తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా! | I feel Guilty in that manner : Chandra Siddhartha | Sakshi
Sakshi News home page

తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!

Published Sun, Sep 29 2013 2:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!

తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!

డైరెక్షన్...  సినిమా ఇండస్ట్రీలో క్రియేటివిటీకి గ్లామర్‌ను యాడ్ చేసిన పొజిషన్.
 అందుకే వెండితెర బాటలో చాలామందికి అదే టార్గెట్.
 లక్షల్లో ఒకరికి అవకాశమొస్తే కోటికి ఒక్కరు నిలబడతారు.
 ఈ పోటీ ప్రపంచంలో నిలబడి గెలవాలంటే నిరంతరం కొత్తగా ఆలోచించాల్సిందే!
 కథను ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పే క్రమంలో మనకు నచ్చిన సినిమా తీయడమా
 జనం మెచ్చే సినిమా తీయడమా...
 ఈ సందిగ్ధం, ఈ సంఘర్షణ ప్రతి దర్శకుడికీ సహజంగా ఎదురయ్యేదే!
 అలా తనలో తాను సంఘర్షిస్తూ ఆ రాపిడిలో వెండితెరపై కొత్త వెలుగులు
 పంచడానికి ప్రయత్నిస్తున్న తెలుగు దర్శకుడు చంద్రసిద్ధార్ధ ఇంగ్లిష్ సినిమా తీశారు.
 ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ నవలను సినిమాగా మార్చే క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలివి.

 
 ఎంత ఘర్షణకు లోనైతే అంత వేగంగా వెలుగు వైపు పయనించినట్టే. ఇది చరిత్రే కాదు, నా మొదటి సినిమా నాకు నేర్పిన అనుభవం కూడా.స్కూల్లో పెయింటింగ్‌లో, క్రియేటివ్ రైటింగ్‌లో చాలా అవార్డులు గెలుచుకున్నాను. దాంతో అందరిలా మనం డాక్టర్, ఇంజనీర్ కాకుండా క్రియేటివ్ ఫీల్డ్‌లోనే ఏదైనా సాధించాలనుకున్నాను. క్రియేటివ్ ఫీల్డ్‌లో అంతిమ గమ్యం సినిమా కాబట్టి ఆ దిశగా అడుగులు వేశాను. ఉప్పల పాటి నారాయణరావు దగ్గర ‘జైత్రయాత్ర’, ‘రక్షణ’లకు డెరైక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశాను. అప్పటికే మా అన్నయ్య కృష్ణమోహన్ నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.
 
 అమెరికన్స్ ఏ జాతివారినైనా చాలా చిన్నచూపు చూస్తారు కానీ, సినిమా డెరైక్టర్ ఏ జాతివాడైనా గౌరవిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఎంత గౌరవప్రదమో అప్పుడే మొదటిసారిగా అర్థమైంది.
 
  తనని హీరోగా పరిచయం చేయడం కోసం సొంత సినిమా నిర్మించాలనుకున్నాను. అన్నయ్య, శ్రీకాంత్, అలీ, బ్రహ్మాజీ, రంభ ప్రధాన పాత్రలుగా మా రెండో అన్నయ్య రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘నిఘా’  మొదలుపెట్టాం. ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. తరువాత తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘నిరంతరం’ షార్ట్ ఫిలిం నిర్మించాను. ప్రశంసలు దక్కాయి కానీ పెట్టుబడి తిరిగి రాలేదు. తర్వాత కొంతకాలం టీవీకి పనిచేశాను. అప్పుడే త్రివిక్రమ్, ఆర్.పి.పట్నాయక్ పరిచయమయ్యారు. కాలం కలల కొలిమిలో తగలబడుతున్న వేళ, దర్శకుడిగా వచ్చిన అవకాశం నాలో కొత్త ఆశను రేకెత్తించింది.
 
 త్రివిక్రమ్ కథతో నా మిత్రుడు వేణు హీరోగా, మరో మిత్రుడు నిర్మాతగా, నేను దర్శకుడిగా ‘అవునంటే కాదంటూ’ సినిమా మొదలైంది. కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ తలెత్తి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమానే తరువాత విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘స్వయంవరం’గా రూపొందింది. అలా వచ్చి ఇలా పోతున్న అవకాశాలతో నాకు భవిష్యత్ పట్ల కలవరం ఏర్పడింది.
 
  నన్ను నేను నిరూపించుకోవలసిన పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో సాఫ్ట్‌వేర్ బూమ్‌తో అమెరికా బాటపడుతున్న యువత మీదకు దృష్టి మళ్లింది. అలా అనురాగ్ మాధుర్ నవల ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ చదివాను. దీన్నే సినిమాగా మలిస్తే ఎలా ఉంటుంది? ఢిల్లీలో ఉన్న రచయిత దగ్గరకు వెళ్లాను. రెండు లక్షలకు రైట్స్ తీసుకున్నాను. నిర్మించడానికి అమెరికాలో స్థిరపడిన శ్రీహరి, ఇందిరగారు ముందుకొచ్చారు. మేం మొదట అమెరికన్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో తీయాలనుకున్నాం. కానీ ఆలోచిస్తే నవలలో ల్యాంగ్వేజ్ బేస్డ్ హ్యూమర్ ఎక్కువుంది. చివరకు ఇంగ్లిష్‌లోనే తీయాలని నిర్ణయించాం. ప్రొఫెసర్ సందీప్ స్క్రిప్ట్ వర్క్‌లో సహకరించారు. స్క్రిప్ట్ రాసేటప్పుడు మాకు ఎదురైన ప్రధాన సమస్య, నవలంతా లెటర్స్ రూపంలో సాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి చదువుకోవడానికి అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ తనకు ఎదురైన సంఘటనలను, అనుభవాలను ఇంటి దగ్గర ఉన్న తన సోదరునితో ఉత్తరాల ద్వారా పంచుకుంటాడు. నవల ఒక కంపైలేషన్ ఆఫ్ లెటర్స్. దీన్ని స్క్రిప్ట్ రూపంలో రాసుకుని, స్క్రీన్‌ప్లే అల్లడం పెద్ద ఛాలెంజ్. ఈ ప్రాసెస్‌ను  చాలా ఎంజాయ్ చేశాను.
 
 స్క్రిప్ట్ పూర్తయ్యాక ఆర్టిస్టులెవరు సరిపోతారా అని ఆలోచించాం. అప్పటికి హిందీలో ‘సత్య’ పెద్ద హిట్. సినిమాను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీయాలనుకున్నాం కాబట్టి జె.డి.చక్రవర్తిని అనుకున్నాం. సాధ్యం కాలేదు. సెకెండ్ హీరో క్యారెక్టర్‌కు అనుకున్న రాజీవ్ పంజాను మెయిన్ క్యారెక్టర్‌కు తీసుకున్నాం. మిగతా పాత్రల కోసం న్యూయార్క్‌లో బ్యాక్‌స్టేజ్ అనే పత్రికలో మూడు లైన్లలో కాస్టింగ్ కాల్ ఇచ్చాం. ఒకేరోజు ఐదు వందల మంది ఆర్టిస్టులు వచ్చారు. న్యూయార్క్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నవాళ్లను ఎక్కువగా తీసుకున్నాం. అమెరికన్స్ ఏ జాతివారినైనా చిన్నచూపు చూస్తారు కానీ, సినిమా డెరైక్టర్ ఏ జాతివాడైనా గౌరవిస్తారు.
 
  సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఎంత గౌరవప్రదమో అప్పుడే మొదటిసారిగా అర్థమైంది.
 నిజానికి ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ అంటే అర్థం కాని అమెరికన్స్ అని అర్థం. కానీ మేం షూటింగ్ చేసే పద్ధతి అర్థం కాక, అమెరికన్స్ మమ్మల్ని ‘ఇన్‌స్క్రూటబుల్ ఇండియన్స్’ అనేవాళ్లు. అమెరికన్స్ షూటింగ్ ఒక పద్ధతిలో జరుగుతుంది. మేం ఇరవై రెండో సీన్ తరువాత, ఏ నలభై మూడవ సీనో తీసేవాళ్లం. అలా డిజార్డర్‌గా తీసే మా పద్ధతి వాళ్లకు వింతగా అనిపించేది. ఒకపక్క అమెరికన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నా, మరోపక్క తమ దేశాన్ని కించపరిచే సినిమా తీస్తున్నారేమో అని లోలోపల సందేహపడేవాళ్లు. అందుకే ఎక్కడ షూట్ చేస్తే అక్కడ ప్రతి ఒక్కరికీ స్క్రిప్ట్ కాపీ ఇచ్చేవాళ్లం. దాంతో తీయబోయే సీన్‌మీద వాళ్లకు ముందుగానే అవగాహన ఉండేది. హార్ట్‌ఫోర్ట్ యూనివర్సిటీ, మౌంట్ హోలియోక్ ఫర్ ఉమెన్ యూనివర్సిటీల్లో ఎక్కువ షూట్ చేశాం. మిత్రుడు బాలు కాస్టింగ్, ప్రొడక్షన్‌లో హెల్ప్ చేశాడు.
 
 ఈ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా బాధపడే ఒక సంఘటన ఈ సందర్భంలో చెప్పి తీరాలి. ఒక ఇంట్లో షూటింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక మాట చెప్పింది. ‘మా అమ్మాయికి సినిమా అంటే పిచ్చి. వీలైతే మీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇవ్వండి. మా ఇంట్లో షూట్ చేస్తున్నారు కాబట్టి మొహమాటానికి అవకాశమిస్తానని చెప్పకండి. నిజంగా సాధ్యమైతేనే చూడండి’ అంది. మాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పి, ఆ అమ్మాయితో ఒక ఇంపార్టెంట్ సీన్ షూట్ చేశాం. ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది. అదే స్ఫూర్తితో న్యూయార్క్ ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్ కోర్స్‌లో చేరింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో లెంగ్త్ పెరగడంతో ఆ అమ్మాయి నటించిన సీన్‌ను ఎడిట్ చేశాం. దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.  విడుదల హడావిడిలో ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను.
 
 ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ అమెరికా కంటే ముందు ఇండియాలో రిలీజ్ చేశాం. ఫస్ట్ షోకు నేను సంగీత్ థియేటర్‌కు వెళ్లాను. ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు, నా ముందు అమెరికా అమ్మాయి సోదరుడు, అతని ఫ్రెండ్ కూర్చుని ఉండటం గమనించాను. తన చెల్లెలు నటించిన సీన్ చూడటం కోసం అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాడని అర్థమైంది. సినిమా నడుస్తున్నంతసేపూ పక్కన ఫ్రెండ్ ‘మీ చెల్లి ఎక్కడ’ అని అతన్ని అడగడం, నెక్స్ట్ సీన్‌లో ఉంటుందని అతను చెప్పడం, చివరకు ఆ అమ్మాయి నటించిన సీన్ లేకపోవడంతో ఇద్దరూ డిజప్పాయింట్ అవడం చూసి, వాళ్లకు కనిపించకుండా నేను తల తిప్పుకున్నాను.
 
 నన్ను అమెరికాలో ఆదరించిన కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించాల్సిన నేను, చిన్న పొరపాటు కారణంగా తప్పుకుని తిరగాల్సి వచ్చింది. వెంటనే అమెరికాకు ఫోన్‌చేసి అక్కడ ఆ అమ్మాయి నటించిన సీన్‌ను యాడ్‌చేసి ఫిలిం ఆ అమ్మాయికి పంపమని చెప్పాను. అది ఆ అమ్మాయికి చేరిందో లేదో నాకు తెలియదు. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా గిల్టీ ఫీలవుతుంటాను. ఆ అనుభవంతో తరువాత నా సినిమాల్లో తీసిన ఏ సీన్‌నూ ఎడిట్ చేయలేదు. అది నా మొదటి సినిమా నేర్పిన విలువైన పాఠం.
 
 సినిమాను చాలా ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపించాం. లండన్ ఫిలిం ఫెస్టివల్‌లో దేశదేశాల ఫిలిం మేకర్స్ చూశారు. సినిమా పూర్తయ్యాక, నన్ను స్టేజ్ మీదకు పిలిచి ఫోకస్ లైట్ వేశారు. అంతమంది ముందు నిలబడేసరికి భావోద్వేగానికి లోనయ్యాను. ఒకరు ‘ఆ నవలను సినిమాగా ఎందుకు తీయాలనుకున్నా’రని అడిగారు. నవల చదువుతున్నప్పుడు దాన్నొక కమర్షియల్ సినిమాలా చూశానని చెప్పాను. చాలా నిజాయితీగా చెప్పావని ప్రశంసించారు.  మన దగ్గర ప్రధాన నగరాల్లో దాదాపు ఏడెనిమిది వారాలు నడిచింది. నా మీద నమ్మకం ఉంచిన నా నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిర్మాతగా నా మొదటి సినిమా ‘నిరంతరం’, దర్శకుడిగా మొదటిది ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’. తెలుగులో దర్శకునిగా మొదటి చిత్రం ‘అప్పుడప్పుడు’. నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసిన మొదటి చిత్రం మాత్రం ‘ఆ నలుగురు’.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement