ashta chamma
-
‘ఆమె’ అష్టా చమ్మా ఎంత పని చేసిందంటే..
సూర్యాపేట : కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో మరోసారి నిరూపితమైంది. ఓ మహిళ అష్టా చమ్మా ఆడటం ద్వారా 31 మందికి కరోనా సోకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కరోనా చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా తబ్లిగి జమాత్ మీటింగ్‌కు వెళ్లివచ్చినవారితో కాంటాక్ట్ అయిన ఓ మహిళ ద్వారా 31 మందికి కరోనా సోకినట్టు ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి వచ్చింది. తనకు కరోనా సోకిన విషయం తెలియని మహిళ.. లాక్డౌన్ వేళ టైమ్ పాస్ కోసం సమీపంలోని పలు ఇళ్లలో తిరిగుతూ అష్టా చమ్మా ఆడారు. దీంతో ఆమె కాంటాక్ట్ అయినవారిలో చాలా మందికి కరోనా సోకింది. ఇది కూడా జిల్లాలో పెద్ద ఎత్తున కేసుల పెరుగుదలకు ఒక కారణం అయింది. కాగా, ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన కరోనా నియంత్రణ కోసం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కనీసం పక్కింటి వారి వద్దకు కూడా వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సూర్యాపేటలో కరోనా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై పలువురు ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి నిరంజన్ బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో బీ శ్రీనివాసరావును నియమించారు. అలాగే డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శివకుమార్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. చదవండి : ‘పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండకూడదు’ -
నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని
యంగ్ హీరో నాని హీరోగా వెండితెరకు పరిచయం అయి పదకొండేళ్లు అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అష్టా చమ్మా రిలీజ్ అయి నేటికి పదకొండేళ్లు. ఈ సందర్భంగా నాని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు ఈ అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్‌గా తనకంటూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నాని, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. Thank you is a small word for such a big family To many more years of this magical bond. Cheers Mee Nani — Nani (@NameisNani) September 5, 2019 -
నిచ్చెన కైలాసం.. గచ్చకాయలు తెలుసా?
జూబ్లీహిల్స్: వామనగుంటలు, పచ్చీస్, అష్టాచెమ్మా, దాడి, పాము, నిచ్చెన కైలాసం, గచ్చకాయలు ఈ పేర్లు వింటే పెద్దలందరికీ తమ చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. వీటి గురించి ఈ తరం పిల్లలకు కొంచెం కూడా తెలియదు. అందుకే పురాతన సంప్రదాయ ఆటలను చిన్నారులకు తెలియజెప్పడానికి, వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్న గుడ్ ఓల్డ్ గేమ్స్ సంస్థ ‘ హెరిటేజ్ గేమ్స్ ఆఫ్ ఇండియా ’ పేరుతో విభిన్నమన సాంప్రదాయ ఆటలను నగరంలో పరిచయం చేసింది. బంజారాహిల్స్ సప్తపర్ణిలో శుక్రవారం ఎగ్జిబిషన్ ప్రారంభించింది. కనుమరుగవుతున్న 101 సాంప్రదాయ ఆటలను వెలిగితీసి ఆటకు సంబంధించిన పరికరాలను తయారు చేయించి ప్రదర్శిస్తున్నామని నిర్వాహకులు సునీతా రాజేష్, అర్చన తెలిపారు. జెయింట్ పచ్చీస్, త్రీ ఇన్ వన్ పచ్చీస్ సహా పలు ఆట పరికరాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఆయా ప్రాంతాల కళాకారులతో తయారు చేయించామని వారు తెలిపారు. ఆధునిక సాంకేతిక సమాచార ప్రపంచంలో కొట్టుకుపోతున్న నేటి తరానికి భారతీయ సాంప్రదాయ ఆటపరికరాలను పరిచయం చేసే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 250 రూపాయల నుండి 60వేల రూపాయల వరకు ఆట పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. -
తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది : నాని
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన సినీ కెరీర్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ' తొమ్మిదేళ్ల క్రితం ఈ రోజు.. నా కుటుంబం పెరగటం ప్రారంభమైంది. అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. నన్ను మీ సొంత వాడిగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు' అంటూ హౌస్ ఫుల్ బోర్డ్ ముందు నిలబడి దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు నాని. సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత కెరీర్ లో అటుపోట్లు చూసినా.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఆకట్టుకున్న నాని ప్రస్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్నాడు. 9 years back on this day my family started getting bigger. It just kept growing from then on. Thank you for making me one of your own :) pic.twitter.com/U7vK3YiDDa — Nani (@NameisNani) 5 September 2017 -
జీవనసారం పలికే పాట..!
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు చిత్రం: అష్టా చమ్మా రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: శ్రీకృష్ణ సంగీతం: కల్యాణి మాలిక్ దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టాచమ్మా చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట ‘ఆడించి అష్టాచమ్మా...’. నా సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చిన పాటలలో ఇది టాప్‌లో ఉంటుంది. సన్నివేశాన్ని మాత్రమే రంజింపచేసినట్లు కాకుండా, కథలో... ఆ సందర్భంలో పాత్రల మధ్యన జరుగుతున్న సంఘర్షణకు కొంచెం హాస్యం జోడించారు. ప్రేమ తత్వం అంటే ఏంటి, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, ఆ ప్రేమలో త్యాగం అనేది ఎంత ముఖ్యమైనది... అనే విషయాలకు, గుప్పెడంత హాస్యాన్ని జోడించి ఆయన అద్భుతంగా అందంగా చెప్పారు ఈ పాటలో. అందుకే ఈ పాట ఎన్నటికీ మరచిపోలేని ఆణిముత్యమని నేను భావిస్తాను. సంగీతసాహిత్యాల పరంగా ఈ పాటను నేను బాగా ఇష్టపడతాను.‘నిజంగా నెగ్గడమంటే ఇష్టంగా ఓడడం అంతే...’ అంటూ జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో అద్భుతంగా మలిచారు. ఈ పాట మొత్తానికి ఈ వాక్యం తలమానికంగా ఉంటుంది. ‘ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా... ’ అని సాగే మొదటి చరణంలోనే వరదలు వచ్చి గంగమ్మ ఊళ్లను ముంచేస్తుందనే విషయానికి కొద్దిపాటి హాస్యం జోడిస్తూ హంగామా చేస్తావే అంటూ సున్నితమైన హాస్యాన్ని పండించారు. ‘నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ల బాటలో... నీ దాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా...’ అంటూ గవ్వలతో ఆడే అష్టా చమ్మా అట గురించి చెబుతూ మానవ జీవితాన్ని తాత్విక ధోరణిలో చూపారు. కోపాన్ని మందారంతోను, రూపాన్ని పువ్వుతోను, నాజూగ్గా గిల్లిందని, కోపాన్ని ముళ్లతోను... ఎంతో మధురంగా, అందంగా పోల్చారు శాస్త్రిగారు. ఏ పాటలోనైనా అసభ్యతకు తావు లేకుండా, వీలైనంతవరకు వేదాంతాన్ని చొప్పించడం ఆయన ప్రత్యేకత. ఈ పాటకు కల్యాణిమాలిక్ సంగీతం మరింత అందం చేకూర్చింది. – సంభాషణ: డా. వైజయంతి -
మరోసారి 'అష్టాచమ్మా'
'భలే భలే మొగాడివోయ్' సక్సెస్ యంగ్ హీరో నానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సక్సెస్ తో ఆ క్రేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం 'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న నాని, ఆ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఏడేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు హీరోగా నానికి మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తూనే ఉంది. అష్టాచమ్మా సినిమా తరువాత 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు ఆ తరువాత' లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన మోహనకృష్ణ 'బందిపోటు'తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత తన తొలి చిత్ర హీరో నానితో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు మోహనకృష్ణ. ఈ సినిమాతో మరోసారి అష్టాచమ్మా మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయాన్ని నాని స్వయంగా తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో వెల్లడించారు. After 7 years :) will always be indebted to him . https://t.co/EnGLy6oyAw — Nani (@NameisNani) November 17, 2015 -
మహేశ్... ఆ పేరులోనే ఓ మత్తు ఉంది!
అష్టా చమ్మా సినిమా వెనుక స్టోరీ- 9 ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి ఎంత టైమ్ పడుతుంది? ఈ ప్రశ్నకు జవాబు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతాడు. ఎందుకంటే ఇప్పుడతని దగ్గర ఓ విత్తనం రెడీగా ఉంది.అప్పుడు మోహనకృష్ణ విజయవాడ - ఆంధ్రా లయోలా కాలేజీలో బి.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్నాడు. రూమ్‌లో కన్నా లైబ్రరీలోనే ఎక్కువుంటున్నాడు. ఫిక్షన్ - నాన్ఫిక్షన్... ఏదీ వదలడం లేదు. ఏదో దాహం వేసినట్టుగా, ఆకలి వేసినట్టుగా ఇంగ్లిషు పుస్తకాలు నమిలి మింగేస్తున్నాడు. ‘‘ఒరేయ్ అబ్బాయ్! ఆస్కార్ వైల్డ్ రచనలు చదివావా? ముఖ్యంగా ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం చదివావా?’’ అడిగాడో ప్రొఫెసర్. ఆ మరుక్షణమే మోహనకృష్ణ చేతిలో ఆ నాటకం ప్రతి ఉంది. రాత్రంతా నిద్ర మానేసి మరీ చదివాడు. ఏవో ఊహలు... ఏవో కలలు... భలే ఉందే కాన్సెప్ట్. ఇలా మన తెలుగు సినిమాలు ఎందుకు రావు? మోహనకృష్ణ మనసులో విత్తనం పడింది. కెనడాలోని యార్క్ యూనివర్సిటీలో ఫిలిం అండ్ వీడియోలో రెండేళ్ల ఎమ్మెస్ పూర్తిచేసి, ఇండియా తిరిగొచ్చాడు మోహనకృష్ణ. ఇప్పుడేం చేయాలి? సినిమా తీయాలి. ఎవరిస్తారు ఆఫర్? రకరకాల ప్రయత్నాలు... ఆలోచనలు. రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదివే అలవాటు. బుక్ ర్యాక్‌లో చేయి పెడితే ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ తగిలింది. ఇంతకు ముందు చదివిన పుస్తకమే. మళ్లీ చదివాడు. పుస్తకమంతా పూర్తయ్యాక డైరీలో రాసుకున్నాడు. ‘‘ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలి’’ అనుకుంటూ వరుసగా పాయింట్స్ రాసుకున్నాడు. విత్తనం మొలకెత్తడం మొదలైంది. రాజా, భూమిక కాంబినేషన్లో ‘మాయాబజార్’ (2006) సినిమా. తొలి చిత్రం ‘గ్రహణం’ తర్వాత మోహనకృష్ణ రెండో ప్రయత్నం. ప్చ్... నిరాశపరిచింది. ఏంటి తన పరిస్థితి? ఏమీ అర్థం కావడం లేదు. అలాంటి టైమ్‌లో ఇంటికొచ్చాడు రామ్మోహన్. బిజినెస్ మేనేజ్మెంట్ చదివి, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ ముందు నుంచీ పరిచయం. ‘‘మనమో సినిమా చేద్దాం మోహన్! నేనే ప్రొడ్యూసర్ని’’ చెప్పాడు రామ్మోహన్. మోహనకృష్ణ మొహం వెలిగిపోయింది. ‘‘నా దగ్గర రెడీగా రెండు కథలున్నాయి. నీ ఇష్టం’’ చెప్పాడు మోహనకృష్ణ. ఓ కథ ఎంచుకున్నాడు రామ్మోహన్. ఆ కథకు బేస్... ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’. మొక్క మొలవడం మొదలైంది. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం ప్రపంచమంతా పాపులర్. ఇందులో హీరో పేరు జాక్. పల్లెటూరి మనిషి. లైఫ్ బోర్ కొట్టేసి అప్పుడప్పుడూ లండన్ వెళ్లి వస్తుంటాడు. అక్కడతని పేరు ఎర్నెస్ట్. గ్వెండోలిన్ అనే అమ్మాయికి ఎర్నెస్ట్ అనే పేరంటే పిచ్చి. అలా వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. జస్ట్... ఈ ఇతివృత్తాన్ని పట్టుకొని మోహనకృష్ణ కథ రెడీ చేశాడు. ఈ కథలో హీరోక్కూడా పల్లెటూరి జీవితమంటే మొహం మొత్తేసి హైదరాబాద్ వస్తాడు. పేరు రాంబాబు. యాక్... కొత్త పేరు కావాలి... అదిరిపోవాలి. మోహనకృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పుడే ‘పోకిరి’ సినిమా రిలీజైంది. అమ్మాయిలంతా మహేశ్బాబంటే పడిచచ్చిపోతున్నారు. ఎస్... పేరు దొరికేసింది. రాంబాబు కాస్తా మహేశ్ అని పేరు మార్చుకుంటాడు. లావణ్య దృష్టిలో మహేశ్ అనే పేరే ఓ మత్తుమందు. కథ రెడీ. హీరోయిన్ భూమిక కథ వింది. ‘‘ఇప్పుడు చేస్తున్న ‘అనసూయ’ సినిమా కంప్లీట్ కాగానే డేట్స్ నీకే’’ అని చెప్పేసింది ఇమ్మీడియట్‌గా. ఒక్కడు’లో మహేశ్, భూమిక కలిసి పనిచేశారు కదా! హిట్ కాంబినేషన్. అలాంటి భూమిక ఈ సినిమాలో మహేశ్ పేరు స్మరిస్తుంటే థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మోహనకృష్ణ ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు హీరో కావాలి. గోపీచంద్‌ను కలిశాడు... నో. దయకిరణ్ను కలిశాడు... నో. ఇద్దరిదీ ఒకే మాట. ‘‘కథ బాగుంది. కానీ మేము సూట్ కాము!’’అయ్యో... మరిప్పుడెలా? ‘సంపంగి’లో చేసిన హీరో దీపక్ లైన్లోకొచ్చాడు. అతను చేయడానికి రెడీ. వీళ్లకే సంశయం. ఈ సినిమాలో సెకండ్ పెయిర్ కావాలి. కథలోని పాత్రలు ఆనంద్... వరలక్ష్మి... ఎక్కడున్నారమ్మా మీరు? వరలక్ష్మి చాలా ఈజీగా దొరికేసింది. ‘కలర్స్’ స్వాతి. ‘మా’ టీవీలో ‘కలర్స్’ ప్రోగ్రామ్‌తో పాపులరైపోయి, కృష్ణవంశీ డెరైక్షన్‌లో ‘డేంజర్’ సినిమా చేసింది. లేటెస్ట్గా వెంకటేశ్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో యాక్ట్ చేసింది. పల్లెటూరి పిల్ల పాత్రకు స్వాతి చాలా బాగుంటుంది. ఫిక్స్. ఆనంద్ పాత్రకు కొత్త కుర్రాడు కావాలి. అడిగినవారికీ అడగనివారికీ ఇదే చెబుతున్నారు. ఆ రోజు రామ్మోహన్ ఆఫీసుకి నందినీరెడ్డి వచ్చింది. రమ్యకృష్ణ తో ‘జర మస్తీ... జరధూమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ చేస్తోంది తను. ‘‘నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు. బాపు, కె.రాఘవేంద్ర రావుల దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాడు. మా ప్రోమోలో కూడా యాక్ట్ చేశాడు’’ అని ప్రోమో చూపించిందామె. ఆ అబ్బాయే నాని. అందరికీ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్ కల్యాణీమాలిక్. కెమెరామ్యాన్ పీజీ విందా... ఇలా టీమ్ అంతా రెడీ. ఇక్కడ స్క్రిప్టేమో 245 పేజీలై కూర్చుంది. బాగా తగ్గించాలి. రాత్రింబవళ్లు కుస్తీ పడి ఓ 60 పేజీలు తగ్గించారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి. షాకింగ్ న్యూస్. భూమిక సినిమా చేయలేని పరిస్థితి. ఆమెకు భరత్ ఠాకూర్‌తో పెళ్లి కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అర్జెంట్‌గా హీరో హీరోయిన్లు కావాలి. కథ మొదటి కొచ్చింది. మోహనకృష్ణ తలపట్టు కున్నాడు. ‘‘ఓ పని చేద్దామా? సెకండ్ పెయిర్‌గా తీసుకున్న నాని, స్వాతి జంటనే మెయిన్ లీడ్ చేద్దామా?’’... రామ్మోహన్ సలహా. నాని, స్వాతిల టైమ్ బాగుంది. మెయిన్ లీడ్‌గా ప్రమోషన్. మరి సెకండ్ పెయిర్? సెర్చింగ్ స్టార్ట్. వందల ఫొటోలొస్తున్నాయి. ఒక్కడూ తగలడే! ఫారిన్ నుంచి ఒకతను టచ్‌లో కొచ్చాడు. అవసరాల శ్రీనివాస్. తెలుగు కుర్రాడే. ఫొటోలు పంపించాడు కానీ, మోహనకృష్ణకు నచ్చలేదు. కానీ అతను పట్టువదలని విక్రమార్కుడిలాగా వీడియో పంపించాడు. మనిషి చాలా ఎత్తుగా, తమాషాగా ఉన్నాడు. ఆనంద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ ఓకే. మోహనకృష్ణ ఇంట్లోవాళ్లందరికీ స్క్రిప్టు తెలుసు. వరలక్ష్మి పాత్ర కోసం తెగ వెతుకుతున్నారనీ తెలుసు. ‘‘‘అమృతం’ టీవీ సీరియల్లో భార్గవి అనే అమ్మాయి చేస్తోంది. ఒకసారి చూడరాదూ!’’... మోహనకృష్ణకు అత్తగారి సలహా. భార్గవికి కబురెళ్లింది. లంగా ఓణీలో ఆఫీసుకు రమ్మన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మోహనకృష్ణ, పీజీ విందా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. గజ్జెల చప్పుడు. ఎవరో అమ్మాయి పైకి వస్తోంది. ‘‘అచ్చం మన వరలక్ష్మిలా లేదూ’’ అనేశాడు పీజీ విందా. ఆ వచ్చింది ఎవరో కాదు... భార్గవి. మేకప్ టెస్ట్ చేయకుండానే వరలక్ష్మి పాత్రకు భార్గవి ఖరారైంది. ‘హలో హలో ఓ అబ్బాయి’ ...ఇది వర్కింగ్ టైటిల్. ఇంకా అట్రాక్టివ్ టైటిల్ కావాలి. ‘‘ ‘కథ కంచికి...’ ఈ టైటిల్ ఎలా ఉంది?’’ అడిగాడు కల్యాణీమాలిక్. ‘‘ఏం బాలేదు’’ మొహం మీదే చెప్పేశాడు మోహనకృష్ణ. ‘‘మరి... ‘అష్టా చమ్మా’?’’ మళ్లీ చెప్పాడు కల్యాణీమాలిక్. ‘‘అరె... భలే ఉందే’’ అందరికీ నచ్చేసింది. హైదరాబాద్... అమలాపురం... గూడాల... బొప్పాయిలంక... ఇవే లొకేషన్లు. టాకీ పార్ట్‌కి 29 రోజులు. పాటలకు 14 రోజులు. కోటీ 60 లక్షల బడ్జెట్. ఫస్ట్ కాపీ వచ్చి రెండు నెలలైపోయింది. నిర్మాత రామ్మోహన్‌లో మాత్రం నో టెన్షన్. ఇలాంటి చిన్న సినిమాకు మంచి టైమ్ దొరకాలి. దొరికేసింది. 2008 సెప్టెంబర్ 5... డేట్ అనౌన్స్ చేసేశారు. రామ్మోహన్కో ఐడియా వచ్చింది. రిలీజ్‌కు వారం ముందే వైజాగ్, విజయవాడల్లో పబ్లిక్ ప్రీమియర్ షో వేస్తే...!? చాలా రిస్కు... ఏ మాత్రం అటూ ఇటూ అయినా మొదటికే మోసం. అయినా రామ్మోహన్ డేర్ చేశారు. వైజాగ్ ప్రీమియర్ సూపర్‌హిట్. విజయవాడ ప్రీమియర్ సూపర్ డూపర్ హిట్. ఫలితం తేలిపోయింది. రిలీజ్ రోజు కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తుంటే ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దగ్గర మోహనకృష్ణకు ఫోన్ వచ్చింది. ‘‘కంగ్రాట్స్ అండీ! ఇప్పుడే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. చాలా ఫ్రెష్‌గా ఉంది. మా అందరికీ నచ్చింది’’... ఆ ఫోన్ డెరైక్టర్ రాజమౌళిది. ఇక ఆ తర్వాత మోహనకృష్ణకు వరుసపెట్టి ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు వస్తూనే ఉన్నాయి. ‘అష్టా చమ్మా’ స్వీక్వెల్ చేయొచ్చుగా?... మోహనకృష్ణను అందరూ తరచుగా అడిగే ప్రశ్న. ఆయనలోనూ విత్తనం పడింది. ఎప్పుడు మొలకెత్తుతుందో వెయిట్ చేయాల్సిందే. వెరీ ఇంట్రస్టింగ్... తొలుత అనుకున్న స్క్రిప్టులో ఝాన్సీ పోషించిన ‘మందిరా దేవి’ పాత్రకు ఓ లవ్ ట్రాక్ ఉంటుంది. లావణ్యను ఇష్టపడే ఓ కుర్రాడు, పేరు లేకుండా ఉత్తరాలు రాస్తుంటాడు. అది తనకే అనుకుని మందిర భ్రమించి, తను కూడా రిప్లై ఇస్తుంటుంది. మెయిన్ స్టోరీకి ఈ ట్రాక్ అడ్డుగా ఉంటుందని భావించి స్క్రిప్టు దశలోనే ఎడిట్ చేసేశారు. ఈ సినిమా అంతా ‘మహేశ్’ పేరు చుట్టూనే తిరుగుతుంది. అందుకే చిత్రీకరణ కంటే ముందే హీరో మహేశ్‌బాబును కలిసి అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఈ సినిమాపై కేస్ స్టడీ నిర్వహించారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో కొత్త పోకడలు పోవడం, నిర్మాత వ్యయ నియంత్రణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం... తదితర కారణాల రీత్యా ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. - పులగం చిన్నారాయణ -
మెగాఫోన్ పట్టనున్న అవసరాల శ్రీనివాస్
ఆష్టా చెమ్మా, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్. త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వర్థమాన నటుడు అవసరాల శ్రీనివాస్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. హాస్య ప్రధానంగా నడిచే కథకు హీరోతోపాటు ప్రముఖ హస్య నటులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన కథను రూపొందించినట్లు తెలిపారు. తాను నిర్మించనున్న చిత్రానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. ఆయన గతంలో ఈగ, అందాల రాక్షసి లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారని శ్రీనివాస్ తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ గోగినేనితో మరో చిత్రానికి పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆ చిత్రం కూడా ప్రధానంగా వినోదభరితంగా ఉంటుందన్నారు. ఆ రెండు చిత్రాలు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు.