tholoyathnam
-
తొలియత్నం: చలంగారు ఉంటే సంతోషించేవారు!
సినిమా ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ స్క్రీన్ మీదినుంచి ఆడియన్స్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది సైన్స్ అవుతుంది. ఆర్ట్‌లో ఎంత క్రియేషన్ ఉంటే, ఆడియన్స్‌లో అంత ఎమోషన్ బిల్డప్ అవుతుంది. ఈ ఆర్ట్‌నూ, సైన్సునూ ఒక సమాంతరరేఖ మీద నిలబెట్టినవాడు సినిమా చరిత్రలో సెన్సిబుల్ డెరైక్టర్‌గా నిలిచిపోతాడు. అలా కంటెంట్‌నూ, కాన్ఫిడెన్స్నూ నమ్ముకుని, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సినిమాలు తీస్తున్న డెరైక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ! అతడి మొదటి సినిమా ‘గ్రహణం’ వెనుక సంగ్రామం అతడి మాటల్లోనే... మన సమాజంలో ఒక ద్వంద్వ ప్రవృత్తి ఉంది. స్త్రీ ఎవరితోనైనా కాస్తంత సాన్నిహిత్యంగా మెలిగితే చులకనగా మాట్లాడతారు. అదే మగాడు ఎంతమంది ఆడవాళ్లతో తిరిగితే అతనికంత క్రేజ్. ఆలోచనల్లో ఈ హిపోక్రసీ మొదటినుంచీ ఉంది. చలంగారి రచనలన్నీ సమాజపు ద్వంద్వ నీతిని చీల్చి చెండాడాయి. స్త్రీ ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చాయి. సంప్రదాయ సమాజంలో భూకంపం పుట్టించాయి. కానీ ఆయన కథలు సినిమాలుగా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మొదటిసారిగా నేనా ప్రయత్నం చేసి సక్సెస్ అవడం నిజంగా నా అదృష్టం. 1996లో మొదటిసారిగా చలంగారి శేషమ్మ కథల సంపుటి చదివాను. అందులో దోషగుణం కథ దగ్గర ఆగిపోయాను. ఆయన మిగతా కథల కన్నా ఇందులో ఏదో ప్రత్యేకత కనిపించింది. దాన్ని సినిమాగా తీయాలని డిసైడయ్యాను. కానీ ఆ కథను యధాతథంగా సినిమాగా మలచడం కుదరదనిపించింది. అందులో ఇరవై శాతం మాత్రమే సినిమాకు అడాప్ట్ చేసుకోవచ్చు. అందులోనే చలం ఆలోచనల్ని దట్టించాలి. మొదట కథను ఒక స్క్రిప్ట్‌గా రాసుకున్నాను. 1998లో కెనడాలో ఫిలిం స్కూల్‌కు అప్లై చేసినప్పుడు అదే స్క్రిప్ట్‌ను శాంపిల్ కింద పంపాను. అప్పుడు నాకు స్క్రీన్ రైటింగ్‌లో అడ్మిషన్ దొరికింది. కోర్స్ పూర్తయ్యాక, 2001లో ఇండియాకు వచ్చాను. 2003 వరకు చాలామంది చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. ఈ మధ్యలో ‘చలి’ అనే షార్ట్ ఫిలిం తీశాను. మంచి అప్రీసియేషన్ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. అప్పటికి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఎలా ఉండాలో నాకు అవగాహన వచ్చింది కాబట్టి ‘దోషగుణం’ స్క్రిప్ట్‌ను రీరైట్ చేశాను. అయితే ఆ పేరు పాతగా ఉండటంతో, సినిమాకి ఏ టైటిల్ పెడదామా అని తీవ్రంగా ఆలోచించాను. ఒక అపవాదు వల్ల భూస్వామి జీవితంలో గ్రహణం కమ్మింది. అతని భార్య జీవితంలోను, పనివాడు కనకయ్య జీవితంలోను కూడా గ్రహణం కమ్మింది. ఇంతమంది జీవితంలో గ్రహణం కమ్మింది కాబట్టి ఆ టైటిలే కరెక్ట్ అనుకున్నాను. భూస్వామి తన భార్య తొడ నుండి రక్తం తీసుకునే సీన్ సినిమాకి చాలా కీలకం. అయితే ఆ సీన్ తీయడానికి ఒక కొత్త దర్శకుడిగా నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు భరణిగారు, జయలలితగారు చాలా సపోర్ట్ చేశారు. ఒకరోజు హైదరాబాద్ ఫిలిం క్లబ్లో తనికెళ్ల భరణిగారు కలిసినప్పుడు చలం కథ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని చెప్పాను. వెంటనే ఆయన పైసా తీసుకోకుండా చేస్తాను అన్నారు. ‘మరి ప్రొడ్యూసర్ ఎలా’ అన్నారాయన. ‘మా అమ్మగారు తన ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేసి మూడు లక్షలిస్తానన్నారు, దాంతో చేస్తానండీ’ అన్నాను. ‘మూడు లక్షలతో సినిమా ఎలా తీస్తావయ్యా’ అని కనకధార క్రియేషన్స్ సుబ్బారావు, అంజిరెడ్డి, వెంకట్ల దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు బడ్జెట్‌ను మరో మూడు లక్షలకు పెంచారు. అలా మా సినిమా ఊపిరి పోసుకుంది. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే, భూస్వామి పాత్రను భరణిగారు చేస్తానన్నారు. భార్య శారదాంబ పాత్రకు జయలలితగారు బాగుంటుందనుకున్నాను. జయలలితగారికి మన సినిమాల్లో ఒక సెక్సీ ఇమేజ్ ఉంది. కానీ ఆవిడ అంతకుమించి చేయగలరని నా నమ్మకం. నా దృష్టిలో ఆవిడో ట్రెడిషనల్ బ్యూటీ. భరణిగారు కూడా మంచి ఐడియా అన్నారు. మిగతా పాత్రలకు సీరియల్స్ నుంచి, కొంతవరకు నాటకాల నుంచి తీసుకున్నాను. కనకయ్య పాత్రకు ఆర్టిస్ట్‌ను వెదకడానికి చాలా ఇబ్బందిపడ్డాను. పదిహేనేళ్ల కుర్రవాడు నడివయసు స్త్రీతో సన్నిహితంగా మెలగాలి. అలా చేయాలంటే ఆ కుర్రవాడికి ఎంతో కొంత పరిణతి కావాలి. అందుకే చాలా అన్వేషణ జరిపి తల్లావజ్జల సుందరిగారి అబ్బాయి మోహనీష్ను సెలెక్ట్ చేసుకున్నాం. తను కనకయ్య పాత్రకు జీవం పోశాడు. ఆనాటి సమాజ వాతావరణాన్ని తలపించే లొకేషన్ కోసం చాలా వెదికాం. చివరకు అమలాపురం దగ్గర ఉన్న లక్కవరం సెలక్ట్ చేసుకున్నాం. అక్కడ ఒక మంచి ఇల్లు దొరికింది. ఒక్క ప్రాపర్టీని కూడా బయట నుంచి తీసుకురాలేదు. దాదాపు షూటింగ్ అంతా అందులోనే జరిగింది. యూనిట్ అంతా ఒకే దగ్గర ఉండి షూటింగ్ చేసుకోవడం, సాయంత్రం వచ్చాక మర్నాడు చేయాల్సిన సీన్ గురించి డిస్కస్ చేసుకోవడంతో ఒక కుటుంబ వాతావరణంలా ఉండేది. షూటింగ్ సమయంలో ఓ రెండు సంఘటనలు నన్ను తీవ్ర ఆశ్చర్యానికి లోను చేసి, కొన్నింటి పట్ల నా అభిప్రాయాన్ని మార్చివేశాయి. కథ ప్రకారం ఒక సీన్లో తల్లిదండ్రుల మీద కోపంతో కనకయ్య కుండ విసిరికొడతాడు. అది కిందపడి పగులుతుంది. సీన్ తీయబోతుంటే ఇంటి ఓనర్ వచ్చి ‘ఇవాళ మంగళవారం, కుండ పగలగొట్టొద్దు’ అంది. మా షెడ్యూల్ ప్రకారం ఆ రోజు సీన్ పూర్తవాలి, మరో రోజు పొడిగించడానికి లేదు. ఎలా అని ఆలోచిస్తుంటే మోహనీష్... ‘సార్, నేను కుండ పగలగొడతాను, మీరు నన్ను తిట్టండి, అలా మన పనైపోతుంది’ అని ఐడియా ఇచ్చాడు. మేం సరే అన్నాం. తను కుండ పగలగొట్టాడు. ‘వాళ్లు అలా చేయవద్దన్నప్పుడు చేయడం తప్పు కదా’ అని మోహనీష్ని తిట్టాను. ఇంటావిడ రాగానే ‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఏంటండీ’ అన్నాను. ‘ఏవో ఉంటాయి నాయనా, ఐనా కుండ లేపే షాట్ ఈ రోజు విడిగా, పగిలిన షాట్ రేపు విడిగా తీసుకుని తరువాత రెండూ కలుపుకోవచ్చుగా’ అందావిడ. నేను ఆశ్చర్యపోయాను. మామూలు ప్రజలకు సినిమా గురించి అంతగా అవగాహన ఉండదని అప్పటిదాకా భావించిన నాకు ఈ అనుభవం కొత్త పాఠం నేర్పింది. అలాగే షూటింగ్ అయిపోయిన తరువాత కొన్ని పల్లెటూరి షాట్స్ తీస్తున్నాను. గోచీ పెట్టుకున్న ఒకతను సైకిల్ మీద మా దగ్గరికి వచ్చి ‘షూటింగ్ అయిపోయింది కదా ఇంకేం తీస్తున్నారండీ’ అన్నాడు. ‘పల్లె విజువల్స్ తీస్తున్నాం’ అన్నాను. ‘తీసుకోండి, టైటిల్స్ వేసుకోవడానికి పనికొస్తాయి’ అన్నాడు. నోట మాట రాలేదు. మొత్తానికి పందొమ్మిది రోజుల్లో, ఆరున్నర లక్షల బడ్జెట్లో సినిమా పూర్తిచేశాం. బ్లాక్ అండ్ వైట్‌లో చేయాలన్నది కూడా యాదృచ్ఛికంగా జరిగిందే. ఒకసారి మానిటర్ ఆన్ చేస్తుంటే కొన్ని క్షణాలు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించింది. అది చూసిన భరణిగారు ‘ఎంత బావుందో’ అన్నారు. అంతే, సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో ఉంచాలనుకున్నాం. అది చాలా ప్లస్సయ్యింది. తరువాత సినిమాను చాలా ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపించాం. మంచి స్పందన వచ్చింది. నేషనల్ అవార్డ్‌కు పంపించేటప్పుడు ఫిలిం ఫార్మాట్ కావాలంటే డిజిటల్ నుంచి ఫిలింకు ట్రాన్స్ఫర్ చేశాం. ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. 2006లో ఆమిర్‌ఖాన్ చేతుల మీదుగా గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డును అందుకున్నాను. రెండేళ్ల తరువాత ఆమిర్ ‘తారే జమీన్ పర్’కు తొలి ఉత్తమ దర్శకుడిగా అదే అవార్డ్ అందుకున్నారు. గ్రహణం నాకు ప్రశంసలతో పాటు విమర్శలనూ తెచ్చిపెట్టింది. కథను సినిమాగా మలిచే క్రమంలో ఏ దర్శకుడికైనా కొంత స్పేస్ ఉంటుంది. దోషగుణాన్ని గ్రహణంగా మలిచే క్రమంలో నేను కూడా కొంత స్వేచ్ఛ తీసుకున్నాను. చలంగారు పల్లెటూరి మనుషులు, వారి స్వభావాల గురించి, అక్కడి వ్యవహారాల గురించి చాలా వర్ణన చేశారు. బడ్జెట్ దృష్ట్యా నేనవన్నీ పక్కన పెట్టాను. ఆయన అభిప్రాయాలన్నీ కనకయ్య మేనమామ పాత్ర ద్వారా చెప్పించాను. నిజానికి ఆ పాత్ర కథలో లేదు. అవసరం కోసం నేనే సృష్టించాను. దానికి నేను సినిమాలో పేరు పెట్టలేదు. అలాగే కనకయ్య తండ్రి పాత్రకు కథలో పేరు లేదు. సినిమాలో నేను సుబ్రహ్మణ్యం అని పెట్టాను. ఇవి చిన్న మార్పులే. కానీ సినిమా మీద ప్రధానంగా రెండు విమర్శలు వచ్చాయి. కథలో చలం శారదాంబను ఒక పవిత్రమూర్తిగా చూపించారు. నేను ఒక సాధారణ స్త్రీగా చూపించాను. ఎందుకంటే పురాణాల్లోలా పవిత్ర స్త్రీకి మాత్రమే అపవాదు రాదు. నిజ జీవితంలో ఒక మామూలు స్త్రీకి కూడా రావచ్చు. వస్తే తనెలా సంఘర్షణకు గురవుతుంది, స్త్రీ లైంగికత్వం మీద సమాజం ఎలాంటి నిఘా పెడుతుందీ చూపించాలనుకున్నాను. అందుకే కనకయ్య శారదాంబ కాళ్లు వత్తేటప్పుడు ప్రేక్షకులు వాళ్లిద్దరికీ ఏదో సంబంధం ఉంది అనుకోవాలన్నట్టు చిత్రించాను. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని కేవలం లైంగిక విషయానికి మాత్రమే పరిమితమైనదానిగా చూడటం తప్పని చివర్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఒక సీన్లో శారదాంబ మంగళసూత్రం తీసి మొహం కడుక్కుని, తరువాత మళ్లీ వేసుకుంటుంది. ఓ సంప్రదాయ స్త్రీ అలా చేయదన్నారు. అలా చేయకూడదని ఎక్కడా లేదని నా ఉద్దేశం. చలంగారి కథను సినిమాగా తీయడానికి అంగీకరించిన ఆయన కూతురు సౌరిస్, సినిమా చూసి ‘నాన్నగారు ఉండి ఉంటే చాలా సంతోషించేవారు’ అన్నారు. నా దృష్టిలో గ్రహణానికి లభించిన అతిపెద్ద సర్టిఫికెట్ అది. ఇక భరణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా తొలి సినిమాకే కాదు, నా కెరీర్‌కి కూడా వెన్నెముకగా నిలిచారాయన! - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా!
ఐతే... డెరైక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మొదటి సినిమా. సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌కి మొదటి సినిమా. ఆర్డ్ డెరైక్టర్ రవిందర్కి మొదటి సినిమా. మ్యూజిక్ డెరైక్టర్ కళ్యాణి మాలిక్‌కి మొదటి సినిమా. ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అనే ఆవేశంలో లాభ నష్టాల బేరీజు లేకుండా, కసితో ముందడుగు వేసిన మొండితనపు కుర్రాళ్ల కల ఇది. రిలీజ్ తరువాత మళ్లీ ‘ఐతే ఏంటి’ అనే పరిస్థితి రాలేదు. టెక్నీషియన్స్‌ను ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసి, ఇండిపెండెంట్ సినిమాకు ఇమేజ్ తెచ్చిన సినిమా అది. ఆ చిత్రం తీసే క్రమంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎదుర్కొన్న అనుభవాలు... ఆయన మాటల్లోనే. మామూలుగా టైస్టుల మీద భారీ ప్రైజ్‌లు ప్రకటిస్తుంటారు. వాళ్లను ప్రభుత్వానికి పట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టిన కథే ‘ఐతే’.నేను ‘అమృతం’ సీరియల్‌కు మొదట్లో డెరైక్టర్‌గా పనిచేశాను. దానికి సెంథిల్ కెమెరామెన్. సర్వేష్ మురారి అసిస్టెంట్ కెమెరామెన్. రవీందర్ ఆర్ట్ డెరైక్టర్. కళ్యాణిమాలిక్ మ్యూజిక్ డెరైక్టర్. అంతా కుర్రాళ్లం కాబట్టి, ఇంకా ఏదో చేయాలన్న కసితో ఉండేవాళ్లం. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ గురించి ఆలోచిస్తూ, ఒక లో-బడ్జెట్ సినిమా చేద్దామనుకున్నాం. అది వర్కవుట్ అవుతుందా లేదా, ఎవరైనా తీసుకుంటారా లేదా... ఏదీ ఆలోచించనీయని యవ్వనావేశం! మొదట ఒక మాఫియా డాన్ చుట్టూ కథ అల్లుకున్నాను. డాన్ చుట్టూతా మీకు తెలిసిన కథలు చెప్పండి, అవి కాకుండా నా దగ్గర ఉన్నది కొత్తది అయితేనే ముందుకు వెళదాం అన్నాను. వాళ్లు చాలా చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్ చెప్పేసరికి ఇదేదో కొత్తగా ఉందని అందరూ ఎక్జయిట్ అయ్యారు. తరువాత ‘అమృతం’ నిర్మాత గుణ్ణం గంగరాజుగారికి లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి సినిమా తీద్దాం, మొదట నువ్వేమనుకుంటున్నావో పూర్తిగా పేపర్ మీద రాసివ్వు అన్నారు. కథ చెప్పడం చాలా ఈజీ, రాయడం చాలా కష్టం. మొదటి మూడు రోజులూ బుర్ర వేడెక్కిపోయింది. మేం నలుగురం కలిసి డిస్కస్ చేసేవాళ్లం. ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు జీవీకే వన్ ఉన్న దగ్గర అప్పుడు చైనీస్ బళ్లు ఉండేవి. అక్కడ గోడ మీద కూర్చుని గంటల తరబడి డిస్కస్ చేసుకుని, అక్కడే తినేసి రూమ్‌కు వెళ్లిపోయేవాళ్లం. రాయడం మొదలుపెట్టాక క్లారిటీ వచ్చింది. మొదట అనుకున్న ప్రకారం మినిస్టర్ కిడ్నాప్‌కి ప్లాన్ చేసి చివరకు తానే కిడ్నాప్ అవుతాడు డాన్. దీన్ని గంగరాజుగారు ఫ్లైట్ హైజాక్, కిడ్నాప్ కింద మార్చారు. అలా ప్రతి దశలోనూ ఆయన చాలా హెల్పయ్యారు. కొత్తవాళ్లతో కదా, మార్కెట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఆయన మమ్మల్ని ఉత్సాహపరిచారు. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చాక, లొకేషన్స్ కోసం వెదుకులాట మొదలైంది. తలకోనతో పాటు చాలా అడవులు చూశాం. రెండు నెలల అన్వేషణ తరువాత వికారాబాద్ ఫారెస్ట్‌ను సెలక్ట్ చేసుకున్నాం. తరువాత సాంకేతిక అంశాల మీద దృష్టి పెట్టాం. కథ యువకుల జీవన పోరాటానికి సంబంధించి కాబట్టి, నేను, సెంథిల్... లైటింగ్, కాస్ట్యూమ్స్, కలర్స్ గురించి డిస్కస్ చేశాం. అమెరికన్ బ్లాక్ బుక్‌లో ఫొటోస్ రిఫరెన్స్ తీసుకుని కలర్ స్కీమ్ డిజైన్ చేసుకున్నాం. మరోవైపు ఆర్టిస్టుల ఎంపిక కీలకంగా మారింది. ఇందులో హీరో ఉండడు. నలుగురు కుర్రాళ్లు, వీళ్ల ఫ్రెండ్ ఒకమ్మాయి, డాన్, డాన్ అసిస్టెంట్... మొత్తం ఏడుగురు మెయిన్ క్యారెక్టర్స్. కొత్తవాళ్లు కావాలని ప్రకటన ఇస్తే, చాలా ఫొటోలు వచ్చాయి. షార్ట్ లిస్ట్ చేసి అభిషేక్, జనార్థన్, శశాంక్లను తీసుకున్నాం. మెయిన్ క్యారెక్టర్‌కు ఎవరూ దొరకక మొహితా చద్దాను బాంబే నుంచి తీసుకున్నాం. డాన్ క్యారెక్టర్‌కు పవన్ మల్హోత్రాతో పాటు మరొకరిని చూడటానికి నేను, గంగరాజుగారు బాంబే వెళ్లాం. వీడియో క్లిప్స్‌లో భయంకరంగా కనిపించిన పవన్, డెరైక్ట్‌గా చూస్తే చాలా చిన్నగా కనిపించాడు. అతడు పనికొస్తాడో లేదోనని నేను సందేహం వ్యక్తం చేశాను. ఆయన పవన్‌తో నా అభిప్రాయం చెప్పారు. పవన్ డాన్ గెటప్‌లో మేం ఉంటున్న హోటల్‌కు వచ్చేశారు. అంత కేర్ తీసుకుని, అంత ఇన్వాల్వ్ అయి ఆ గెటప్‌లో రావడం చూసి ఇంప్రెస్ అయిపోయాను. సింధు తులానీని చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించింది. మరో ఆలోచన లేకుండా సెలక్ట్ చేసేశాం. షూటింగ్ మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి మొదలుపెట్టాం. రోజూ సెట్లోకి రాగానే ఆ రోజు ఎన్ని క్లోజ్‌లు, ఎన్ని మిడ్‌లు, ఎన్ని వైడ్లు అని పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ సినిమాలో ఓ కీలకమైన విషయం గురించి మేం పడ్డ ఇబ్బందులు చెప్పాలి. బాంబే ఎయిర్‌పోర్ట్‌లో డాన్మీద అటాక్ జరిగే యాక్షన్ సీన్ ప్లాన్ చేశాం. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని లోకల్ ఫైట్మాస్టర్ను పెట్టుకున్నాం. అతను తన పాత పద్ధతిలో షాట్స్ కంపోజ్ చేశాడు. మాకది నచ్చలేదు. పర్మిషన్ ఉన్నది ఒక్క రాత్రికే. దాంతో రెండు మూడు షాట్స్ తీసిన తరువాత అతన్ని పక్కన పెట్టి మేమే తీయడం మొదలుపెట్టాం. అనుకున్నట్టు వచ్చింది. షూటౌట్ అయిన తరువాత డాన్ తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కెమెరా కాళ్ల నుంచి ఫేస్ దగ్గరకు క్రాస్‌గా ట్రావెల్ చేయాలి. క్రేన్, ట్రాలీ ఫేస్ దగ్గరికి క్రాసింగ్‌గా ఒకే లెవెల్లో వెళ్లాలి. ఆ ఇరుకు ప్లేస్‌లో ఇది కొంచెం కష్టమైన షాట్. ఐదారుసార్లు తీసినా జర్క్ వచ్చేసింది. నేను ఓకే చెప్పేశా. ఎడిటింగ్‌లో గన్ సౌండ్స్ యాడ్ చేశాను. జరిగిన అటాక్‌ను విలన్ గుర్తు తెచ్చుకుంటున్నట్టు జర్క్ దగ్గర తుపాకీ చప్పుళ్ల సౌండ్ సింక్ అయింది. మరో సీన్లో డాన్‌ను కిడ్నాప్ చేసిన తరువాత కుర్రాళ్లు చీర్స్ చెప్పుకుంటుంటారు. అప్పుడు త్రీ యాక్సిస్ రొటేషన్ టెక్నాలజీ లేకపోయినా షాట్లో అదే ఎఫెక్ట్ తీసుకొచ్చాడు సెంథిల్. అలాగే మొదటినుంచీ ఒక సాంగ్ పెడదామనుకున్నాం. దానికి కళ్యాణిమాలిక్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడు. విన్న వెంటనే ఓకే చేసేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. డ్యాన్స్‌మాస్టర్ నిక్సన్ ఆధ్వర్యంలో సాంగ్ పిక్చరైజేషన్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఇక క్లైమాక్స్ సీన్లో బాంబ్ బ్లాస్ట్‌కు కార్ డిక్కీ లేచి పడాలి. స్పెషల్ ఎఫెక్స్ట్ వాళ్లు కాలిక్యులేట్ చేసి డిక్కీ ఆరు ఫీట్లు ఎగురుతుందని చెప్పారు. కానీ షూట్ చేసేటప్పుడు బాంబు ధాటికి డిక్కీ పైకి లేచి, ఎలక్ట్రిక్ పోల్కి తగిలి సర్క్యూట్ సంభవించింది. దాంతో రెండు గంటలపాటు వికారాబాద్‌కు కరెంట్ సప్లై నిలిచిపోయింది. అది పొరబాటున యూనిట్ వైపు పడి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. మా ప్రొడక్షన్‌వాళ్లు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సమస్యను పరిష్కరించారు. అంతేకాక, వర్షం వల్ల వరుసగా రెండు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కొంచెం టెన్షన్ పడినా, మొత్తానికి 63 రోజుల్లో పూర్తి చేశాం. అది కూడా ద్విభాషా చిత్రం కాబట్టి. పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్‌కు మాత్రం టైమ్ పట్టింది. వాయిస్‌లు నేచురల్‌గా ఉండాలి కాబట్టి డబ్బింగ్ ఎక్కువ సమయం తీసుకుంది. న్యాచురల్ ఫిలింస్‌కు అప్పట్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సినిమా పూర్తయిన మూడు నెలలకు కూడా విడుదల కాలేదు. కొంతమంది బాలేదన్నారు కూడా. మరీ అంత దారుణంగా తీశామా అనుకున్నాం. ఆ టైమ్‌లో మా ప్రొడ్యూసర్ మాకు చాలా ధైర్యాన్నిచ్చారు. రామ్‌గోపాల్‌వర్మని సినిమా చూడమంటే చూడనన్నారు. బాగుంటే ఓకే, బాగోలేకపోతే నేనే కామెంట్ చేస్తే అది మీకే నష్టం అన్నారు. ఫర్వాలేదని బీటా ప్రొజెక్షన్లో చూపించాం. ఆయనకు విపరీతంగా నచ్చింది. మా యూనిట్ నుండి కాకుండా బయటివాళ్ల నుంచి వచ్చిన మొదటి పాజిటివ్ కాంప్లిమెంట్ అదే. తరువాత రామానాయుడు స్టూడియోకు డీటీఎస్ మిక్సింగ్‌కు పంపించాం. ఆడియోగ్రాఫర్ మధుసూదన్‌రెడ్డి ఇంటర్వెల్ వరకు చూసి అద్భుతంగా ఉందన్నారు. సినిమా విడుదలయ్యాక, లైట్‌బాయ్స్ ఒక విషయం చెప్పారు. షూటింగ్లో మా తపన చూసి కుర్రాళ్లు ఏదో కష్టపడుతున్నారు, అసలు సినిమా ఏమైనా నడుస్తుందా అనుకున్నారట. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని వాళ్లు అస్సలు అనుకోలేదట. స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్‌ప్రొడక్షన్ వరకు ప్రతి దశలో అందరం ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టే అంత పెద్ద సక్సెస్ వచ్చిందనుకుంటాను. కెమెరా, కలర్స్, లైటింగ్ విషయాల్లో ప్రయోగాలు చేసి సినిమాను వాస్తవికతకు దగ్గరగా ఉండేట్టు తీశాం. ఈ సినిమాకు అసలు బలం స్క్రీన్‌ప్లే. అందుకు నామీద సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ల ప్రభావం ఉండటం కారణం కావచ్చు. గంగరాజుగారి డైలాగ్స్ సూపర్బ్‌గా హెల్పయ్యాయి. ఎడిటర్ సుధాకర్ కూడా ప్లస్సయ్యారు. సినిమాను ఫాస్ట్ పేస్డ్ నేరేషన్లో నడిపాడు. హిందీలో ‘పచాస్లాక్’ అనే పేరు పెట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మేశాం. తెలుగులో విడుదలైన రెండు మూడేళ్లకు వాళ్లు హిందీలో రిలీజ్ చేశారు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: సినిమా చూసి నచ్చలేదన్నాడు!
రీమేక్ సినిమా అంటే పేలిన బుల్లెట్‌ను మళ్లీ పేల్చడం లాంటిది. హిట్టయితే, ఆ... రీమేకే కదా అంటారు. ఫ్లాపయితే, ఊ... రీమేక్ కూడా తీయలేకపోయాడు అనేస్తారు. రీమేకెప్పుడూ డెరైక్టర్ కాన్ఫిడెన్స్‌ను మేకులా గుచ్చుతుంటుంది. రీమేక్ అనేది కేవలం భాషకు కాదు, భావానికి సంబంధించినది కూడా. అలాంటి ఫీట్‌ను పదేపదే చేస్తూ సక్సెస్ అవుతున్న రీమేకర్ భీమనేని శ్రీనివాసరావు తన మొదటి సినిమా ‘శుభమస్తు’తోనే రీమే‘కింగ్’ ఎలా అయ్యారన్నదే ఈ వారం తొలియత్నం. సినిమా అంటే చాలామందికి ప్యాషన్. కానీ దాన్ని అఛీవ్ చేయడం చాలా కష్టం. నేను మాత్రం నా సినిమా కలను నిజం చేసుకోవడానికి గుంటూరు నుంచి మద్రాస్ వరకూ వెళ్లాను. టి.కృష్ణగారి నుంచి ముత్యాల సుబ్బయ్య, బి.గోపాల్, మోహనగాంధీ, ఐవి శశి, పరుచూరి బ్రదర్స్ వరకు చాలా మంది దర్శకుల దగ్గర పనిచేశాను. రామానాయుడు, ఎడిటర్ మోహన్ వంటి పెద్ద పెద్ద నిర్మాతల బ్యానర్స్‌లో పనిచేశాను. ఇలా డిఫరెంట్ డెరైక్టర్స్‌తో డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో పనిచేయడం నా కెరీర్‌కు చాలా ఉపయోగపడింది. నాకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్, వే ఆఫ్ డీలింగ్ ఏర్పరుచుకోవడానికి తోడ్పడింది. ఎడిటర్ మోహన్ బ్యానర్లో ముత్యాల సుబ్బయ్య దగ్గర ‘మామగారు’ సినిమాకు కోడెరైక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు నా మొదటి సినిమాకు బీజం పడింది. అందులో దాసరిగారు మెయిన్ క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీలో శిఖరంలాంటి ఆయనతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మోహన్‌గారు పదేపదే నన్ను హెచ్చరించేవారు. సెట్లో నా వర్కింగ్ స్టైల్, ప్లానింగ్ మోహన్‌గారికి బాగా నచ్చాయి. సినిమా జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో ఆయన నన్ను టెస్ట్ చేసేవారు. మామగారులో దీపావళి సాంగ్ జరిగే సమయంలో, ఆకాశంలో చంద్రుడు వెన్నెలలు విరజిమ్ముతున్నాడు. మోహన్‌గారు నా దగ్గరికి వచ్చి ఫ్రేమ్‌లో చందమామ వచ్చేట్టు కంపోజ్ చేస్తే బాగుంటుందేమో, డెరైక్టర్‌కు చెప్పు అన్నారు. ఒక్కక్షణం ఆలోచించి దీపావళి అమావాస్య రోజు వస్తుంది కదా అన్నాను. మోహన్‌గారు నవ్వారు. అలా నాకాయన బోలెడన్ని టెస్ట్‌లు పెట్టేవారు. సినిమా అండర్ ప్రొడక్షన్లో వుండగానే కథ రెడీ చేసుకో, డెరైక్షన్ ఇస్తానన్నారాయన. అయితే నాకు మోహన్గారి కంటే ముందు రామానాయుడు గారు ఆఫర్ ఇచ్చారు. అదెలాగంటే, నేను బి.గోపాల్ దగ్గర చినరాయుడు సినిమాకు కోడెరైక్టర్‌గా పనిచేశాను. వెంకటేష్‌గారికి నా వర్కింగ్ స్టైల్ నచ్చి రామానాయుడిగారికి చెప్పారు. ఆయన నన్ను పిలిచి కథ రెడీ చేసుకో అన్నారు. అయితే ముందు మా బ్యానర్లో ఒక సినిమాకు కోడెరైక్టర్‌గా పనిచేయాలని షరతు పెట్టారు. అలా సురేష్ ప్రొడక్షన్స్‌లో గుహనాధన్గారి దగ్గర ‘పరువు ప్రతిష్ట’కు కోడెరైక్టర్‌గా చేశాను. తరువాత కథ రెడీ చేసుకునే పనిలో పడ్డాను. మరోవైపు మోహన్‌గారు కూడా కథ రెడీ చేసుకో,సినిమా చేద్దామన్నారు. ఈ మధ్యలో మోహన్గారి బ్యానర్లో పల్నాటి పౌరుషం సినిమాకు కూడా పనిచేశాను. అది సరిగ్గా ఆడలేదు. ఐనా మోహన్‌గారు నాకిచ్చిన మాటకు కట్టుబడి సినిమాచేద్దామన్నారు. అప్పటికి నా దగ్గర కథ సిద్ధంగా లేదు. ఈ క్రమంలో ఒకరోజు ‘అనియన్ బావ చేటన్ బావ’ అనే మళయాలం సినిమా చూశాను. అది నాకు బాగా నచ్చింది. మోహన్ గారిని చూడమని చెప్పాను, ఆయనకూ నచ్చి రైట్స్ తీసుకున్నారు. అప్పుడు నాయుడు గారికేం చెప్పాలన్న సందిగ్ధంలో పడ్డాను. ఆయన తన బ్యానర్లో ఎందరో పెద్ద దర్శకులను పరిచయం చేసారు. కాదంటే ఎలా. నాకేమో మోహన్‌గారితో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది. ఆయనతో ఏదైనా ఫ్రీగా చెప్పగలను. ఈ సంఘర్షణలో రామానాయుడిగారి దగ్గరికి వెళ్లి ఆయనకు పరిస్థితి వివరించాను. ఆయన నీ ఇష్టం, మొదటి సినిమా కదా ఆలోచించుకో అన్నారు. నేను మోహన్గారివేపు మొగ్గు చూపాను. చాలా స్పీడ్‌గా ప్రీప్రొడక్షన్ మొదలైంది. మూలకథను అలాగే ఉంచి, దాని ఆత్మ చెడకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చాం. తరువాత ఆర్టిస్ట్ ఎంపిక మొదలుపెట్టాం. కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటే సినిమా సగం హిట్టయినట్టేనని నా నమ్మకం. హీరోగా జగపతిబాబును ఎంచుకున్నాం. అప్పటికి కుటుంబ కథా చిత్రాల్లో ఫామ్‌లో ఉన్న ఆమని, ఇంద్రజలను హీరోయిన్లుగా తీసుకున్నాం. అన్నదమ్ముల పాత్రలకు దాసరిగారు, సత్యనారాయణగారిని అనుకున్నాం. అంతా సిద్ధం చేసుకుని షూటింగ్ మొదలుపెట్టాం. మొదటిరోజు షూటింగ్... దాసరిగారు, సత్యనారాయణగారు, జగపతిబాబు సీన్లో ఉన్నారు. స్క్రిప్ట్, ప్లానింగ్ విషయం లో మోహన్‌గారికి నామీద అపారమైన నమ్మకం. కానీ షాట్ డివిజన్, కెమెరా యాంగిల్స్, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తానో అని ఏమూలో చిన్న సందేహం ఆయనకు. సెట్లో నేను చురుగ్గా కదులుతూ నెక్ట్స్ నెక్ట్స్ అంటూ ఆరోజుకు అనుకున్న రెండు సీన్లు పూర్తి చేశాను. మోహన్‌గారు వెంటనే తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి, ఏదో భయపడ్డాను కానీ శీను చాలా కాన్ఫిడెంట్‌గా చేశాడని చెప్పారు. ప్రొడ్యూసర్ డెరైక్టర్‌ను నమ్మితే సినిమాకోసం ఎంతదూరమైనా వెళతారు. అందుకు ఒక ఉదాహరణ చెప్పాలి. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అన్నదమ్ములు ఉండే ఇంటికోసం వెదుకుతున్నాం. ఇప్పటిదాకా ఎవరూ షూట్ చేయని పెద్ద ఇల్లు ఒకటి మోహన్‌గారు చూశారు. అది చాలా రిచ్ హౌజ్. అదృష్టం కొద్దీ అందులో షూట్ చేసే అవకాశం మాకు దొరికింది. మొదట లోబడ్జెట్ సినిమా అనుకున్నది ఆ ఇంట్లో కొంత షూట్ చేశాక దాన్ని మ్యాచ్ చేసేందుకు సినిమాను మినిమమ్ బడ్జెట్లోకి తీసుకెళ్లారు మోహన్‌గారు. ఈ షూటింగ్లో నాకు బాగా గుర్తుండిపోయిన అనుభవం ఒకటి చెప్పాలి. కథలో భాగంగా హీరో తమ అమ్మాయిల్లో ఎవరిని పెళ్లాడాలనే విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరతాయి. ఇద్దరూ ఒకరిమీద ఒకరు చేయి చేసుకునే స్ధాయికి వెళతారు. రెండు మూడు టేక్‌లు తీసినా సీన్ నేను అనుకున్నట్టు రావడం లేదు. అప్పుడు సత్యనారాయణగారు ఇంకా ఎన్నిసార్లయ్యా అని చిరాకుపడ్డారు. ఆయనసలే చాలా సీనియర్ నటులు. ఒక్క క్షణం నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దాసరిగారు సత్యనారాయణగారిని పక్కకు తీసుకెళ్లి, మనం ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా డెరైక్టర్‌కు ఏది కావాలో అది ఇవ్వగలగాలి అని చెప్పారు. చివరికి నేననుకున్నది వచ్చేదాకా ఇద్దరూ సహకరించారు. సినిమాలో హీరో ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరిని చేసుకుంటాడన్న టెన్షన్, వాళ్ల మధ్య వచ్చే మిస్కమ్యునికేషన్స్, కన్ఫ్యూజన్స్ బాగా వచ్చాయి. జగపతిబాబు-బ్రహ్మానందం, సుధాకర్-బాబూమోహన్‌ల కామెడీ బాగా పండింది. అప్పటికి మానిటర్ సిస్టమ్ రాలేదు కాబట్టి ఏదీ రీచెక్ చేసుకునే అవకాశం లేదు. టేక్ జరుగుతున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండి అవుట్‌పుట్ ఎలా వస్తుందో జడ్జ్ చేయాల్సివచ్చేది. ముఖ్యంగా షూటింగ్లో నేను బాగా స్ట్రగుల్ అయింది క్లైమాక్స్ విషయంలో. మూలంలోకన్నా ఎంటర్టైన్మెంట్, టెన్షన్ బాగా బిల్డప్ చేయాలని చివరివరకూ ఆ సీన్స్ పెండింగ్‌లో ఉంచాం. రేపు షూటింగ్ అంటే ముందురోజు వరకు ఇంప్రూవ్మెంట్ చేస్తూనేఉన్నాం. దాంతో షూట్ ఎలా జరుగుతుందోనని భయపడ్డాను. ఎందుకంటే డెరైక్టర్ కాన్ఫిడెన్స్‌ను బట్టే ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ ఉంటుంది. లక్కీగా సెట్‌కు వెళ్లాక అనుకున్నదానికన్నా బాగా తీయగలిగాను. ఆ అనుభవంతో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లేకుండా ఇంకెప్పుడూ షూట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. సంగీతానికి సంబంధించి నాకంత నాలెడ్జ్ లేదు. ఏదైనా పాట విని బాగుందో, బాలేదో చెప్పడం వరకే నాకు తెలుసు. కథవిని కోటిగారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. కెమెరామెన్ మహీధర్ నాకేది కావాలో అర్థం చేసుకుని అవుట్‌పుట్ ఇచ్చేవారు. భారీ కాస్టింగ్వున్నా ఎక్కడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి మోహన్‌గారితో పాటు నా టీమ్ బాగా సహకరించింది. మొత్తం 58 రోజుల్లో సినిమా పూర్తి చేసి పోస్ట్‌ప్రొడక్షన్‌కు వెళ్లాం. సినిమా ఫస్ట్ ప్రింట్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రివ్యూ వేశాం. మూడు రీళ్లయ్యాక ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు. సినిమా పూర్తయ్యాక తాను మొదటి మూడు రీళ్లు చూస్తానన్నాడు. రివర్స్‌లో చూడడం వల్ల ఆయనకు సినిమా పూర్తిగా అర్థం కాలేదు. మోహన్గారి దగ్గరకు వెళ్లి సినిమా నచ్చలేదన్నాడు. ఈ విషయం మిగతా డిస్ట్రిబ్యూటర్స్‌కు తెలిస్తే సినిమా బిజినెస్ అవదని ఆయన కంగారుపడ్డారు. కానీ సినిమా మంచి బిజినెస్ అవడంతో పాటు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మోహన్‌గారు నన్ను దీవిస్తూ శుభమస్తు అని టైటిల్ పెట్టారో ఏమో అది పెద్ద సక్సెస్ అయింది. నా మొదటిసినిమానే వందరోజుల సినిమాగా నిలబడింది. రెండు మూడు టేక్‌లు తీసినా సీన్ నేను అనుకున్నట్టు రావడం లేదు. అప్పుడు సత్యనారాయణగారు ఇంకా ఎన్నిసార్లయ్యా అని చిరాకుపడ్డారు. ఆయనసలే చాలా సీనియర్ నటులు. ఒక్క క్షణం నాకేం చేయాలో అర్థం కాలేదు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: మీనా వందేళ్ల జీవితాన్నిచ్చింది!
డైరెక్టర్ అనగానే దానిలో పురుషుడు అనే అర్థం సహజంగా ధ్వనిస్తుంది. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్స్ దాదాపుగా మేల్ డామినేటెడ్ ఫీల్డ్స్. ముఖ్యంగా సినిమా రంగం, అందులోనూ దర్శకత్వశాఖ అంటే, అది పురుషుల ప్రపంచం. అలాంటి చోట నిలదొక్కుకుని, గిన్నిస్‌బుక్‌లో జెండా పాతడం ఒక్క విజయనిర్మలకే సాధ్యమైంది. మొండితనం, పట్టుదల.. సినిమా రంగంలో ఆమెకో సెపరేట్ పేజీని క్రియేట్ చేసాయి. బాలనటిగా, హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి... డెరైక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయనిర్మల... తన మొదటి తెలుగు సినిమా ‘మీనా’ తనకు మరిచిపోలేని మధుర జ్ఞాపకం అంటున్నారు. ఆ రోజుల్ల్లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా నిర్మాణంలో కల్పించుకునేవాళ్లు. నవయుగ వాళ్లు సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో చంద్రకళ పెళ్లి సీన్లో ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాటను పూర్తిగా తొలగించమన్నారు. నేను మాత్రం బాగుంటుందని అలాగే ఉంచేశాను. సినిమా విడుదలయ్యాక ఆరుద్ర రాసిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ‘సాక్షి’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాపుగారు వేసుకున్న స్టోరీ బోర్డ్ గమనించేదాన్ని. లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్ గురించి ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అలా దర్శకత్వం పట్ల ఒక ప్రాధమిక అవగాహన,ఆసక్తీ ఏర్పడ్డాయి. నేను డెరైక్షన్ చేస్తానని కృష్ణగారిని అడిగాను. నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో రెండు పడవల మీద కాలుపెడితే ప్రయాణం కష్టం, కొంత కాలం ఆగు అని సలహా ఇచ్చారు. తరువాత చాలామంది దర్శకులతో పనిచేయడంతో ఒక దర్శకునికి ఉండవలసిన లక్షణాలు అర్ధమయ్యాయి. నాకు మొదటినుంచీ టెక్నికల్ అంశాల పట్ల ఆసక్తి ఉండటంతో లాంగ్ షాట్‌కు ఏ లెన్స్ వేస్తారు, 9 ఎం.ఎం. లెన్స్ ఎప్పుడు వాడాలి అనే అంశాల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. నటిగా వంద సినిమాలు పూర్తయ్యాక, దర్శకురాలు కావాలనే నా కోరికకు కార్యరూపం ఇవ్వాలనుకున్నాను. అయితే అనుకోని విధంగా ముందే అవకాశం రావడంతో మొదట మలయాళంలో కవిత సినిమాకు దర్శకత్వం వహించాను. అది లో-బడ్జెట్ సినిమా. కానీ పెద్ద సక్సెస్ అయింది. తరువాత నా మాతృభాష తెలుగులో సినిమా చేయాలన్న తపనతో కథ కోసం ఆలోచించాను. అప్పట్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్‌గా వచ్చిన యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ను సినిమాగా మలిస్తే బాగుంటుందనిపించింది. అది ప్రోగ్రెసివ్ ధాట్స్ ఉన్న ఒక యువతి కథ. దానికో ఆబ్జెక్టివ్ ఉంది. తల్లిదండ్రులు పిల్లల గురించి, వాళ్ల భవిష్యత్ గురించి ఆలోచించాలన్న థీమ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పాయింట్ నన్ను కట్టిపడేసింది. ఐతే నవల హక్కులు దుక్కిపాటి మధుసూదనరావుగారి దగ్గర ఉన్నాయి. ఆయనను అడిగితే ఎవరితో చేస్తావమ్మా అని అడిగారు. కృష్ణగారితో అన్నాను. మేం నాగేశ్వరరావుగారితో చేద్దామనుకునే ధైర్యం చేయలేకపోయాం. కృష్ణగారితో పంచె కట్టించి ఎలా చేస్తావన్నారు. ఎందుకంటే కృష్ణగారు అప్పటికి మాస్ హీరో. ఇదేమో ఫ్యామిలీ డ్రామా. ఆయనకు సరిపోతుందో లేదోనని దుక్కిపాటిగారి సందేహం. కానీ నేను చేస్తానని ధైర్యంగా చెప్పి ఆయన దగ్గర హక్కులు తీసుకున్నాను. నవలలో పెద్దగా మార్పులు చేయకుండా స్క్రిప్ట్ రాసుకున్నాను. క్యారంబోర్డ్ మీద కొండపల్లి బొమ్మలు ఉంచి ఏ సీన్లో ఏ పాత్ర ఎక్కడ నుంచి ఎటు కదలాలి, ఏ షాట్ ఏ యాంగిల్ నుంచి తీయాలి అని ప్లాన్ చేసుకుని, పర్ఫెక్ట్గా స్టోరీ బోర్డ్ రాసుకున్నాను. విజయకృష్ణా బ్యానర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద సినిమా మొదలుపెట్టాం. దర్శకురాలిగా మొదటిరోజు ఫస్ట్ షాట్ కృష్ణగారి మీద తీశాను. సూర్యకాంతం, చంద్రకళ, ఎస్.వరలక్ష్మి, జగ్గయ్య వీళ్లందరితో ఆ రోజు సీన్స్ తీయాలి. అందరూ సీనియర్ నటులు. సూర్యకాంతంగారు నన్ను చూసి ‘ఆ... ఈమె సినిమా డెరైక్ట్ చేస్తుందట’ అన్నారు అదో ధోరణిలో. ఒక షాట్లో ఆమె లేచి నిలబడాలి. లెమ్మంటే ఇంకోసారి చెప్పు లేస్తాను అన్నారు. మూడోసారి కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతా అయ్యాక, లైట్స్ ఆన్, కెమెరా ఆన్. ఇంతే కదా నువ్వు చెప్పింది’ అన్నారు. ఇక ఎస్.వరలక్ష్మిగారిది సిటీలో ఉండే మోడ్రన్ క్యారెక్టర్. మేకప్ వేసుకునేటప్పుడు ఐ లాషెస్ చాలా పెద్దగా పెట్టుకుంది. తల్లి పాత్ర కదా అంత బాగోదేమో అన్నాను. చాలా బాగుంటుంది, నాకు తెలుసు’ అన్నారావిడ. సరే అనుకుని ఆమె మీద షాట్ తీసి ఓకే అన్నాను. నాకు వన్ మోర్ షాట్ కావాలన్నారావిడ. ప్రతీ సీన్‌కే టెన్షనే. ఆ రోజు ఎలాగో గడిచింది. మొదటిరోజే మొత్తానికి ఏడు సీన్స్ తీయడం కొంచెం ఊరట. మరుసటి రోజు గుమ్మడిగారి సీన్స్. సీన్ చెబితే నువ్వు చెప్పగానే నాకు మూడ్ రావాలి కదా అన్నారు. కొంచెం తీశాక, గుమ్మడిగారు విగ్ తీసేసి పిచ్చిపిచ్చిగా తీస్తున్నావు ఇలాగైతే నా వల్ల కాదు అనేశారు. నేను ఇప్పటివరకు తీసింది రేపు చూపిస్తాను, మీకు నచ్చితే తరువాత కంటిన్యూ చేయండి అన్నాను. ఆ రాత్రి రష్ ఎడిట్ చేసి మరుసటిరోజు ప్రివ్యూ వేసి గుమ్మడి గారికి చూపించాను. అమ్మ, బ్రహ్మరాక్షసీ... ఎంత బాగా చేశావ్ అని మెచ్చుకున్నారాయన. అలా ఆ గండం గట్టెక్కాను. అల్లు రామలింగయ్యగారు బిజీ ఆర్టిస్ట్ కావడంతో ఆయన రెండు మూడు షూటింగ్స్ చేసి మా షూటింగ్‌కు వచ్చేవాళ్లు. డైలాగ్స్ చూసి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, మార్చమ్మా అనేవాళ్లు. నేను కుదరదు ఈ డైలాగ్ ఇలాగే కావాలి అని తేల్చి చెప్పేదాన్ని. అంతా కొంచెం పెద్ద ఆర్టిస్ట్‌లు కాబట్టి మొదట రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను. తరువాత అంతా సర్దుకుపోయింది. మీనా ప్రతిరోజు నాకో కొత్త అనుభవం. ఎందుకంటే, నేను కేవలం ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వేరు. డెరైక్టర్ యాక్షన్ అనగానే నా పని నేను చేసేదాన్ని. కానీ నేనే డెరైక్టర్, యాక్టర్ అనేసరికి పరిస్థితి వేరు. కెమెరా వెనుక నిలబడి యాక్షన్ అని చెప్పి కెమెరా ముందుకు పరిగెత్తేదాన్ని. ముందు నా డైలాగ్ లేకుండా చూసుకోవడంతో ఈ సమస్యను అధిగమించాను. చివరలో నా డైలాగ్ ఉంటే డైలాగ్ చెప్పి కట్ చెప్పేదాన్ని. ఇక లొకేషన్స్ విషయానికొస్తే, అప్పట్లో పల్లెటూళ్లకు వెళ్లి సినిమా తీయడం చాలా అరుదు. మేం మద్రాసులో కొంత తీశాక, కృష్ణగారి సొంతూరు బుర్రిపాలెంలో హీరో ఇంటికి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేశాం. ఇందులో కృష్ణగారు పంచ, జుబ్బలో తప్ప మరో డ్రెస్‌లో కనబడరు. అందుకే ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ ఊళ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే, కృష్ణగారి తల్లిని నటింపజేయడం. పెళ్లిలో ఒక పెద్ద ముత్తయిదువు కావాలి, సమయానికి ఎవరూ దొరకలేదు. అత్తయ్యా మీరు చేస్తారా అంటే ఆమె సరే అన్నారు. అలా నాకా అదృష్టం దక్కింది. మీనా సినిమాకు సంగీతం చాలా చక్కగా కుదిరింది. రమేష్‌నాయుడుగారు సంగీతం. దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ పాటలు. పెళ్లంటే... పాట నేను మనసులో ఏం అనుకుని దాశరథిగారికి చెప్పానో ఆయన అదే భావాన్ని పాటగా రాశారు. కృష్ణగారి మీద, నా మీద తీసిన చేనుకి గట్టుంది, ఇంటికి గడపుంది పాట నాకు బాగా నచ్చిన పాట. మల్లెతీగ వంటిది మగువ జీవితం, పెళ్లంటే నూరేళ్ల పంట పాటలు చాలా పాపులర్ అయ్యాయి. లాంగ్ షాట్స్ అన్నీ ఒకసారి, సజెషన్ షాట్స్ అన్నీ ఒకసారి తీయడంతో షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఇందులో కెమెరామెన్ పుప్పాల గోపాలకృష్ణమూర్తి సహకారం ఎంతో ఉంది. నిజానికి మీనా నవల రెండు పార్ట్‌లుగా వచ్చింది. ఇది సినిమాగా తీస్తే చాలా లెంగ్త్ వస్తుందన్నారు. కానీ ఏ మాత్రం రాజీ పడకుండా, నవలలోని ఆత్మకు లోపం జరగకుండా తీశాను. చంద్రకళకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కథానుసారం పెళ్లికొడుకు తరపువాళ్లు కోతిలా కనపడతారు. ఇది నవలలో రాసింది. శ్రీరామ నామాలు పాటలో పెళ్లికొడుకు వాళ్లకు కోతి మాస్క్ వేసి తీశాను. అలా ఎక్కడా రాజీపడకుండా తీయడంతో చివరకు 18,000 అడుగులు వచ్చింది. అయినా ఏమాత్రం ఎడిట్ చేయకుండా సినిమా విడుదల చేశాం. 1973 డిసెంబర్ 28న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా క్లైమాక్స్‌లో తల్లికి, కూతురికి మధ్య వచ్చే చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. అది చాలామంది తల్లిదండ్రులను ఆలోచింపజేసింది. సినిమా చూసి సులోచనారాణిగారు చాలా బాగా తీశావని మెచ్చుకున్నారు. దుక్కిపాటిగారు చూసి నువ్వు ఇంత బాగా తీస్తావనుకోలేదు అన్నారు. శతదినోత్సవం మద్రాస్‌లో పెద్ద ఎత్తున చేశాం. ఫంక్షన్‌కు వచ్చినవాళ్లందరికీ భోజనాలు పెట్టి కొత్త ఆనవాయితీకి తెర తీశాం. ఈ సినిమాతో నాకు నవలా దర్శకురాలిగా పేరు వచ్చింది. అంతేకాదు... ‘మీనా’ సినిమా నాకు వందేళ్ల జీవితాన్నిచ్చిందని గర్వంగా చెపుతాను. - కె.క్రాంతికుమార్‌రెడ్డి