తొలియత్నం: ఇదే నాలుగో సినిమా అయ్యుంటే... | K. Vijaya Bhaskar says about Direction in his career | Sakshi
Sakshi News home page

తొలియత్నం: ఇదే నాలుగో సినిమా అయ్యుంటే...

Published Sun, Dec 8 2013 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

K. Vijaya Bhaskar says about Direction in his career

సముద్రంలో కెరటం లేచిపడింది, పడి లేచిందా?
ఆకాశంలో సూర్యుడు వెలిగి ఆరిపోయాడా, ఆరినవాడు తిరిగి వెలిగాడా?
ఏది సత్యం, ఏదసత్యం... ఏది కొలమానం, ఏది గీటురాయి...
జీవితం వృత్తమైనప్పుడు నిజం, అబద్ధం, గెలుపు, ఓటమి లాంటి విలువన్నీ పాక్షిక సత్యాలే.
కానీ జీవితం ఆ జీవితంలోని కొన్ని క్షణాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తూ, సక్సెస్‌ను మాత్రమే కొలమానంగా లెక్కించే సినీ వెండితెర చతురస్రంలో విలువలు, లెక్కలకు అతీతంగా గమనం సాగించడం అంత సులువేమీ కాదు.
అయితే ఒక విలువతో, నిబద్దతతో పనిచేసినప్పుడు ఈ భౌతిక విలువలకు అతీతంగా నచ్చిన మార్గంలో స్థిరంగా ముందుకు సాగడం సాధ్యమేనని నిరూపించిన దర్శకుడు కె.విజయభాస్కర్.
ఆయన మొదటి సినిమా ‘ప్రార్థన’ ఆయనకే కాదు, ప్రేక్షకులకూ ఓ కొత్త అనుభవం. అలాంటి ప్రయోగం చేసే అవకాశం ఇప్పటికీ రాలేదంటున్న విజయభాస్కర్ అంతరంగమిది.

 
 బి.గోపాల్‌గారు ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ‘కానూన్ అప్నా అప్నా’గా హిందీలో తీస్తున్న సమయమది. ఆ సినిమాకు నేను ఆఖరి అసిస్టెంట్‌ని. తరువాత ‘లారీ డ్రైవర్’కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. గోపాల్‌గారికి చెప్పగానే, చెయ్యగలవా అన్నారు. తలూపాను. సరేనన్నారాయన. కందేపి సాంబశివరావు, సురేశ్ కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అప్పుడప్పుడే ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంటున్న సురేశ్‌ను హీరోగా ప్రమోట్ చేయడం కోసమే ఈ సినిమా చేయాలనుకుని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. హీరోను, బడ్జెట్ పరిధులను దృష్టిలో ఉంచుకుని, కథ రాసుకోవాలి. నాకేమో సినిమా కథ అనగానే రొటీన్‌కు భిన్నంగా ఉండాలనేది ఆలోచన. మా చిన్నప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్నప్పుడు ప్రతివారం ఒక పరభాషా చిత్రం చూపించేవారు. దాంతో ప్రపంచ సినిమాతో అప్పుడే పరిచయం ఏర్పడింది.
 
 ఆ ప్రభావంతో వైవిధ్యమైన కథ రాయాలని తపించాను. రోజుల తరబడి ఇంటి డాబా మీద ఒంటరిగా కూర్చుని కథ రాశాను. ఎక్కడ ఏం రాయాలి, దేని తరువాత మరేం రావాలి లాంటి స్క్రీన్‌ప్లే రూల్స్ తెలీకుండా స్క్రిప్ట్ పూర్తి చేశాను. నిర్మాతకు, హీరోకు కధ వినిపించగానే ‘‘మనం ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇక ఆర్టిస్ట్‌లు ఎవరు అనుకున్నప్పుడు హీరో సురేశ్ పక్కన హీరోయిన్‌గా ఒక కొత్తమ్మాయిని తీసుకున్నాం. తను అప్పుడే విడుదలైన మణిరత్నం ‘అంజలి’ సినిమాలో ఆనంద్ పక్కన జంటగా నటించింది. అందులో ఒక పాటలో తన పెర్‌ఫామెన్స్ నచ్చింది.
 
  ఆమె పేరును అంజలిగా మార్చి, మా సినిమాలో పెట్టుకున్నాం. హీరో పక్కన స్నేహితులుగా సూర్యకిరణ్, జాకీ (తరువాత ఒకరు దర్శకుడిగా, మరొకరు నటుడిగా ఫేమ్ అయ్యారు) నటించారు. ఇక షూటింగ్ ఎక్కడ చేద్దాం అన్న చర్చ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మా గుంటూరులో అయితే షూటింగ్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అన్నారు. కథ ప్రకారం, మాకు కీలకంగా కావలసింది ఒక మెకానిక్ షెడ్. గుంటూరులో షెడ్ వేసిన తరువాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా సినిమా పూర్తిచేశాం.

 

బడ్జెట్ పరిమితుల దృష్ట్యా సినిమాలో క్వాలిటీ లేకపోయినా, కథ, కథనంలో నవ్యతే ‘ప్రార్థన’ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటి అద్భుతమైన అవకాశం నాకింతవరకూ రాలేదు, బహుశా మరెప్పటికీ రాకపోవచ్చు కూడా. సినిమా ప్రారంభంలోనే ఒక పాప, డ్రిపెషన్‌లో వున్న హీరో, పాప కోసం వెతుకుతున్న విలన్ ఇలా ఒకరికొకరు సంబంధం లేని పాత్రల మధ్య ఏదో సంబంధం వుందన్న ఆలోచన, ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగజేసాను. సరిగ్గా ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేసాను. మెకానిక్‌గా పనిచేసే హీరో, ఒక ధనవంతురాలయిన అమ్మాయి  ప్రేమించుకుంటారు. హీరోయిన్ విధిలేని పరిస్ధితుల్లో  తన తండ్రి దగ్గర పనిచేసే విలన్ బెనర్జీని పెళ్లి చేసుకుంటుంది. ఒక పాపకు జన్మనిచ్చి హీరోయిన్ చనిపోతుంది.  ఇక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్‌లోపే విలన్ ఉద్దేశం, హీరో లక్ష్యం ప్రేక్షకులకి తెలిసిపోతాయి. ఇక ఇక్కడి నుంచి ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తూ సెకండ్ హాఫ్ నడపాలి. అదీ ఛాలెంజ్.
 
  ఆస్తిని కాపాడుకోవడానికి బెనర్జీకి పాప కావాలి. సవతి తల్లి  పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయిన పాప ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. హీరో దగ్గర వుందని సమాచారం తెలిసి వెళతాడు. ఒకసారి నీవల్ల నేను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాను. ఇప్పుడు కూడా అదే తప్పు చేయనంటాడు హీరో. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ. హీరో విలన్‌ను చితక్కొట్టి పంపిస్తాడు. విలన్ బెనర్జీ పాపను తీసుకొచ్చే బాధ్యత ఒక చిన్నపాటి రౌడీకి అప్పగిస్తాడు. పాపకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కథ మలుపు తీసుకుంటుంది.  హీరో పాపను హాస్పిటల్‌లో చేరుస్తాడు. అపెండిసైటిస్ అని తేలడంతో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. వైద్యం కోసం పక్క ఊరికి వెళ్లిన డాక్టర్ కోసం హీరోతో పాటు మిత్రబృందం ఎదురు చూస్తుంటారు. సమయం పరిగెడుతున్నా డాక్టర్ వచ్చే జాడ కనపడటం లేదు.
 
  మరోవైపు తన అసిస్టెంట్స్ ద్వారా విషయం తెలుసుకున్న రౌడీ... డాక్టర్‌ను హాస్పిటల్‌కు రాకుండా చేయాలనుకుంటాడు. ఆ బాధ్యత తన అసిస్టెంట్స్‌కు అప్పగిస్తాడు. హాస్పిటల్ దగ్గర డాక్టర్‌కోసం చాలాసేపు నిరీక్షించిన హీరో లాభం లేదనుకుని, డాక్టర్ ఇంటివైపు బయలుదేరుతాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ తలుపు తీసి లోనికి అడుగుపెట్టి, కిచెన్‌లో కుక్కర్ ఆన్ చేస్తుంది. హాల్లోకి వచ్చి లైట్ వేయగానే, తన కుర్చీలో కనిపించిన వ్యక్తిని చూసి అరుస్తుంది. అతడు వెంటనే ఆమె నోరు మూసి, కుర్చీలో కట్టేస్తాడు. నేను నిన్నేమీ చేయను, కాసేపు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఇక్కడే కూర్చో అని బయట నుంచి తాళం వేస్తాడు. అతడు బయటకు రాగానే డాక్టర్ ఇంటివైపు వస్తున్న హీరో కనిపిస్తాడు. హీరో నుండి తప్పించుకోవడానికి రౌడీ పక్కనే ఉన్న పెద్ద కొబ్బరిచెట్టు ఎక్కుతాడు. హీరో కాలింగ్ బెల్ కొడతాడు.
 
  లోపలి నుంచి ఏ అలికిడీ వినిపించదు. తలుపువైపు చూస్తే తాళం వేసి కనిపిస్తుంది. హీరో గుమ్మం మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం నిరీక్షిస్తుంటాడు. లోపల కట్టేసి ఉన్న డాక్టర్‌కు తనకోసం ఎవరో వచ్చారని అర్థమవుతుంది. ఇక్కడి నుంచి సీనంతా టాప్ యాంగిల్‌లో ఓ చెట్టు మీద ఉన్న రౌడీ యాంగిల్‌లో ప్రేక్షకుడికి కనిపిస్తుంటుంది. బయట మెట్ల మీద కూర్చున్న హీరో, లోపల టేబుల్ మీద వాటర్ బాటిల్‌ను తలతో కింద పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్. వాటర్ బాటిల్ కిందపడితే లోపల ఉన్న డాక్టర్ ఉనికి హీరోకి తెలిసిపోతుంది. బయట అసహనంగా టైమ్ చూసుకుంటున్న హీరో, లోపల తన తలతో బాటిల్ పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, పైన చెట్టు మీద నుంచి టెన్షన్‌గా చూస్తున్న రౌడీ. ఇంతలో బాటిల్ టేబుల్ నుంచి కిందపడి పెద్ద సౌండ్ చేసే లోపు, రౌడీ కొబ్బరికాయ తెంచి కిందపడేస్తాడు. హీరో అలర్ట్ అయ్యేలోపు చెట్టు కింద పడ్డ కొబ్బరికాయ కనిపిస్తుంది. మళ్లీ టెన్షన్.

 

అటు హాస్పిటల్‌లో నొప్పితో బాధపడుతున్న పాప, మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న హీరో, లోపల తన ఉనికిని బయట ఉన్న వ్యక్తికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, హీరోకు లోపల డాక్టర్ ఉన్నట్లు తెలిసిపోతుందేమోనని చెట్టుమీద టెన్షన్ పడుతున్న రౌడీ... ఇలా టెన్షన్ టెన్షన్‌గా ఉన్నప్పుడు కిందపడిన నీళ్లు తలుపు సందులోంచి కారుతూ మెట్ల మీద కూర్చున్న హీరో కిందకు వస్తుండగా, సడన్‌గా లేచి వెళ్లిపోతాడు. మళ్లీ టెన్షన్ టెన్షన్. హీరో సందు మలుపు దాటుతుండగా లోపల కిచెన్ నుంచి విజిల్ వినిపిస్తుంది. హీరో మళ్లీ వెనక్కు వచ్చి లోపల ఎవరో ఉన్నారని తలుపు బద్దలుకొడతాడు. రౌడీని ఎదిరించి, డాక్టర్‌ను విడిపించి, సమయానికి హాస్పిటల్‌కు వెళతారు. ఈ సీన్ తీసేటప్పుడు షాట్స్, ప్రాపర్టీస్, యాంగిల్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను.
 
 ఎందుకంటే సీన్ అంతా చెట్టు మీద ఉన్న వ్యక్తి యాంగిల్ నుంచే జరుగుతుంది. అతని టెన్షన్‌తో పాటుగా ప్రేక్షకులు టెన్షన్ అనుభవించాలి. ప్రేక్షకులను థ్రిల్ చేయడం కోసం ప్రతి డిటైల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. నిజానికి గుంటూరులో కొబ్బరిచెట్టు ఉన్న ఇల్లుకోసం చాలా వెదికాం కానీ దొరకలేదు. చివరకు ఒక పెద్ద కొబ్బరిచెట్టును వేరే చోటు నుంచి తెప్పించి మేం షూట్ చేయాలనుకున్న ఇంటి పెరట్లో నాటించాం. ఇలా ఒక సీన్‌ను ఇంత కన్విన్సింగ్‌గా, ఇంట్రెస్ట్‌గా రాసే సందర్భం నాకు మళ్లీ రాలేదని చెప్పొచ్చు.కథ మూడ్‌కు తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్ చాలా సహకారం అందించారు.
 
 ఏ రకంగా చూసినా అప్పటికి ఇది విభిన్నమైన కథ. ఇదే నా మూడో నాలుగో సినిమా అయితే, బడ్జెట్ పరిమితులు లేకుండా ఇంకొంత క్వాలిటీతో తీసేవాణ్నేమో. ఏదేమైనా జీవితం పట్ల సరైన ప్రాపంచిక దృక్పథం ఉండబట్టే ‘ప్రార్థన’ తరువాత ‘స్వయంవరం’ వరకు ఏడేళ్ల దాకా సినిమా అవకాశం రాకపోయినా నిబ్బరంగా ఉండగలిగాను.
 
 ప్రభుదేవాను మొదటిసారి ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయం చేశాం. అందుకోసం తను గుంటూరు వచ్చాడు. అయితే మా సినిమా కంటే ముందు (తరువాత) తను కొరియోగ్రఫీ చేసిన మరో సినిమా ముందుగా విడుదలైంది.
 -  కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement