయిన పాప ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. హీరో దగ్గర వుందని సమాచారం తెలిసి వెళతాడు. ఒకసారి నీవల్ల నేను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాను. ఇప్పుడు కూడా అదే తప్పు చేయనంటాడు హీరో. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ. హీరో విలన్‌ను చితక్కొట్టి పంపిస్తాడు. విలన్ బెనర్జీ పాపను తీసుకొచ్చే బాధ్యత ఒక చిన్నపాటి రౌడీకి అప్పగిస్తాడు. పాపకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కథ మలుపు తీసుకుంటుంది. హీరో పాపను హాస్పిటల్లో చేరుస్తాడు. అపెండిసైటిస్ అని తేలడంతో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. వైద్యం కోసం పక్క ఊరికి వెళ్లిన డాక్టర్ కోసం హీరోతో పాటు మిత్రబృందం ఎదురు చూస్తుంటారు. సమయం పరిగెడుతున్నా డాక్టర్ వచ్చే జాడ కనపడటం లేదు. మరోవైపు తన అసిస్టెంట్స్ ద్వారా విషయం తెలుసుకున్న రౌడీ... డాక్టర్‌ను హాస్పిటల్‌కు రాకుండా చేయాలనుకుంటాడు. ఆ బాధ్యత తన అసిస్టెంట్స్‌కు అప్పగిస్తాడు. హాస్పిటల్ దగ్గర డాక్టర్‌కోసం చాలాసేపు నిరీక్షించిన హీరో లాభం లేదనుకుని, డాక్టర్ ఇంటివైపు బయలుదేరుతాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ తలుపు తీసి లోనికి అడుగుపెట్టి, కిచెన్‌లో కుక్కర్ ఆన్ చేస్తుంది. హాల్లోకి వచ్చి లైట్ వేయగానే, తన కుర్చీలో కనిపించిన వ్యక్తిని చూసి అరుస్తుంది. అతడు వెంటనే ఆమె నోరు మూసి, కుర్చీలో కట్టేస్తాడు. నేను నిన్నేమీ చేయను, కాసేపు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఇక్కడే కూర్చో అని బయట నుంచి తాళం వేస్తాడు. అతడు బయటకు రాగానే డాక్టర్ ఇంటివైపు వస్తున్న హీరో కనిపిస్తాడు. హీరో నుండి తప్పించుకోవడానికి రౌడీ పక్కనే ఉన్న పెద్ద కొబ్బరిచెట్టు ఎక్కుతాడు. హీరో కాలింగ్ బెల్ కొడతాడు. లోపలి నుంచి ఏ అలికిడీ వినిపించదు. తలుపువైపు చూస్తే తాళం వేసి కనిపిస్తుంది. హీరో గుమ్మం మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం నిరీక్షిస్తుంటాడు. లోపల కట్టేసి ఉన్న డాక్టర్‌కు తనకోసం ఎవరో వచ్చారని అర్థమవుతుంది. ఇక్కడి నుంచి సీనంతా టాప్ యాంగిల్లో ఓ చెట్టు మీద ఉన్న రౌడీ యాంగిల్లో ప్రేక్షకుడికి కనిపిస్తుంటుంది. బయట మెట్ల మీద కూర్చున్న హీరో, లోపల టేబుల్ మీద వాటర్ బాటిల్‌ను తలతో కింద పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్. వాటర్ బాటిల్ కిందపడితే లోపల ఉన్న డాక్టర్ ఉనికి హీరోకి తెలిసిపోతుంది. బయట అసహనంగా టైమ్ చూసుకుంటున్న హీరో, లోపల తన తలతో బాటిల్ పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, పైన చెట్టు మీద నుంచి టెన్షన్‌గా చూస్తున్న రౌడీ. ఇంతలో బాటిల్ టేబుల్ నుంచి కిందపడి పెద్ద సౌండ్ చేసే లోపు, రౌడీ కొబ్బరికాయ తెంచి కిందపడేస్తాడు. హీరో అలర్ట్ అయ్యేలోపు చెట్టు కింద పడ్డ కొబ్బరికాయ కనిపిస్తుంది. మళ్లీ టెన్షన్. అటు హాస్పిటల్లో నొప్పితో బాధపడుతున్న పాప, మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న హీరో, లోపల తన ఉనికిని బయట ఉన్న వ్యక్తికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, హీరోకు లోపల డాక్టర్ ఉన్నట్లు తెలిసిపోతుందేమోనని చెట్టుమీద టెన్షన్ పడుతున్న రౌడీ... ఇలా టెన్షన్ టెన్షన్‌గా ఉన్నప్పుడు కిందపడిన నీళ్లు తలుపు సందులోంచి కారుతూ మెట్ల మీద కూర్చున్న హీరో కిందకు వస్తుండగా, సడన్‌గా లేచి వెళ్లిపోతాడు. మళ్లీ టెన్షన్ టెన్షన్. హీరో సందు మలుపు దాటుతుండగా లోపల కిచెన్ నుంచి విజిల్ వినిపిస్తుంది. హీరో మళ్లీ వెనక్కు వచ్చి లోపల ఎవరో ఉన్నారని తలుపు బద్దలుకొడతాడు. రౌడీని ఎదిరించి, డాక్టర్‌ను విడిపించి, సమయానికి హాస్పిటల్‌కు వెళతారు. ఈ సీన్ తీసేటప్పుడు షాట్స్, ప్రాపర్టీస్, యాంగిల్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను. ఎందుకంటే సీన్ అంతా చెట్టు మీద ఉన్న వ్యక్తి యాంగిల్ నుంచే జరుగుతుంది. అతని టెన్షన్‌తో పాటుగా ప్రేక్షకులు టెన్షన్ అనుభవించాలి. ప్రేక్షకులను థ్రిల్ చేయడం కోసం ప్రతి డిటైల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. నిజానికి గుంటూరులో కొబ్బరిచెట్టు ఉన్న ఇల్లుకోసం చాలా వెదికాం కానీ దొరకలేదు. చివరకు ఒక పెద్ద కొబ్బరిచెట్టును వేరే చోటు నుంచి తెప్పించి మేం షూట్ చేయాలనుకున్న ఇంటి పెరట్లో నాటించాం. ఇలా ఒక సీన్‌ను ఇంత కన్విన్సింగ్‌గా, ఇంట్రెస్ట్‌గా రాసే సందర్భం నాకు మళ్లీ రాలేదని చెప్పొచ్చు.కథ మూడ్‌కు తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్ చాలా సహకారం అందించారు. ఏ రకంగా చూసినా అప్పటికి ఇది విభిన్నమైన కథ. ఇదే నా మూడో నాలుగో సినిమా అయితే, బడ్జెట్ పరిమితులు లేకుండా ఇంకొంత క్వాలిటీతో తీసేవాణ్నేమో. ఏదేమైనా జీవితం పట్ల సరైన ప్రాపంచిక దృక్పథం ఉండబట్టే ‘ప్రార్థన’ తరువాత ‘స్వయంవరం’ వరకు ఏడేళ్ల దాకా సినిమా అవకాశం రాకపోయినా నిబ్బరంగా ఉండగలిగాను. ప్రభుదేవాను మొదటిసారి ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయం చేశాం. అందుకోసం తను గుంటూరు వచ్చాడు. అయితే మా సినిమా కంటే ముందు (తరువాత) తను కొరియోగ్రఫీ చేసిన మరో సినిమా ముందుగా విడుదలైంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
రిలేషణం: నా తమ్ముడు మనసున్నవాడు!
ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకం, సాహిత్యం, టీవీ, సినిమా, రాజకీయం... అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయనదో ప్రత్యేక ముద్ర. ఆయనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. తెలుగు కళామతల్లికి వరపుత్రుడైన ఆయన గురించి అన్న సీతారామారావు చెబుతున్న విశేషాలు... మాది ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం. నలుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాణ్ని. సుబ్రహ్మణ్యం చిన్నవాడు. నాన్నగారు నా పదో యేట చనిపోయారు. అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచారు. అమ్మకు పొలం పనుల్లో సహాయపడేవాళ్లం. మా అమ్మ పడిన కష్టం మరే తల్లీ అనుభవించకూడదు. సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటినుంచీ నాటకాల పిచ్చి. శ్రీరామనవమి, వినాయకచవితి పందిళ్లలో పౌరాణిక నాటకాలు చూసి తెలవారుతుండగా వచ్చేవాడు. పద్యాలు పాడటం నేర్చుకున్నాడు. సినిమాలంటే కూడా మోజు. అద్దంకిలో ఆరేడు తరగతులు చదువుతున్నప్పుడు రోజూ సినిమాలకు వెళ్లేవాడు. తను ఎన్.టి.ఆర్. ఫ్యాన్. నేను ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్. నాటకాల కరపత్రాల్లో వాడి పేరు పక్కన అపర ఎన్.టి.ఆర్. అని, నాకు అపర ఎ.ఎన్.ఆర్ అని రాసేవాళ్లు. తరువాత తను ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ కాలేజీకి వెళ్లాడు. అక్కడ తనకు ఎస్.ఎఫ్.ఐ.తో అనుబంధం పెరిగింది. తమ్ముడు, టి.కృష్ణ, బి.గోపాల్, హరనాథరావు, వందేమాతరం శ్రీనివాస్ కలిసి నాటకాలు వేసేవాళ్లు. మద్రాస్‌లో వేసిన ‘మరో మొహెంజొదారో’ నాటకానికి బెస్ట్ కమెడియన్‌గా అవార్డ్ వచ్చింది. డిగ్రీ తరువాత గ్రూప్ 2 ఆఫీసర్‌గా సెలక్టయ్యాడు. హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా నాటకాలు వేసేవాడు. అప్పుడు అట్లూరి రామారావుగారు తమ్ముడి ప్రతిభను గమనించి, దూరదర్శన్వాళ్లకు పరిచయం చేశారు. తను రాసి డెరైక్ట్ చేసిన ‘అనగనగా ఒక శోభ’ అనే సీరియల్ చూసి దూరదర్శన్ డెరైక్టర్ హక్ మరో కొత్త సీరియల్ చేయమన్నారు. అప్పుడు తను చేసిన ‘ఆనందోబ్రహ్మ’ తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తరువాత ‘మర్యాద రామన్న’ చేశాడు. ఆదివారం వస్తే మా ఊరివాళ్లంతా సుబ్రహ్మణ్యం కనిపిస్తాడని టీవీల దగ్గర కూర్చునేవాళ్లు. అది మాకు చాలా గర్వంగా ఉండేది. తను చాలా డైనమిక్. ఎవరినైనా సరే చొరవగా పరిచయం చేసుకుంటాడు. నేను హైదరాబాద్‌లో పి.యు.సి. ఫెయిలైనప్పుడు మా ఊరి రైతులు నన్ను వంశపారంపర్యమైన కరణీకాన్ని చేపట్టమని కోరారు. అప్పుడు సుబ్రహ్మణ్యం తాశీల్దారుతో మాట్లాడి, నాకు కరణంగా ఉద్యోగం ఇప్పించాడు. తరువాత జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి వి.ఎ.ఒ.గా ప్రమోషన్ ఇప్పించాడు. ఇద్దరం కలిస్తే సాహిత్యం, వ్యవసాయం, రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం. నేను కమ్యూనిస్ట్ అభిమానిని. తమ్ముడు కాంగ్రెస్‌లో చేరడం నాకు నచ్చలేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పటినుంచీ కాంగ్రెస్ అంటే నాకు అయిష్టత. కానీ వైఎస్సార్ గారికి తమ్ముడంటే వల్లమాలిన అభిమానం. ఆయన తనపై పెట్టిన బాధ్యతను సుబ్రహ్మణ్యం హుందాగా నిర్వర్తించాడు. సుబ్రహ్మణ్యం నా భార్య చెల్లెలినే చేసుకున్నాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లను తన కొడుకులతో సమంగా చూసుకుంటాడు. మా చిన్నమ్మాయికి తనింట్లోనే ఓ ఫ్లోర్ ఇచ్చాడంటే వాడి మనసెలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నాకు అద్దంకిలో ఇల్లు కట్టించి ఇచ్చాడు. తమతో హైదరాబాద్‌లో ఉండమంటాడు కానీ నాకు ఊళ్లోనే ప్రశాంతంగా ఉంటుంది. తనక్కూడా పల్లెలంటే చాలా ఇష్టం. ఊరి దగ్గర కొంత పొలం కొనుక్కున్నాడు. సిటీలో ఏమాత్రం అసౌకర్యంగా ఫీలైనా పొలానికొస్తాడు. ఎంత కష్టమొచ్చినా తట్టుకోగల మానసిక దృఢత్వం వాడిది. అంతేకాదు, మనసున్నవాడు. అపకారం చేసినవాళ్లక్కూడా ఉపకారం చేయడం వాడి నైజం. సుబ్రహ్మణ్యం ఏ విషయమైనా నాకు చెప్పకుండా చేయడు. ప్రతి విషయంలోనూ నా సలహా తీసుకుంటాడు. కాకపోతే ఒక్కటే మార్పు. (నవ్వుతూ) వాడు సెలబ్రిటీ అయ్యాక మా మధ్య గౌరవాలు మొదలయ్యాయి! నా బాధ్యతలూ తనే తీసుకున్నాడు: ధర్మవరపు అన్నయ్య మొదటినుంచీ నన్ను ప్రోత్సహించాడు. నాతో పాటు నాటకాలు వేశాడు. నా బాధ్యతలు చాలా వరకు తీసుకున్నాడు. కాబట్టే నాకు నా మార్గంలో ముందడుగు వేయడం సులువైంది. తను ఊళ్లో ఉంటాడు గానీ, ఆయన పిల్లలందరూ నాకు దగ్గరగానే ఉంటారు. మేమందరం ఒకే కుటుంబంలా కలిసి ఉండటంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనొక అమాయకుడైన మంచివాడు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: మీనా వందేళ్ల జీవితాన్నిచ్చింది!
డైరెక్టర్ అనగానే దానిలో పురుషుడు అనే అర్థం సహజంగా ధ్వనిస్తుంది. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్స్ దాదాపుగా మేల్ డామినేటెడ్ ఫీల్డ్స్. ముఖ్యంగా సినిమా రంగం, అందులోనూ దర్శకత్వశాఖ అంటే, అది పురుషుల ప్రపంచం. అలాంటి చోట నిలదొక్కుకుని, గిన్నిస్‌బుక్‌లో జెండా పాతడం ఒక్క విజయనిర్మలకే సాధ్యమైంది. మొండితనం, పట్టుదల.. సినిమా రంగంలో ఆమెకో సెపరేట్ పేజీని క్రియేట్ చేసాయి. బాలనటిగా, హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి... డెరైక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయనిర్మల... తన మొదటి తెలుగు సినిమా ‘మీనా’ తనకు మరిచిపోలేని మధుర జ్ఞాపకం అంటున్నారు. ఆ రోజుల్ల్లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా నిర్మాణంలో కల్పించుకునేవాళ్లు. నవయుగ వాళ్లు సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో చంద్రకళ పెళ్లి సీన్లో ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాటను పూర్తిగా తొలగించమన్నారు. నేను మాత్రం బాగుంటుందని అలాగే ఉంచేశాను. సినిమా విడుదలయ్యాక ఆరుద్ర రాసిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ‘సాక్షి’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాపుగారు వేసుకున్న స్టోరీ బోర్డ్ గమనించేదాన్ని. లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్ గురించి ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అలా దర్శకత్వం పట్ల ఒక ప్రాధమిక అవగాహన,ఆసక్తీ ఏర్పడ్డాయి. నేను డెరైక్షన్ చేస్తానని కృష్ణగారిని అడిగాను. నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో రెండు పడవల మీద కాలుపెడితే ప్రయాణం కష్టం, కొంత కాలం ఆగు అని సలహా ఇచ్చారు. తరువాత చాలామంది దర్శకులతో పనిచేయడంతో ఒక దర్శకునికి ఉండవలసిన లక్షణాలు అర్ధమయ్యాయి. నాకు మొదటినుంచీ టెక్నికల్ అంశాల పట్ల ఆసక్తి ఉండటంతో లాంగ్ షాట్‌కు ఏ లెన్స్ వేస్తారు, 9 ఎం.ఎం. లెన్స్ ఎప్పుడు వాడాలి అనే అంశాల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. నటిగా వంద సినిమాలు పూర్తయ్యాక, దర్శకురాలు కావాలనే నా కోరికకు కార్యరూపం ఇవ్వాలనుకున్నాను. అయితే అనుకోని విధంగా ముందే అవకాశం రావడంతో మొదట మలయాళంలో కవిత సినిమాకు దర్శకత్వం వహించాను. అది లో-బడ్జెట్ సినిమా. కానీ పెద్ద సక్సెస్ అయింది. తరువాత నా మాతృభాష తెలుగులో సినిమా చేయాలన్న తపనతో కథ కోసం ఆలోచించాను. అప్పట్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్‌గా వచ్చిన యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ను సినిమాగా మలిస్తే బాగుంటుందనిపించింది. అది ప్రోగ్రెసివ్ ధాట్స్ ఉన్న ఒక యువతి కథ. దానికో ఆబ్జెక్టివ్ ఉంది. తల్లిదండ్రులు పిల్లల గురించి, వాళ్ల భవిష్యత్ గురించి ఆలోచించాలన్న థీమ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పాయింట్ నన్ను కట్టిపడేసింది. ఐతే నవల హక్కులు దుక్కిపాటి మధుసూదనరావుగారి దగ్గర ఉన్నాయి. ఆయనను అడిగితే ఎవరితో చేస్తావమ్మా అని అడిగారు. కృష్ణగారితో అన్నాను. మేం నాగేశ్వరరావుగారితో చేద్దామనుకునే ధైర్యం చేయలేకపోయాం. కృష్ణగారితో పంచె కట్టించి ఎలా చేస్తావన్నారు. ఎందుకంటే కృష్ణగారు అప్పటికి మాస్ హీరో. ఇదేమో ఫ్యామిలీ డ్రామా. ఆయనకు సరిపోతుందో లేదోనని దుక్కిపాటిగారి సందేహం. కానీ నేను చేస్తానని ధైర్యంగా చెప్పి ఆయన దగ్గర హక్కులు తీసుకున్నాను. నవలలో పెద్దగా మార్పులు చేయకుండా స్క్రిప్ట్ రాసుకున్నాను. క్యారంబోర్డ్ మీద కొండపల్లి బొమ్మలు ఉంచి ఏ సీన్లో ఏ పాత్ర ఎక్కడ నుంచి ఎటు కదలాలి, ఏ షాట్ ఏ యాంగిల్ నుంచి తీయాలి అని ప్లాన్ చేసుకుని, పర్ఫెక్ట్గా స్టోరీ బోర్డ్ రాసుకున్నాను. విజయకృష్ణా బ్యానర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద సినిమా మొదలుపెట్టాం. దర్శకురాలిగా మొదటిరోజు ఫస్ట్ షాట్ కృష్ణగారి మీద తీశాను. సూర్యకాంతం, చంద్రకళ, ఎస్.వరలక్ష్మి, జగ్గయ్య వీళ్లందరితో ఆ రోజు సీన్స్ తీయాలి. అందరూ సీనియర్ నటులు. సూర్యకాంతంగారు నన్ను చూసి ‘ఆ... ఈమె సినిమా డెరైక్ట్ చేస్తుందట’ అన్నారు అదో ధోరణిలో. ఒక షాట్లో ఆమె లేచి నిలబడాలి. లెమ్మంటే ఇంకోసారి చెప్పు లేస్తాను అన్నారు. మూడోసారి కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతా అయ్యాక, లైట్స్ ఆన్, కెమెరా ఆన్. ఇంతే కదా నువ్వు చెప్పింది’ అన్నారు. ఇక ఎస్.వరలక్ష్మిగారిది సిటీలో ఉండే మోడ్రన్ క్యారెక్టర్. మేకప్ వేసుకునేటప్పుడు ఐ లాషెస్ చాలా పెద్దగా పెట్టుకుంది. తల్లి పాత్ర కదా అంత బాగోదేమో అన్నాను. చాలా బాగుంటుంది, నాకు తెలుసు’ అన్నారావిడ. సరే అనుకుని ఆమె మీద షాట్ తీసి ఓకే అన్నాను. నాకు వన్ మోర్ షాట్ కావాలన్నారావిడ. ప్రతీ సీన్‌కే టెన్షనే. ఆ రోజు ఎలాగో గడిచింది. మొదటిరోజే మొత్తానికి ఏడు సీన్స్ తీయడం కొంచెం ఊరట. మరుసటి రోజు గుమ్మడిగారి సీన్స్. సీన్ చెబితే నువ్వు చెప్పగానే నాకు మూడ్ రావాలి కదా అన్నారు. కొంచెం తీశాక, గుమ్మడిగారు విగ్ తీసేసి పిచ్చిపిచ్చిగా తీస్తున్నావు ఇలాగైతే నా వల్ల కాదు అనేశారు. నేను ఇప్పటివరకు తీసింది రేపు చూపిస్తాను, మీకు నచ్చితే తరువాత కంటిన్యూ చేయండి అన్నాను. ఆ రాత్రి రష్ ఎడిట్ చేసి మరుసటిరోజు ప్రివ్యూ వేసి గుమ్మడి గారికి చూపించాను. అమ్మ, బ్రహ్మరాక్షసీ... ఎంత బాగా చేశావ్ అని మెచ్చుకున్నారాయన. అలా ఆ గండం గట్టెక్కాను. అల్లు రామలింగయ్యగారు బిజీ ఆర్టిస్ట్ కావడంతో ఆయన రెండు మూడు షూటింగ్స్ చేసి మా షూటింగ్‌కు వచ్చేవాళ్లు. డైలాగ్స్ చూసి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, మార్చమ్మా అనేవాళ్లు. నేను కుదరదు ఈ డైలాగ్ ఇలాగే కావాలి అని తేల్చి చెప్పేదాన్ని. అంతా కొంచెం పెద్ద ఆర్టిస్ట్‌లు కాబట్టి మొదట రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను. తరువాత అంతా సర్దుకుపోయింది. మీనా ప్రతిరోజు నాకో కొత్త అనుభవం. ఎందుకంటే, నేను కేవలం ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వేరు. డెరైక్టర్ యాక్షన్ అనగానే నా పని నేను చేసేదాన్ని. కానీ నేనే డెరైక్టర్, యాక్టర్ అనేసరికి పరిస్థితి వేరు. కెమెరా వెనుక నిలబడి యాక్షన్ అని చెప్పి కెమెరా ముందుకు పరిగెత్తేదాన్ని. ముందు నా డైలాగ్ లేకుండా చూసుకోవడంతో ఈ సమస్యను అధిగమించాను. చివరలో నా డైలాగ్ ఉంటే డైలాగ్ చెప్పి కట్ చెప్పేదాన్ని. ఇక లొకేషన్స్ విషయానికొస్తే, అప్పట్లో పల్లెటూళ్లకు వెళ్లి సినిమా తీయడం చాలా అరుదు. మేం మద్రాసులో కొంత తీశాక, కృష్ణగారి సొంతూరు బుర్రిపాలెంలో హీరో ఇంటికి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేశాం. ఇందులో కృష్ణగారు పంచ, జుబ్బలో తప్ప మరో డ్రెస్‌లో కనబడరు. అందుకే ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ ఊళ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే, కృష్ణగారి తల్లిని నటింపజేయడం. పెళ్లిలో ఒక పెద్ద ముత్తయిదువు కావాలి, సమయానికి ఎవరూ దొరకలేదు. అత్తయ్యా మీరు చేస్తారా అంటే ఆమె సరే అన్నారు. అలా నాకా అదృష్టం దక్కింది. మీనా సినిమాకు సంగీతం చాలా చక్కగా కుదిరింది. రమేష్‌నాయుడుగారు సంగీతం. దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ పాటలు. పెళ్లంటే... పాట నేను మనసులో ఏం అనుకుని దాశరథిగారికి చెప్పానో ఆయన అదే భావాన్ని పాటగా రాశారు. కృష్ణగారి మీద, నా మీద తీసిన చేనుకి గట్టుంది, ఇంటికి గడపుంది పాట నాకు బాగా నచ్చిన పాట. మల్లెతీగ వంటిది మగువ జీవితం, పెళ్లంటే నూరేళ్ల పంట పాటలు చాలా పాపులర్ అయ్యాయి. లాంగ్ షాట్స్ అన్నీ ఒకసారి, సజెషన్ షాట్స్ అన్నీ ఒకసారి తీయడంతో షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఇందులో కెమెరామెన్ పుప్పాల గోపాలకృష్ణమూర్తి సహకారం ఎంతో ఉంది. నిజానికి మీనా నవల రెండు పార్ట్‌లుగా వచ్చింది. ఇది సినిమాగా తీస్తే చాలా లెంగ్త్ వస్తుందన్నారు. కానీ ఏ మాత్రం రాజీ పడకుండా, నవలలోని ఆత్మకు లోపం జరగకుండా తీశాను. చంద్రకళకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కథానుసారం పెళ్లికొడుకు తరపువాళ్లు కోతిలా కనపడతారు. ఇది నవలలో రాసింది. శ్రీరామ నామాలు పాటలో పెళ్లికొడుకు వాళ్లకు కోతి మాస్క్ వేసి తీశాను. అలా ఎక్కడా రాజీపడకుండా తీయడంతో చివరకు 18,000 అడుగులు వచ్చింది. అయినా ఏమాత్రం ఎడిట్ చేయకుండా సినిమా విడుదల చేశాం. 1973 డిసెంబర్ 28న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా క్లైమాక్స్‌లో తల్లికి, కూతురికి మధ్య వచ్చే చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. అది చాలామంది తల్లిదండ్రులను ఆలోచింపజేసింది. సినిమా చూసి సులోచనారాణిగారు చాలా బాగా తీశావని మెచ్చుకున్నారు. దుక్కిపాటిగారు చూసి నువ్వు ఇంత బాగా తీస్తావనుకోలేదు అన్నారు. శతదినోత్సవం మద్రాస్‌లో పెద్ద ఎత్తున చేశాం. ఫంక్షన్‌కు వచ్చినవాళ్లందరికీ భోజనాలు పెట్టి కొత్త ఆనవాయితీకి తెర తీశాం. ఈ సినిమాతో నాకు నవలా దర్శకురాలిగా పేరు వచ్చింది. అంతేకాదు... ‘మీనా’ సినిమా నాకు వందేళ్ల జీవితాన్నిచ్చిందని గర్వంగా చెపుతాను. - కె.క్రాంతికుమార్‌రెడ్డి