మహేశ్... ఆ పేరులోనే ఓ మత్తు ఉంది!
అష్టా చమ్మా
సినిమా వెనుక స్టోరీ- 9
ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి ఎంత టైమ్ పడుతుంది? ఈ ప్రశ్నకు జవాబు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతాడు. ఎందుకంటే ఇప్పుడతని దగ్గర ఓ విత్తనం రెడీగా ఉంది.అప్పుడు మోహనకృష్ణ విజయవాడ - ఆంధ్రా లయోలా కాలేజీలో బి.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్నాడు. రూమ్‌లో కన్నా లైబ్రరీలోనే ఎక్కువుంటున్నాడు. ఫిక్షన్ - నాన్‌ఫిక్షన్... ఏదీ వదలడం లేదు. ఏదో దాహం వేసినట్టుగా, ఆకలి వేసినట్టుగా ఇంగ్లిషు పుస్తకాలు నమిలి మింగేస్తున్నాడు.
‘‘ఒరేయ్ అబ్బాయ్! ఆస్కార్ వైల్డ్ రచనలు చదివావా? ముఖ్యంగా ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం చదివావా?’’ అడిగాడో ప్రొఫెసర్. ఆ మరుక్షణమే మోహనకృష్ణ చేతిలో ఆ నాటకం ప్రతి ఉంది. రాత్రంతా నిద్ర మానేసి మరీ చదివాడు. ఏవో ఊహలు... ఏవో కలలు... భలే ఉందే కాన్సెప్ట్. ఇలా మన తెలుగు సినిమాలు ఎందుకు రావు? మోహనకృష్ణ మనసులో విత్తనం పడింది.
కెనడాలోని యార్క్ యూనివర్సిటీలో ఫిలిం అండ్ వీడియోలో రెండేళ్ల ఎమ్మెస్ పూర్తిచేసి, ఇండియా తిరిగొచ్చాడు మోహనకృష్ణ. ఇప్పుడేం చేయాలి? సినిమా తీయాలి. ఎవరిస్తారు ఆఫర్? రకరకాల ప్రయత్నాలు... ఆలోచనలు. రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదివే అలవాటు. బుక్ ర్యాక్‌లో చేయి పెడితే ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ తగిలింది. ఇంతకు ముందు చదివిన పుస్తకమే. మళ్లీ చదివాడు. పుస్తకమంతా పూర్తయ్యాక డైరీలో రాసుకున్నాడు. ‘‘ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలి’’ అనుకుంటూ వరుసగా పాయింట్స్ రాసుకున్నాడు. విత్తనం మొలకెత్తడం మొదలైంది.
రాజా, భూమిక కాంబినేషన్‌లో ‘మాయాబజార్’ (2006) సినిమా. తొలి చిత్రం ‘గ్రహణం’ తర్వాత మోహనకృష్ణ రెండో ప్రయత్నం. ప్చ్... నిరాశపరిచింది. ఏంటి తన పరిస్థితి? ఏమీ అర్థం కావడం లేదు. అలాంటి టైమ్‌లో ఇంటికొచ్చాడు రామ్‌మోహన్. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ ముందు నుంచీ పరిచయం. ‘‘మనమో సినిమా చేద్దాం మోహన్! నేనే ప్రొడ్యూసర్‌ని’’ చెప్పాడు రామ్‌మోహన్. మోహనకృష్ణ మొహం వెలిగిపోయింది. ‘‘నా దగ్గర రెడీగా రెండు కథలున్నాయి. నీ ఇష్టం’’ చెప్పాడు మోహనకృష్ణ. ఓ కథ ఎంచుకున్నాడు రామ్‌మోహన్. ఆ కథకు బేస్... ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’. మొక్క మొలవడం మొదలైంది.
‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం ప్రపంచమంతా పాపులర్. ఇందులో హీరో పేరు జాక్. పల్లెటూరి మనిషి. లైఫ్ బోర్ కొట్టేసి అప్పుడప్పుడూ లండన్ వెళ్లి వస్తుంటాడు. అక్కడతని పేరు ఎర్నెస్ట్. గ్వెండోలిన్ అనే అమ్మాయికి ఎర్నెస్ట్ అనే పేరంటే పిచ్చి. అలా వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. జస్ట్... ఈ ఇతివృత్తాన్ని పట్టుకొని మోహనకృష్ణ కథ రెడీ చేశాడు. ఈ కథలో హీరోక్కూడా పల్లెటూరి జీవితమంటే మొహం మొత్తేసి హైదరాబాద్ వస్తాడు. పేరు రాంబాబు. యాక్... కొత్త పేరు కావాలి... అదిరిపోవాలి. మోహనకృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పుడే ‘పోకిరి’ సినిమా రిలీజైంది. అమ్మాయిలంతా మహేశ్‌బాబంటే పడిచచ్చిపోతున్నారు. ఎస్... పేరు దొరికేసింది. రాంబాబు కాస్తా మహేశ్ అని పేరు మార్చుకుంటాడు. లావణ్య దృష్టిలో మహేశ్ అనే పేరే ఓ మత్తుమందు. కథ రెడీ.
హీరోయిన్ భూమిక కథ వింది. ‘‘ఇప్పుడు చేస్తున్న ‘అనసూయ’ సినిమా కంప్లీట్ కాగానే డేట్స్ నీకే’’ అని చెప్పేసింది ఇమ్మీడియట్‌గా. ఒక్కడు’లో మహేశ్, భూమిక కలిసి పనిచేశారు కదా! హిట్ కాంబినేషన్. అలాంటి భూమిక ఈ సినిమాలో మహేశ్ పేరు స్మరిస్తుంటే థియేటర్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మోహనకృష్ణ ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు హీరో కావాలి. గోపీచంద్‌ను కలిశాడు... నో. దయకిరణ్‌ను కలిశాడు... నో. ఇద్దరిదీ ఒకే మాట. ‘‘కథ బాగుంది. కానీ మేము సూట్ కాము!’’అయ్యో... మరిప్పుడెలా? ‘సంపంగి’లో చేసిన హీరో దీపక్ లైన్‌లోకొచ్చాడు. అతను చేయడానికి రెడీ. వీళ్లకే సంశయం.
ఈ సినిమాలో సెకండ్ పెయిర్ కావాలి. కథలోని పాత్రలు ఆనంద్... వరలక్ష్మి... ఎక్కడున్నారమ్మా మీరు?
వరలక్ష్మి చాలా ఈజీగా దొరికేసింది. ‘కలర్స్’ స్వాతి. ‘మా’ టీవీలో ‘కలర్స్’ ప్రోగ్రామ్‌తో పాపులరైపోయి, కృష్ణవంశీ డెరైక్షన్‌లో ‘డేంజర్’ సినిమా చేసింది. లేటెస్ట్‌గా వెంకటేశ్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో యాక్ట్ చేసింది. పల్లెటూరి పిల్ల పాత్రకు స్వాతి చాలా బాగుంటుంది. ఫిక్స్.
ఆనంద్ పాత్రకు కొత్త కుర్రాడు కావాలి. అడిగినవారికీ అడగనివారికీ ఇదే చెబుతున్నారు. ఆ రోజు రామ్‌మోహన్ ఆఫీసుకి నందినీరెడ్డి వచ్చింది. రమ్యకృష్ణ తో ‘జర మస్తీ... జరధూమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ చేస్తోంది తను. ‘‘నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు. బాపు, కె.రాఘవేంద్ర రావుల దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాడు. మా ప్రోమోలో కూడా యాక్ట్ చేశాడు’’ అని ప్రోమో చూపించిందామె. ఆ అబ్బాయే నాని. అందరికీ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్ కల్యాణీమాలిక్. కెమెరామ్యాన్ పీజీ విందా... ఇలా టీమ్ అంతా రెడీ. ఇక్కడ స్క్రిప్టేమో 245 పేజీలై కూర్చుంది. బాగా తగ్గించాలి. రాత్రింబవళ్లు కుస్తీ పడి ఓ 60 పేజీలు తగ్గించారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి.
షాకింగ్ న్యూస్. భూమిక సినిమా చేయలేని పరిస్థితి. ఆమెకు భరత్ ఠాకూర్‌తో పెళ్లి కన్‌ఫర్మ్ అయ్యింది.
ఇప్పుడు మళ్లీ అర్జెంట్‌గా హీరో హీరోయిన్లు కావాలి. కథ మొదటి కొచ్చింది. మోహనకృష్ణ తలపట్టు కున్నాడు. ‘‘ఓ పని చేద్దామా? సెకండ్ పెయిర్‌గా తీసుకున్న నాని, స్వాతి జంటనే మెయిన్ లీడ్ చేద్దామా?’’... రామ్‌మోహన్ సలహా. నాని, స్వాతిల టైమ్ బాగుంది. మెయిన్ లీడ్‌గా ప్రమోషన్. మరి సెకండ్ పెయిర్?
సెర్చింగ్ స్టార్ట్. వందల ఫొటోలొస్తున్నాయి. ఒక్కడూ తగలడే!
ఫారిన్ నుంచి ఒకతను టచ్‌లో కొచ్చాడు. అవసరాల శ్రీనివాస్. తెలుగు కుర్రాడే. ఫొటోలు పంపించాడు కానీ, మోహనకృష్ణకు నచ్చలేదు. కానీ అతను పట్టువదలని విక్రమార్కుడిలాగా వీడియో పంపించాడు. మనిషి చాలా ఎత్తుగా, తమాషాగా ఉన్నాడు. ఆనంద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ ఓకే.
మోహనకృష్ణ ఇంట్లోవాళ్లందరికీ స్క్రిప్టు తెలుసు. వరలక్ష్మి పాత్ర కోసం తెగ వెతుకుతున్నారనీ తెలుసు. ‘‘‘అమృతం’ టీవీ సీరియల్‌లో భార్గవి అనే అమ్మాయి చేస్తోంది. ఒకసారి చూడరాదూ!’’... మోహనకృష్ణకు అత్తగారి సలహా. భార్గవికి కబురెళ్లింది. లంగా ఓణీలో ఆఫీసుకు రమ్మన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మోహనకృష్ణ, పీజీ విందా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. గజ్జెల చప్పుడు. ఎవరో అమ్మాయి పైకి వస్తోంది. ‘‘అచ్చం మన వరలక్ష్మిలా లేదూ’’ అనేశాడు పీజీ విందా. ఆ వచ్చింది ఎవరో కాదు... భార్గవి. మేకప్ టెస్ట్ చేయకుండానే వరలక్ష్మి పాత్రకు భార్గవి ఖరారైంది.
‘హలో హలో ఓ అబ్బాయి’ ...ఇది వర్కింగ్ టైటిల్. ఇంకా అట్రాక్టివ్ టైటిల్ కావాలి. ‘‘ ‘కథ కంచికి...’ ఈ టైటిల్ ఎలా ఉంది?’’ అడిగాడు కల్యాణీమాలిక్. ‘‘ఏం బాలేదు’’ మొహం మీదే చెప్పేశాడు మోహనకృష్ణ. ‘‘మరి... ‘అష్టా చమ్మా’?’’ మళ్లీ చెప్పాడు కల్యాణీమాలిక్. ‘‘అరె... భలే ఉందే’’ అందరికీ నచ్చేసింది. హైదరాబాద్... అమలాపురం... గూడాల... బొప్పాయిలంక... ఇవే లొకేషన్లు. టాకీ పార్ట్‌కి 29 రోజులు. పాటలకు 14 రోజులు. కోటీ 60 లక్షల బడ్జెట్. ఫస్ట్ కాపీ వచ్చి రెండు నెలలైపోయింది. నిర్మాత రామ్‌మోహన్‌లో మాత్రం నో టెన్షన్. ఇలాంటి చిన్న సినిమాకు మంచి టైమ్ దొరకాలి. దొరికేసింది. 2008 సెప్టెంబర్ 5... డేట్ అనౌన్స్ చేసేశారు.
రామ్‌మోహన్‌కో ఐడియా వచ్చింది. రిలీజ్‌కు వారం ముందే వైజాగ్, విజయవాడల్లో పబ్లిక్ ప్రీమియర్ షో వేస్తే...!? చాలా రిస్కు... ఏ మాత్రం అటూ ఇటూ అయినా మొదటికే మోసం. అయినా రామ్‌మోహన్ డేర్ చేశారు. వైజాగ్ ప్రీమియర్ సూపర్‌హిట్. విజయవాడ ప్రీమియర్ సూపర్ డూపర్ హిట్. ఫలితం తేలిపోయింది.
రిలీజ్ రోజు కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్తుంటే ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దగ్గర మోహనకృష్ణకు ఫోన్ వచ్చింది. ‘‘కంగ్రాట్స్ అండీ! ఇప్పుడే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. చాలా ఫ్రెష్‌గా ఉంది. మా అందరికీ నచ్చింది’’... ఆ ఫోన్ డెరైక్టర్ రాజమౌళిది. ఇక ఆ తర్వాత మోహనకృష్ణకు వరుసపెట్టి ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు వస్తూనే ఉన్నాయి. ‘అష్టా చమ్మా’ స్వీక్వెల్ చేయొచ్చుగా?... మోహనకృష్ణను అందరూ తరచుగా అడిగే ప్రశ్న. ఆయనలోనూ విత్తనం పడింది. ఎప్పుడు మొలకెత్తుతుందో వెయిట్ చేయాల్సిందే.
వెరీ ఇంట్రస్టింగ్...
తొలుత అనుకున్న స్క్రిప్టులో ఝాన్సీ పోషించిన ‘మందిరా దేవి’ పాత్రకు ఓ లవ్ ట్రాక్ ఉంటుంది. లావణ్యను ఇష్టపడే ఓ కుర్రాడు, పేరు లేకుండా ఉత్తరాలు రాస్తుంటాడు. అది తనకే అనుకుని మందిర భ్రమించి, తను కూడా రిప్లై ఇస్తుంటుంది. మెయిన్ స్టోరీకి ఈ ట్రాక్ అడ్డుగా ఉంటుందని భావించి స్క్రిప్టు దశలోనే ఎడిట్ చేసేశారు. ఈ సినిమా అంతా ‘మహేశ్’ పేరు చుట్టూనే తిరుగుతుంది. అందుకే చిత్రీకరణ కంటే ముందే హీరో మహేశ్‌బాబును కలిసి అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ఈ సినిమాపై కేస్ స్టడీ నిర్వహించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో కొత్త పోకడలు పోవడం, నిర్మాత వ్యయ నియంత్రణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం... తదితర కారణాల రీత్యా ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు.
- పులగం చిన్నారాయణ