తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా! | We didn't count anything for the first movie: Chandrasekhar yeleti | Sakshi
Sakshi News home page

తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా!

Published Sun, Sep 8 2013 2:25 AM | Last Updated on Sat, Jul 28 2018 6:16 PM

తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా! - Sakshi

తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా!

ఐతే... డెరైక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మొదటి సినిమా.
 సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌కి మొదటి సినిమా.
 ఆర్డ్ డెరైక్టర్ రవిందర్‌కి మొదటి సినిమా.
 మ్యూజిక్ డెరైక్టర్ కళ్యాణి మాలిక్‌కి మొదటి సినిమా.
 ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అనే ఆవేశంలో లాభ నష్టాల బేరీజు లేకుండా, కసితో ముందడుగు వేసిన మొండితనపు కుర్రాళ్ల కల ఇది. రిలీజ్ తరువాత మళ్లీ ‘ఐతే ఏంటి’ అనే పరిస్థితి రాలేదు. టెక్నీషియన్స్‌ను ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసి, ఇండిపెండెంట్ సినిమాకు ఇమేజ్ తెచ్చిన సినిమా అది. ఆ చిత్రం తీసే క్రమంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎదుర్కొన్న అనుభవాలు... ఆయన మాటల్లోనే.
 
 మామూలుగా టైస్టుల మీద భారీ ప్రైజ్‌లు ప్రకటిస్తుంటారు. వాళ్లను ప్రభుత్వానికి పట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టిన కథే ‘ఐతే’.నేను ‘అమృతం’ సీరియల్‌కు మొదట్లో డెరైక్టర్‌గా పనిచేశాను. దానికి సెంథిల్ కెమెరామెన్. సర్వేష్ మురారి అసిస్టెంట్ కెమెరామెన్. రవీందర్ ఆర్ట్ డెరైక్టర్. కళ్యాణిమాలిక్ మ్యూజిక్ డెరైక్టర్. అంతా కుర్రాళ్లం కాబట్టి, ఇంకా ఏదో చేయాలన్న కసితో ఉండేవాళ్లం. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ గురించి ఆలోచిస్తూ, ఒక లో-బడ్జెట్ సినిమా చేద్దామనుకున్నాం. అది వర్కవుట్ అవుతుందా లేదా, ఎవరైనా తీసుకుంటారా లేదా... ఏదీ ఆలోచించనీయని యవ్వనావేశం!
 
 మొదట ఒక మాఫియా డాన్ చుట్టూ కథ అల్లుకున్నాను. డాన్ చుట్టూతా మీకు తెలిసిన కథలు చెప్పండి, అవి కాకుండా నా దగ్గర ఉన్నది కొత్తది అయితేనే ముందుకు వెళదాం అన్నాను. వాళ్లు చాలా చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్ చెప్పేసరికి ఇదేదో కొత్తగా ఉందని అందరూ ఎక్జయిట్ అయ్యారు. తరువాత ‘అమృతం’ నిర్మాత గుణ్ణం గంగరాజుగారికి లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి సినిమా తీద్దాం, మొదట నువ్వేమనుకుంటున్నావో పూర్తిగా పేపర్ మీద రాసివ్వు అన్నారు. కథ చెప్పడం చాలా ఈజీ, రాయడం చాలా కష్టం. మొదటి మూడు రోజులూ బుర్ర వేడెక్కిపోయింది. మేం నలుగురం కలిసి డిస్కస్ చేసేవాళ్లం. ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు జీవీకే వన్ ఉన్న దగ్గర అప్పుడు చైనీస్ బళ్లు ఉండేవి. అక్కడ గోడ మీద కూర్చుని గంటల తరబడి డిస్కస్ చేసుకుని, అక్కడే తినేసి రూమ్‌కు వెళ్లిపోయేవాళ్లం. రాయడం మొదలుపెట్టాక క్లారిటీ వచ్చింది.
 
 మొదట అనుకున్న ప్రకారం మినిస్టర్ కిడ్నాప్‌కి ప్లాన్ చేసి చివరకు తానే కిడ్నాప్ అవుతాడు డాన్. దీన్ని గంగరాజుగారు ఫ్లైట్ హైజాక్, కిడ్నాప్ కింద మార్చారు. అలా ప్రతి దశలోనూ ఆయన చాలా హెల్పయ్యారు. కొత్తవాళ్లతో కదా, మార్కెట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఆయన మమ్మల్ని ఉత్సాహపరిచారు. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చాక, లొకేషన్స్ కోసం వెదుకులాట మొదలైంది. తలకోనతో పాటు చాలా అడవులు చూశాం. రెండు నెలల అన్వేషణ తరువాత వికారాబాద్ ఫారెస్ట్‌ను సెలక్ట్ చేసుకున్నాం.
 
 తరువాత సాంకేతిక అంశాల మీద దృష్టి పెట్టాం. కథ యువకుల జీవన పోరాటానికి సంబంధించి కాబట్టి, నేను, సెంథిల్... లైటింగ్, కాస్ట్యూమ్స్, కలర్స్ గురించి డిస్కస్ చేశాం. అమెరికన్ బ్లాక్ బుక్‌లో ఫొటోస్ రిఫరెన్స్ తీసుకుని కలర్ స్కీమ్ డిజైన్ చేసుకున్నాం. మరోవైపు ఆర్టిస్టుల ఎంపిక కీలకంగా మారింది. ఇందులో హీరో ఉండడు. నలుగురు కుర్రాళ్లు, వీళ్ల ఫ్రెండ్ ఒకమ్మాయి, డాన్, డాన్ అసిస్టెంట్... మొత్తం ఏడుగురు మెయిన్ క్యారెక్టర్స్. కొత్తవాళ్లు కావాలని ప్రకటన ఇస్తే, చాలా ఫొటోలు వచ్చాయి. షార్ట్ లిస్ట్ చేసి అభిషేక్, జనార్థన్, శశాంక్‌లను తీసుకున్నాం. మెయిన్ క్యారెక్టర్‌కు ఎవరూ దొరకక మొహితా చద్దాను బాంబే నుంచి తీసుకున్నాం. డాన్ క్యారెక్టర్‌కు పవన్ మల్హోత్రాతో పాటు మరొకరిని చూడటానికి నేను, గంగరాజుగారు బాంబే వెళ్లాం. వీడియో క్లిప్స్‌లో భయంకరంగా కనిపించిన పవన్, డెరైక్ట్‌గా చూస్తే చాలా చిన్నగా కనిపించాడు. అతడు పనికొస్తాడో లేదోనని నేను సందేహం వ్యక్తం చేశాను. ఆయన పవన్‌తో నా అభిప్రాయం చెప్పారు. పవన్ డాన్ గెటప్‌లో మేం ఉంటున్న హోటల్‌కు వచ్చేశారు. అంత కేర్ తీసుకుని, అంత ఇన్‌వాల్వ్ అయి ఆ గెటప్‌లో రావడం చూసి ఇంప్రెస్ అయిపోయాను. సింధు తులానీని చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించింది. మరో ఆలోచన లేకుండా సెలక్ట్ చేసేశాం.
 
 షూటింగ్ మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి మొదలుపెట్టాం. రోజూ సెట్‌లోకి రాగానే ఆ రోజు ఎన్ని క్లోజ్‌లు, ఎన్ని మిడ్‌లు, ఎన్ని వైడ్‌లు అని పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ సినిమాలో ఓ కీలకమైన విషయం గురించి మేం పడ్డ ఇబ్బందులు చెప్పాలి. బాంబే ఎయిర్‌పోర్ట్‌లో డాన్‌మీద అటాక్ జరిగే యాక్షన్ సీన్ ప్లాన్ చేశాం. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని లోకల్ ఫైట్‌మాస్టర్‌ను పెట్టుకున్నాం. అతను తన పాత పద్ధతిలో షాట్స్ కంపోజ్ చేశాడు. మాకది నచ్చలేదు. పర్మిషన్ ఉన్నది ఒక్క రాత్రికే. దాంతో రెండు మూడు షాట్స్ తీసిన తరువాత అతన్ని పక్కన పెట్టి మేమే తీయడం మొదలుపెట్టాం. అనుకున్నట్టు వచ్చింది. షూటౌట్ అయిన తరువాత డాన్ తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కెమెరా కాళ్ల నుంచి ఫేస్ దగ్గరకు క్రాస్‌గా ట్రావెల్ చేయాలి. క్రేన్, ట్రాలీ ఫేస్ దగ్గరికి క్రాసింగ్‌గా ఒకే లెవెల్‌లో వెళ్లాలి. ఆ ఇరుకు ప్లేస్‌లో ఇది కొంచెం కష్టమైన షాట్. ఐదారుసార్లు తీసినా జర్క్ వచ్చేసింది. నేను ఓకే చెప్పేశా. ఎడిటింగ్‌లో గన్ సౌండ్స్ యాడ్ చేశాను. జరిగిన అటాక్‌ను విలన్ గుర్తు తెచ్చుకుంటున్నట్టు జర్క్ దగ్గర తుపాకీ చప్పుళ్ల సౌండ్ సింక్ అయింది.
 
 మరో సీన్‌లో డాన్‌ను కిడ్నాప్ చేసిన తరువాత కుర్రాళ్లు చీర్స్ చెప్పుకుంటుంటారు. అప్పుడు త్రీ యాక్సిస్ రొటేషన్ టెక్నాలజీ లేకపోయినా షాట్‌లో అదే ఎఫెక్ట్ తీసుకొచ్చాడు సెంథిల్. అలాగే మొదటినుంచీ ఒక సాంగ్ పెడదామనుకున్నాం. దానికి కళ్యాణిమాలిక్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడు. విన్న వెంటనే ఓకే చేసేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. డ్యాన్స్‌మాస్టర్ నిక్సన్ ఆధ్వర్యంలో సాంగ్ పిక్చరైజేషన్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాం.
 ఇక క్లైమాక్స్ సీన్‌లో బాంబ్ బ్లాస్ట్‌కు కార్ డిక్కీ లేచి పడాలి. స్పెషల్ ఎఫెక్స్ట్ వాళ్లు కాలిక్యులేట్ చేసి డిక్కీ ఆరు ఫీట్లు ఎగురుతుందని చెప్పారు. కానీ షూట్ చేసేటప్పుడు బాంబు ధాటికి డిక్కీ పైకి లేచి, ఎలక్ట్రిక్ పోల్‌కి తగిలి సర్క్యూట్ సంభవించింది. దాంతో రెండు గంటలపాటు వికారాబాద్‌కు కరెంట్ సప్లై నిలిచిపోయింది. అది పొరబాటున యూనిట్ వైపు పడి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. మా ప్రొడక్షన్‌వాళ్లు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సమస్యను పరిష్కరించారు. అంతేకాక, వర్షం వల్ల వరుసగా రెండు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కొంచెం టెన్షన్ పడినా, మొత్తానికి  63 రోజుల్లో పూర్తి చేశాం. అది కూడా ద్విభాషా చిత్రం కాబట్టి. పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్‌కు మాత్రం టైమ్ పట్టింది. వాయిస్‌లు నేచురల్‌గా ఉండాలి కాబట్టి డబ్బింగ్ ఎక్కువ సమయం తీసుకుంది. న్యాచురల్ ఫిలింస్‌కు అప్పట్లో అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు.
 
 సినిమా పూర్తయిన మూడు నెలలకు కూడా విడుదల కాలేదు. కొంతమంది బాలేదన్నారు కూడా. మరీ అంత దారుణంగా తీశామా అనుకున్నాం. ఆ టైమ్‌లో మా ప్రొడ్యూసర్ మాకు చాలా ధైర్యాన్నిచ్చారు. రామ్‌గోపాల్‌వర్మని సినిమా చూడమంటే చూడనన్నారు. బాగుంటే ఓకే, బాగోలేకపోతే నేనే కామెంట్ చేస్తే అది మీకే నష్టం అన్నారు. ఫర్వాలేదని బీటా ప్రొజెక్షన్‌లో చూపించాం. ఆయనకు విపరీతంగా నచ్చింది. మా యూనిట్ నుండి కాకుండా బయటివాళ్ల నుంచి వచ్చిన మొదటి పాజిటివ్ కాంప్లిమెంట్ అదే. తరువాత రామానాయుడు స్టూడియోకు డీటీఎస్ మిక్సింగ్‌కు పంపించాం. ఆడియోగ్రాఫర్ మధుసూదన్‌రెడ్డి ఇంటర్వెల్ వరకు చూసి అద్భుతంగా ఉందన్నారు. సినిమా విడుదలయ్యాక, లైట్‌బాయ్స్ ఒక విషయం చెప్పారు. షూటింగ్‌లో మా తపన చూసి కుర్రాళ్లు ఏదో కష్టపడుతున్నారు, అసలు సినిమా ఏమైనా నడుస్తుందా అనుకున్నారట. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని వాళ్లు అస్సలు అనుకోలేదట.
 
 స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్‌ప్రొడక్షన్ వరకు ప్రతి దశలో అందరం ఇన్‌వాల్వ్ అయ్యాం కాబట్టే అంత పెద్ద సక్సెస్ వచ్చిందనుకుంటాను. కెమెరా, కలర్స్, లైటింగ్ విషయాల్లో ప్రయోగాలు చేసి సినిమాను వాస్తవికతకు దగ్గరగా ఉండేట్టు తీశాం. ఈ సినిమాకు అసలు బలం స్క్రీన్‌ప్లే. అందుకు నామీద సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ల ప్రభావం ఉండటం కారణం కావచ్చు. గంగరాజుగారి డైలాగ్స్ సూపర్బ్‌గా హెల్పయ్యాయి. ఎడిటర్ సుధాకర్ కూడా ప్లస్సయ్యారు. సినిమాను ఫాస్ట్ పేస్డ్ నేరేషన్‌లో నడిపాడు. హిందీలో ‘పచాస్‌లాక్’ అనే పేరు పెట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మేశాం. తెలుగులో విడుదలైన రెండు మూడేళ్లకు వాళ్లు హిందీలో రిలీజ్ చేశారు.
 -  కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement