జీవనసారం పలికే పాట..!
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు
చిత్రం: అష్టా చమ్మా
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శ్రీకృష్ణ
సంగీతం: కల్యాణి మాలిక్
దర్శకత్వం:
ఇంద్రగంటి మోహనకృష్ణ
అష్టాచమ్మా చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట ‘ఆడించి అష్టాచమ్మా...’. నా సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చిన పాటలలో ఇది టాప్‌లో ఉంటుంది. సన్నివేశాన్ని మాత్రమే రంజింపచేసినట్లు కాకుండా, కథలో... ఆ సందర్భంలో పాత్రల మధ్యన జరుగుతున్న సంఘర్షణకు కొంచెం హాస్యం జోడించారు.
ప్రేమ తత్వం అంటే ఏంటి, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, ఆ ప్రేమలో త్యాగం అనేది ఎంత ముఖ్యమైనది... అనే విషయాలకు, గుప్పెడంత హాస్యాన్ని జోడించి ఆయన అద్భుతంగా అందంగా చెప్పారు ఈ పాటలో. అందుకే ఈ పాట ఎన్నటికీ మరచిపోలేని ఆణిముత్యమని నేను భావిస్తాను. సంగీతసాహిత్యాల పరంగా ఈ పాటను నేను బాగా ఇష్టపడతాను.‘నిజంగా నెగ్గడమంటే ఇష్టంగా ఓడడం అంతే...’ అంటూ జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో అద్భుతంగా మలిచారు. ఈ పాట మొత్తానికి ఈ వాక్యం తలమానికంగా ఉంటుంది.
‘ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా... ’ అని సాగే మొదటి చరణంలోనే వరదలు వచ్చి గంగమ్మ ఊళ్లను ముంచేస్తుందనే విషయానికి కొద్దిపాటి హాస్యం జోడిస్తూ హంగామా చేస్తావే అంటూ సున్నితమైన హాస్యాన్ని పండించారు. ‘నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ల బాటలో... నీ దాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా...’ అంటూ గవ్వలతో ఆడే అష్టా చమ్మా అట గురించి చెబుతూ మానవ జీవితాన్ని తాత్విక ధోరణిలో చూపారు.
కోపాన్ని మందారంతోను, రూపాన్ని పువ్వుతోను, నాజూగ్గా గిల్లిందని, కోపాన్ని ముళ్లతోను... ఎంతో మధురంగా, అందంగా పోల్చారు శాస్త్రిగారు. ఏ పాటలోనైనా అసభ్యతకు తావు లేకుండా, వీలైనంతవరకు వేదాంతాన్ని చొప్పించడం ఆయన ప్రత్యేకత. ఈ పాటకు కల్యాణిమాలిక్ సంగీతం మరింత అందం చేకూర్చింది.
– సంభాషణ: డా. వైజయంతి