తొలియత్నం: మీనా వందేళ్ల జీవితాన్నిచ్చింది! | vijaya nirmala talks about her first movie `Meena` | Sakshi
Sakshi News home page

తొలియత్నం: మీనా వందేళ్ల జీవితాన్నిచ్చింది!

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

తొలియత్నం: మీనా వందేళ్ల జీవితాన్నిచ్చింది! - Sakshi

తొలియత్నం: మీనా వందేళ్ల జీవితాన్నిచ్చింది!

డైరెక్టర్ అనగానే దానిలో పురుషుడు అనే అర్థం సహజంగా ధ్వనిస్తుంది.
 ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్స్ దాదాపుగా మేల్ డామినేటెడ్ ఫీల్డ్స్.
 ముఖ్యంగా సినిమా రంగం, అందులోనూ దర్శకత్వశాఖ అంటే, అది పురుషుల ప్రపంచం.
 అలాంటి చోట నిలదొక్కుకుని, గిన్నిస్‌బుక్‌లో జెండా పాతడం ఒక్క విజయనిర్మలకే సాధ్యమైంది.
 మొండితనం, పట్టుదల.. సినిమా రంగంలో ఆమెకో సెపరేట్ పేజీని క్రియేట్ చేసాయి.
 బాలనటిగా, హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి...  డెరైక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయనిర్మల... తన మొదటి తెలుగు సినిమా ‘మీనా’  తనకు మరిచిపోలేని మధుర జ్ఞాపకం అంటున్నారు.

 
 ఆ రోజుల్ల్లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా నిర్మాణంలో కల్పించుకునేవాళ్లు. నవయుగ వాళ్లు సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో చంద్రకళ పెళ్లి సీన్‌లో ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాటను పూర్తిగా తొలగించమన్నారు. నేను మాత్రం బాగుంటుందని అలాగే ఉంచేశాను. సినిమా విడుదలయ్యాక ఆరుద్ర రాసిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
 నేను ‘సాక్షి’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాపుగారు వేసుకున్న స్టోరీ బోర్డ్ గమనించేదాన్ని. లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్ గురించి ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అలా దర్శకత్వం పట్ల ఒక ప్రాధమిక అవగాహన,ఆసక్తీ ఏర్పడ్డాయి. నేను డెరైక్షన్ చేస్తానని కృష్ణగారిని అడిగాను. నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో రెండు పడవల మీద కాలుపెడితే ప్రయాణం కష్టం, కొంత కాలం ఆగు అని సలహా ఇచ్చారు. తరువాత చాలామంది దర్శకులతో పనిచేయడంతో ఒక దర్శకునికి ఉండవలసిన లక్షణాలు అర్ధమయ్యాయి. నాకు మొదటినుంచీ టెక్నికల్ అంశాల పట్ల ఆసక్తి ఉండటంతో లాంగ్ షాట్‌కు ఏ లెన్స్ వేస్తారు, 9 ఎం.ఎం. లెన్స్ ఎప్పుడు వాడాలి అనే అంశాల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. నటిగా వంద సినిమాలు పూర్తయ్యాక, దర్శకురాలు కావాలనే నా కోరికకు కార్యరూపం ఇవ్వాలనుకున్నాను. అయితే అనుకోని విధంగా ముందే అవకాశం రావడంతో మొదట  మలయాళంలో కవిత సినిమాకు దర్శకత్వం వహించాను. అది లో-బడ్జెట్ సినిమా. కానీ  పెద్ద సక్సెస్ అయింది.
 
 తరువాత నా మాతృభాష తెలుగులో సినిమా చేయాలన్న తపనతో కథ కోసం ఆలోచించాను. అప్పట్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్‌గా వచ్చిన యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ను సినిమాగా మలిస్తే బాగుంటుందనిపించింది. అది ప్రోగ్రెసివ్ ధాట్స్ ఉన్న ఒక యువతి కథ. దానికో ఆబ్జెక్టివ్ ఉంది. తల్లిదండ్రులు పిల్లల గురించి, వాళ్ల భవిష్యత్ గురించి ఆలోచించాలన్న థీమ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పాయింట్ నన్ను కట్టిపడేసింది. ఐతే నవల హక్కులు దుక్కిపాటి మధుసూదనరావుగారి దగ్గర ఉన్నాయి. ఆయనను అడిగితే ఎవరితో చేస్తావమ్మా అని అడిగారు. కృష్ణగారితో అన్నాను.
 
  మేం నాగేశ్వరరావుగారితో చేద్దామనుకునే ధైర్యం చేయలేకపోయాం. కృష్ణగారితో పంచె కట్టించి ఎలా చేస్తావన్నారు. ఎందుకంటే కృష్ణగారు అప్పటికి మాస్ హీరో. ఇదేమో ఫ్యామిలీ డ్రామా. ఆయనకు సరిపోతుందో లేదోనని దుక్కిపాటిగారి సందేహం. కానీ నేను చేస్తానని ధైర్యంగా చెప్పి ఆయన దగ్గర హక్కులు తీసుకున్నాను. నవలలో పెద్దగా మార్పులు చేయకుండా స్క్రిప్ట్ రాసుకున్నాను. క్యారంబోర్డ్ మీద కొండపల్లి బొమ్మలు ఉంచి ఏ సీన్‌లో ఏ పాత్ర ఎక్కడ నుంచి ఎటు కదలాలి, ఏ షాట్ ఏ యాంగిల్ నుంచి తీయాలి అని ప్లాన్ చేసుకుని, పర్‌ఫెక్ట్‌గా స్టోరీ బోర్డ్ రాసుకున్నాను. విజయకృష్ణా బ్యానర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద సినిమా మొదలుపెట్టాం.
 
 దర్శకురాలిగా మొదటిరోజు
 ఫస్ట్ షాట్ కృష్ణగారి మీద తీశాను. సూర్యకాంతం, చంద్రకళ, ఎస్.వరలక్ష్మి, జగ్గయ్య వీళ్లందరితో ఆ రోజు సీన్స్ తీయాలి. అందరూ సీనియర్ నటులు.
 
 సూర్యకాంతంగారు నన్ను చూసి ‘ఆ... ఈమె సినిమా డెరైక్ట్ చేస్తుందట’ అన్నారు అదో ధోరణిలో. ఒక షాట్‌లో ఆమె లేచి నిలబడాలి. లెమ్మంటే ఇంకోసారి చెప్పు లేస్తాను అన్నారు. మూడోసారి కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతా అయ్యాక, లైట్స్ ఆన్, కెమెరా ఆన్. ఇంతే కదా నువ్వు చెప్పింది’ అన్నారు. ఇక ఎస్.వరలక్ష్మిగారిది సిటీలో ఉండే మోడ్రన్ క్యారెక్టర్. మేకప్ వేసుకునేటప్పుడు ఐ లాషెస్ చాలా పెద్దగా పెట్టుకుంది. తల్లి పాత్ర కదా అంత బాగోదేమో అన్నాను. చాలా బాగుంటుంది, నాకు తెలుసు’ అన్నారావిడ. సరే అనుకుని ఆమె మీద షాట్ తీసి ఓకే అన్నాను. నాకు వన్ మోర్ షాట్ కావాలన్నారావిడ. ప్రతీ సీన్‌కే టెన్షనే. ఆ రోజు ఎలాగో గడిచింది. మొదటిరోజే మొత్తానికి ఏడు సీన్స్ తీయడం కొంచెం ఊరట.


 మరుసటి రోజు గుమ్మడిగారి సీన్స్. సీన్ చెబితే నువ్వు చెప్పగానే నాకు మూడ్ రావాలి కదా అన్నారు.  కొంచెం తీశాక, గుమ్మడిగారు విగ్ తీసేసి పిచ్చిపిచ్చిగా తీస్తున్నావు ఇలాగైతే నా వల్ల కాదు అనేశారు. నేను ఇప్పటివరకు తీసింది రేపు చూపిస్తాను, మీకు నచ్చితే తరువాత కంటిన్యూ చేయండి అన్నాను. ఆ రాత్రి రష్ ఎడిట్ చేసి మరుసటిరోజు ప్రివ్యూ వేసి గుమ్మడి గారికి చూపించాను. అమ్మ, బ్రహ్మరాక్షసీ... ఎంత బాగా చేశావ్ అని మెచ్చుకున్నారాయన. అలా ఆ గండం గట్టెక్కాను.
 
 అల్లు రామలింగయ్యగారు బిజీ ఆర్టిస్ట్ కావడంతో ఆయన రెండు మూడు షూటింగ్స్ చేసి మా షూటింగ్‌కు వచ్చేవాళ్లు. డైలాగ్స్ చూసి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, మార్చమ్మా అనేవాళ్లు. నేను కుదరదు ఈ డైలాగ్ ఇలాగే కావాలి అని తేల్చి చెప్పేదాన్ని.  అంతా కొంచెం పెద్ద ఆర్టిస్ట్‌లు కాబట్టి మొదట రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను. తరువాత అంతా సర్దుకుపోయింది.
 
 మీనా ప్రతిరోజు నాకో కొత్త అనుభవం. ఎందుకంటే, నేను కేవలం ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వేరు. డెరైక్టర్ యాక్షన్ అనగానే నా పని నేను చేసేదాన్ని. కానీ నేనే డెరైక్టర్, యాక్టర్ అనేసరికి పరిస్థితి వేరు. కెమెరా వెనుక నిలబడి యాక్షన్ అని చెప్పి కెమెరా ముందుకు పరిగెత్తేదాన్ని. ముందు నా డైలాగ్ లేకుండా చూసుకోవడంతో ఈ సమస్యను అధిగమించాను. చివరలో నా డైలాగ్ ఉంటే డైలాగ్ చెప్పి కట్ చెప్పేదాన్ని. ఇక లొకేషన్స్ విషయానికొస్తే, అప్పట్లో పల్లెటూళ్లకు వెళ్లి సినిమా తీయడం చాలా అరుదు. మేం మద్రాసులో కొంత తీశాక, కృష్ణగారి సొంతూరు బుర్రిపాలెంలో హీరో ఇంటికి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేశాం. ఇందులో కృష్ణగారు పంచ, జుబ్బలో తప్ప మరో డ్రెస్‌లో కనబడరు. అందుకే ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ ఊళ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే, కృష్ణగారి తల్లిని నటింపజేయడం. పెళ్లిలో ఒక పెద్ద ముత్తయిదువు కావాలి, సమయానికి ఎవరూ దొరకలేదు. అత్తయ్యా మీరు చేస్తారా అంటే ఆమె సరే అన్నారు. అలా నాకా అదృష్టం దక్కింది.
 
 మీనా సినిమాకు సంగీతం చాలా చక్కగా కుదిరింది. రమేష్‌నాయుడుగారు సంగీతం. దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ పాటలు. పెళ్లంటే... పాట నేను మనసులో ఏం అనుకుని దాశరథిగారికి చెప్పానో ఆయన అదే భావాన్ని పాటగా రాశారు. కృష్ణగారి మీద, నా మీద తీసిన చేనుకి గట్టుంది, ఇంటికి గడపుంది పాట నాకు బాగా నచ్చిన పాట. మల్లెతీగ వంటిది మగువ జీవితం, పెళ్లంటే నూరేళ్ల పంట పాటలు చాలా పాపులర్ అయ్యాయి.
 
 లాంగ్ షాట్స్ అన్నీ ఒకసారి, సజెషన్ షాట్స్ అన్నీ ఒకసారి తీయడంతో షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఇందులో కెమెరామెన్ పుప్పాల గోపాలకృష్ణమూర్తి సహకారం ఎంతో ఉంది. నిజానికి మీనా నవల రెండు పార్ట్‌లుగా వచ్చింది. ఇది సినిమాగా తీస్తే చాలా లెంగ్త్ వస్తుందన్నారు. కానీ  ఏ మాత్రం రాజీ పడకుండా, నవలలోని ఆత్మకు లోపం జరగకుండా తీశాను. చంద్రకళకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కథానుసారం పెళ్లికొడుకు తరపువాళ్లు కోతిలా కనపడతారు. ఇది నవలలో రాసింది. శ్రీరామ నామాలు పాటలో పెళ్లికొడుకు వాళ్లకు కోతి మాస్క్ వేసి తీశాను. అలా ఎక్కడా రాజీపడకుండా తీయడంతో చివరకు 18,000 అడుగులు వచ్చింది. అయినా ఏమాత్రం ఎడిట్ చేయకుండా సినిమా విడుదల చేశాం.
 
 1973 డిసెంబర్ 28న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా క్లైమాక్స్‌లో తల్లికి, కూతురికి మధ్య వచ్చే చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. అది చాలామంది తల్లిదండ్రులను ఆలోచింపజేసింది. సినిమా చూసి సులోచనారాణిగారు చాలా బాగా తీశావని మెచ్చుకున్నారు.  దుక్కిపాటిగారు చూసి నువ్వు ఇంత బాగా తీస్తావనుకోలేదు అన్నారు. శతదినోత్సవం మద్రాస్‌లో పెద్ద ఎత్తున చేశాం. ఫంక్షన్‌కు వచ్చినవాళ్లందరికీ భోజనాలు పెట్టి కొత్త ఆనవాయితీకి తెర తీశాం. ఈ సినిమాతో నాకు నవలా దర్శకురాలిగా పేరు వచ్చింది. అంతేకాదు... ‘మీనా’ సినిమా నాకు వందేళ్ల జీవితాన్నిచ్చిందని గర్వంగా చెపుతాను.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement