k. krantikumar reddy
-
భూమిపుత్ర @ 50...
సంక్షుభిత వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేస్తూ కొత్తదారులు వెదుకుతున్న అన్నదాతల విజయగాథలకు మనోహర దృశ్య రూపం ‘భూమిపుత్ర’. మాటీవీలో ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు ప్రసారమవుతున్న ఈ ధారావాహిక ఇటీవలే 150వ ఎపిసోడ్ మైలురాయిని అధిగమించింది. వ్యవసాయానికి జవజీవాలందిస్తున్న ఈ విలక్షణ వ్యవసాయ కార్యక్రమాన్ని అన్నీ తానే అయి సృజిస్తున్న కె. క్రాంతికుమార్ రెడ్డి అభినందనీయులు. సేద్యాన్ని ప్రకృతిమాత కడుపుకోతగా మార్చడం సరికాదన్న మెలకువను తన అనుభవాలతో మేల్కొలుపుతూ.. అన్నదాతల స్ఫూర్తియాత్రలను హృద్యంగా చిత్రిస్తున్న ‘భూమిపుత్ర’ ధారావాహిక అహరహం కొనసాగాలని ఆశిద్దాం! -
కోత్త బత్తాయి లోకం!
కిన్నో ఆరెంజ్ సాగుతో సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుడు సత్యారెడ్డి.. రసాయనిక వ్యవసాయంలో కుదే లై తోట తీసేద్దామనుకున్న దశలో ప్రకృతి వ్యవసాయంపై దృషి ప్రకృతి వ్యవసాయం ఇచ్చిన ధైర్యంతో 28 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ సాగు కోటి ఆశలతో బత్తాయి తోట వేసిన రైతు సత్యారెడ్డి ఆశలు నాలుగేళ్లలోనే ఆవిరయ్యాయి. ఎంత ఖర్చుపెట్టినా చెట్లు చనిపోతుండడంతో.. తగిన పరిష్కారాల కోసం వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా అన్వేషించారు. ఈ క్రమంలో ఎగుమతి అవకాశాలున్న కిన్నో ఆరెంజ్ పంట సాగు మేలైనదని గుర్తించారు. అన్నివిధాలా నష్టదాయకంగా పరిణమించిన రసాయనిక వ్యవసాయం కన్నా ప్రకృతి వ్యవసాయం మేలైనదని రైతుల అనుభవాల ద్వారా గ్రహించారు. ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తూ లాభాల మాధుర్యాన్ని చవిచూస్తున్నారు. సేద్య పోరాటంలో విజేతగా నిలుస్తున్నారు. కింద పడకపోవడంలో ఏమంత గొప్పతనం లేదు, పడి లేవడంలోనే జీవితపు గొప్పదనం దాగి ఉంది - నెల్సన్ మండేలా ఇది సమాజంలో అందిరికన్నా రైతుకు ఎక్కువ వర్తిస్తుంది. ఎన్నిసార్లు కిందపడినా, గాయపడినా తిరిగి లేచి ప్రయాణం కొనసాగించడం ఒక్క అన్నదాతకే చెల్లింది. రసాయనిక వ్యవసాయం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం వెదుక్కుంటూ సేద్య పోరాటంలో సాగుతున్న ఒకానొక యోధుడు సత్యారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన రైతు సత్యారెడ్డి, మాణిక్యమ్మ దంపతులు పాతికేళ్ల కిందట సేద్యంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల తర్వాత.. 50 ఎకరాల్లో బత్తాయి సాగు చేపట్టారు. నాటిన ఐదేళ్లకు బత్తాయి కాపునకు వచ్చింది. మొదటి సంవత్సరం మంచి పంట వచ్చింది. కానీ అధిక దిగుబడి సాధించాలన్న తాపత్రయంలో విపరీతంగా ఎరువులు వాడడంతో చెట్లు వేరుకుళ్లు తెగులుతో క్రమంగా దెబ్బతినడం ప్రారంభించాయి. తరువాత నాలుగేళ్లలో వేరు కుళ్లుతో చాలా చెట్లు చనిపోయాయి. పదేళ్లకు చెట్లన్నీ తీసేశాను. తరువాత ఏం చేయాలో అర్థం కాలేదు. భూమిని దున్నటం.. ఏ పంట సాగు చేయాలో అర్థంకాక బీడుగా వదిలే యటం.. తన మదిలో ప్రశ్నలకు జవాబు కోసం ఎక్కడెక్కడో సంచరించడం.. ఇలా కొన్ని సంవత్సరాలపాటు గడచింది. ఈ అన్వేషణలో భాగంగా కర్ణాటక ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలన్నీ తిరిగారు. అక్కడ ఒక రైతు క్షేత్రంలో మొదటసారి కిన్నో ఆరెంజ్ సాగు చూశాక దానిపై ఆసక్తి కలిగింది. సిట్రస్ జాతికి చెందిన రెండు వంగడాలను సంకరం చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 1935లో అభివృద్ధి చేసిన పంట కిన్నో ఆరెంజ్. బత్తాయిలోకన్నా రసం ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పాకిస్తాన్ కిన్నో ఆరెంజ్‌కు ఆదరణ ఎక్కువ. మన పంజాబ్‌లోనూ ఈ పంట సాగులో ఉంది. మార్కెట్లో కిన్నో ఆరెంజ్‌కు వున్న డిమాండ్ తెలుసుకున్నాక సత్యారెడ్డి పదకొండెకరాల్లో (20్ఠ20 దూరంలో ఎకరానికి వంద చొప్పున) ఈ మొక్కలు నాటారు. సత్యారెడ్డి స్ఫూర్తితో మరికొంత మంది రైతులు సుమారు వంద ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ సాగు మొదలుపెట్టారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ప్రారంభించిన కిన్నో ఆరెంజ్ సాగును కూడా గతంలో బత్తాయిలో ఎదురైన సమస్యలు వెంటాడాయి. రెండో ఏడాదిలో వంద చెట్లు చనిపోయాయి. అయినా ఏ మాత్రం తగ్గకుండా రసాయనిక ఎరువులు వాడారు. మూడో ఏడాది మరో యాభై చెట్లు చనిపోయాయి. కానీ ఆ ఏడాది 50 టన్నుల దిగుబడి ద్వారా సుమారు రూ. 11 లక్షల ఆదాయం వచ్చింది. నిజానికి మూడో సంవత్సరంలో పంట తీయకూడదు. కానీ, మన వాతావరణం దీనికి సరిపోదని చాలా మంది చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని జారవిడవొద్దన్న ఆతృతలో తొందరగా పంట తీసుకున్నారు. సూక్ష్మపోషకాల లోపాలు ఎక్కువయ్యాయి. మేరుకుళ్లు సమస్య మరింత తీవ్రమైంది. నాలుగో సంవత్సరంలో వంద చెట్లు చనిపోయాయి. దీంతో ఇక తోట మొత్తాన్నీ తీసేయాలన్న ఆలోచనకు వచ్చారు. అదే సమయంలో.. వివిధ రాష్ట్రాల్లో పాలేకర్ శిక్షణ శిబిరాలకు హాజ రయ్యారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు అమలు చేస్తున్న తోటలకు స్వయంగా వెళ్లి చూశారు. అవన్నీ చూశాక తన కిన్నో ఆరెంజ్ తోటలో సమస్యల పరిష్కారానికి ప్రకృతి వ్యవసాయమే తగిన పరిష్కారమన్న నిర్థారణకు వచ్చారు. ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు ఆవులను తెచ్చి గత ఏడాది ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం చెట్ల నీడ పడే సమయంలో ప్రతి పదిహేను రోజుల కోసారి డ్రిప్ ద్వారా జీవామృతం, ప్రతి 3 నెలలకోసారి ఎకరానికి 200 కిలోల చొప్పున ఘనజీవామృతం వేశారు. చిగురాకు దశలో ఆకు తొలిచే పురుగులు, పచ్చ పురుగులు ఆశించి నప్పుడు దశపర్ణి కషాయం, బ్యాక్టీరియా తెగుళ్లకు పుల్ల మజ్జిగ చల్లారు. క్రమంగా చెట్లు కోలుకోవడం ప్రారం భమైంది. ఖర్చు ఎకరాకు రూ. 2 వేలకు తగ్గింది. ఆయన తోటలో వచ్చిన అనూహ్యమైన మార్పును చూసి అప్పటి దాకా కిన్నో ఆరెంజ్ తీసేద్దామనకున్న సాటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపునకు మళ్లారు. అయితే, రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి సేద్యం వైపు మళ్లడంతో దిగుబడి నలభై టన్నులకు తగ్గింది. ప్రకృతి సాగు వల్ల కన్నో ఆరెంజ్ పండల పరిమాణం, రుచి, నిల్వ సామర్థ్యం పెరిగింది. కానీ మార్కెట్లో కేజీకి రూ. 35 ధర పలకడంతో ఆదాయం తగ్గలేదు. క్రమంగా భూమి శక్తిని పుంజుకోవడంతో ఈ సంవత్సరం 11 ఎకరాల పాత తోటలో 60 టన్నుల దిగుబడి వస్తుందని సత్యా రెడ్డి అంచనా. 9 ఎకరాల తోటలో తొలిపంటగా 20 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందం టున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కిన్నో ఆరెంజ్ సైజులోను, నాణ్యతలోను చాలా మెరుగ్గా ఉండటం విశేషం. పంజాబ్‌లో పంట లేని సమయంలో ఇక్కడ పంట రావడం మార్కెటింగ్ విషయంలో కలిసొచ్చే అంశమైంది. కినోవాను ఆయన చెన్నై, బెంగళూరుకు ఎగుమతి చేస్తుంటారు. ప్రకృతి సేద్యంలో కిన్నో ఆరెంజ్ పంట ఇచ్చిన స్థైర్యంతో మరో 17 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ వేశారు. సత్యారెడ్డి జీవితం ఒక పోరాటం. ఒక ఎడతెగని అన్వేషణ. రైతుగా ప్రకృతితో అనుబంధాన్ని పునరుద్ధరిం చుకోవడమే ఆయన విజయ రహస్యం! - కె. క్రాంతికుమార్‌రెడ్డి తీపి బత్తాయి.. ఎర్ర నిమ్మ! గత సంవత్సరం జలంధర్ వెళ్లినప్పుడు సిట్రస్ జాతికి చెందిన మాల్లా బ్లడ్ రెడ్, మాల్టా జఫ్ఫాల గురించి సత్యారెడ్డికి తెలిసింది. ఆ మొక్కలు తెచ్చి కిన్నో ఆరెంజ్ తోటలో ప్రయోగాత్మకంగా అంతరపంటగా సాగు చేస్తున్నారు. కిన్నో ఆరెంజ్ ఏడాదికి ఒకసారి కాపుకొస్తే.. మాల్టా జఫ్ఫా 2, 3 సార్లు కాపుకొస్తుంది. ఇది చూడటానికి బత్తాయిలా ఉండి, కిన్నో ఆరెంజ్ కన్నా తియ్యగా ఉంటుంది. గుజ్జు, రసం కూడా ఎక్కువే. మాల్టా బ్లడ్ రెడ్ లోపల రక్త వర్ణంలో ఉంటుంది. దీని రసం ఒక నెల రోజుల పాటు నిల్వ చేసినా ఏమాత్రం పాడవదని చెబుతున్నారు. పంటకాలం 45 ఏళ్లు! ప్రకృతి వ్యవసాయంలో సిట్రస్ తోటల పంటకాలం 45 ఏళ్లుంటుంది. పంజాబ్‌లో కిషన్‌కుమార్ జాకడ్ అనే రైతు పొలంలో 40 ఏళ్లనాటి కిన్నో ఆరెంజ్ తోట చూసి.. ఈ పంటను సాగు చేస్తున్నా.. మా తోటలో వ్యవ సాయ పనులన్నీ నా భార్య మాణిక్యమ్మ చూసుకుంటారు. అసలు శ్రమంతా ఆమెదే. నేను సలహాదారుడ్ని మాత్రమే. - గని సత్యారెడ్డి(90007 59372), తనగల, వడ్డేపల్లి మండలం, మహ బూబ్‌నగర్ జిల్లా -
తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!
డైరెక్షన్... సినిమా ఇండస్ట్రీలో క్రియేటివిటీకి గ్లామర్‌ను యాడ్ చేసిన పొజిషన్. అందుకే వెండితెర బాటలో చాలామందికి అదే టార్గెట్. లక్షల్లో ఒకరికి అవకాశమొస్తే కోటికి ఒక్కరు నిలబడతారు. ఈ పోటీ ప్రపంచంలో నిలబడి గెలవాలంటే నిరంతరం కొత్తగా ఆలోచించాల్సిందే! కథను ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పే క్రమంలో మనకు నచ్చిన సినిమా తీయడమా జనం మెచ్చే సినిమా తీయడమా... ఈ సందిగ్ధం, ఈ సంఘర్షణ ప్రతి దర్శకుడికీ సహజంగా ఎదురయ్యేదే! అలా తనలో తాను సంఘర్షిస్తూ ఆ రాపిడిలో వెండితెరపై కొత్త వెలుగులు పంచడానికి ప్రయత్నిస్తున్న తెలుగు దర్శకుడు చంద్రసిద్ధార్ధ ఇంగ్లిష్ సినిమా తీశారు. ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ నవలను సినిమాగా మార్చే క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలివి. ఎంత ఘర్షణకు లోనైతే అంత వేగంగా వెలుగు వైపు పయనించినట్టే. ఇది చరిత్రే కాదు, నా మొదటి సినిమా నాకు నేర్పిన అనుభవం కూడా.స్కూల్లో పెయింటింగ్‌లో, క్రియేటివ్ రైటింగ్‌లో చాలా అవార్డులు గెలుచుకున్నాను. దాంతో అందరిలా మనం డాక్టర్, ఇంజనీర్ కాకుండా క్రియేటివ్ ఫీల్డ్‌లోనే ఏదైనా సాధించాలనుకున్నాను. క్రియేటివ్ ఫీల్డ్‌లో అంతిమ గమ్యం సినిమా కాబట్టి ఆ దిశగా అడుగులు వేశాను. ఉప్పల పాటి నారాయణరావు దగ్గర ‘జైత్రయాత్ర’, ‘రక్షణ’లకు డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అప్పటికే మా అన్నయ్య కృష్ణమోహన్ నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అమెరికన్స్ ఏ జాతివారినైనా చాలా చిన్నచూపు చూస్తారు కానీ, సినిమా డెరైక్టర్ ఏ జాతివాడైనా గౌరవిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఎంత గౌరవప్రదమో అప్పుడే మొదటిసారిగా అర్థమైంది. తనని హీరోగా పరిచయం చేయడం కోసం సొంత సినిమా నిర్మించాలనుకున్నాను. అన్నయ్య, శ్రీకాంత్, అలీ, బ్రహ్మాజీ, రంభ ప్రధాన పాత్రలుగా మా రెండో అన్నయ్య రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘నిఘా’ మొదలుపెట్టాం. ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. తరువాత తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘నిరంతరం’ షార్ట్ ఫిలిం నిర్మించాను. ప్రశంసలు దక్కాయి కానీ పెట్టుబడి తిరిగి రాలేదు. తర్వాత కొంతకాలం టీవీకి పనిచేశాను. అప్పుడే త్రివిక్రమ్, ఆర్.పి.పట్నాయక్ పరిచయమయ్యారు. కాలం కలల కొలిమిలో తగలబడుతున్న వేళ, దర్శకుడిగా వచ్చిన అవకాశం నాలో కొత్త ఆశను రేకెత్తించింది. త్రివిక్రమ్ కథతో నా మిత్రుడు వేణు హీరోగా, మరో మిత్రుడు నిర్మాతగా, నేను దర్శకుడిగా ‘అవునంటే కాదంటూ’ సినిమా మొదలైంది. కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ తలెత్తి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమానే తరువాత విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘స్వయంవరం’గా రూపొందింది. అలా వచ్చి ఇలా పోతున్న అవకాశాలతో నాకు భవిష్యత్ పట్ల కలవరం ఏర్పడింది. నన్ను నేను నిరూపించుకోవలసిన పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో సాఫ్ట్వేర్ బూమ్‌తో అమెరికా బాటపడుతున్న యువత మీదకు దృష్టి మళ్లింది. అలా అనురాగ్ మాధుర్ నవల ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ చదివాను. దీన్నే సినిమాగా మలిస్తే ఎలా ఉంటుంది? ఢిల్లీలో ఉన్న రచయిత దగ్గరకు వెళ్లాను. రెండు లక్షలకు రైట్స్ తీసుకున్నాను. నిర్మించడానికి అమెరికాలో స్థిరపడిన శ్రీహరి, ఇందిరగారు ముందుకొచ్చారు. మేం మొదట అమెరికన్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో తీయాలనుకున్నాం. కానీ ఆలోచిస్తే నవలలో ల్యాంగ్వేజ్ బేస్డ్ హ్యూమర్ ఎక్కువుంది. చివరకు ఇంగ్లిష్‌లోనే తీయాలని నిర్ణయించాం. ప్రొఫెసర్ సందీప్ స్క్రిప్ట్ వర్క్‌లో సహకరించారు. స్క్రిప్ట్ రాసేటప్పుడు మాకు ఎదురైన ప్రధాన సమస్య, నవలంతా లెటర్స్ రూపంలో సాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి చదువుకోవడానికి అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ తనకు ఎదురైన సంఘటనలను, అనుభవాలను ఇంటి దగ్గర ఉన్న తన సోదరునితో ఉత్తరాల ద్వారా పంచుకుంటాడు. నవల ఒక కంపైలేషన్ ఆఫ్ లెటర్స్. దీన్ని స్క్రిప్ట్ రూపంలో రాసుకుని, స్క్రీన్‌ప్లే అల్లడం పెద్ద ఛాలెంజ్. ఈ ప్రాసెస్‌ను చాలా ఎంజాయ్ చేశాను. స్క్రిప్ట్ పూర్తయ్యాక ఆర్టిస్టులెవరు సరిపోతారా అని ఆలోచించాం. అప్పటికి హిందీలో ‘సత్య’ పెద్ద హిట్. సినిమాను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో తీయాలనుకున్నాం కాబట్టి జె.డి.చక్రవర్తిని అనుకున్నాం. సాధ్యం కాలేదు. సెకెండ్ హీరో క్యారెక్టర్‌కు అనుకున్న రాజీవ్ పంజాను మెయిన్ క్యారెక్టర్‌కు తీసుకున్నాం. మిగతా పాత్రల కోసం న్యూయార్క్‌లో బ్యాక్‌స్టేజ్ అనే పత్రికలో మూడు లైన్లలో కాస్టింగ్ కాల్ ఇచ్చాం. ఒకేరోజు ఐదు వందల మంది ఆర్టిస్టులు వచ్చారు. న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నవాళ్లను ఎక్కువగా తీసుకున్నాం. అమెరికన్స్ ఏ జాతివారినైనా చిన్నచూపు చూస్తారు కానీ, సినిమా డెరైక్టర్ ఏ జాతివాడైనా గౌరవిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఎంత గౌరవప్రదమో అప్పుడే మొదటిసారిగా అర్థమైంది. నిజానికి ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ అంటే అర్థం కాని అమెరికన్స్ అని అర్థం. కానీ మేం షూటింగ్ చేసే పద్ధతి అర్థం కాక, అమెరికన్స్ మమ్మల్ని ‘ఇన్‌స్క్రూటబుల్ ఇండియన్స్’ అనేవాళ్లు. అమెరికన్స్ షూటింగ్ ఒక పద్ధతిలో జరుగుతుంది. మేం ఇరవై రెండో సీన్ తరువాత, ఏ నలభై మూడవ సీనో తీసేవాళ్లం. అలా డిజార్డర్‌గా తీసే మా పద్ధతి వాళ్లకు వింతగా అనిపించేది. ఒకపక్క అమెరికన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నా, మరోపక్క తమ దేశాన్ని కించపరిచే సినిమా తీస్తున్నారేమో అని లోలోపల సందేహపడేవాళ్లు. అందుకే ఎక్కడ షూట్ చేస్తే అక్కడ ప్రతి ఒక్కరికీ స్క్రిప్ట్ కాపీ ఇచ్చేవాళ్లం. దాంతో తీయబోయే సీన్మీద వాళ్లకు ముందుగానే అవగాహన ఉండేది. హార్ట్ఫోర్ట్ యూనివర్సిటీ, మౌంట్ హోలియోక్ ఫర్ ఉమెన్ యూనివర్సిటీల్లో ఎక్కువ షూట్ చేశాం. మిత్రుడు బాలు కాస్టింగ్, ప్రొడక్షన్లో హెల్ప్ చేశాడు. ఈ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా బాధపడే ఒక సంఘటన ఈ సందర్భంలో చెప్పి తీరాలి. ఒక ఇంట్లో షూటింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక మాట చెప్పింది. ‘మా అమ్మాయికి సినిమా అంటే పిచ్చి. వీలైతే మీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇవ్వండి. మా ఇంట్లో షూట్ చేస్తున్నారు కాబట్టి మొహమాటానికి అవకాశమిస్తానని చెప్పకండి. నిజంగా సాధ్యమైతేనే చూడండి’ అంది. మాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పి, ఆ అమ్మాయితో ఒక ఇంపార్టెంట్ సీన్ షూట్ చేశాం. ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది. అదే స్ఫూర్తితో న్యూయార్క్ ఫిలిం స్కూల్లో యాక్టింగ్ కోర్స్‌లో చేరింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్లో లెంగ్త్ పెరగడంతో ఆ అమ్మాయి నటించిన సీన్‌ను ఎడిట్ చేశాం. దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. విడుదల హడావిడిలో ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ అమెరికా కంటే ముందు ఇండియాలో రిలీజ్ చేశాం. ఫస్ట్ షోకు నేను సంగీత్ థియేటర్‌కు వెళ్లాను. ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు, నా ముందు అమెరికా అమ్మాయి సోదరుడు, అతని ఫ్రెండ్ కూర్చుని ఉండటం గమనించాను. తన చెల్లెలు నటించిన సీన్ చూడటం కోసం అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాడని అర్థమైంది. సినిమా నడుస్తున్నంతసేపూ పక్కన ఫ్రెండ్ ‘మీ చెల్లి ఎక్కడ’ అని అతన్ని అడగడం, నెక్స్ట్ సీన్లో ఉంటుందని అతను చెప్పడం, చివరకు ఆ అమ్మాయి నటించిన సీన్ లేకపోవడంతో ఇద్దరూ డిజప్పాయింట్ అవడం చూసి, వాళ్లకు కనిపించకుండా నేను తల తిప్పుకున్నాను. నన్ను అమెరికాలో ఆదరించిన కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించాల్సిన నేను, చిన్న పొరపాటు కారణంగా తప్పుకుని తిరగాల్సి వచ్చింది. వెంటనే అమెరికాకు ఫోన్‌చేసి అక్కడ ఆ అమ్మాయి నటించిన సీన్‌ను యాడ్చేసి ఫిలిం ఆ అమ్మాయికి పంపమని చెప్పాను. అది ఆ అమ్మాయికి చేరిందో లేదో నాకు తెలియదు. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా గిల్టీ ఫీలవుతుంటాను. ఆ అనుభవంతో తరువాత నా సినిమాల్లో తీసిన ఏ సీన్నూ ఎడిట్ చేయలేదు. అది నా మొదటి సినిమా నేర్పిన విలువైన పాఠం. సినిమాను చాలా ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపించాం. లండన్ ఫిలిం ఫెస్టివల్లో దేశదేశాల ఫిలిం మేకర్స్ చూశారు. సినిమా పూర్తయ్యాక, నన్ను స్టేజ్ మీదకు పిలిచి ఫోకస్ లైట్ వేశారు. అంతమంది ముందు నిలబడేసరికి భావోద్వేగానికి లోనయ్యాను. ఒకరు ‘ఆ నవలను సినిమాగా ఎందుకు తీయాలనుకున్నా’రని అడిగారు. నవల చదువుతున్నప్పుడు దాన్నొక కమర్షియల్ సినిమాలా చూశానని చెప్పాను. చాలా నిజాయితీగా చెప్పావని ప్రశంసించారు. మన దగ్గర ప్రధాన నగరాల్లో దాదాపు ఏడెనిమిది వారాలు నడిచింది. నా మీద నమ్మకం ఉంచిన నా నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిర్మాతగా నా మొదటి సినిమా ‘నిరంతరం’, దర్శకుడిగా మొదటిది ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’. తెలుగులో దర్శకునిగా మొదటి చిత్రం ‘అప్పుడప్పుడు’. నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసిన మొదటి చిత్రం మాత్రం ‘ఆ నలుగురు’. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: చలంగారు ఉంటే సంతోషించేవారు!
సినిమా ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ స్క్రీన్ మీదినుంచి ఆడియన్స్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది సైన్స్ అవుతుంది. ఆర్ట్‌లో ఎంత క్రియేషన్ ఉంటే, ఆడియన్స్‌లో అంత ఎమోషన్ బిల్డప్ అవుతుంది. ఈ ఆర్ట్‌నూ, సైన్సునూ ఒక సమాంతరరేఖ మీద నిలబెట్టినవాడు సినిమా చరిత్రలో సెన్సిబుల్ డెరైక్టర్‌గా నిలిచిపోతాడు. అలా కంటెంట్‌నూ, కాన్ఫిడెన్స్నూ నమ్ముకుని, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సినిమాలు తీస్తున్న డెరైక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ! అతడి మొదటి సినిమా ‘గ్రహణం’ వెనుక సంగ్రామం అతడి మాటల్లోనే... మన సమాజంలో ఒక ద్వంద్వ ప్రవృత్తి ఉంది. స్త్రీ ఎవరితోనైనా కాస్తంత సాన్నిహిత్యంగా మెలిగితే చులకనగా మాట్లాడతారు. అదే మగాడు ఎంతమంది ఆడవాళ్లతో తిరిగితే అతనికంత క్రేజ్. ఆలోచనల్లో ఈ హిపోక్రసీ మొదటినుంచీ ఉంది. చలంగారి రచనలన్నీ సమాజపు ద్వంద్వ నీతిని చీల్చి చెండాడాయి. స్త్రీ ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చాయి. సంప్రదాయ సమాజంలో భూకంపం పుట్టించాయి. కానీ ఆయన కథలు సినిమాలుగా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మొదటిసారిగా నేనా ప్రయత్నం చేసి సక్సెస్ అవడం నిజంగా నా అదృష్టం. 1996లో మొదటిసారిగా చలంగారి శేషమ్మ కథల సంపుటి చదివాను. అందులో దోషగుణం కథ దగ్గర ఆగిపోయాను. ఆయన మిగతా కథల కన్నా ఇందులో ఏదో ప్రత్యేకత కనిపించింది. దాన్ని సినిమాగా తీయాలని డిసైడయ్యాను. కానీ ఆ కథను యధాతథంగా సినిమాగా మలచడం కుదరదనిపించింది. అందులో ఇరవై శాతం మాత్రమే సినిమాకు అడాప్ట్ చేసుకోవచ్చు. అందులోనే చలం ఆలోచనల్ని దట్టించాలి. మొదట కథను ఒక స్క్రిప్ట్‌గా రాసుకున్నాను. 1998లో కెనడాలో ఫిలిం స్కూల్‌కు అప్లై చేసినప్పుడు అదే స్క్రిప్ట్‌ను శాంపిల్ కింద పంపాను. అప్పుడు నాకు స్క్రీన్ రైటింగ్‌లో అడ్మిషన్ దొరికింది. కోర్స్ పూర్తయ్యాక, 2001లో ఇండియాకు వచ్చాను. 2003 వరకు చాలామంది చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. ఈ మధ్యలో ‘చలి’ అనే షార్ట్ ఫిలిం తీశాను. మంచి అప్రీసియేషన్ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. అప్పటికి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఎలా ఉండాలో నాకు అవగాహన వచ్చింది కాబట్టి ‘దోషగుణం’ స్క్రిప్ట్‌ను రీరైట్ చేశాను. అయితే ఆ పేరు పాతగా ఉండటంతో, సినిమాకి ఏ టైటిల్ పెడదామా అని తీవ్రంగా ఆలోచించాను. ఒక అపవాదు వల్ల భూస్వామి జీవితంలో గ్రహణం కమ్మింది. అతని భార్య జీవితంలోను, పనివాడు కనకయ్య జీవితంలోను కూడా గ్రహణం కమ్మింది. ఇంతమంది జీవితంలో గ్రహణం కమ్మింది కాబట్టి ఆ టైటిలే కరెక్ట్ అనుకున్నాను. భూస్వామి తన భార్య తొడ నుండి రక్తం తీసుకునే సీన్ సినిమాకి చాలా కీలకం. అయితే ఆ సీన్ తీయడానికి ఒక కొత్త దర్శకుడిగా నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు భరణిగారు, జయలలితగారు చాలా సపోర్ట్ చేశారు. ఒకరోజు హైదరాబాద్ ఫిలిం క్లబ్లో తనికెళ్ల భరణిగారు కలిసినప్పుడు చలం కథ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని చెప్పాను. వెంటనే ఆయన పైసా తీసుకోకుండా చేస్తాను అన్నారు. ‘మరి ప్రొడ్యూసర్ ఎలా’ అన్నారాయన. ‘మా అమ్మగారు తన ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేసి మూడు లక్షలిస్తానన్నారు, దాంతో చేస్తానండీ’ అన్నాను. ‘మూడు లక్షలతో సినిమా ఎలా తీస్తావయ్యా’ అని కనకధార క్రియేషన్స్ సుబ్బారావు, అంజిరెడ్డి, వెంకట్ల దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు బడ్జెట్‌ను మరో మూడు లక్షలకు పెంచారు. అలా మా సినిమా ఊపిరి పోసుకుంది. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే, భూస్వామి పాత్రను భరణిగారు చేస్తానన్నారు. భార్య శారదాంబ పాత్రకు జయలలితగారు బాగుంటుందనుకున్నాను. జయలలితగారికి మన సినిమాల్లో ఒక సెక్సీ ఇమేజ్ ఉంది. కానీ ఆవిడ అంతకుమించి చేయగలరని నా నమ్మకం. నా దృష్టిలో ఆవిడో ట్రెడిషనల్ బ్యూటీ. భరణిగారు కూడా మంచి ఐడియా అన్నారు. మిగతా పాత్రలకు సీరియల్స్ నుంచి, కొంతవరకు నాటకాల నుంచి తీసుకున్నాను. కనకయ్య పాత్రకు ఆర్టిస్ట్‌ను వెదకడానికి చాలా ఇబ్బందిపడ్డాను. పదిహేనేళ్ల కుర్రవాడు నడివయసు స్త్రీతో సన్నిహితంగా మెలగాలి. అలా చేయాలంటే ఆ కుర్రవాడికి ఎంతో కొంత పరిణతి కావాలి. అందుకే చాలా అన్వేషణ జరిపి తల్లావజ్జల సుందరిగారి అబ్బాయి మోహనీష్ను సెలెక్ట్ చేసుకున్నాం. తను కనకయ్య పాత్రకు జీవం పోశాడు. ఆనాటి సమాజ వాతావరణాన్ని తలపించే లొకేషన్ కోసం చాలా వెదికాం. చివరకు అమలాపురం దగ్గర ఉన్న లక్కవరం సెలక్ట్ చేసుకున్నాం. అక్కడ ఒక మంచి ఇల్లు దొరికింది. ఒక్క ప్రాపర్టీని కూడా బయట నుంచి తీసుకురాలేదు. దాదాపు షూటింగ్ అంతా అందులోనే జరిగింది. యూనిట్ అంతా ఒకే దగ్గర ఉండి షూటింగ్ చేసుకోవడం, సాయంత్రం వచ్చాక మర్నాడు చేయాల్సిన సీన్ గురించి డిస్కస్ చేసుకోవడంతో ఒక కుటుంబ వాతావరణంలా ఉండేది. షూటింగ్ సమయంలో ఓ రెండు సంఘటనలు నన్ను తీవ్ర ఆశ్చర్యానికి లోను చేసి, కొన్నింటి పట్ల నా అభిప్రాయాన్ని మార్చివేశాయి. కథ ప్రకారం ఒక సీన్లో తల్లిదండ్రుల మీద కోపంతో కనకయ్య కుండ విసిరికొడతాడు. అది కిందపడి పగులుతుంది. సీన్ తీయబోతుంటే ఇంటి ఓనర్ వచ్చి ‘ఇవాళ మంగళవారం, కుండ పగలగొట్టొద్దు’ అంది. మా షెడ్యూల్ ప్రకారం ఆ రోజు సీన్ పూర్తవాలి, మరో రోజు పొడిగించడానికి లేదు. ఎలా అని ఆలోచిస్తుంటే మోహనీష్... ‘సార్, నేను కుండ పగలగొడతాను, మీరు నన్ను తిట్టండి, అలా మన పనైపోతుంది’ అని ఐడియా ఇచ్చాడు. మేం సరే అన్నాం. తను కుండ పగలగొట్టాడు. ‘వాళ్లు అలా చేయవద్దన్నప్పుడు చేయడం తప్పు కదా’ అని మోహనీష్ని తిట్టాను. ఇంటావిడ రాగానే ‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఏంటండీ’ అన్నాను. ‘ఏవో ఉంటాయి నాయనా, ఐనా కుండ లేపే షాట్ ఈ రోజు విడిగా, పగిలిన షాట్ రేపు విడిగా తీసుకుని తరువాత రెండూ కలుపుకోవచ్చుగా’ అందావిడ. నేను ఆశ్చర్యపోయాను. మామూలు ప్రజలకు సినిమా గురించి అంతగా అవగాహన ఉండదని అప్పటిదాకా భావించిన నాకు ఈ అనుభవం కొత్త పాఠం నేర్పింది. అలాగే షూటింగ్ అయిపోయిన తరువాత కొన్ని పల్లెటూరి షాట్స్ తీస్తున్నాను. గోచీ పెట్టుకున్న ఒకతను సైకిల్ మీద మా దగ్గరికి వచ్చి ‘షూటింగ్ అయిపోయింది కదా ఇంకేం తీస్తున్నారండీ’ అన్నాడు. ‘పల్లె విజువల్స్ తీస్తున్నాం’ అన్నాను. ‘తీసుకోండి, టైటిల్స్ వేసుకోవడానికి పనికొస్తాయి’ అన్నాడు. నోట మాట రాలేదు. మొత్తానికి పందొమ్మిది రోజుల్లో, ఆరున్నర లక్షల బడ్జెట్లో సినిమా పూర్తిచేశాం. బ్లాక్ అండ్ వైట్‌లో చేయాలన్నది కూడా యాదృచ్ఛికంగా జరిగిందే. ఒకసారి మానిటర్ ఆన్ చేస్తుంటే కొన్ని క్షణాలు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించింది. అది చూసిన భరణిగారు ‘ఎంత బావుందో’ అన్నారు. అంతే, సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో ఉంచాలనుకున్నాం. అది చాలా ప్లస్సయ్యింది. తరువాత సినిమాను చాలా ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపించాం. మంచి స్పందన వచ్చింది. నేషనల్ అవార్డ్‌కు పంపించేటప్పుడు ఫిలిం ఫార్మాట్ కావాలంటే డిజిటల్ నుంచి ఫిలింకు ట్రాన్స్ఫర్ చేశాం. ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. 2006లో ఆమిర్‌ఖాన్ చేతుల మీదుగా గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డును అందుకున్నాను. రెండేళ్ల తరువాత ఆమిర్ ‘తారే జమీన్ పర్’కు తొలి ఉత్తమ దర్శకుడిగా అదే అవార్డ్ అందుకున్నారు. గ్రహణం నాకు ప్రశంసలతో పాటు విమర్శలనూ తెచ్చిపెట్టింది. కథను సినిమాగా మలిచే క్రమంలో ఏ దర్శకుడికైనా కొంత స్పేస్ ఉంటుంది. దోషగుణాన్ని గ్రహణంగా మలిచే క్రమంలో నేను కూడా కొంత స్వేచ్ఛ తీసుకున్నాను. చలంగారు పల్లెటూరి మనుషులు, వారి స్వభావాల గురించి, అక్కడి వ్యవహారాల గురించి చాలా వర్ణన చేశారు. బడ్జెట్ దృష్ట్యా నేనవన్నీ పక్కన పెట్టాను. ఆయన అభిప్రాయాలన్నీ కనకయ్య మేనమామ పాత్ర ద్వారా చెప్పించాను. నిజానికి ఆ పాత్ర కథలో లేదు. అవసరం కోసం నేనే సృష్టించాను. దానికి నేను సినిమాలో పేరు పెట్టలేదు. అలాగే కనకయ్య తండ్రి పాత్రకు కథలో పేరు లేదు. సినిమాలో నేను సుబ్రహ్మణ్యం అని పెట్టాను. ఇవి చిన్న మార్పులే. కానీ సినిమా మీద ప్రధానంగా రెండు విమర్శలు వచ్చాయి. కథలో చలం శారదాంబను ఒక పవిత్రమూర్తిగా చూపించారు. నేను ఒక సాధారణ స్త్రీగా చూపించాను. ఎందుకంటే పురాణాల్లోలా పవిత్ర స్త్రీకి మాత్రమే అపవాదు రాదు. నిజ జీవితంలో ఒక మామూలు స్త్రీకి కూడా రావచ్చు. వస్తే తనెలా సంఘర్షణకు గురవుతుంది, స్త్రీ లైంగికత్వం మీద సమాజం ఎలాంటి నిఘా పెడుతుందీ చూపించాలనుకున్నాను. అందుకే కనకయ్య శారదాంబ కాళ్లు వత్తేటప్పుడు ప్రేక్షకులు వాళ్లిద్దరికీ ఏదో సంబంధం ఉంది అనుకోవాలన్నట్టు చిత్రించాను. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని కేవలం లైంగిక విషయానికి మాత్రమే పరిమితమైనదానిగా చూడటం తప్పని చివర్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఒక సీన్లో శారదాంబ మంగళసూత్రం తీసి మొహం కడుక్కుని, తరువాత మళ్లీ వేసుకుంటుంది. ఓ సంప్రదాయ స్త్రీ అలా చేయదన్నారు. అలా చేయకూడదని ఎక్కడా లేదని నా ఉద్దేశం. చలంగారి కథను సినిమాగా తీయడానికి అంగీకరించిన ఆయన కూతురు సౌరిస్, సినిమా చూసి ‘నాన్నగారు ఉండి ఉంటే చాలా సంతోషించేవారు’ అన్నారు. నా దృష్టిలో గ్రహణానికి లభించిన అతిపెద్ద సర్టిఫికెట్ అది. ఇక భరణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా తొలి సినిమాకే కాదు, నా కెరీర్‌కి కూడా వెన్నెముకగా నిలిచారాయన! - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
రిలేషణం: తేమగల రాయి... రామ్‌గోపాల్‌వర్మ
రామ్‌గోపాల్‌వర్మ... ఇండస్ట్రీలో న్యూ టాలెంట్‌కి ఆయన గాడ్‌ఫాదర్. ఈ గాడ్‌ఫాదర్‌కి రోల్‌మోడల్... ఆయన మేనమామ మురళీరాజు. నాకు సినిమాలు తప్ప సెంటిమెంట్లు లేవు అన్నట్టుగా ఉండే వర్మ రాతి మనిషా లేక ఆ రాతి కింద ఏమైనా తడిజాడలున్నాయా... మేనమామ మురళీరాజు మాటల్లో తెలుసుకుందాం! వర్మకు సినిమాల పట్ల ఆసక్తి కలిగించేలా చేసింది నేనే అన్నది కేవలం తను కల్పించిన ఒక భ్రమ మాత్రమే. కాలేజీలో ఉన్నప్పుడు తను గాడ్‌ఫాదర్ నవలలో పేరాలు, సినిమాలో సీన్స్ అనర్గళంగా చెప్పేవాడు. తరువాత చూస్తే, అందులో చాలావరకు తన ఇమాజినేషన్, ఆర్టిక్యులేషన్ ఉండేది. ప్రపంచ సినిమాలో వెయ్యి అత్యుత్తమ చిత్రాలుంటే, నేను తొమ్మిది వందల సినిమాలు చూశాను. తను మాత్రం వంద చూసుంటాడు. కానీ తను వంద సినిమాలు తీస్తే, నేను ఒక్కటి కూడా తీయలేకపోయాను. ఇక, మా బంధం గురించి చెప్పాలంటే, నేను ప్రేక్షకుణ్ని, వర్మ దర్శకుడు. అదే మా బంధం. మా మార్గాలు ఎక్కడ వేరవుతాయి అంటే, వర్మ థింకింగ్ వేరు. నా థింకింగ్ వేరు. నాది జ్ఞాన మార్గం. తనది క్రియా మార్గం. నాకు ఫ్లైట్‌లో ప్యాసింజర్‌గా వెళ్లడం ఇష్టం. తనకు పైలట్‌గా విమానం నడపడం ఇష్టం. రాము సూర్యుడు, నేను చంద్రుడు. తనకు స్వయం ప్రకాశకత్వం ఉంది, నాకు లేదు. రాముకి ఉన్నతమైన లక్షణాలున్నాయి. డబ్బు సంపాదించగానే తండ్రికి కారు కొనిచ్చాడు. తనకెలాంటి బంధాలూ లేవని రాము చెప్పేది అబద్ధం. నాలుగు ఫ్యామిలీస్ అతని మీద ఆధారపడి ఉన్నాయి. కనీసం వంద మందికి జీవితాధారాన్నిచ్చాడు. తనకు ఎమోషన్ లేదంటాడు కానీ తన తండ్రి చనిపోయిన కొన్నేళ్ల వరకూ వెక్కి వెక్కి ఏడ్చాడు. లోపల ఎమోషన్ లేకుంటే బయటకు దుఃఖం ఎలా వస్తుంది! రాము ఓ గ్రేట్మ్యాన్ అని ఊహ వచ్చాక, తను నా మేనల్లుడు అనుకోవడం మానేశాను. నిజం చెప్పాలంటే ఆయన నాకు మామ. నేను మేనల్లుణ్ని. తను ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాల గురించి తెలుసుకుంటుంటాడు. నేను పెద్దగా ఎవరినీ కలవడానికి ఇష్టపడను. ఒక్క రామూని మాత్రం మళ్లీ మళ్లీ కలవడానికి ఇష్టపడతాను. బాంబేకి వెళ్లి ఫోన్ చేస్తే ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు సినిమాకు సంబంధించి అన్ని ప్రాసెస్లు దగ్గరుండి చూపిస్తాడు. నన్ను తను ఎంటర్టైన్ చేసినట్టు మరెవరూ చేయలేరు. వినోదం రూపంలో ఆతిథ్యం ఇవ్వగలిగే సంస్కారం ఉన్న పెద్దమనిషి ఆయన. తన దగ్గర ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయం నాకు కనిపిస్తూ ఉంటుంది. తనను చిన్నప్పటినుంచీ అబ్జర్వ్ చేస్తున్నాను. చిన్నప్పుడు తనకు కత్తి కాంతారావు అంటే ఇష్టం. వయసులో బ్రూస్లీ, తరువాత అమితాబ్ అంటే ఇష్టం. రాము దేవుడు ఉన్నాడు లేడు అని నమ్మడు. ఒకవేళ దేవుడు ఉన్నా అతనికి మన గురించి అక్కరలేదు. అలాంటప్పుడు అతని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలి అంటాడు. అది ఒక విధంగా కరెక్టే. సూర్యుడిలా దేవుడు సాక్షి అంతే. నాది అద్వైతం. దేవుడిలో నేనున్నాను, నాలో దేవుడున్నాడు. తన సినిమాలకు సంబంధించి నా అబ్జర్వేషన్స్ చెబుతానే తప్ప అభిప్రాయాలు చెప్పను. అతను నన్నెప్పుడూ అడగలేదు. నేనెప్పుడూ చెప్పను. పోస్ట్ ప్రొడక్షన్లో సీన్స్ చూపించి అడుగుతాడు. నేను నా అభిప్రాయం చెబుతాను. అంతవరకే. దగ్గరివాళ్లు విమర్శిస్తే రాము తట్టుకోలేడు. ఈ మధ్య తన సినిమాలు సరిగ్గా ఎంటర్టైన్ చేయడం లేదు. ఫెలిని(ఇటలీ చిత్ర దర్శకుడు) ఒక దశలో ఆర్ట్ ఇజ్ మై ఎక్స్ప్రెషన్ అన్నట్టు వర్మ కూడా నా సినిమా నా ఇష్టం అంటాడు. రాము తనకై తన గురించి, తన ప్లెజర్ గురించి జీవిస్తాడు. అందుకే ఆగ్ తీశాడు. రామూని యాక్సెప్ట్ చేయవచ్చు. రిజెక్ట్ చేయవచ్చు. కానీ ఎవరికీ ద్వేషించడం అస్సలు కుదరదు. జీవితమనే ల్యాబొరేటరీలో చిన్న చిన్న చమత్కారాలు జరుగుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాము అలాంటి చమత్కారమే. ఆయన ఒక మనిషి కాదు, ప్రాసెస్. జీవితం సంతోషంగా ఉండాలంటే ఐదు సూత్రాలు చెబుతారు. ఐహిక సుఖాలు 20 శాతం ఆనందాన్నిస్తాయి; మనకు నచ్చిన పనిచేస్తే, ఇరవై శాతం ఆనందం; సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తే ఇరవై శాతం; త్యాగబుద్ధి వలన ఇరవై శాతం; లక్ష్య సిద్ధి ఇరవై శాతం సంతోషం కలుగుతుంది. ఇవేవీ రామూకి తెలియకపోయినా తను ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. జీవితానికి పరమార్థం ఇతరులను ఇన్స్పైర్ చేయడం అని చెప్తారు. అలా చూస్తే, హిచ్కాక్లాగా రామూ కూడా చాలామందిని ఇన్స్పైర్ చేశాడు. రాము తన లక్ష్య సిద్ధికి గారడీ చేస్తాడు కానీ కుతంత్రాలు కాదు, ఇతరులకు హాని చేసే చర్చలు, ఈర్ష్య ద్వేషాలు లేని వ్యక్తి రాము. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా!
ఐతే... డెరైక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మొదటి సినిమా. సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌కి మొదటి సినిమా. ఆర్డ్ డెరైక్టర్ రవిందర్కి మొదటి సినిమా. మ్యూజిక్ డెరైక్టర్ కళ్యాణి మాలిక్‌కి మొదటి సినిమా. ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అనే ఆవేశంలో లాభ నష్టాల బేరీజు లేకుండా, కసితో ముందడుగు వేసిన మొండితనపు కుర్రాళ్ల కల ఇది. రిలీజ్ తరువాత మళ్లీ ‘ఐతే ఏంటి’ అనే పరిస్థితి రాలేదు. టెక్నీషియన్స్‌ను ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసి, ఇండిపెండెంట్ సినిమాకు ఇమేజ్ తెచ్చిన సినిమా అది. ఆ చిత్రం తీసే క్రమంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎదుర్కొన్న అనుభవాలు... ఆయన మాటల్లోనే. మామూలుగా టైస్టుల మీద భారీ ప్రైజ్‌లు ప్రకటిస్తుంటారు. వాళ్లను ప్రభుత్వానికి పట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టిన కథే ‘ఐతే’.నేను ‘అమృతం’ సీరియల్‌కు మొదట్లో డెరైక్టర్‌గా పనిచేశాను. దానికి సెంథిల్ కెమెరామెన్. సర్వేష్ మురారి అసిస్టెంట్ కెమెరామెన్. రవీందర్ ఆర్ట్ డెరైక్టర్. కళ్యాణిమాలిక్ మ్యూజిక్ డెరైక్టర్. అంతా కుర్రాళ్లం కాబట్టి, ఇంకా ఏదో చేయాలన్న కసితో ఉండేవాళ్లం. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ గురించి ఆలోచిస్తూ, ఒక లో-బడ్జెట్ సినిమా చేద్దామనుకున్నాం. అది వర్కవుట్ అవుతుందా లేదా, ఎవరైనా తీసుకుంటారా లేదా... ఏదీ ఆలోచించనీయని యవ్వనావేశం! మొదట ఒక మాఫియా డాన్ చుట్టూ కథ అల్లుకున్నాను. డాన్ చుట్టూతా మీకు తెలిసిన కథలు చెప్పండి, అవి కాకుండా నా దగ్గర ఉన్నది కొత్తది అయితేనే ముందుకు వెళదాం అన్నాను. వాళ్లు చాలా చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్ చెప్పేసరికి ఇదేదో కొత్తగా ఉందని అందరూ ఎక్జయిట్ అయ్యారు. తరువాత ‘అమృతం’ నిర్మాత గుణ్ణం గంగరాజుగారికి లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి సినిమా తీద్దాం, మొదట నువ్వేమనుకుంటున్నావో పూర్తిగా పేపర్ మీద రాసివ్వు అన్నారు. కథ చెప్పడం చాలా ఈజీ, రాయడం చాలా కష్టం. మొదటి మూడు రోజులూ బుర్ర వేడెక్కిపోయింది. మేం నలుగురం కలిసి డిస్కస్ చేసేవాళ్లం. ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు జీవీకే వన్ ఉన్న దగ్గర అప్పుడు చైనీస్ బళ్లు ఉండేవి. అక్కడ గోడ మీద కూర్చుని గంటల తరబడి డిస్కస్ చేసుకుని, అక్కడే తినేసి రూమ్‌కు వెళ్లిపోయేవాళ్లం. రాయడం మొదలుపెట్టాక క్లారిటీ వచ్చింది. మొదట అనుకున్న ప్రకారం మినిస్టర్ కిడ్నాప్‌కి ప్లాన్ చేసి చివరకు తానే కిడ్నాప్ అవుతాడు డాన్. దీన్ని గంగరాజుగారు ఫ్లైట్ హైజాక్, కిడ్నాప్ కింద మార్చారు. అలా ప్రతి దశలోనూ ఆయన చాలా హెల్పయ్యారు. కొత్తవాళ్లతో కదా, మార్కెట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఆయన మమ్మల్ని ఉత్సాహపరిచారు. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చాక, లొకేషన్స్ కోసం వెదుకులాట మొదలైంది. తలకోనతో పాటు చాలా అడవులు చూశాం. రెండు నెలల అన్వేషణ తరువాత వికారాబాద్ ఫారెస్ట్‌ను సెలక్ట్ చేసుకున్నాం. తరువాత సాంకేతిక అంశాల మీద దృష్టి పెట్టాం. కథ యువకుల జీవన పోరాటానికి సంబంధించి కాబట్టి, నేను, సెంథిల్... లైటింగ్, కాస్ట్యూమ్స్, కలర్స్ గురించి డిస్కస్ చేశాం. అమెరికన్ బ్లాక్ బుక్‌లో ఫొటోస్ రిఫరెన్స్ తీసుకుని కలర్ స్కీమ్ డిజైన్ చేసుకున్నాం. మరోవైపు ఆర్టిస్టుల ఎంపిక కీలకంగా మారింది. ఇందులో హీరో ఉండడు. నలుగురు కుర్రాళ్లు, వీళ్ల ఫ్రెండ్ ఒకమ్మాయి, డాన్, డాన్ అసిస్టెంట్... మొత్తం ఏడుగురు మెయిన్ క్యారెక్టర్స్. కొత్తవాళ్లు కావాలని ప్రకటన ఇస్తే, చాలా ఫొటోలు వచ్చాయి. షార్ట్ లిస్ట్ చేసి అభిషేక్, జనార్థన్, శశాంక్లను తీసుకున్నాం. మెయిన్ క్యారెక్టర్‌కు ఎవరూ దొరకక మొహితా చద్దాను బాంబే నుంచి తీసుకున్నాం. డాన్ క్యారెక్టర్‌కు పవన్ మల్హోత్రాతో పాటు మరొకరిని చూడటానికి నేను, గంగరాజుగారు బాంబే వెళ్లాం. వీడియో క్లిప్స్‌లో భయంకరంగా కనిపించిన పవన్, డెరైక్ట్‌గా చూస్తే చాలా చిన్నగా కనిపించాడు. అతడు పనికొస్తాడో లేదోనని నేను సందేహం వ్యక్తం చేశాను. ఆయన పవన్‌తో నా అభిప్రాయం చెప్పారు. పవన్ డాన్ గెటప్‌లో మేం ఉంటున్న హోటల్‌కు వచ్చేశారు. అంత కేర్ తీసుకుని, అంత ఇన్వాల్వ్ అయి ఆ గెటప్‌లో రావడం చూసి ఇంప్రెస్ అయిపోయాను. సింధు తులానీని చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించింది. మరో ఆలోచన లేకుండా సెలక్ట్ చేసేశాం. షూటింగ్ మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి మొదలుపెట్టాం. రోజూ సెట్లోకి రాగానే ఆ రోజు ఎన్ని క్లోజ్‌లు, ఎన్ని మిడ్‌లు, ఎన్ని వైడ్లు అని పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ సినిమాలో ఓ కీలకమైన విషయం గురించి మేం పడ్డ ఇబ్బందులు చెప్పాలి. బాంబే ఎయిర్‌పోర్ట్‌లో డాన్మీద అటాక్ జరిగే యాక్షన్ సీన్ ప్లాన్ చేశాం. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని లోకల్ ఫైట్మాస్టర్ను పెట్టుకున్నాం. అతను తన పాత పద్ధతిలో షాట్స్ కంపోజ్ చేశాడు. మాకది నచ్చలేదు. పర్మిషన్ ఉన్నది ఒక్క రాత్రికే. దాంతో రెండు మూడు షాట్స్ తీసిన తరువాత అతన్ని పక్కన పెట్టి మేమే తీయడం మొదలుపెట్టాం. అనుకున్నట్టు వచ్చింది. షూటౌట్ అయిన తరువాత డాన్ తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కెమెరా కాళ్ల నుంచి ఫేస్ దగ్గరకు క్రాస్‌గా ట్రావెల్ చేయాలి. క్రేన్, ట్రాలీ ఫేస్ దగ్గరికి క్రాసింగ్‌గా ఒకే లెవెల్లో వెళ్లాలి. ఆ ఇరుకు ప్లేస్‌లో ఇది కొంచెం కష్టమైన షాట్. ఐదారుసార్లు తీసినా జర్క్ వచ్చేసింది. నేను ఓకే చెప్పేశా. ఎడిటింగ్‌లో గన్ సౌండ్స్ యాడ్ చేశాను. జరిగిన అటాక్‌ను విలన్ గుర్తు తెచ్చుకుంటున్నట్టు జర్క్ దగ్గర తుపాకీ చప్పుళ్ల సౌండ్ సింక్ అయింది. మరో సీన్లో డాన్‌ను కిడ్నాప్ చేసిన తరువాత కుర్రాళ్లు చీర్స్ చెప్పుకుంటుంటారు. అప్పుడు త్రీ యాక్సిస్ రొటేషన్ టెక్నాలజీ లేకపోయినా షాట్లో అదే ఎఫెక్ట్ తీసుకొచ్చాడు సెంథిల్. అలాగే మొదటినుంచీ ఒక సాంగ్ పెడదామనుకున్నాం. దానికి కళ్యాణిమాలిక్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడు. విన్న వెంటనే ఓకే చేసేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. డ్యాన్స్‌మాస్టర్ నిక్సన్ ఆధ్వర్యంలో సాంగ్ పిక్చరైజేషన్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఇక క్లైమాక్స్ సీన్లో బాంబ్ బ్లాస్ట్‌కు కార్ డిక్కీ లేచి పడాలి. స్పెషల్ ఎఫెక్స్ట్ వాళ్లు కాలిక్యులేట్ చేసి డిక్కీ ఆరు ఫీట్లు ఎగురుతుందని చెప్పారు. కానీ షూట్ చేసేటప్పుడు బాంబు ధాటికి డిక్కీ పైకి లేచి, ఎలక్ట్రిక్ పోల్కి తగిలి సర్క్యూట్ సంభవించింది. దాంతో రెండు గంటలపాటు వికారాబాద్‌కు కరెంట్ సప్లై నిలిచిపోయింది. అది పొరబాటున యూనిట్ వైపు పడి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. మా ప్రొడక్షన్‌వాళ్లు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సమస్యను పరిష్కరించారు. అంతేకాక, వర్షం వల్ల వరుసగా రెండు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కొంచెం టెన్షన్ పడినా, మొత్తానికి 63 రోజుల్లో పూర్తి చేశాం. అది కూడా ద్విభాషా చిత్రం కాబట్టి. పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్‌కు మాత్రం టైమ్ పట్టింది. వాయిస్‌లు నేచురల్‌గా ఉండాలి కాబట్టి డబ్బింగ్ ఎక్కువ సమయం తీసుకుంది. న్యాచురల్ ఫిలింస్‌కు అప్పట్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సినిమా పూర్తయిన మూడు నెలలకు కూడా విడుదల కాలేదు. కొంతమంది బాలేదన్నారు కూడా. మరీ అంత దారుణంగా తీశామా అనుకున్నాం. ఆ టైమ్‌లో మా ప్రొడ్యూసర్ మాకు చాలా ధైర్యాన్నిచ్చారు. రామ్‌గోపాల్‌వర్మని సినిమా చూడమంటే చూడనన్నారు. బాగుంటే ఓకే, బాగోలేకపోతే నేనే కామెంట్ చేస్తే అది మీకే నష్టం అన్నారు. ఫర్వాలేదని బీటా ప్రొజెక్షన్లో చూపించాం. ఆయనకు విపరీతంగా నచ్చింది. మా యూనిట్ నుండి కాకుండా బయటివాళ్ల నుంచి వచ్చిన మొదటి పాజిటివ్ కాంప్లిమెంట్ అదే. తరువాత రామానాయుడు స్టూడియోకు డీటీఎస్ మిక్సింగ్‌కు పంపించాం. ఆడియోగ్రాఫర్ మధుసూదన్‌రెడ్డి ఇంటర్వెల్ వరకు చూసి అద్భుతంగా ఉందన్నారు. సినిమా విడుదలయ్యాక, లైట్‌బాయ్స్ ఒక విషయం చెప్పారు. షూటింగ్లో మా తపన చూసి కుర్రాళ్లు ఏదో కష్టపడుతున్నారు, అసలు సినిమా ఏమైనా నడుస్తుందా అనుకున్నారట. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని వాళ్లు అస్సలు అనుకోలేదట. స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్‌ప్రొడక్షన్ వరకు ప్రతి దశలో అందరం ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టే అంత పెద్ద సక్సెస్ వచ్చిందనుకుంటాను. కెమెరా, కలర్స్, లైటింగ్ విషయాల్లో ప్రయోగాలు చేసి సినిమాను వాస్తవికతకు దగ్గరగా ఉండేట్టు తీశాం. ఈ సినిమాకు అసలు బలం స్క్రీన్‌ప్లే. అందుకు నామీద సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ల ప్రభావం ఉండటం కారణం కావచ్చు. గంగరాజుగారి డైలాగ్స్ సూపర్బ్‌గా హెల్పయ్యాయి. ఎడిటర్ సుధాకర్ కూడా ప్లస్సయ్యారు. సినిమాను ఫాస్ట్ పేస్డ్ నేరేషన్లో నడిపాడు. హిందీలో ‘పచాస్లాక్’ అనే పేరు పెట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మేశాం. తెలుగులో విడుదలైన రెండు మూడేళ్లకు వాళ్లు హిందీలో రిలీజ్ చేశారు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి