kalyani malik
-
అవార్డులపై నమ్మకం పోయింది : మ్యూజిక్ డైరెక్టర్
‘‘ఓ సినిమా సంగీతం విషయంలో అధిక భాగం దర్శకుల పాత్ర ఉంటుంది. దర్శకుడి అభిరుచిని బట్టే సినిమా, సంగీతం ఉంటాయి. నా సంగీతం బాగుందంటే అందులో ఎక్కువ క్రెడిట్ నా దర్శకులకే ఇస్తాను’’ అన్నారు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘2003లో నా తొలి సినిమా ‘ఐతే’ రిలీజైంది. ఈ 20 ఏళ్లలో ‘ఫలానా అబ్బాయి..’ నా 19వ సినిమా. సంవత్సరానికో సినిమా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంగీతానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాను. నా కెరీర్లో ‘ఫలానా అబ్బాయి..’ లోని ‘కనుల చాటు మేఘమా..’ ఉత్తమ పాట అని చెప్పగలను. ఈ పాటకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాను. కానీ జాతీయ అవార్డులు ఎవరికి ఇస్తారో, అవి ఎలా వస్తాయో ఈ మధ్య ఓ ఫ్రెండ్ చెప్పాడు. దాంతో అవార్డులపై నమ్మకం పోయింది. నాకిప్పటివరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’లోని ‘ఏం సందేహం లేదు..’ పాటని నేను, సునీత పాడాం. సునీతకు అవార్డు వచ్చింది కానీ నాకు రాలేదు. అప్పటి నుంచి అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశా. నా సినిమా, నా పాట నచ్చి ఎవరైనా నిర్మాత నాకు మరో చాన్స్ ఇస్తే అదే పెద్ద అవార్డుగా భావిస్తాను. మా అన్నయ్య (కీరవాణి) స్వరపరిచిన ‘నాటు నాటు..’ ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉంది. ఇక నేను సంగీతం అందించిన ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నా యి. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నా’’ అన్నారు. -
నేనెవరికీ పోటీ కాదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశా. సంగీత దర్శకుల్లో నేనెవరికీ పోటీ కాదు.. నాకెవ్వరూ పోటీ అనుకోను’’ అన్నారు కల్యాణీ మాలిక్. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ నెల 26న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ – ‘‘ఐతే’ తర్వాత 17 ఏళ్లకు చందూ (చంద్రశేఖర్ యేలేటి)తో ‘చెక్’ చేశా. సంగీత దర్శకుడిగా ‘ఐతే’ నా తొలి సినిమా. అప్పుడు పని పట్ల ఎలాంటి భయం–భక్తి, ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నానో... ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా కెరీర్లో హిట్, ఫ్లాప్‌లు ఉన్నాయి కానీ బ్లాక్‌బస్టర్ సినిమా లేదు. ‘చెక్’ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో ఒక పాటే ఉంది. నేపథ్య సంగీతం ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నేపథ్య సంగీతానికి 30 రోజులు పైనే పట్టింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్ ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్‌లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. బాబుకు మరో ఝలక్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే తనదైన స్టైల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. తొలి పాటలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతీల మధ్య ప్రేమాను రాగాలను చూపించిన వర్మ రెండో పాటలో ఎన్టీఆర్ పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించిందన్న విషయాలను టార్గెట్ చేశాడు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ప్రణయ గీతం) అవసరం అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్‌గా చూపించాడు. వెన్నుపోటు పొడిచిన బాబు, ఎన్టీఆర్ పోయాక దండవేసి దండం పెడుతున్నాడని చురకలంటించాడు. కల్యాణ్ మాళిక్ సంగీత సారధ్యంలో విల్సన్ హెరాల్డ్ ఆలపించిన ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించారు. ఈ పాటతో పాటు రేపు (మార్చి 8) సినిమాకు సంబంధించి రెండో థియేట్రికల్ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. (చదవండి : భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ) -
లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ పాట విడుదల
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ప్రణయ గీతం
ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న వర్మ, తాజాగా ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో తెరకెక్కించిన ప్రణయ గీతం వీడియోను రిలీజ్ చేశాడు. ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అంటూ సాగే ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించగా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీర్తి!
‘మహానటి’తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు కీర్తి సురేష్. ఈ మూవీ తరువాత ఇప్పటివరకు మరే తెలుగు ప్రాజెక్ట్‌ను కీర్తి సురేష్ ప్రకంటించలేదు. తమిళ్ డబ్బింగ్ సినిమాలైన సామి, పందెంకోడి2, సర్కార్ సినిమాలతోనే టాలీవుడ్‌ను పలకరించింది. అయితే తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను తెలుగులో చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్ కోనేరు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. -
మహేశ్... ఆ పేరులోనే ఓ మత్తు ఉంది!
అష్టా చమ్మా సినిమా వెనుక స్టోరీ- 9 ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి ఎంత టైమ్ పడుతుంది? ఈ ప్రశ్నకు జవాబు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతాడు. ఎందుకంటే ఇప్పుడతని దగ్గర ఓ విత్తనం రెడీగా ఉంది.అప్పుడు మోహనకృష్ణ విజయవాడ - ఆంధ్రా లయోలా కాలేజీలో బి.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్నాడు. రూమ్‌లో కన్నా లైబ్రరీలోనే ఎక్కువుంటున్నాడు. ఫిక్షన్ - నాన్ఫిక్షన్... ఏదీ వదలడం లేదు. ఏదో దాహం వేసినట్టుగా, ఆకలి వేసినట్టుగా ఇంగ్లిషు పుస్తకాలు నమిలి మింగేస్తున్నాడు. ‘‘ఒరేయ్ అబ్బాయ్! ఆస్కార్ వైల్డ్ రచనలు చదివావా? ముఖ్యంగా ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం చదివావా?’’ అడిగాడో ప్రొఫెసర్. ఆ మరుక్షణమే మోహనకృష్ణ చేతిలో ఆ నాటకం ప్రతి ఉంది. రాత్రంతా నిద్ర మానేసి మరీ చదివాడు. ఏవో ఊహలు... ఏవో కలలు... భలే ఉందే కాన్సెప్ట్. ఇలా మన తెలుగు సినిమాలు ఎందుకు రావు? మోహనకృష్ణ మనసులో విత్తనం పడింది. కెనడాలోని యార్క్ యూనివర్సిటీలో ఫిలిం అండ్ వీడియోలో రెండేళ్ల ఎమ్మెస్ పూర్తిచేసి, ఇండియా తిరిగొచ్చాడు మోహనకృష్ణ. ఇప్పుడేం చేయాలి? సినిమా తీయాలి. ఎవరిస్తారు ఆఫర్? రకరకాల ప్రయత్నాలు... ఆలోచనలు. రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదివే అలవాటు. బుక్ ర్యాక్‌లో చేయి పెడితే ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ తగిలింది. ఇంతకు ముందు చదివిన పుస్తకమే. మళ్లీ చదివాడు. పుస్తకమంతా పూర్తయ్యాక డైరీలో రాసుకున్నాడు. ‘‘ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలి’’ అనుకుంటూ వరుసగా పాయింట్స్ రాసుకున్నాడు. విత్తనం మొలకెత్తడం మొదలైంది. రాజా, భూమిక కాంబినేషన్లో ‘మాయాబజార్’ (2006) సినిమా. తొలి చిత్రం ‘గ్రహణం’ తర్వాత మోహనకృష్ణ రెండో ప్రయత్నం. ప్చ్... నిరాశపరిచింది. ఏంటి తన పరిస్థితి? ఏమీ అర్థం కావడం లేదు. అలాంటి టైమ్‌లో ఇంటికొచ్చాడు రామ్మోహన్. బిజినెస్ మేనేజ్మెంట్ చదివి, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ ముందు నుంచీ పరిచయం. ‘‘మనమో సినిమా చేద్దాం మోహన్! నేనే ప్రొడ్యూసర్ని’’ చెప్పాడు రామ్మోహన్. మోహనకృష్ణ మొహం వెలిగిపోయింది. ‘‘నా దగ్గర రెడీగా రెండు కథలున్నాయి. నీ ఇష్టం’’ చెప్పాడు మోహనకృష్ణ. ఓ కథ ఎంచుకున్నాడు రామ్మోహన్. ఆ కథకు బేస్... ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’. మొక్క మొలవడం మొదలైంది. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం ప్రపంచమంతా పాపులర్. ఇందులో హీరో పేరు జాక్. పల్లెటూరి మనిషి. లైఫ్ బోర్ కొట్టేసి అప్పుడప్పుడూ లండన్ వెళ్లి వస్తుంటాడు. అక్కడతని పేరు ఎర్నెస్ట్. గ్వెండోలిన్ అనే అమ్మాయికి ఎర్నెస్ట్ అనే పేరంటే పిచ్చి. అలా వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. జస్ట్... ఈ ఇతివృత్తాన్ని పట్టుకొని మోహనకృష్ణ కథ రెడీ చేశాడు. ఈ కథలో హీరోక్కూడా పల్లెటూరి జీవితమంటే మొహం మొత్తేసి హైదరాబాద్ వస్తాడు. పేరు రాంబాబు. యాక్... కొత్త పేరు కావాలి... అదిరిపోవాలి. మోహనకృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పుడే ‘పోకిరి’ సినిమా రిలీజైంది. అమ్మాయిలంతా మహేశ్బాబంటే పడిచచ్చిపోతున్నారు. ఎస్... పేరు దొరికేసింది. రాంబాబు కాస్తా మహేశ్ అని పేరు మార్చుకుంటాడు. లావణ్య దృష్టిలో మహేశ్ అనే పేరే ఓ మత్తుమందు. కథ రెడీ. హీరోయిన్ భూమిక కథ వింది. ‘‘ఇప్పుడు చేస్తున్న ‘అనసూయ’ సినిమా కంప్లీట్ కాగానే డేట్స్ నీకే’’ అని చెప్పేసింది ఇమ్మీడియట్‌గా. ఒక్కడు’లో మహేశ్, భూమిక కలిసి పనిచేశారు కదా! హిట్ కాంబినేషన్. అలాంటి భూమిక ఈ సినిమాలో మహేశ్ పేరు స్మరిస్తుంటే థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మోహనకృష్ణ ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు హీరో కావాలి. గోపీచంద్‌ను కలిశాడు... నో. దయకిరణ్ను కలిశాడు... నో. ఇద్దరిదీ ఒకే మాట. ‘‘కథ బాగుంది. కానీ మేము సూట్ కాము!’’అయ్యో... మరిప్పుడెలా? ‘సంపంగి’లో చేసిన హీరో దీపక్ లైన్లోకొచ్చాడు. అతను చేయడానికి రెడీ. వీళ్లకే సంశయం. ఈ సినిమాలో సెకండ్ పెయిర్ కావాలి. కథలోని పాత్రలు ఆనంద్... వరలక్ష్మి... ఎక్కడున్నారమ్మా మీరు? వరలక్ష్మి చాలా ఈజీగా దొరికేసింది. ‘కలర్స్’ స్వాతి. ‘మా’ టీవీలో ‘కలర్స్’ ప్రోగ్రామ్‌తో పాపులరైపోయి, కృష్ణవంశీ డెరైక్షన్‌లో ‘డేంజర్’ సినిమా చేసింది. లేటెస్ట్గా వెంకటేశ్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో యాక్ట్ చేసింది. పల్లెటూరి పిల్ల పాత్రకు స్వాతి చాలా బాగుంటుంది. ఫిక్స్. ఆనంద్ పాత్రకు కొత్త కుర్రాడు కావాలి. అడిగినవారికీ అడగనివారికీ ఇదే చెబుతున్నారు. ఆ రోజు రామ్మోహన్ ఆఫీసుకి నందినీరెడ్డి వచ్చింది. రమ్యకృష్ణ తో ‘జర మస్తీ... జరధూమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ చేస్తోంది తను. ‘‘నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు. బాపు, కె.రాఘవేంద్ర రావుల దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాడు. మా ప్రోమోలో కూడా యాక్ట్ చేశాడు’’ అని ప్రోమో చూపించిందామె. ఆ అబ్బాయే నాని. అందరికీ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్ కల్యాణీమాలిక్. కెమెరామ్యాన్ పీజీ విందా... ఇలా టీమ్ అంతా రెడీ. ఇక్కడ స్క్రిప్టేమో 245 పేజీలై కూర్చుంది. బాగా తగ్గించాలి. రాత్రింబవళ్లు కుస్తీ పడి ఓ 60 పేజీలు తగ్గించారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి. షాకింగ్ న్యూస్. భూమిక సినిమా చేయలేని పరిస్థితి. ఆమెకు భరత్ ఠాకూర్‌తో పెళ్లి కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అర్జెంట్‌గా హీరో హీరోయిన్లు కావాలి. కథ మొదటి కొచ్చింది. మోహనకృష్ణ తలపట్టు కున్నాడు. ‘‘ఓ పని చేద్దామా? సెకండ్ పెయిర్‌గా తీసుకున్న నాని, స్వాతి జంటనే మెయిన్ లీడ్ చేద్దామా?’’... రామ్మోహన్ సలహా. నాని, స్వాతిల టైమ్ బాగుంది. మెయిన్ లీడ్‌గా ప్రమోషన్. మరి సెకండ్ పెయిర్? సెర్చింగ్ స్టార్ట్. వందల ఫొటోలొస్తున్నాయి. ఒక్కడూ తగలడే! ఫారిన్ నుంచి ఒకతను టచ్‌లో కొచ్చాడు. అవసరాల శ్రీనివాస్. తెలుగు కుర్రాడే. ఫొటోలు పంపించాడు కానీ, మోహనకృష్ణకు నచ్చలేదు. కానీ అతను పట్టువదలని విక్రమార్కుడిలాగా వీడియో పంపించాడు. మనిషి చాలా ఎత్తుగా, తమాషాగా ఉన్నాడు. ఆనంద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ ఓకే. మోహనకృష్ణ ఇంట్లోవాళ్లందరికీ స్క్రిప్టు తెలుసు. వరలక్ష్మి పాత్ర కోసం తెగ వెతుకుతున్నారనీ తెలుసు. ‘‘‘అమృతం’ టీవీ సీరియల్లో భార్గవి అనే అమ్మాయి చేస్తోంది. ఒకసారి చూడరాదూ!’’... మోహనకృష్ణకు అత్తగారి సలహా. భార్గవికి కబురెళ్లింది. లంగా ఓణీలో ఆఫీసుకు రమ్మన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మోహనకృష్ణ, పీజీ విందా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. గజ్జెల చప్పుడు. ఎవరో అమ్మాయి పైకి వస్తోంది. ‘‘అచ్చం మన వరలక్ష్మిలా లేదూ’’ అనేశాడు పీజీ విందా. ఆ వచ్చింది ఎవరో కాదు... భార్గవి. మేకప్ టెస్ట్ చేయకుండానే వరలక్ష్మి పాత్రకు భార్గవి ఖరారైంది. ‘హలో హలో ఓ అబ్బాయి’ ...ఇది వర్కింగ్ టైటిల్. ఇంకా అట్రాక్టివ్ టైటిల్ కావాలి. ‘‘ ‘కథ కంచికి...’ ఈ టైటిల్ ఎలా ఉంది?’’ అడిగాడు కల్యాణీమాలిక్. ‘‘ఏం బాలేదు’’ మొహం మీదే చెప్పేశాడు మోహనకృష్ణ. ‘‘మరి... ‘అష్టా చమ్మా’?’’ మళ్లీ చెప్పాడు కల్యాణీమాలిక్. ‘‘అరె... భలే ఉందే’’ అందరికీ నచ్చేసింది. హైదరాబాద్... అమలాపురం... గూడాల... బొప్పాయిలంక... ఇవే లొకేషన్లు. టాకీ పార్ట్‌కి 29 రోజులు. పాటలకు 14 రోజులు. కోటీ 60 లక్షల బడ్జెట్. ఫస్ట్ కాపీ వచ్చి రెండు నెలలైపోయింది. నిర్మాత రామ్మోహన్‌లో మాత్రం నో టెన్షన్. ఇలాంటి చిన్న సినిమాకు మంచి టైమ్ దొరకాలి. దొరికేసింది. 2008 సెప్టెంబర్ 5... డేట్ అనౌన్స్ చేసేశారు. రామ్మోహన్కో ఐడియా వచ్చింది. రిలీజ్‌కు వారం ముందే వైజాగ్, విజయవాడల్లో పబ్లిక్ ప్రీమియర్ షో వేస్తే...!? చాలా రిస్కు... ఏ మాత్రం అటూ ఇటూ అయినా మొదటికే మోసం. అయినా రామ్మోహన్ డేర్ చేశారు. వైజాగ్ ప్రీమియర్ సూపర్‌హిట్. విజయవాడ ప్రీమియర్ సూపర్ డూపర్ హిట్. ఫలితం తేలిపోయింది. రిలీజ్ రోజు కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తుంటే ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దగ్గర మోహనకృష్ణకు ఫోన్ వచ్చింది. ‘‘కంగ్రాట్స్ అండీ! ఇప్పుడే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. చాలా ఫ్రెష్‌గా ఉంది. మా అందరికీ నచ్చింది’’... ఆ ఫోన్ డెరైక్టర్ రాజమౌళిది. ఇక ఆ తర్వాత మోహనకృష్ణకు వరుసపెట్టి ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు వస్తూనే ఉన్నాయి. ‘అష్టా చమ్మా’ స్వీక్వెల్ చేయొచ్చుగా?... మోహనకృష్ణను అందరూ తరచుగా అడిగే ప్రశ్న. ఆయనలోనూ విత్తనం పడింది. ఎప్పుడు మొలకెత్తుతుందో వెయిట్ చేయాల్సిందే. వెరీ ఇంట్రస్టింగ్... తొలుత అనుకున్న స్క్రిప్టులో ఝాన్సీ పోషించిన ‘మందిరా దేవి’ పాత్రకు ఓ లవ్ ట్రాక్ ఉంటుంది. లావణ్యను ఇష్టపడే ఓ కుర్రాడు, పేరు లేకుండా ఉత్తరాలు రాస్తుంటాడు. అది తనకే అనుకుని మందిర భ్రమించి, తను కూడా రిప్లై ఇస్తుంటుంది. మెయిన్ స్టోరీకి ఈ ట్రాక్ అడ్డుగా ఉంటుందని భావించి స్క్రిప్టు దశలోనే ఎడిట్ చేసేశారు. ఈ సినిమా అంతా ‘మహేశ్’ పేరు చుట్టూనే తిరుగుతుంది. అందుకే చిత్రీకరణ కంటే ముందే హీరో మహేశ్‌బాబును కలిసి అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఈ సినిమాపై కేస్ స్టడీ నిర్వహించారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో కొత్త పోకడలు పోవడం, నిర్మాత వ్యయ నియంత్రణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం... తదితర కారణాల రీత్యా ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. - పులగం చిన్నారాయణ -
రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదొక్కటే: కీరవాణి
సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి సొంత అన్నదమ్ముల పిల్లలు. కానీ ఇద్దరూ అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా కనిపిస్తారు. కీరవాణి అంటే రాజమౌళికి విపరీతమైన రెస్పెక్ట్. రాజమౌళి అంటే కీరవాణికి ఓ ప్రత్యేకమైన అభిమానం. రాజమౌళి సినిమాలకు కీరవాణి సంగీతం వెన్నెముక అంటే అతిశయోక్తి కాదు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ సూపర్‌హిట్టే. నేడు రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఓ పది విషయాలు చెప్పమంటే... కీరవాణి ఇలా చెప్పుకొచ్చారు. ► మాది ఉమ్మడి కుటుంబం. నా తమ్ముడు కల్యాణి మాలిక్, రాజమౌళిది దాదాపు ఒకే వయసు. అందుకని వాళ్లిద్దరూ కలిసి పెరిగారు. రాజమౌళి చిన్నప్పటి విషయాలు ఎక్కువగా కల్యాణి మాలిక్‌కే తెలుస్తాయి. ► నాకు, రాజమౌళికి పన్నెండేళ్ల వయసు వ్యత్యాసం. కలిసి పెరిగాం అంటే.. పెరిగాం. పెరగలేదు అంటే పెరగలేదు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తను ఫస్ట్ స్టాండర్డ్‌లో చేరాడు. నేను తిరిగిన వ్యక్తులు వేరు. తన స్నేహితులు వేరు. ► రాజమౌళిని ఇంట్లో అందరం నంది అని పిలుస్తాం. అలా ఎందుకు పిలుస్తాం అని మా పెద్దవాళ్లని నేనెప్పుడూ అడగలేదు. ఆ పేరు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నన్ను మాత్రం తను పెద్దన్నా అని పిలుస్తాడు. ► చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగాం కాబట్టి, నా కుటుంబ సభ్యులు పైకొచ్చినప్పుడు నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. అలా రాజమౌళి పైకొచ్చినప్పుడు నాకేం ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే, కలిసి పెరిగినవాళ్ల కాబట్టి, ప్రతిభ ఉన్న విషయం తెలుస్తుంది కదా. ‘సింహాద్రి’ సినిమా అప్పుడు నాకు రాజమౌళిలో మంచి దర్శకుడు ఉన్నాడనిపించిం. ► రాజమౌళికి తను చేసే పని పట్ల శ్రద్ధ, భక్తి ఎక్కువ. అలా చేసేవాళ్లు ఎప్పటికైనా పైకొస్తారు. అందుకని రాజమౌళి పైకొస్తాడనే నమ్మకం ఉండేది. ► రాజమౌళిలో నాకు నచ్చిన విషయం కఠోర పరిశ్రమ. నచ్చని విషయం గడ్డం పెంచడం. ఆ విషయం తనతో అప్పుడప్పుడు చెబుతుంటాను. కానీ, తియ్యడు. నాకూ గడ్డం ఉంటుంది. కానీ, ఎదుటివాళ్లు మాత్రం పోలీస్‌శాఖకు సంబంధించినవాళ్లలా క్లీన్ షేవ్ చేసుకుని కనిపిస్తే నాకు నచ్చుతుంది. ► ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే ధైర్యం రాజమౌళికి ఉంది. ► అందరు సంగీతదర్శకులు తనకిష్టమే. కానీ, నేను బెస్ట్ ఇస్తాననే నమ్మకంతో నాతో చేస్తాడు. అన్నయ్య అనే భక్తి భావంతో నాతో పాటలు చేయించుకోవడంలేదు. ఎప్పుడైతే నేను వర్క్ చేయలేనో, అప్పుడు నాతో చేయడం కూడా మానేస్తాడు. దేని దారి దానిదే. ► సినిమా వరకూ మేం అన్నదమ్ములం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాం. తనక్కావల్సినది నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. నాకేదైనా కరెక్ట్ అనిపిస్తే నేనూ అంతే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. ► ప్రతి పుట్టినరోజునాడు తప్పనిసరిగా కలిసి స్పెండ్ చేస్తాం. గత ఏడాది ‘బాహుబలి’ షూటింగ్ లొకేషన్లో ఉన్నాం. ఈ ఏడాది కూడా అంతే. - డి.జి. భవాని -
తొలియత్నం: లెక్కలేసుకోకుండా తీసిన సినిమా!
ఐతే... డెరైక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మొదటి సినిమా. సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌కి మొదటి సినిమా. ఆర్డ్ డెరైక్టర్ రవిందర్కి మొదటి సినిమా. మ్యూజిక్ డెరైక్టర్ కళ్యాణి మాలిక్‌కి మొదటి సినిమా. ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అనే ఆవేశంలో లాభ నష్టాల బేరీజు లేకుండా, కసితో ముందడుగు వేసిన మొండితనపు కుర్రాళ్ల కల ఇది. రిలీజ్ తరువాత మళ్లీ ‘ఐతే ఏంటి’ అనే పరిస్థితి రాలేదు. టెక్నీషియన్స్‌ను ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసి, ఇండిపెండెంట్ సినిమాకు ఇమేజ్ తెచ్చిన సినిమా అది. ఆ చిత్రం తీసే క్రమంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎదుర్కొన్న అనుభవాలు... ఆయన మాటల్లోనే. మామూలుగా టైస్టుల మీద భారీ ప్రైజ్‌లు ప్రకటిస్తుంటారు. వాళ్లను ప్రభుత్వానికి పట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టిన కథే ‘ఐతే’.నేను ‘అమృతం’ సీరియల్‌కు మొదట్లో డెరైక్టర్‌గా పనిచేశాను. దానికి సెంథిల్ కెమెరామెన్. సర్వేష్ మురారి అసిస్టెంట్ కెమెరామెన్. రవీందర్ ఆర్ట్ డెరైక్టర్. కళ్యాణిమాలిక్ మ్యూజిక్ డెరైక్టర్. అంతా కుర్రాళ్లం కాబట్టి, ఇంకా ఏదో చేయాలన్న కసితో ఉండేవాళ్లం. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ గురించి ఆలోచిస్తూ, ఒక లో-బడ్జెట్ సినిమా చేద్దామనుకున్నాం. అది వర్కవుట్ అవుతుందా లేదా, ఎవరైనా తీసుకుంటారా లేదా... ఏదీ ఆలోచించనీయని యవ్వనావేశం! మొదట ఒక మాఫియా డాన్ చుట్టూ కథ అల్లుకున్నాను. డాన్ చుట్టూతా మీకు తెలిసిన కథలు చెప్పండి, అవి కాకుండా నా దగ్గర ఉన్నది కొత్తది అయితేనే ముందుకు వెళదాం అన్నాను. వాళ్లు చాలా చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్ చెప్పేసరికి ఇదేదో కొత్తగా ఉందని అందరూ ఎక్జయిట్ అయ్యారు. తరువాత ‘అమృతం’ నిర్మాత గుణ్ణం గంగరాజుగారికి లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి సినిమా తీద్దాం, మొదట నువ్వేమనుకుంటున్నావో పూర్తిగా పేపర్ మీద రాసివ్వు అన్నారు. కథ చెప్పడం చాలా ఈజీ, రాయడం చాలా కష్టం. మొదటి మూడు రోజులూ బుర్ర వేడెక్కిపోయింది. మేం నలుగురం కలిసి డిస్కస్ చేసేవాళ్లం. ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు జీవీకే వన్ ఉన్న దగ్గర అప్పుడు చైనీస్ బళ్లు ఉండేవి. అక్కడ గోడ మీద కూర్చుని గంటల తరబడి డిస్కస్ చేసుకుని, అక్కడే తినేసి రూమ్‌కు వెళ్లిపోయేవాళ్లం. రాయడం మొదలుపెట్టాక క్లారిటీ వచ్చింది. మొదట అనుకున్న ప్రకారం మినిస్టర్ కిడ్నాప్‌కి ప్లాన్ చేసి చివరకు తానే కిడ్నాప్ అవుతాడు డాన్. దీన్ని గంగరాజుగారు ఫ్లైట్ హైజాక్, కిడ్నాప్ కింద మార్చారు. అలా ప్రతి దశలోనూ ఆయన చాలా హెల్పయ్యారు. కొత్తవాళ్లతో కదా, మార్కెట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఆయన మమ్మల్ని ఉత్సాహపరిచారు. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చాక, లొకేషన్స్ కోసం వెదుకులాట మొదలైంది. తలకోనతో పాటు చాలా అడవులు చూశాం. రెండు నెలల అన్వేషణ తరువాత వికారాబాద్ ఫారెస్ట్‌ను సెలక్ట్ చేసుకున్నాం. తరువాత సాంకేతిక అంశాల మీద దృష్టి పెట్టాం. కథ యువకుల జీవన పోరాటానికి సంబంధించి కాబట్టి, నేను, సెంథిల్... లైటింగ్, కాస్ట్యూమ్స్, కలర్స్ గురించి డిస్కస్ చేశాం. అమెరికన్ బ్లాక్ బుక్‌లో ఫొటోస్ రిఫరెన్స్ తీసుకుని కలర్ స్కీమ్ డిజైన్ చేసుకున్నాం. మరోవైపు ఆర్టిస్టుల ఎంపిక కీలకంగా మారింది. ఇందులో హీరో ఉండడు. నలుగురు కుర్రాళ్లు, వీళ్ల ఫ్రెండ్ ఒకమ్మాయి, డాన్, డాన్ అసిస్టెంట్... మొత్తం ఏడుగురు మెయిన్ క్యారెక్టర్స్. కొత్తవాళ్లు కావాలని ప్రకటన ఇస్తే, చాలా ఫొటోలు వచ్చాయి. షార్ట్ లిస్ట్ చేసి అభిషేక్, జనార్థన్, శశాంక్లను తీసుకున్నాం. మెయిన్ క్యారెక్టర్‌కు ఎవరూ దొరకక మొహితా చద్దాను బాంబే నుంచి తీసుకున్నాం. డాన్ క్యారెక్టర్‌కు పవన్ మల్హోత్రాతో పాటు మరొకరిని చూడటానికి నేను, గంగరాజుగారు బాంబే వెళ్లాం. వీడియో క్లిప్స్‌లో భయంకరంగా కనిపించిన పవన్, డెరైక్ట్‌గా చూస్తే చాలా చిన్నగా కనిపించాడు. అతడు పనికొస్తాడో లేదోనని నేను సందేహం వ్యక్తం చేశాను. ఆయన పవన్‌తో నా అభిప్రాయం చెప్పారు. పవన్ డాన్ గెటప్‌లో మేం ఉంటున్న హోటల్‌కు వచ్చేశారు. అంత కేర్ తీసుకుని, అంత ఇన్వాల్వ్ అయి ఆ గెటప్‌లో రావడం చూసి ఇంప్రెస్ అయిపోయాను. సింధు తులానీని చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించింది. మరో ఆలోచన లేకుండా సెలక్ట్ చేసేశాం. షూటింగ్ మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి మొదలుపెట్టాం. రోజూ సెట్లోకి రాగానే ఆ రోజు ఎన్ని క్లోజ్‌లు, ఎన్ని మిడ్‌లు, ఎన్ని వైడ్లు అని పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ సినిమాలో ఓ కీలకమైన విషయం గురించి మేం పడ్డ ఇబ్బందులు చెప్పాలి. బాంబే ఎయిర్‌పోర్ట్‌లో డాన్మీద అటాక్ జరిగే యాక్షన్ సీన్ ప్లాన్ చేశాం. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని లోకల్ ఫైట్మాస్టర్ను పెట్టుకున్నాం. అతను తన పాత పద్ధతిలో షాట్స్ కంపోజ్ చేశాడు. మాకది నచ్చలేదు. పర్మిషన్ ఉన్నది ఒక్క రాత్రికే. దాంతో రెండు మూడు షాట్స్ తీసిన తరువాత అతన్ని పక్కన పెట్టి మేమే తీయడం మొదలుపెట్టాం. అనుకున్నట్టు వచ్చింది. షూటౌట్ అయిన తరువాత డాన్ తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కెమెరా కాళ్ల నుంచి ఫేస్ దగ్గరకు క్రాస్‌గా ట్రావెల్ చేయాలి. క్రేన్, ట్రాలీ ఫేస్ దగ్గరికి క్రాసింగ్‌గా ఒకే లెవెల్లో వెళ్లాలి. ఆ ఇరుకు ప్లేస్‌లో ఇది కొంచెం కష్టమైన షాట్. ఐదారుసార్లు తీసినా జర్క్ వచ్చేసింది. నేను ఓకే చెప్పేశా. ఎడిటింగ్‌లో గన్ సౌండ్స్ యాడ్ చేశాను. జరిగిన అటాక్‌ను విలన్ గుర్తు తెచ్చుకుంటున్నట్టు జర్క్ దగ్గర తుపాకీ చప్పుళ్ల సౌండ్ సింక్ అయింది. మరో సీన్లో డాన్‌ను కిడ్నాప్ చేసిన తరువాత కుర్రాళ్లు చీర్స్ చెప్పుకుంటుంటారు. అప్పుడు త్రీ యాక్సిస్ రొటేషన్ టెక్నాలజీ లేకపోయినా షాట్లో అదే ఎఫెక్ట్ తీసుకొచ్చాడు సెంథిల్. అలాగే మొదటినుంచీ ఒక సాంగ్ పెడదామనుకున్నాం. దానికి కళ్యాణిమాలిక్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడు. విన్న వెంటనే ఓకే చేసేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. డ్యాన్స్‌మాస్టర్ నిక్సన్ ఆధ్వర్యంలో సాంగ్ పిక్చరైజేషన్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఇక క్లైమాక్స్ సీన్లో బాంబ్ బ్లాస్ట్‌కు కార్ డిక్కీ లేచి పడాలి. స్పెషల్ ఎఫెక్స్ట్ వాళ్లు కాలిక్యులేట్ చేసి డిక్కీ ఆరు ఫీట్లు ఎగురుతుందని చెప్పారు. కానీ షూట్ చేసేటప్పుడు బాంబు ధాటికి డిక్కీ పైకి లేచి, ఎలక్ట్రిక్ పోల్కి తగిలి సర్క్యూట్ సంభవించింది. దాంతో రెండు గంటలపాటు వికారాబాద్‌కు కరెంట్ సప్లై నిలిచిపోయింది. అది పొరబాటున యూనిట్ వైపు పడి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. మా ప్రొడక్షన్‌వాళ్లు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సమస్యను పరిష్కరించారు. అంతేకాక, వర్షం వల్ల వరుసగా రెండు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కొంచెం టెన్షన్ పడినా, మొత్తానికి 63 రోజుల్లో పూర్తి చేశాం. అది కూడా ద్విభాషా చిత్రం కాబట్టి. పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్‌కు మాత్రం టైమ్ పట్టింది. వాయిస్‌లు నేచురల్‌గా ఉండాలి కాబట్టి డబ్బింగ్ ఎక్కువ సమయం తీసుకుంది. న్యాచురల్ ఫిలింస్‌కు అప్పట్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సినిమా పూర్తయిన మూడు నెలలకు కూడా విడుదల కాలేదు. కొంతమంది బాలేదన్నారు కూడా. మరీ అంత దారుణంగా తీశామా అనుకున్నాం. ఆ టైమ్‌లో మా ప్రొడ్యూసర్ మాకు చాలా ధైర్యాన్నిచ్చారు. రామ్‌గోపాల్‌వర్మని సినిమా చూడమంటే చూడనన్నారు. బాగుంటే ఓకే, బాగోలేకపోతే నేనే కామెంట్ చేస్తే అది మీకే నష్టం అన్నారు. ఫర్వాలేదని బీటా ప్రొజెక్షన్లో చూపించాం. ఆయనకు విపరీతంగా నచ్చింది. మా యూనిట్ నుండి కాకుండా బయటివాళ్ల నుంచి వచ్చిన మొదటి పాజిటివ్ కాంప్లిమెంట్ అదే. తరువాత రామానాయుడు స్టూడియోకు డీటీఎస్ మిక్సింగ్‌కు పంపించాం. ఆడియోగ్రాఫర్ మధుసూదన్‌రెడ్డి ఇంటర్వెల్ వరకు చూసి అద్భుతంగా ఉందన్నారు. సినిమా విడుదలయ్యాక, లైట్‌బాయ్స్ ఒక విషయం చెప్పారు. షూటింగ్లో మా తపన చూసి కుర్రాళ్లు ఏదో కష్టపడుతున్నారు, అసలు సినిమా ఏమైనా నడుస్తుందా అనుకున్నారట. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని వాళ్లు అస్సలు అనుకోలేదట. స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్‌ప్రొడక్షన్ వరకు ప్రతి దశలో అందరం ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టే అంత పెద్ద సక్సెస్ వచ్చిందనుకుంటాను. కెమెరా, కలర్స్, లైటింగ్ విషయాల్లో ప్రయోగాలు చేసి సినిమాను వాస్తవికతకు దగ్గరగా ఉండేట్టు తీశాం. ఈ సినిమాకు అసలు బలం స్క్రీన్‌ప్లే. అందుకు నామీద సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ల ప్రభావం ఉండటం కారణం కావచ్చు. గంగరాజుగారి డైలాగ్స్ సూపర్బ్‌గా హెల్పయ్యాయి. ఎడిటర్ సుధాకర్ కూడా ప్లస్సయ్యారు. సినిమాను ఫాస్ట్ పేస్డ్ నేరేషన్లో నడిపాడు. హిందీలో ‘పచాస్లాక్’ అనే పేరు పెట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మేశాం. తెలుగులో విడుదలైన రెండు మూడేళ్లకు వాళ్లు హిందీలో రిలీజ్ చేశారు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి