ఆయన ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూసి... నాకు నవ్వాగలేదు! | He gave to a birthday gift ... I laughs me! | Sakshi
Sakshi News home page

ఆయన ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూసి... నాకు నవ్వాగలేదు!

Published Sat, May 24 2014 10:33 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఆయన ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూసి...  నాకు నవ్వాగలేదు! - Sakshi

ఆయన ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూసి... నాకు నవ్వాగలేదు!

కెమేరా ముందైనా, వెనకైనా... వారిది అపురూప జంట.
 ఒకరు నటనలో సూపర్‌స్టార్...
 మరొకరు మంచి నటి... రికార్డులకెక్కిన దర్శకురాలు...
 ఒకరిది సొంత దుస్తుల ఎంపికైనా తెలియని
 పసిపిల్లాడి మనస్తత్వం.
 మరొకరిది ఆయన కోసం గరిటె పట్టడంలో
 ఆత్మతృప్తి పొందే అమ్మతత్వం.


 కెమేరా కన్ను ‘సాక్షి’ (1967)గా పెరిగిన వయసుతో పాటు ప్రేమ కూడా మరింతగా పెనవేసుకుపోయిన కృష్ణ,
 విజయనిర్మల వైవాహిక జీవితంలో ఎన్నో తీపి గుర్తులు..
 ఈ నాలుగున్నర దశాబ్దాల నిత్యనూతన ప్రేమానుబంధం
 ఇంత బలంగా ఉండడానికి కారణం ఏమిటి?
 అసలు వాళ్ళ మధ్య ప్రేమ ఎలా మొదలైంది?
 వారికి కోపతాపాలు లేవా? రావా?
 నిర్మల ఆరోగ్యం బాగా లేనప్పుడు కృష్ణ ఏం చేశారు?
 కృష్ణ మొదటి భార్య, పిల్లలతో నిర్మల ఎలా ఉంటారు?
 కృష్ణ పుట్టినరోజు మే 31కి ఓ వారం ముందే విజయ నిర్మల ఎన్నో ముచ్చట్లు ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.
 రండి... నిర్మలమైన ఆ ప్రేమ జీవిత
 విజయ రహస్యాలను ఆమెనే అడిగి తెలుసుకుందాం...
 
 కృష్ణగార్ని మొదటెక్కడ చూశారు? ఎప్పుడు కలిశారు?
 విజయనిర్మల:
మద్రాసులో ఓ సినిమా ఆఫీసులో ఆయనను మొదటిసారిగా చూశా. కలిసింది మాత్రం ‘సాక్షి’ చిత్రం షూటింగ్‌లో. అందులో చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిలా ఆయన చేయాలి. ఆ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. కృష్ణగారి నవ్వు నాకు మరీ నచ్చింది. బాపూగారికీ ఆ నవ్వంటే చాలా ఇష్టం. ‘సాక్షి’ షూటింగ్ అప్పుడే నాకు కృష్ణగారంటే మనసులో ఓ ఇష్టం ఏర్పడింది.
 
 ‘సాక్షి’లో కృష్ణగారితో మీ పెళ్లి సన్నివేశాన్ని గుడిలో తీసినప్పుడు, నిజంగానే పెళ్లవుతుందని ఎవరో అన్నారట?
 విజయనిర్మల:
చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు కానీ..నటుడు రాజబాబు ‘ఇప్పుడు జరిగింది సినిమా పెళ్లి. కానీ, నిజంగా మీకు పెళ్లవుతుం’దన్నారు. ‘అలా మాట్లాడకు. తప్పు’ అన్నా. కానీ, నెల తర్వాత అదే జరిగింది.
 
 అదెలా జరిగింది?
 విజయనిర్మల
: కృష్ణగారికి కూడా నేనంటే ఇష్టం మొదలైంది. మా ఇద్దరికీ మధ్యవర్తి నటుడు రాజబాబు. ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు’ అంటూ ఆయనే నా దగ్గర అన్నారు. అప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నా. ‘ఇక్కడ కాదు.. మద్రాసు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడతా’ అని రాజబాబుతో అన్నా. మద్రాసు వెళ్లిన తర్వాత మాట్లాడుకుని, కొంతమంది పరిశ్రమ పెద్దలతో చెప్పి, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. నిర్మాత భావనారాయణగారు మా పెళ్లి పెద్ద. నటి రమాప్రభ, ఇంకొంతమంది మా పెళ్లికొచ్చారు. పెళ్లి కాగానే అట్నుంచి అటు ‘అమ్మ కోసం’ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లాం. అప్పుడు నాగయ్యగారు, అంజలీదేవి గారు... ‘ఇద్దరూ దొంగలు. నోట్లో అసలు నాలుకే లేనివాళ్లలా కనిపిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంత పెద్ద పని చేసొచ్చారు’ అన్నారు సరదాగా. హనీమూన్‌కి మాత్రం కాశ్మీర్ వెళ్లాం. అది కూడా షూటింగ్ పని మీదే.
 
 ప్రేమ విషయాన్ని ముందుగా కృష్ణగారు చెప్పారా? లేక మీరా?
 విజయనిర్మల:
కృష్ణగారే చెప్పారు. అప్పటికే ఆయనంటే ఇష్టం ఉండడంతో నేను కూడా వెంటనే ఒప్పుకున్నాను.
 
 కృష్ణగారు ఎంతోమంది అందమైన నాయికల సరసన నటించారు కదా! మిమ్మల్నే ప్రేమించడానికి కారణం ఏమిటంటారు?
 విజయనిర్మల:
దర్శకురాలైన తర్వాత నేను అందరితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను కానీ హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్‌లో విరామం దొరికితే, ఏదైనా నవల చదువుతూ కూర్చునేదాన్ని. నా పనేంటో నేనేంటో అన్నట్లుండేదాన్ని. కృష్ణగారు నన్నిష్టపడడానికి అదో కారణం అయ్యుంటుంది.
 
 మీరెందుకు నచ్చారో ఆయనను ఎప్పుడైనా అడిగారా?... ఏమన్నారు?
 విజయనిర్మల:
‘వంట బాగా చేస్తావు కాబట్టి ఇష్టం’ అని నవ్వుతూ అన్నారు. ‘వంట కోసమే పెళ్లాడారా’ అంటే, ‘కాదు. నీ కళ్లంటే ఇష్ట’మని చెప్పారు.
 
 కృష్ణగారి మొదటి భార్యతో మీ అనుబంధం ఎలా ఉంటుంది?
 విజయనిర్మల:
మేమిద్దరం బాగానే ఉంటాం. ఓ రకంగా క్లోజ్‌ఫ్రెండ్స్ అనొచ్చు. ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తుంది. నేను వాళ్లింటికి వెళతాను. ఆవిడ పుట్టినరోజుకు కేక్ తీసుకెళతాం. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. నన్ను ‘పిన్నీ’ అని పిలుస్తారు. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు.
 
 ఈ మధ్యే అనుబంధం పెరిగిందా? లేక మొదట నుంచీ మీ అందరూ బాగా ఉండేవారా?
 విజయనిర్మల:
ఈ మధ్యే! అప్పట్లో సినిమాలతో బిజీ. తీరిక చిక్కేది కాదు. ఇప్పుడు కావాల్సినంత ఖాళీ కాబట్టి, రాకపోకలు ఎక్కువయ్యాయి.
 
 
కృష్ణగారు, మీరు పెళ్లాడిన కొత్తలో సినిమాల బిజీ మధ్య ఫ్యామిలీ లైఫ్...
 విజయనిర్మల:
చాలా మిస్సయ్యాం. మా పెళ్లయిన కొత్తలో నేనో మలయాళ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ కేరళలో జరిగితే, కృష్ణగారు కారేసుకుని వచ్చేసేవారు. నాకు ఖాళీ దొరికినప్పుడు, ఆయన ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికెళ్లేదాన్ని. కానీ, లొకేషన్‌కు మాత్రం వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే, హీరోయిన్స్‌తో యాక్ట్ చేసేటప్పుడు కృష్ణగారు ఇబ్బందిపడొచ్చు. అలాగే, ఆ హీరోయిన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
 
 డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కృష్ణగారు మీకేమైనా ఆంక్షలు పెట్టేవారా?
 విజయనిర్మల:
అస్సలు లేదు. ‘నీకు సౌకర్యవంతంగా ఉన్న డ్రెస్‌లు వేసుకో’ అంటారు. పాత్రకు అనుగుణంగా డ్రెస్ ఉండాలంటారు. హెయిర్ స్టయిల్ విషయంలో మాత్రం కామెంట్ చేసేవారు. ఒకప్పుడు జుట్టును ఇంతెత్తున చేసి, ముడిలా వేసేవాళ్లు. ఆ స్టయిల్ చేసుకున్నప్పుడు ‘ఇదేంటి పిచ్చుక గూడులా ఉంది. బాగా లేదు’ అనేవారు.
 
 కృష్ణగారితో మీకు అనుబంధం పెరిగిన తర్వాత జరుపుకొన్న మీ తొలి పుట్టినరోజుకు ఆయన ఏం బహుమతి ఇచ్చారు?
 విజయనిర్మల:
ఆయనతో జరుపుకొన్న ప్రతి పుట్టినరోజూ నాకు జ్ఞాపకమే. ఓ పుట్టినరోజుకి ఆయన నాకు గడియారం కొనిపెట్టారు.  మా మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజది. గిఫ్ట్ ప్యాక్ విప్పి చూసిన నాకు నవ్వాగలేదు. అది టేబుల్ క్లాక్. ఇష్టంగా ఇచ్చారు కాబట్టి, ఆ గడియారాన్ని నేను చాలా ఏళ్ళు పదిలంగా కాపాడుకున్నా. కృష్ణగారు బంగారు నగలు ఇష్టపడరు. ఎలాంటి కానుకలు కొనిపెట్టాలో మాత్రమే కాదు.. ఎలాంటి డ్రెస్సులేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు.
 
 అంటే.. సూపర్‌స్టార్ డ్రెస్‌లన్నీ మీరే ఎంపిక చేస్తారన్నమాట?
 విజయనిర్మల:
అవును. సినిమాల కోసం  కాస్ట్యూమర్స్ సెలక్ట్ చేస్తారు. కానీ, విడిగా వేసుకునే బట్టలు మాత్రం నేనే  కొంటాను. ఈ మధ్య చెయ్యికి ఫ్రాక్టర్ కావడంతోఓ ఆరు నెలలు నేను బయటకు వెళ్లలేదు. ఇటీవలే కృష్ణగారు పంచెలు కావాలనడిగారు.. దాంతో తెప్పించా.
 
 ఆ మధ్య ఆయన బర్త్‌డేకి బెంజ్ కారు కొనిపెట్టినట్లున్నారుగా!
 విజయనిర్మల:
పుట్టినరోజుకు నెల రోజుల ముందే ఆ కారు బుక్ చేశాను కానీ, కృష్ణగారితో చెప్పలేదు. పుట్టినరోజు నాడు ఇంటి నుంచి పద్మాలయా స్టూడియోకు వెళ్లడానికి బయటికొచ్చాం. బెంజ్ కారు వచ్చి, మా ముందు ఆగింది. నేను ఆయన చేతికి కారు తాళాలు ఇస్తే, ‘ఈ కారెవరిది? ఇప్పుడు ఇందులో వెళ్లాలా?’ అనడిగారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పాను.
 
 నిజజీవితంలో కృష్ణగారిది చిన్నపిల్లాడి మనస్తత్వమని అంతా అంటారు..
 విజయనిర్మల:
అది నిజమే. ఇప్పటికీ ఆయనది పసిపిల్లాడి మనస్తత్వమే. చాలా మంచి వ్యక్తి కూడా. నేను చేసే వంటలంటే ఆయనకు బాగా ఇష్టం. నాకెంత ఒంట్లో బాగాలేకపోయినా వంటలో నా చెయ్యి ఉండాల్సిందే. అప్పుడే ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య నాకు చెయ్యి ఫ్రాక్చరై దాదాపు ఆరు నెలలు వంట చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా. నేను వంట చేయలేనప్పుడు మా వదినవాళ్లు చేస్తారు. అయినా నాకే మనసొప్పదు. కృష్ణగారికి స్వయంగా నేను చేసి పెడితేనే తృప్తి. నెల రోజులుగా మళ్ళీ వంట మొదలుపెట్టా.
 
 మీరు చేసే వంటల్లో కృష్ణగారికి బాగా నచ్చేవి?
 విజయనిర్మల:
అన్నీ ఇష్టమే. ముఖ్యంగా నేను చేసే చేపల పులుసంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నిర్మల చేసినట్లుగా ఎవరూ వంట చేయలేరు. ఆమె వంటలంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అందరికీ చెబుతుంటారు.
 
 మామూలుగా కృష్ణగారు భోజనప్రియులా?
 విజయనిర్మల:
ఒకప్పుడు! ఆయన కోసం తందూరీ ప్రత్యే కంగా నేర్చుకున్నా. కానీ, ఇప్పుడు తిండి తగ్గిపోయింది.
 
 మీ మధ్య చిన్న చిన్న అలకలు.. గొడవలు..?
 విజయనిర్మల:
అలకలు సహజం. ఇక, సంసారమన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి? అయితే విడిపోయేంత గొడవలు ఎప్పుడూ రాలేదు. చెప్పిన టైమ్‌కి ఇంటికి రానప్పుడు, కోపం ప్రదర్శించేదాన్ని. కాసేపు మాట్లాడుకోకపోయినా, తర్వాత మామూలైపోతాం.
 
 ఒకరి పట్ల మరొకరు కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారు?
 విజయనిర్మల:
కృష్ణగారు ఏ భావమూ ప్రదర్శించరు. అన్నిటికీ ఒకే విధంగా ఉంటారు. నేను మాత్రం కొంచెం కోపంగా చూస్తాను. మాట్లాడకుండా ఉంటాను. దాంతో కోపమొచ్చిందని అర్థం చేసుకుంటారు. మా కోపం కాసేపే. తర్వాత మామూలుగా మాట్లాడుకుంటాం.
 
 మీ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. మరి, ఎలా గడుపుతున్నారు?
 విజయనిర్మల:
మేం పెద్దగా బయటికెళ్లం. రోజూ పేపర్లు తిరగేస్తాం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్‌ని కలిసి చూస్తాం. క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం ఆయనో టీవీ, నేనో టీవీ చూస్తాం. యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లో కూడా టీవీ పెట్టుకునేవారు కృష్ణగారు. క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చేసినప్పుడు మాత్రం పేకాట ఆడేవాళ్లం. ఎప్పుడూ ఆయనే విన్నర్.
 
 
మీ వైవాహిక జీవితంలో ఎదురైన క్లిష్టమైన సమస్య?
 విజయనిర్మల:
దేవుడి ఆశీర్వాదం వల్ల ఏదీ రాలేదు.

 


 ఆయన భర్త కావడం దేవుడి వరం అనుకుంటారా?
 విజయనిర్మల:
కచ్చితంగా! ఒక మంచి జీవిత భాగస్వామి లభించడం తేలిక కాదు. భార్యలను హింసించే భర్తల కథలు సినిమాల్లో చూస్తున్నాం. విడిగా కూడా అలాంటి భర్తలు చాలామందే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు మేలిమి బంగారం.        - డి.జి. భవాని
 
 సాక్షి’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల
 
 కృష్ణగారు అందగాడు. జయప్రద, శ్రీదేవి.. ఇలా ఎందరో అందగత్తెల సరసన నటించారు! మీకెప్పుడూ అభద్రత కలగలేదా?
 విజయనిర్మల:
వాళ్లందరూ అందగత్తెలే! ఒప్పుకుంటా. కానీ, కృష్ణగారు ఎవరితోనూ అంత చనువుగా ఉండేవారు కాదు. అందుకని నాకెప్పుడూ అభద్రతాభావం కలగలేదు.
 
 భాగస్వామి మన పట్ల ఎంత కేరింగ్‌గా ఉంటారో అనారోగ్యంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. మరి.. కృష్ణగారెలా చూసుకున్నారు?
 విజయనిర్మల: నేనేం మందులు వాడానో నాకు తెలీదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి - ఇలా ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిన మందులు ఆయనే తెచ్చి ఇచ్చేవారు. చెప్పాలంటే నా గురించి నా కన్నా ఆయనే ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు (చెమర్చిన కళ్లతో).
 
 ఇంతకీ, కృష్ణగారిలో మీకు బాగా నచ్చిన అంశం?
 విజయనిర్మల: చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. తన పనేంటో తనేంటో! అనవసరంగా ఒకర్ని నిందించడం, లేనిపో నివి మాట్లాడడం ఆయనకిష్టం ఉండదు. అది నాకు నచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement