తొలియత్నం: సినిమా చూసి నచ్చలేదన్నాడు! | Remaking king bheemineni srinivas | Sakshi
Sakshi News home page

తొలియత్నం: సినిమా చూసి నచ్చలేదన్నాడు!

Published Sun, Sep 1 2013 2:20 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

తొలియత్నం: సినిమా చూసి నచ్చలేదన్నాడు! - Sakshi

తొలియత్నం: సినిమా చూసి నచ్చలేదన్నాడు!

రీమేక్ సినిమా అంటే పేలిన బుల్లెట్‌ను మళ్లీ పేల్చడం లాంటిది.
 హిట్టయితే, ఆ... రీమేకే కదా అంటారు.
 ఫ్లాపయితే, ఊ... రీమేక్ కూడా తీయలేకపోయాడు అనేస్తారు.
 రీమేకెప్పుడూ డెరైక్టర్ కాన్ఫిడెన్స్‌ను మేకులా గుచ్చుతుంటుంది.
 రీమేక్ అనేది కేవలం భాషకు కాదు, భావానికి సంబంధించినది కూడా.
 అలాంటి ఫీట్‌ను పదేపదే చేస్తూ సక్సెస్ అవుతున్న రీమేకర్ భీమనేని శ్రీనివాసరావు తన
 మొదటి సినిమా ‘శుభమస్తు’తోనే రీమే‘కింగ్’ ఎలా అయ్యారన్నదే ఈ వారం తొలియత్నం.

 
 సినిమా అంటే చాలామందికి ప్యాషన్. కానీ దాన్ని అఛీవ్ చేయడం చాలా కష్టం. నేను మాత్రం నా సినిమా కలను నిజం చేసుకోవడానికి గుంటూరు నుంచి మద్రాస్ వరకూ వెళ్లాను. టి.కృష్ణగారి నుంచి ముత్యాల సుబ్బయ్య, బి.గోపాల్, మోహనగాంధీ, ఐవి శశి, పరుచూరి బ్రదర్స్ వరకు చాలా మంది దర్శకుల దగ్గర పనిచేశాను. రామానాయుడు, ఎడిటర్ మోహన్ వంటి పెద్ద పెద్ద నిర్మాతల బ్యానర్స్‌లో పనిచేశాను. ఇలా డిఫరెంట్ డెరైక్టర్స్‌తో డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో పనిచేయడం నా కెరీర్‌కు చాలా ఉపయోగపడింది. నాకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్, వే ఆఫ్ డీలింగ్ ఏర్పరుచుకోవడానికి తోడ్పడింది.
 
 ఎడిటర్ మోహన్ బ్యానర్‌లో ముత్యాల సుబ్బయ్య దగ్గర ‘మామగారు’ సినిమాకు కోడెరైక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు నా మొదటి సినిమాకు బీజం పడింది. అందులో దాసరిగారు మెయిన్ క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీలో శిఖరంలాంటి ఆయనతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మోహన్‌గారు పదేపదే నన్ను హెచ్చరించేవారు. సెట్లో నా వర్కింగ్ స్టైల్, ప్లానింగ్ మోహన్‌గారికి బాగా నచ్చాయి. సినిమా జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో ఆయన నన్ను టెస్ట్ చేసేవారు. మామగారులో దీపావళి సాంగ్ జరిగే సమయంలో, ఆకాశంలో చంద్రుడు వెన్నెలలు విరజిమ్ముతున్నాడు. మోహన్‌గారు నా దగ్గరికి వచ్చి ఫ్రేమ్‌లో చందమామ వచ్చేట్టు కంపోజ్ చేస్తే బాగుంటుందేమో, డెరైక్టర్‌కు చెప్పు అన్నారు. ఒక్కక్షణం ఆలోచించి దీపావళి అమావాస్య రోజు వస్తుంది కదా అన్నాను. మోహన్‌గారు నవ్వారు. అలా నాకాయన బోలెడన్ని టెస్ట్‌లు పెట్టేవారు. సినిమా అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే కథ రెడీ చేసుకో, డెరైక్షన్ ఇస్తానన్నారాయన. అయితే నాకు మోహన్‌గారి కంటే ముందు రామానాయుడు గారు ఆఫర్ ఇచ్చారు.
 
 అదెలాగంటే, నేను బి.గోపాల్ దగ్గర చినరాయుడు సినిమాకు కోడెరైక్టర్‌గా పనిచేశాను. వెంకటేష్‌గారికి నా వర్కింగ్ స్టైల్ నచ్చి రామానాయుడిగారికి చెప్పారు. ఆయన నన్ను పిలిచి కథ రెడీ చేసుకో అన్నారు. అయితే ముందు మా బ్యానర్‌లో ఒక సినిమాకు కోడెరైక్టర్‌గా పనిచేయాలని షరతు పెట్టారు. అలా సురేష్ ప్రొడక్షన్స్‌లో గుహనాధన్‌గారి దగ్గర ‘పరువు ప్రతిష్ట’కు కోడెరైక్టర్‌గా చేశాను. తరువాత కథ రెడీ చేసుకునే పనిలో పడ్డాను. మరోవైపు మోహన్‌గారు కూడా కథ రెడీ చేసుకో,సినిమా చేద్దామన్నారు. ఈ మధ్యలో మోహన్‌గారి బ్యానర్‌లో పల్నాటి పౌరుషం సినిమాకు కూడా పనిచేశాను. అది సరిగ్గా ఆడలేదు. ఐనా మోహన్‌గారు నాకిచ్చిన మాటకు కట్టుబడి సినిమాచేద్దామన్నారు. అప్పటికి నా దగ్గర కథ సిద్ధంగా లేదు. ఈ క్రమంలో ఒకరోజు ‘అనియన్ బావ చేటన్ బావ’ అనే మళయాలం సినిమా చూశాను. అది నాకు బాగా నచ్చింది. మోహన్ గారిని చూడమని చెప్పాను, ఆయనకూ నచ్చి రైట్స్ తీసుకున్నారు. అప్పుడు నాయుడు గారికేం చెప్పాలన్న సందిగ్ధంలో పడ్డాను. ఆయన తన బ్యానర్‌లో ఎందరో పెద్ద దర్శకులను పరిచయం చేసారు. కాదంటే ఎలా. నాకేమో మోహన్‌గారితో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది. ఆయనతో ఏదైనా ఫ్రీగా చెప్పగలను. ఈ సంఘర్షణలో రామానాయుడిగారి దగ్గరికి వెళ్లి ఆయనకు పరిస్థితి వివరించాను.
 
 ఆయన నీ ఇష్టం, మొదటి సినిమా కదా ఆలోచించుకో అన్నారు. నేను మోహన్‌గారివేపు మొగ్గు చూపాను. చాలా స్పీడ్‌గా ప్రీప్రొడక్షన్ మొదలైంది. మూలకథను అలాగే ఉంచి, దాని ఆత్మ చెడకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చాం. తరువాత ఆర్టిస్ట్ ఎంపిక మొదలుపెట్టాం. కాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటే సినిమా సగం హిట్టయినట్టేనని నా నమ్మకం. హీరోగా జగపతిబాబును ఎంచుకున్నాం. అప్పటికి కుటుంబ కథా చిత్రాల్లో ఫామ్‌లో ఉన్న ఆమని, ఇంద్రజలను హీరోయిన్‌లుగా తీసుకున్నాం. అన్నదమ్ముల పాత్రలకు దాసరిగారు, సత్యనారాయణగారిని అనుకున్నాం. అంతా సిద్ధం చేసుకుని షూటింగ్ మొదలుపెట్టాం.
 
 మొదటిరోజు షూటింగ్...
 దాసరిగారు, సత్యనారాయణగారు, జగపతిబాబు సీన్‌లో ఉన్నారు. స్క్రిప్ట్, ప్లానింగ్ విషయం లో మోహన్‌గారికి నామీద అపారమైన నమ్మకం. కానీ షాట్ డివిజన్, కెమెరా యాంగిల్స్, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తానో అని ఏమూలో చిన్న సందేహం ఆయనకు. సెట్లో నేను చురుగ్గా కదులుతూ నెక్ట్స్ నెక్ట్స్ అంటూ ఆరోజుకు అనుకున్న రెండు సీన్లు పూర్తి చేశాను. మోహన్‌గారు వెంటనే తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి, ఏదో భయపడ్డాను కానీ శీను చాలా కాన్ఫిడెంట్‌గా చేశాడని చెప్పారు. ప్రొడ్యూసర్ డెరైక్టర్‌ను నమ్మితే సినిమాకోసం ఎంతదూరమైనా వెళతారు. అందుకు ఒక ఉదాహరణ చెప్పాలి. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అన్నదమ్ములు ఉండే ఇంటికోసం వెదుకుతున్నాం. ఇప్పటిదాకా ఎవరూ షూట్ చేయని పెద్ద ఇల్లు ఒకటి మోహన్‌గారు చూశారు. అది చాలా రిచ్ హౌజ్. అదృష్టం కొద్దీ అందులో షూట్ చేసే అవకాశం మాకు దొరికింది. మొదట లోబడ్జెట్ సినిమా అనుకున్నది ఆ ఇంట్లో కొంత షూట్ చేశాక దాన్ని మ్యాచ్ చేసేందుకు సినిమాను మినిమమ్ బడ్జెట్‌లోకి తీసుకెళ్లారు మోహన్‌గారు.
 
 ఈ షూటింగ్‌లో నాకు బాగా గుర్తుండిపోయిన అనుభవం ఒకటి చెప్పాలి. కథలో భాగంగా హీరో తమ అమ్మాయిల్లో ఎవరిని పెళ్లాడాలనే విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరతాయి. ఇద్దరూ ఒకరిమీద ఒకరు చేయి చేసుకునే స్ధాయికి వెళతారు. రెండు మూడు టేక్‌లు తీసినా సీన్ నేను అనుకున్నట్టు రావడం లేదు. అప్పుడు సత్యనారాయణగారు ఇంకా ఎన్నిసార్లయ్యా అని చిరాకుపడ్డారు. ఆయనసలే చాలా సీనియర్ నటులు. ఒక్క క్షణం నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దాసరిగారు సత్యనారాయణగారిని పక్కకు తీసుకెళ్లి, మనం ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా డెరైక్టర్‌కు ఏది కావాలో అది ఇవ్వగలగాలి అని చెప్పారు. చివరికి నేననుకున్నది వచ్చేదాకా  ఇద్దరూ సహకరించారు.
 
 సినిమాలో హీరో ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరిని చేసుకుంటాడన్న టెన్షన్, వాళ్ల మధ్య వచ్చే మిస్‌కమ్యునికేషన్స్, కన్ఫ్యూజన్స్ బాగా వచ్చాయి. జగపతిబాబు-బ్రహ్మానందం, సుధాకర్-బాబూమోహన్‌ల కామెడీ బాగా పండింది. అప్పటికి మానిటర్ సిస్టమ్ రాలేదు కాబట్టి ఏదీ రీచెక్ చేసుకునే అవకాశం లేదు. టేక్ జరుగుతున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండి అవుట్‌పుట్ ఎలా వస్తుందో జడ్జ్ చేయాల్సివచ్చేది.
 
 ముఖ్యంగా షూటింగ్‌లో నేను బాగా స్ట్రగుల్ అయింది క్లైమాక్స్ విషయంలో. మూలంలోకన్నా ఎంటర్‌టైన్‌మెంట్, టెన్షన్  బాగా బిల్డప్ చేయాలని చివరివరకూ ఆ సీన్స్ పెండింగ్‌లో ఉంచాం.
 రేపు షూటింగ్ అంటే ముందురోజు వరకు ఇంప్రూవ్‌మెంట్ చేస్తూనేఉన్నాం. దాంతో షూట్ ఎలా జరుగుతుందోనని భయపడ్డాను. ఎందుకంటే డెరైక్టర్ కాన్ఫిడెన్స్‌ను బట్టే ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ ఉంటుంది. లక్కీగా సెట్‌కు వెళ్లాక అనుకున్నదానికన్నా బాగా తీయగలిగాను. ఆ అనుభవంతో పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ లేకుండా ఇంకెప్పుడూ షూట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
 
 సంగీతానికి సంబంధించి నాకంత నాలెడ్జ్ లేదు. ఏదైనా పాట విని బాగుందో, బాలేదో చెప్పడం వరకే నాకు తెలుసు. కథవిని కోటిగారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. కెమెరామెన్ మహీధర్ నాకేది కావాలో అర్థం చేసుకుని అవుట్‌పుట్ ఇచ్చేవారు. భారీ కాస్టింగ్‌వున్నా ఎక్కడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి మోహన్‌గారితో పాటు నా టీమ్ బాగా సహకరించింది. మొత్తం 58 రోజుల్లో సినిమా పూర్తి చేసి పోస్ట్‌ప్రొడక్షన్‌కు వెళ్లాం.
 
 సినిమా ఫస్ట్ ప్రింట్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రివ్యూ వేశాం. మూడు రీళ్లయ్యాక ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు. సినిమా పూర్తయ్యాక తాను మొదటి మూడు రీళ్లు చూస్తానన్నాడు. రివర్స్‌లో చూడడం వల్ల ఆయనకు సినిమా పూర్తిగా అర్థం కాలేదు. మోహన్‌గారి దగ్గరకు వెళ్లి సినిమా నచ్చలేదన్నాడు. ఈ విషయం మిగతా డిస్ట్రిబ్యూటర్స్‌కు తెలిస్తే సినిమా బిజినెస్ అవదని ఆయన కంగారుపడ్డారు. కానీ సినిమా మంచి బిజినెస్ అవడంతో పాటు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మోహన్‌గారు నన్ను దీవిస్తూ శుభమస్తు అని టైటిల్ పెట్టారో ఏమో అది పెద్ద సక్సెస్ అయింది. నా మొదటిసినిమానే వందరోజుల సినిమాగా నిలబడింది. రెండు మూడు టేక్‌లు తీసినా సీన్ నేను అనుకున్నట్టు రావడం లేదు. అప్పుడు సత్యనారాయణగారు ఇంకా ఎన్నిసార్లయ్యా అని చిరాకుపడ్డారు. ఆయనసలే చాలా సీనియర్ నటులు. ఒక్క క్షణం నాకేం చేయాలో అర్థం కాలేదు.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement