రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదొక్కటే: కీరవాణి | He is my favourite in present generation : M.M.Keeravani | Sakshi
Sakshi News home page

రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదొక్కటే: కీరవాణి

Published Thu, Oct 9 2014 11:30 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదొక్కటే: కీరవాణి - Sakshi

రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదొక్కటే: కీరవాణి

సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి సొంత అన్నదమ్ముల పిల్లలు. కానీ ఇద్దరూ అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా కనిపిస్తారు. కీరవాణి అంటే రాజమౌళికి విపరీతమైన రెస్పెక్ట్. రాజమౌళి అంటే కీరవాణికి ఓ ప్రత్యేకమైన అభిమానం. రాజమౌళి సినిమాలకు కీరవాణి సంగీతం వెన్నెముక అంటే అతిశయోక్తి కాదు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలన్నీ సూపర్‌హిట్టే. నేడు రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఓ పది విషయాలు చెప్పమంటే... కీరవాణి ఇలా చెప్పుకొచ్చారు.
 
మాది ఉమ్మడి కుటుంబం. నా తమ్ముడు కల్యాణి మాలిక్, రాజమౌళిది దాదాపు ఒకే వయసు. అందుకని వాళ్లిద్దరూ కలిసి పెరిగారు. రాజమౌళి చిన్నప్పటి విషయాలు ఎక్కువగా కల్యాణి మాలిక్‌కే తెలుస్తాయి.
 
నాకు, రాజమౌళికి పన్నెండేళ్ల వయసు వ్యత్యాసం. కలిసి పెరిగాం అంటే.. పెరిగాం. పెరగలేదు అంటే పెరగలేదు. నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు తను ఫస్ట్ స్టాండర్డ్‌లో చేరాడు. నేను తిరిగిన వ్యక్తులు వేరు. తన స్నేహితులు వేరు.
 
రాజమౌళిని ఇంట్లో అందరం నంది అని పిలుస్తాం. అలా ఎందుకు పిలుస్తాం అని మా పెద్దవాళ్లని నేనెప్పుడూ అడగలేదు. ఆ పేరు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నన్ను మాత్రం తను పెద్దన్నా అని పిలుస్తాడు.
 
చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగాం కాబట్టి, నా కుటుంబ సభ్యులు పైకొచ్చినప్పుడు నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. అలా రాజమౌళి పైకొచ్చినప్పుడు నాకేం ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే, కలిసి పెరిగినవాళ్ల కాబట్టి, ప్రతిభ ఉన్న విషయం తెలుస్తుంది కదా.  ‘సింహాద్రి’ సినిమా అప్పుడు నాకు రాజమౌళిలో మంచి దర్శకుడు ఉన్నాడనిపించిం.

రాజమౌళికి తను చేసే పని పట్ల శ్రద్ధ, భక్తి ఎక్కువ. అలా చేసేవాళ్లు ఎప్పటికైనా పైకొస్తారు. అందుకని రాజమౌళి పైకొస్తాడనే నమ్మకం ఉండేది.
 
రాజమౌళిలో నాకు నచ్చిన విషయం కఠోర పరిశ్రమ. నచ్చని విషయం గడ్డం పెంచడం. ఆ విషయం తనతో అప్పుడప్పుడు చెబుతుంటాను.  కానీ, తియ్యడు. నాకూ గడ్డం ఉంటుంది. కానీ, ఎదుటివాళ్లు మాత్రం పోలీస్‌శాఖకు సంబంధించినవాళ్లలా క్లీన్ షేవ్ చేసుకుని కనిపిస్తే నాకు నచ్చుతుంది.
 
ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే ధైర్యం రాజమౌళికి ఉంది.

అందరు సంగీతదర్శకులు తనకిష్టమే. కానీ, నేను బెస్ట్ ఇస్తాననే నమ్మకంతో నాతో చేస్తాడు. అన్నయ్య అనే భక్తి భావంతో నాతో పాటలు చేయించుకోవడంలేదు. ఎప్పుడైతే నేను వర్క్ చేయలేనో, అప్పుడు నాతో చేయడం కూడా మానేస్తాడు. దేని దారి దానిదే.
 
సినిమా వరకూ మేం అన్నదమ్ములం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాం. తనక్కావల్సినది నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. నాకేదైనా   కరెక్ట్ అనిపిస్తే నేనూ అంతే నిర్మొహమాటంగా చెప్పేస్తాను.

  ప్రతి పుట్టినరోజునాడు తప్పనిసరిగా కలిసి స్పెండ్ చేస్తాం. గత ఏడాది ‘బాహుబలి’ షూటింగ్ లొకేషన్లో ఉన్నాం. ఈ ఏడాది కూడా అంతే.
 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement