కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. ‘బాహుబలి’ చూసి ప్రభాస్ కటౌట్‌కి తగ్గ క్యారెక్టర్‌లో కత్తిలా నటించాడన్నారు. సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పుడు సేమ్ కటౌట్ సెకండ్ పార్ట్‌తో వస్తోంది. సో.. అన్ని కళ్లూ ‘బాహుబలి–2’ పైనే. రాజమౌళి దర్శకత్వంలో శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌తో ఇంటర్వ్యూ...
‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడైనా చెబుతారా?
ఎందుకనేది తెలిస్తే మీరు సినిమాను ఎంజాయ్ చేయలేరు. ఒక్క సీన్‌లో కాదు... ఓ 10, 20, 30 సీన్లలో జరిగిన అంశాలు చంపడానికి కారణమవుతాయి. ఈ ప్రశ్నకు ఎవరూ ఒక్క మాటలో ఆన్సర్ చెప్పలేరు. ప్రేక్షకులు ఈ ప్రశ్న పదే పదే అడుగుతున్నారంటే వాళ్లెంతగా సినిమాను ప్రేమించారో ఊహించుకోవచ్చు.
రాజమౌళి ఆ ప్రశ్నతో సినిమాను ముగిస్తారని మీకూ, యూనిట్ సభ్యులకూ ముందే తెలుసా?
లేదు. లక్కీగా... ‘బాహుబలి’ రిలీజ్‌కు ముందే పార్ట్–2లో ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశాం. అందువల్ల, సెట్‌లో చాలామంది ఆ సీన్స్ తీసినప్పుడు సరిగ్గా చూడలేదు. రిలీజ్ తర్వాత షూటింగ్ చేసుంటే యూనిట్ అందరికీ తెలిసేది. సీక్రెట్ బయటకు వచ్చేసేది.
‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఊహించారా?
లేదు. రాజమౌళి విజన్‌ను మేమంతా గుడ్డిగా నమ్మాం. మేం ఊహించిన దానికంటే సినిమా భారీ హిట్టయ్యింది. రిలీజ్ డే హిట్ టాక్ వచ్చిన తర్వాత వీవీ వినాయక్‌గారు, రాజమౌళి, నేనూ కలిశాం. అప్పుడు వినాయక్‌గారు ‘దేవసేన సంకెళ్లతో ఎందుకుంది? శివగామి ఎందుకు చచ్చిపోయింది? కట్టప్ప ఎందుకు చంపాడు? సినిమాలో ఇటువంటివి పది ప్రశ్నలుండగా... బ్లాక్‌బస్టర్ టాక్ ఎలా వచ్చింది? ఎలా ఇంత పెద్ద హిట్ అయింది?’ అనడిగారు. నాకు కథ పూర్తిగా తెలుసు కాబట్టి, ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించలేదు. శివుడి కాలిని కట్టప్ప నెత్తి మీద పెట్టుకోవడం ఓ ట్విస్ట్ అవుతుందనుకున్నానంతే. బహుశా... ప్రేక్షకులకు సినిమాలో కొత్తదనం నచ్చిందేమో! యుద్ధాలు, చారిత్రక నేపథ్యం నచ్చాయేమో! ఏదో మేజిక్ అయితే జరిగింది.
‘బాహుబలి–2’పై భారీ అంచనాలున్నాయి. మీకు టెన్షన్‌గా ఉందా? కాన్ఫిడెంట్‌గా ఉన్నారా?
పార్ట్–1కి టెన్షన్ పడ్డా. ఎందుకంటే నిర్మాతలు బాగా రిస్క్ చేశారు. తెలుగులో ఎంత వసూలు చేస్తుంది? తమిళంలో చూస్తారా? లేదా? హిందీలో అసలు ఆడుతుందా? అనేవి తెలీకుండా మా నిర్మాతలు శోభు, ప్రసాద్‌లు భారీగా ఖర్చు పెట్టారు. సినిమా ఫ్లాప్ అయితే... వాళ్ల కోసం నేనో మూడు, రాజమౌళి ఓ మూడు సినిమాలు చేసినా నిర్మాతలు బయట పడలేరు. మళ్లీ సినిమా చేసి, విడుదల చేసినా... వడ్డీలు, గట్రా ఆ ఆలోచన వస్తేనే భయంగా ఉంది. ఎవరు ఏం చేసినా నిర్మాతలను సేవ్ చేయలేమనే భయంకరమైన టెన్షన్ ఉండేది. మంచి రిజల్ట్ వచ్చేసరికి హ్యాపీ. ఇప్పుడూ టెన్షన్‌గా ఉంది. కానీ, ఫస్ట్ పార్ట్ అంత లేదు. ఓ వారం తర్వాత మెల్లగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ‘బాహుబలి’లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మాత్రమే చూశారు. పార్ట్–2లో అసలు కథ, డ్రామా, రెండు యుద్ధాలున్నాయి. మహాభారతాన్ని తలపిస్తుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనుకుంటున్నా.
బాహుబలి’ సక్సెస్ చూసి నిర్మాతలు సేఫ్ అనుకున్నారా?
అంతే కదా. రాజమౌళి ఎంత హార్డ్‌వర్క్ చేశాడు? నేను ఎన్నేళ్లు టైమ్ కేటాయించాను? అనేవి పక్కన పెడితే... లైఫ్‌లో మళ్లీ సంపాదించుకోలేని డబ్బులను నిర్మాతలు ఖర్చుపెట్టారు. ‘బాహుబలి’ హిట్ అయితే ఫ్లాప్ కిందే లెక్క. బ్లాక్ బస్టర్ అవ్వాలి. వేరే ఛాయిస్ లేదు. పెద్ద హిట్టయినా నిర్మాతలకు ఏం మిగల్లేదంటే ఎంత ఖర్చు పెట్టారో ఆలోచించండి. ‘బాహుబలి’ హిట్టవ్వకపోతే పార్ట్–2 ఆపేయాలి. అప్పటికే 30 శాతం షూటింగ్ చేసేశాం. మళ్లీ, మరో సినిమా అంటే కష్టమే కదా!
మీరు, రాజమౌళి తప్పిస్తే ‘బాహుబలి’ టీమ్ వేరే సినిమాలు చేశారు..
నేను, రాజమౌళి వేరే సినిమాలు చేస్తే... ఇంకో ఎనిమిదేళ్లు పట్టేదేమో (నవ్వులు)! ఈ మహాయజ్ఞంలో నా వంతుగా మొదట నేను చేయాల్సింది ఏంటంటే... రాజమౌళికి టైమ్ ఇవ్వాలి. మధ్యలో నేనింకో సినిమా చేస్తూ... ‘క్లైమాక్స్ ఒక్కటే డార్లింగ్. రెండు రోజుల్లో వచ్చేస్తా’ వంటì పర్మిషన్లు అడగ కూడదనుకున్నా. ‘బాహుబలి’ ఓ ప్రయోగం. ప్రతిదీ మాకు ఓ ఎక్స్‌పీరియన్సే. వార్ సీన్స్ 80 రోజులు అనుకుంటే 120 రోజులైంది. నేను మరో సినిమా చేస్తే, అది ప్లానింగ్ ప్రకారం జరక్కపోతే మరిన్ని సమస్యలు.
ఈ సినిమాలో వార్ సీన్స్‌పై హాలీవుడ్ ప్రభావం ఎక్కువ ఉందనే టాక్ రావడంపై మీ కామెంట్?
‘ధీవర..’ సాంగ్ చూశారు కాదా! మేఘాల పైనుంచి వాటర్ ఫాల్స్ రావడం ఏంటి? రాజమౌళి తప్ప మరొకరు అలా ఆలోచించలేరు. కరణ్ జోహార్‌కు చూపిస్తే... ‘ఏంటిది ‘అవతార్’లా ఉంది’ అన్నారు. ఆ వాటర్ ఫాల్స్ సీక్వెన్స్ హాలీవుడ్ కంటే బాగా వచ్చిందని నా వ్యక్తిగత అభిప్రాయం. వార్ సీన్లూ బాగున్నాయి. హాలీవుడ్‌వి ఇంకా బాగుండొచ్చు.
‘బాహుబలి’కి నాలుగేళ్లు కష్టపడ్డారు. పార్ట్–1తో దేశవ్యాప్తంగా మీకు మంచి పేరొచ్చింది. మరో సినిమాకు మళ్లీ ఇంత కష్టపడే ఆలోచన ఉందా?
ఇప్పుడా మైండ్‌సెట్‌లో లేను. ‘బాహుబలి’ని ఎంజాయ్ చేశా. వెంటనే ఈ టైప్ మూవీకి ఎవరైనా అడిగి, అది లక్ష కోట్ల సినిమా అని చెప్పినా చేయను. నాలుగేళ్ల తర్వాత అయితే చేస్తానేమో. పేరొస్తే ఏంటి? రాకపోతే ఏంటి? నేను ఎంజాయ్ చేయలేనిది నాకెందుకు?
ఇకపై, ఏడాదికి రెండు సినిమాలు చేస్తానన్నారు. సాధ్యమేనా?
సాధ్యమే. కానీ, యాక్షన్‌తో అయితే అంత సులభం కాదు. హాలీవుడ్ తరహాలో ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్, గట్రా చేస్తే ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు నెలల్లో పూర్తి చేయొచ్చు.
కీరవాణిగారు ప్రభాస్‌కి గర్వం లేదన్నారు. మీరేమంటారు?
ఏమో... గర్వం లేనట్లు నటిస్తున్నానేమో! (నవ్వులు) ఇప్పుడీ సినిమాను ఉదాహరణగా తీసుకుంటే... నేను కథ రాయలేదు, దర్శకత్వం చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు గర్వపడాలి? రాజమౌళిపై నమ్మకంతో, నాకు పేరు రావాలని చేశా.
ఈ సినిమాతో మీలో సహనం పెరిగిందా?
పెదనాన్నగారు మొగల్తూరు ఎంపీగా చేసినప్పుడు నాలో సహనం అనేది వచ్చింది. ఎందుకంటే నెల రోజులు నాకు మొగల్తూరు బాధ్యతలు అప్పగించారు. నా దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరూ తమ సమస్యలను, పార్టీ గొడవలను చెప్పేవారు. ఏం సమాధానం చెప్పాలో తెలీదు, రాజకీయాలు అసలే తెలీదు. నావల్ల ఒక్క ఓటు కూడా రాదు. కనీసం పోకుండా చూద్దామని వాళ్లు చెప్పేవన్నీ వినేవాణ్ణి. నెల తర్వాత పెదనాన్నగారికి దండం పెట్టి... మీ రాజకీయాలు నాకు సంబంధం లేదు. లైఫ్‌లో ఇంకోసారి పిలవద్దని చెప్పా. నాకు రాజకీయాలు సెట్ కావు.
హాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి వెళ్తున్నారట? నెక్స్›్ట సినిమా ఎప్పుడు?
ఈ సినిమాతో నిజాలు, పుకార్లు... చాలా ప్రచారంలోకి వచ్చేశాయి. హిందీ సినిమా చేస్తానేమో. హాలీవుడ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఓ నెల తర్వాత దర్శకులు సుజీత్, రాధాకృష్ణలతో చేయబోయే సినిమాల చిత్రీకరణను దాదాపు ఒకేసారి ప్రారంభించాలనుకుంటున్నాం.
‘బాహుబలి’ తర్వాత ఏ సినిమా చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉందా?
ప్రచార చిత్రాల నుంచి ప్రేక్షకుల ఇమేజ్ మార్చొచ్చు. ఉదాహరణకు ‘ఛత్రపతి’ తర్వాత ‘డార్లింగ్’ను ప్రేక్షకులు అంగీకరించారు కదా! ‘ఛత్రపతి’లో 20, 30మందిని నరికేసిన మాస్ హీరో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ క్లైమాక్స్‌లో ‘నేను తప్పు చేశా, సారీ’ అనే సీన్ చేస్తే అంగీకరించారు కదా! పోస్టర్స్, ట్రైలర్స్‌తో ప్రేక్షకులు సినిమాపై ఓ అవగాహనకు వస్తారు. లేదంటే... ఓ పెద్ద హిట్ తర్వాత హీరోలు సినిమాలు ఆపేయాలి. ‘బాహుబలి’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే టెన్షన్ ఎప్పుడూ లేదు.
‘బాహుబలి’ సినిమా తీసినన్ని రోజులూ స్కూల్‌కి వెళ్లినట్టుంది అన్నారు!
నిజమే. ఓ సీన్ తీయడానికి 30, 40 లక్షలంట! వన్‌మోర్ చెబితే... అన్నీ సెట్ చేయడానికి 3, 4 గంటలు పట్టేది. పైగా, ఎంతో లాస్. అందువల్ల, త్వరగా నిద్రలేచి షూటింగ్‌కి వెళ్లాలనుకునేవాణ్ణి. దాంతో స్కూల్‌కి వెళ్లినట్లనిపించింది. ‘మిర్చి’కి నా స్నేహితులే నిర్మాతలు. తొమ్మిదింటికి షూటింగ్‌కి వస్తానని చెప్పొచ్చు. ఒకవేళ రాజమౌళి వింటాడనుకున్నా... నిర్మాతల ఖర్చు చూసి నేనే భయపడేవాణ్ణి.
లక్ష కోట్ల సినిమా అయినా ఇప్పట్లో చేయను!
Published Mon, Apr 17 2017 11:43 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement
Advertisement