రేణిగుంట: మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్... రేణిగుంట చెక్‌పోస్ట్ మార్గంలో వెళ్లే ప్రతి లారీ డ్రైవర్‌కు ఈ పేరు సుపరిచితమే... చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడు ముడుపులు సమర్పించుకోవాల్సిందే... దారి మళ్లించి వెళ్లిన వాహనాలను వెంబడించి మరీ అక్రమ వసూళ్లు చేపట్టే ఘనుడు ఈయన... రేణిగుంట ఆర్‌టీఏ చెక్‌పోస్ట్‌లో ఆయన చెప్పిందే వేదం... ఆయన మాటకు ఎదురుచెప్పిన తోటి సిబ్బందినే ఇబ్బందులకు గురిచేసిన నైజం ఆయన సొంతం. గత నాలుగేళ్లుగా ఆయన రేణిగుంట చెక్‌పోస్ట్‌లో చేపట్టిన అక్రమ వసూళ్లు అక్షరాలా రూ.100 కోట్లంటే సగటు ప్రభుత్వ ఉద్యోగి కళ్లు తేలెయ్యాల్సిందే.. అన్నీ రోజులు ఒకలా ఉండవన్న సత్యం ఆయనను పలకరించింది. శనివారం ఏకకాలంలో ఆయన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.100కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బంది వెన్నులోనూ వణుకు మొదలైంది.
రోజుకు అక్రమ వసూళ్లు రూ.3లక్షలు పైమాటే
రేణిగుంట ఆర్‌టీవో చెక్‌పోస్ట్ మీదుగా ప్రతి నిత్యం వేలాది వాహనాలు కడప, చెన్నై, నెల్లూరు,చిత్తూరు మార్గల నుంచి రాకపోకలు సాగిస్తుంటా యి. ప్రధానంగా వివిధ లోడ్లతో వెళ్లే లారీలే ఇక్కడ పనిచేసే వారి అక్రమార్జనకు ప్రధాన వనరు. సీటులో ఏ అధికారి ఉన్నా లారీ డ్రైవర్లు వాహనాలను ఆపి బిల్లుల మాటున ముడుపులు సమర్పించి వెళ్లాల్సిందే. ప్రతి వాహనదారుడు రూ.500 నుంచి రూ.10వేల వరకు సమర్పించి వెళుతుంటారు. ఇక్కడ జరిపే అక్రమ వసూళ్లు రోజుకు రూ.3లక్షలు పైనే ఉంటుందని తెలుస్తోంది. కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే రూ.14,950 లెక్కలో లేని నగదును గుర్తించిన ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు.
రోజువారీ వసూళ్లు కాకుండా గూడూరు నుంచి బెంగుళూరుకు నిత్యం వందలాది లారీలలో వెళ్లే సిలికా ఇసుక వ్యాపారుల నుంచి నెలసరి మామూళ్లు రూ.లక్షల్లో వసూలు చేస్తారు. అలాగే ఈ మార్గం గుండా కబేళాలకు తరలించే మూగజీవాల అక్రమ తరలింపుదారుల నుంచి భారీస్థాయి మామూళ్లు వసూలవుతున్నాయి. ఇదంతా రేణిగుంట చెక్‌పోస్ట్ కేంద్రంగా బహిరంగంగానే ప్రతినిత్యం జరిగే తంతు. అక్రమ వసూళ్ల కోసం ఇక్కడి అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టకుని వారికి రోజుకు రూ.2వేలు ఇస్తుండటం బహిరంగ రహస్యమే.
ఆయనంటే హడల్
ఎంవీఐ విజయభాస్కర్ అంటే వాహనదా రులే కాదు... తోటి సిబ్బందే హడలిపోవాల్సిందే. ఆయన గతంలో కడపలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన 2014 జూన్‌లో ఎంవీఐగా ఉద్యోగోన్నతిపై రేణిగుంట చెక్‌పోస్ట్‌కు వచ్చారు. ఆర్‌టీఏ ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలకు తోడు రాజకీ య అండదండలు ఆయనకు బలంగా ఉన్నట్లు తోటి సిబ్బంది వద్ద తొలినాళ్లలో హంగామా సృష్టించి తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎవరు అడ్డు చెప్పినా ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేస్తాడు. కార్యాలయ సీనియర్ ఎంవీఐ మరొకరు ఉన్నా తా నే ఇన్‌చార్జి అని చెప్పుకుంటూ అన్ని వసూళ్లు ఆ యన కన్నుసన్నల్లోనే జరిగేలా చూసుకున్నాడు. వ్యవహార శైలి, అక్రమార్జనపై గతంలో అనేకమా ర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు
రేణిగుంట చెక్‌పోస్ట్‌పై గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు జరిగాయి. గతంలో ఓసారి ఏసీబీ దాడులు చేసి అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా గుండెపోటు సాకు చూపి తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా అప్పట్లో ఓ కిందిస్థాయి ఉద్యోగి బలైనట్లు సమాచారం. ఇక్కడ దాడులు చేసిన ప్రతిసారి పెద్దమొత్తంలో నగదును స్వాదీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పరంపర మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యం లో ఆయన లెక్కకు మించి అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు స్పష్టం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల చిట్టాను బహిర్గతం చేశారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బందిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment