Tholi yatnam
-
తొలియత్నం: ఇదే నాలుగో సినిమా అయ్యుంటే...
సముద్రంలో కెరటం లేచిపడింది, పడి లేచిందా? ఆకాశంలో సూర్యుడు వెలిగి ఆరిపోయాడా, ఆరినవాడు తిరిగి వెలిగాడా? ఏది సత్యం, ఏదసత్యం... ఏది కొలమానం, ఏది గీటురాయి... జీవితం వృత్తమైనప్పుడు నిజం, అబద్ధం, గెలుపు, ఓటమి లాంటి విలువన్నీ పాక్షిక సత్యాలే. కానీ జీవితం ఆ జీవితంలోని కొన్ని క్షణాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తూ, సక్సెస్‌ను మాత్రమే కొలమానంగా లెక్కించే సినీ వెండితెర చతురస్రంలో విలువలు, లెక్కలకు అతీతంగా గమనం సాగించడం అంత సులువేమీ కాదు. అయితే ఒక విలువతో, నిబద్దతతో పనిచేసినప్పుడు ఈ భౌతిక విలువలకు అతీతంగా నచ్చిన మార్గంలో స్థిరంగా ముందుకు సాగడం సాధ్యమేనని నిరూపించిన దర్శకుడు కె.విజయభాస్కర్. ఆయన మొదటి సినిమా ‘ప్రార్థన’ ఆయనకే కాదు, ప్రేక్షకులకూ ఓ కొత్త అనుభవం. అలాంటి ప్రయోగం చేసే అవకాశం ఇప్పటికీ రాలేదంటున్న విజయభాస్కర్ అంతరంగమిది. బి.గోపాల్గారు ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ‘కానూన్ అప్నా అప్నా’గా హిందీలో తీస్తున్న సమయమది. ఆ సినిమాకు నేను ఆఖరి అసిస్టెంట్‌ని. తరువాత ‘లారీ డ్రైవర్’కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. గోపాల్‌గారికి చెప్పగానే, చెయ్యగలవా అన్నారు. తలూపాను. సరేనన్నారాయన. కందేపి సాంబశివరావు, సురేశ్ కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అప్పుడప్పుడే ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంటున్న సురేశ్‌ను హీరోగా ప్రమోట్ చేయడం కోసమే ఈ సినిమా చేయాలనుకుని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. హీరోను, బడ్జెట్ పరిధులను దృష్టిలో ఉంచుకుని, కథ రాసుకోవాలి. నాకేమో సినిమా కథ అనగానే రొటీన్‌కు భిన్నంగా ఉండాలనేది ఆలోచన. మా చిన్నప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతివారం ఒక పరభాషా చిత్రం చూపించేవారు. దాంతో ప్రపంచ సినిమాతో అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆ ప్రభావంతో వైవిధ్యమైన కథ రాయాలని తపించాను. రోజుల తరబడి ఇంటి డాబా మీద ఒంటరిగా కూర్చుని కథ రాశాను. ఎక్కడ ఏం రాయాలి, దేని తరువాత మరేం రావాలి లాంటి స్క్రీన్‌ప్లే రూల్స్ తెలీకుండా స్క్రిప్ట్ పూర్తి చేశాను. నిర్మాతకు, హీరోకు కధ వినిపించగానే ‘‘మనం ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇక ఆర్టిస్ట్‌లు ఎవరు అనుకున్నప్పుడు హీరో సురేశ్ పక్కన హీరోయిన్గా ఒక కొత్తమ్మాయిని తీసుకున్నాం. తను అప్పుడే విడుదలైన మణిరత్నం ‘అంజలి’ సినిమాలో ఆనంద్ పక్కన జంటగా నటించింది. అందులో ఒక పాటలో తన పెర్ఫామెన్స్ నచ్చింది. ఆమె పేరును అంజలిగా మార్చి, మా సినిమాలో పెట్టుకున్నాం. హీరో పక్కన స్నేహితులుగా సూర్యకిరణ్, జాకీ (తరువాత ఒకరు దర్శకుడిగా, మరొకరు నటుడిగా ఫేమ్ అయ్యారు) నటించారు. ఇక షూటింగ్ ఎక్కడ చేద్దాం అన్న చర్చ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మా గుంటూరులో అయితే షూటింగ్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అన్నారు. కథ ప్రకారం, మాకు కీలకంగా కావలసింది ఒక మెకానిక్ షెడ్. గుంటూరులో షెడ్ వేసిన తరువాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా సినిమా పూర్తిచేశాం. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా సినిమాలో క్వాలిటీ లేకపోయినా, కథ, కథనంలో నవ్యతే ‘ప్రార్థన’ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటి అద్భుతమైన అవకాశం నాకింతవరకూ రాలేదు, బహుశా మరెప్పటికీ రాకపోవచ్చు కూడా. సినిమా ప్రారంభంలోనే ఒక పాప, డ్రిపెషన్‌లో వున్న హీరో, పాప కోసం వెతుకుతున్న విలన్ ఇలా ఒకరికొకరు సంబంధం లేని పాత్రల మధ్య ఏదో సంబంధం వుందన్న ఆలోచన, ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగజేసాను. సరిగ్గా ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేసాను. మెకానిక్‌గా పనిచేసే హీరో, ఒక ధనవంతురాలయిన అమ్మాయి ప్రేమించుకుంటారు. హీరోయిన్ విధిలేని పరిస్ధితుల్లో తన తండ్రి దగ్గర పనిచేసే విలన్ బెనర్జీని పెళ్లి చేసుకుంటుంది. ఒక పాపకు జన్మనిచ్చి హీరోయిన్ చనిపోతుంది. ఇక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లోపే విలన్ ఉద్దేశం, హీరో లక్ష్యం ప్రేక్షకులకి తెలిసిపోతాయి. ఇక ఇక్కడి నుంచి ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తూ సెకండ్ హాఫ్ నడపాలి. అదీ ఛాలెంజ్. ఆస్తిని కాపాడుకోవడానికి బెనర్జీకి పాప కావాలి. సవతి తల్లి పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయిన పాప ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. హీరో దగ్గర వుందని సమాచారం తెలిసి వెళతాడు. ఒకసారి నీవల్ల నేను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాను. ఇప్పుడు కూడా అదే తప్పు చేయనంటాడు హీరో. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ. హీరో విలన్‌ను చితక్కొట్టి పంపిస్తాడు. విలన్ బెనర్జీ పాపను తీసుకొచ్చే బాధ్యత ఒక చిన్నపాటి రౌడీకి అప్పగిస్తాడు. పాపకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కథ మలుపు తీసుకుంటుంది. హీరో పాపను హాస్పిటల్లో చేరుస్తాడు. అపెండిసైటిస్ అని తేలడంతో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. వైద్యం కోసం పక్క ఊరికి వెళ్లిన డాక్టర్ కోసం హీరోతో పాటు మిత్రబృందం ఎదురు చూస్తుంటారు. సమయం పరిగెడుతున్నా డాక్టర్ వచ్చే జాడ కనపడటం లేదు. మరోవైపు తన అసిస్టెంట్స్ ద్వారా విషయం తెలుసుకున్న రౌడీ... డాక్టర్‌ను హాస్పిటల్‌కు రాకుండా చేయాలనుకుంటాడు. ఆ బాధ్యత తన అసిస్టెంట్స్‌కు అప్పగిస్తాడు. హాస్పిటల్ దగ్గర డాక్టర్‌కోసం చాలాసేపు నిరీక్షించిన హీరో లాభం లేదనుకుని, డాక్టర్ ఇంటివైపు బయలుదేరుతాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ తలుపు తీసి లోనికి అడుగుపెట్టి, కిచెన్‌లో కుక్కర్ ఆన్ చేస్తుంది. హాల్లోకి వచ్చి లైట్ వేయగానే, తన కుర్చీలో కనిపించిన వ్యక్తిని చూసి అరుస్తుంది. అతడు వెంటనే ఆమె నోరు మూసి, కుర్చీలో కట్టేస్తాడు. నేను నిన్నేమీ చేయను, కాసేపు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఇక్కడే కూర్చో అని బయట నుంచి తాళం వేస్తాడు. అతడు బయటకు రాగానే డాక్టర్ ఇంటివైపు వస్తున్న హీరో కనిపిస్తాడు. హీరో నుండి తప్పించుకోవడానికి రౌడీ పక్కనే ఉన్న పెద్ద కొబ్బరిచెట్టు ఎక్కుతాడు. హీరో కాలింగ్ బెల్ కొడతాడు. లోపలి నుంచి ఏ అలికిడీ వినిపించదు. తలుపువైపు చూస్తే తాళం వేసి కనిపిస్తుంది. హీరో గుమ్మం మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం నిరీక్షిస్తుంటాడు. లోపల కట్టేసి ఉన్న డాక్టర్‌కు తనకోసం ఎవరో వచ్చారని అర్థమవుతుంది. ఇక్కడి నుంచి సీనంతా టాప్ యాంగిల్లో ఓ చెట్టు మీద ఉన్న రౌడీ యాంగిల్లో ప్రేక్షకుడికి కనిపిస్తుంటుంది. బయట మెట్ల మీద కూర్చున్న హీరో, లోపల టేబుల్ మీద వాటర్ బాటిల్‌ను తలతో కింద పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్. వాటర్ బాటిల్ కిందపడితే లోపల ఉన్న డాక్టర్ ఉనికి హీరోకి తెలిసిపోతుంది. బయట అసహనంగా టైమ్ చూసుకుంటున్న హీరో, లోపల తన తలతో బాటిల్ పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, పైన చెట్టు మీద నుంచి టెన్షన్‌గా చూస్తున్న రౌడీ. ఇంతలో బాటిల్ టేబుల్ నుంచి కిందపడి పెద్ద సౌండ్ చేసే లోపు, రౌడీ కొబ్బరికాయ తెంచి కిందపడేస్తాడు. హీరో అలర్ట్ అయ్యేలోపు చెట్టు కింద పడ్డ కొబ్బరికాయ కనిపిస్తుంది. మళ్లీ టెన్షన్. అటు హాస్పిటల్లో నొప్పితో బాధపడుతున్న పాప, మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న హీరో, లోపల తన ఉనికిని బయట ఉన్న వ్యక్తికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, హీరోకు లోపల డాక్టర్ ఉన్నట్లు తెలిసిపోతుందేమోనని చెట్టుమీద టెన్షన్ పడుతున్న రౌడీ... ఇలా టెన్షన్ టెన్షన్‌గా ఉన్నప్పుడు కిందపడిన నీళ్లు తలుపు సందులోంచి కారుతూ మెట్ల మీద కూర్చున్న హీరో కిందకు వస్తుండగా, సడన్‌గా లేచి వెళ్లిపోతాడు. మళ్లీ టెన్షన్ టెన్షన్. హీరో సందు మలుపు దాటుతుండగా లోపల కిచెన్ నుంచి విజిల్ వినిపిస్తుంది. హీరో మళ్లీ వెనక్కు వచ్చి లోపల ఎవరో ఉన్నారని తలుపు బద్దలుకొడతాడు. రౌడీని ఎదిరించి, డాక్టర్‌ను విడిపించి, సమయానికి హాస్పిటల్‌కు వెళతారు. ఈ సీన్ తీసేటప్పుడు షాట్స్, ప్రాపర్టీస్, యాంగిల్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను. ఎందుకంటే సీన్ అంతా చెట్టు మీద ఉన్న వ్యక్తి యాంగిల్ నుంచే జరుగుతుంది. అతని టెన్షన్‌తో పాటుగా ప్రేక్షకులు టెన్షన్ అనుభవించాలి. ప్రేక్షకులను థ్రిల్ చేయడం కోసం ప్రతి డిటైల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. నిజానికి గుంటూరులో కొబ్బరిచెట్టు ఉన్న ఇల్లుకోసం చాలా వెదికాం కానీ దొరకలేదు. చివరకు ఒక పెద్ద కొబ్బరిచెట్టును వేరే చోటు నుంచి తెప్పించి మేం షూట్ చేయాలనుకున్న ఇంటి పెరట్లో నాటించాం. ఇలా ఒక సీన్‌ను ఇంత కన్విన్సింగ్‌గా, ఇంట్రెస్ట్‌గా రాసే సందర్భం నాకు మళ్లీ రాలేదని చెప్పొచ్చు.కథ మూడ్‌కు తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్ చాలా సహకారం అందించారు. ఏ రకంగా చూసినా అప్పటికి ఇది విభిన్నమైన కథ. ఇదే నా మూడో నాలుగో సినిమా అయితే, బడ్జెట్ పరిమితులు లేకుండా ఇంకొంత క్వాలిటీతో తీసేవాణ్నేమో. ఏదేమైనా జీవితం పట్ల సరైన ప్రాపంచిక దృక్పథం ఉండబట్టే ‘ప్రార్థన’ తరువాత ‘స్వయంవరం’ వరకు ఏడేళ్ల దాకా సినిమా అవకాశం రాకపోయినా నిబ్బరంగా ఉండగలిగాను. ప్రభుదేవాను మొదటిసారి ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయం చేశాం. అందుకోసం తను గుంటూరు వచ్చాడు. అయితే మా సినిమా కంటే ముందు (తరువాత) తను కొరియోగ్రఫీ చేసిన మరో సినిమా ముందుగా విడుదలైంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: అనుకున్నవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి!
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా బలమైంది సంకల్పం. ఒకసారి ఇది నేను చేయాలి, చేయగలను అనుకున్నప్పుడు దాని ముందు నిలబడటానికి ఇంకేదీ సాహసించదు. సంకల్పం ముందు శిఖరమంత సమస్యైనా చిన్నబోతుంది. నడుస్తున్న దారిలో ముళ్లు తొలిగి పూలు పరుచుకుంటాయి. ఆకాశంలో ఎండ తీక్షణత తగ్గి మేఘాలు ముసురుకుంటాయి. అలిసిపోయినప్పుడు నక్షత్రాలు నేలకొరిగి ముచ్చట్లాడతాయి. అందుకే మనిషికో కల ఉండాలి. అది సాధించాలన్న సంకల్పం ఉండాలి. అలా దర్శకుడవ్వాలనుకున్న ఒక యువకుడు, తన కలను రగిలించి వెండితెరపై పరిచిన తొలి రవి కిరణాల వెలుగే ఈ వారం తొలియత్నం... అతడి మాటల్లోనే... యాడ్ ఫిలింస్ సక్సెస్ అయిన తరువాత ఒకడుగు ముందుకు వేయాలనుకున్నాను. సినిమా దర్శకుడవ్వాలన్న నా కల నిజం చేసుకోవడానికి అదే సరైన సమయం అనిపించింది. ముందుగా ఒక కథ తయారుచేసుకుని, అది కొంతమంది ప్రొడ్యూజర్లకు వినిపించాను. వాళ్లు కొన్ని నెలల పాటు నన్ను వెయిటింగ్లో పెట్టారు. దానికి ఒక కాలేజ్ సెట్, పెద్ద బడ్జెట్ అవసరమవుతుంది. దాని పేరు అల్లరి.స్క్రిప్ట్ పట్టుకుని తిరిగితే పనికాదని అర్థమైంది. నేనే సొంతంగా తీయాలని ఒక చిన్నకథ కోసం ఆలోచన చేశాను. చిన్నప్పటినుంచి చూసిన హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్తో ఒక టీనేజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ముందు కథ టైటిల్ తీసి దీనికి పెట్టాను. అలా అల్లరి మొదలైంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి, ఆర్టిస్టులను కొత్తవాళ్లను తీసుకోవాలనుకున్నాం. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకు నరేష్ సరిపోతాడనిపించింది. తను నాకు ముందు నుంచే పరిచయం. అయితే, తనకు అప్పటికి హీరో కావాలన్న ఆలోచన లేదు. నేను అడగ్గానే తను చాలా సర్ప్రైజ్ అయ్యాడు. హీరోయిన్స్‌ను మోడల్ కో-ఆర్డినేటర్ల ద్వారా సెలక్ట్ చేసుకున్నాం. ఇందులో మా నాన్నకు పెయిర్‌గా ఉండే ఆర్టిస్ట్ కోసం కొంచెం ఇబ్బందిపడ్డాను. ఆ ఆర్టిస్టు క్యారెక్టర్ నల్లగా, కొంచెం భారీగా, కళ్లు ఎర్రగా ఉండాలని డిజైన్ చేసుకున్నాను. మరుసటిరోజు షూటింగ్ స్టార్ట్ చేయాలి. కానీ, ఎంత వెదికినా ఆర్టిస్ట్ దొరకలేదు. అంతలో మా నాన్నగారు రేపు కాకినాడ నుంచి ఒక స్టేజీ ఆర్టిస్ట్ వస్తుంది, చూడు అన్నారు. ఆ దేవుడి మీద భారం వేసి, తనకోసం చూస్తుండగా ఆటోలో దిగింది. ఆశ్చర్యం. నేను ఆ క్యారెక్టర్‌కు ఎలాంటి మనిషి కావాలనుకున్నానో తనే నా ఎదురుగా వచ్చి నిలుచున్నట్టుంది. అంతకుముందు రాత్రి ప్రయాణం వల్ల జుట్టు చెదిరి, ఎర్రటి కళ్లతో నాముందుకు వచ్చింది. వెంటనే డ్రెస్ మార్చి, కెమెరా ముందు నిలబెట్టాం. షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నీ మాయలా జరిగిపోయాయి. అనుకున్నదే తడవుగా షూట్ టైమ్‌కు వాటంతటవే అమరిపోయేవి. నా రాజీపడని తత్వానికి కావలసినవన్నీ సమకూరడం అదృష్టమే అనుకుంటా. హీరోయిన్ రూమ్‌లో ఒక మ్యాక్ కంప్యూటర్ ఉండాలి. కొనాలంటే, ఆ రోజు ఆదివారం. షెడ్యూల్‌ప్రకారం షూట్ జరగాలి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. కానీ, అక్కడ దొరకలేదు. నిరాశగా వెనుదిరగ్గానే బయట ఒక ఫ్రెండ్ కలిశాడు. ఏమిటిక్కడ అని అడిగాను. తను కొత్తగా మ్యాక్ కంప్యూటర్స్ డీలర్షిప్ తీసుకున్నానని చెప్పాడు. అదృష్టం అనుకుని, విషయం చెప్పా. తను వెంటనే ఒక సిస్టమ్ అరేంజ్ చేశాడు. మరోసారి ఒక వైట్ కార్డ్‌లెస్ ఫోన్ కావలసి వచ్చింది. ఆ రోజు ఆదివారం. ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు. రోడ్డుమీద కలిసిన ఒక ఫ్రెండ్ ఏంటంత టెన్షన్‌గా ఉన్నావని అడిగాడు. విషయం చెప్పగానే అతను హెల్ప్ చేశాడు. నేను కలర్స్ స్కీమ్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. హీరోయిన్ రూమ్‌లో మ్యాచింగ్ కలర్స్ కర్టెన్స్ కావాలి. కావల్సినవి దొరకడం లేదు. నెక్స్డే షూటింగ్. ఏం చేయాలి. అంతకుముందే మా ఫ్రెండ్ ఇంట్లో నేననుకున్న కర్టెన్స్ చూసినట్టు గుర్తు. వెంటనే పది గంటల రాత్రి వేళ స్క్రూడ్రైవర్ తీసుకుని వాళ్లింటికి బయలుదేరాను. నన్నలా చూసి మావాడు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా, తనే నెమ్మదిగా ఊడదీసి ఇచ్చాడు. మళ్లీ షూటింగ్ అవగానే తీసుకెళ్లి అలాగే పెట్టేశాను. షూటింగ్ గొరిల్లా ఫిలిం మేకింగ్‌లా ఎక్కడ పడితే అక్కడ, ఎలా వీలైతే అలా చేసేశాం. ఒకరోజు పొద్దున్నే తొమ్మిదిన్నరకు ఖైరతాబాద్ జంక్షన్లో షూట్ చేయాల్సి వచ్చింది. నరేశ్ హీరోయిన్‌తో బైక్ మీద ఫ్లై ఓవర్ మీదుగా రాంగ్ రూట్లో రావాలి. అటు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వచ్చే సమయం కూడా అదే. ఏమైనా సరే అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తిచేయాలి. అందుకోసం ఓ స్కెచ్ వేశాం. ట్రాఫిక్ రిలీజ్ అవగానే, నరేశ్ రాంగ్ రూట్లో వెళ్లాలి. ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మా ఆర్టిస్ట్ వాళ్లకు అడ్డంగా వెళ్లి పట్టుకోవాలి. అప్పుడు మా వెహికిల్స్ వచ్చి కెమెరాను, ఆర్టిస్టులను తీసుకుని వెళ్లాలి. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అసలు అక్కడ ఉన్న నిజమైన పోలీసులకు కూడా మేం షూట్ చేసిన విషయం తెలియదు. అంతా గప్‌చుప్‌గా అయిదు నిమిషాల్లో జరిగిపోయింది. సినిమా చాలావరకు ఒక అపార్ట్మెంట్లోనే జరిగింది. మారేడ్‌పల్లిలో మాకు తెలిసినవాళ్ల అపార్ట్మెంట్లో షూటింగ్ చేశాం. పదిహేను రోజులకు కేవలం ఇరవై ఐదు వేలు తీసుకున్నారు. ఇప్పుడైతే అలా చేయలేమేమో! ఇక క్లైమాక్స్ ఒకే ఒక రోజులో షూట్ చేయాలనుకున్నాం. అందుకు కాచిగూడ రైల్వేస్టేషన్లో ఒక రైలు అద్దెకు తీసుకున్నాం. ఏమీ తినకుండా కేవలం జ్యూసులతోనే అందరం తెగ కష్టపడుతున్నాం. సాయంత్రం అయిదవగానే, రైల్వే అఫిషియల్ వచ్చి మీ టైమ్ అయిపోయింది, క్లోజ్ చేయండి అన్నాడు. ఒకే ఒక్క షాట్ బ్యాలన్స్ ఉంది అని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడికి వేరే ట్రైన్ వస్తుంది కాబట్టి, మరో ప్లాట్‌ఫామ్ మీద షూట్ చేసుకోమన్నారు. ఈ లొకేషన్‌ను, ఆ లొకేషన్‌ను ఎలా మ్యాచ్ చేయాలి అని ఆలోచనలో పడ్డాను. కెమెరా యాంగిల్స్ ద్వారా మేనేజ్ చేద్దాం అని నిర్ణయించుకునేలోపు భారీ వర్షం. ఏం చేయాలో అర్థం కాలేదు. పదిహేను నిమిషాల తరువాత వర్షం వెలిసి ఎండ వచ్చేసింది. హడావుడిగా షాట్ పూర్తిచేసేసి కారులో కూర్చోగానే, మళ్లీ వర్షం. ఇలా ఎన్నో అవాంతరాలు అధిగమించి, షూటింగ్ పూర్తిచేశాం. నా అన్ని సినిమాల్లో చాలా పద్ధతిగా జరిగిన సినిమా అల్లరి. సినిమా అంతా నా కంట్రోల్లోనే తీయగలిగాను. సినిమా స్కోప్ పాపులర్‌గా ఉన్న టైమ్‌లో బడ్జెట్ తగ్గించుకోవటానికి 35 ఎం.ఎం.లో తీయాలనుకున్నాను. మేం ఎనభై లక్షల బడ్జెట్లో సినిమా తీయాలనుకుంటే, ఎనభై నాలుగు లక్షలైంది. యాభై వేల అడుగుల్లో తీయాలనుకుంటే, యాభై వేల నాలుగు వందల అడుగుల్లో తీశాం. నలభై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తిచేయాలనుకుంటే, అలాగే జరిగింది. సినిమాటోగ్రాఫర్ నాతో పాటు యాడ్ ఫిలింస్‌లో చేశాడు కాబట్టి, నేననుకున్నట్టు ఎంటీవీ స్టైల్లో చాలా డిఫరెంట్ యాంగిల్స్‌లో తీయగలిగాం. మ్యూజిక్ డెరైక్టర్ కూడా మాతో యాడ్ ఫిలింస్‌కు పనిచేసినవాడే. అతను పదిహేను సెకన్లు, ముప్ఫై సెకన్ల ఫిలిమ్స్‌కు అలవాటుపడ్డాడు కాబట్టి, మన తరహా నాలుగైదు నిమిషాల పాటలకు, రీ-రికార్డింగ్‌కు కొంత ట్యూన్ చేయాల్సి వచ్చింది. ‘అల్లరి’ విడుదలైన తరువాత ప్రేమకథల్లో ఒక కల్ట్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత లవ్‌స్టోరీలు తీసే విధానం, చూసే విధానం కూడా మారింది. -కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: మొదటి టైటిల్ ప్రేమ తొక్క తోలు
కలలు కనేవాళ్లు.. ఒక ఆశయాన్ని నమ్మేవాళ్లు భవిష్యత్తును బలంగా విశ్వసించేవాళ్లు అందుకోసం ధైర్యంగా ముందడుగు వేసేవాళ్లు... ఎక్కడో ఏ మూలో సంచరిస్తున్నా చేయవలసిన మహత్కార్యమేదో వారందరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది. ఒక సామాజిక సృజనకు అగ్గి రాజేస్తుంది. అలా వెండితెరపై ఒక అందమైన ప్రేమకథను వెలిగించిన క్షణాలు ఎలా మొదలయ్యాయో దర్శకురాలు నందినీరెడ్డి మాటల్లో... నాకు మొదటి నుంచీ రొమాంటిక్ కామెడీలంటే చాలా ఇష్టం. ఒక ప్రేమికురాలిగా నేను రొమాంటిక్ కామెడీలను చాలా ఎంజాయ్ చేస్తాను. అవి ఒత్తిడి నుంచి బయటపడేసి, మనసును ఆహ్లాదపరుస్తాయి. నేను చేసే సినిమా కూడా అలాగే ఉండాలనుకునేదాన్ని. అలా ఆలోచిస్తున్నప్పుడు, మనసులో ఒక ఐడియా తళుక్కుమంది. ఒక సంక్లిష్ట సన్నివేశంలో అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు తారసపడతారు. ఒకమ్మాయి, అబ్బాయి రొటీన్‌గా కలుసుకునే పరిస్థితుల కన్నా ఇది చాలా భిన్నంగా ఉందని భావించాను. ఈ ఆలోచనల క్రమం నన్ను వెంటాడుతున్నప్పుడు నా ఫ్రెండ్, తమిళ సినిమా ‘వెప్పమ్’ డెరైక్టర్ అంజనా అలీఖాన్‌తో తరచూ మాట్లాడేదాన్ని. మా ఇద్దరి చర్చా ఫలితమే ‘అలా మొదలైంది’ మూలకథ. కథపై ఒక స్పష్టత వచ్చాక, ఓ పది నిమిషాల పాటు నానికి న్యారేషన్ ఇచ్చాను. వింటున్నప్పుడు తను చాలా ఉద్వేగానికి లోనయ్యారు. సినిమాకు ప్రేమ తొక్క తోలు అనే టైటిల్ అనుకున్నాం. తరువాత నాకున్న బద్దకం కారణంగా, స్క్రిప్ట్ రాయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంజన స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాకు పది రోజుల గడువు పెట్టింది. దాంతో ఇక రాయక తప్పలేదు. కాగితాలు ముందు పెట్టుకొని కూర్చున్నప్పుడు, నా అనుభవంలోకి వచ్చిన మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు కథలోకి అందంగా ఒదిగిపోయాయి. అదే సమయంలో వెన్ హ్యారీ మెట్ సాల్లీ, ఎ లాట్ లైక్ లవ్ సినిమాలు అదే పనిగా చూశాను. అన్ని ఆలోచనలు, ఊహలు కలబోసి అరవై సీన్లతో కూడిన స్క్రిప్ట్ రెడీ చేశాను. క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్లు మళ్లీ ఒక పెళ్లిలో కలవడం, ఒక అందమైన సంభాషణతో సినిమాను ముగించడం బావుంటుందనుకున్నాను. అయితే ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ప్రియదర్శన్ తరహా కన్ఫ్యూజన్ క్లైమాక్స్‌కు బాగుంటుందని మార్పులు చేశాను. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత ఇంకేదో అసంతృప్తి నన్ను వేధించడం మొదలుపెట్టింది. ఒక విభిన్నమైన పాత్రను సృష్టించి, కథకు మరింత బలం తీసుకురావాలనిపించింది. ‘ఇన్ జులై’ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు ఒకదానికొకటి తప్పుగా అన్వయించుకునే పరిస్థితులు ఫన్ క్రియేట్ చేస్తాయి. ఆ స్ఫూర్తితో ‘జాన్ అబ్రహామ్’ పాత్రను క్రియేట్ చేశాను. జాన్ అబ్రహామ్ ప్రొఫెషనల్ కిడ్నాపర్ అయినా, అతనిలోని హ్యూమర్ యాంగిల్‌తో హ్యూమర్‌ను పండించాలనుకున్నాను. ప్రేక్షకుల మనసులో చెలరేగే ప్రశ్నలను వాళ్ల తరపున నానిని అడగటానికి జాన్ అబ్రహామ్ పాత్రను వాడుకున్నాను. ఈ పాత్రను నేను చాలా ప్రేమించాను. కానీ మా టీమ్ మాత్రం ఈ పాత్ర పట్ల కన్విన్స్ అవలేదు. దాంతో ఆ పాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టేశాను. సినిమా మూడు షెడ్యూల్స్ అయ్యాక, నా ఫ్రెండ్, సినిమాల్లో కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ సెట్స్‌కు వచ్చాడు. నేను అతనికి జాన్ అబ్రహామ్ పాత్ర గురించి చెప్తున్నప్పుడు, కన్విన్స్ అయి, ప్రొడ్యూసర్‌ను ఒప్పించాడు. ఈ క్యారెక్టర్ ఆశిష్ విద్యార్థి చేస్తే బాగుంటుందని అనుకున్నా. అయితే ప్రకాశ్‌రాజ్‌తో నాకున్న పరిచయం వల్ల, ఈ పాత్ర గురించి చెప్పా. ఆయనకు బాగా నచ్చింది కానీ, తను దాదాపు అలాంటి పాత్రే ‘ఆరెంజ్’ సినిమాలో చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆశిష్ విద్యార్థికి తన క్యారెక్టర్ న్యారేట్ చేశాను. అతనికి బాగా నచ్చి, తన రెమ్యూనరేషన్ చెప్పాడు. కానీ అది మా బడ్జెట్‌కు మించిన వ్యవహారం. కొన్ని రోజుల తరువాత ఆశిష్ విద్యార్థి మాకు ఫోన్ చేసి, మా కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమయ్యానని చెప్పాడు. ‘ఐస్ ఏజ్’ సినిమాలో ఫ్క్రాట్ పాత్ర నాకు చాలా నచ్చింది. అది కథలో భాగం కాకపోయినా, పరిస్థితుల్ని అయోమయంలోకి నెట్టేసి, విపరీతమైన హాస్యాన్ని కురిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఈ కథలో రాయాలనుకున్నాను. అదే సమయంలో ఈ కథలో రెసిషన్‌లో ఉద్యోగం కోల్పోయిన పాత్ర ఉండాలన్నారు. రచయిత భూపాల్ కథలో ఒక తాగుబోతు పాత్ర ఉండాలన్నారు. ఆ పాత్రకు రమేశ్ బాగుంటాడని చెప్పాడు. క్లైమాక్స్‌లో జాన్ అబ్రహామ్కు భార్య నుంచి ఫోన్ వస్తుంది. ఆ భార్య పేరు చాలా ఫన్నీగా ఉండాలని అందుకోసం వెతుకుతున్నాం. అప్పుడు ఆశిష్ విద్యార్థి కపిలేశ్వరమ్మ అని పేరు చెప్పారు. సినిమా విడుదలయ్యాక, ఫేస్బుక్లో ఒకరు తమ కుక్కకు కపిలేశ్వరమ్మ అని పేరు పెట్టామని నాకు పోస్ట్ చేశారు. సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆశిష్‌తో కొంత షూట్ బ్యాలన్స్ ఉంది. తనతో షూట్ చేయాల్సిన రోజు ముందు రాత్రి నుంచీ విపరీతంగా వర్షం. మరుసటిరోజు తను యూఎస్ వెళ్లాలి. దాదాపు రెండు నెలల వరకు తను తిరిగి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నాలుగున్నరకు లేచి చూస్తే వర్షం ఏమాత్రం తగ్గలేదు. ఏడున్నర సమయంలో పెట్రోల్ బంక్‌లో ఫ్రెండ్స్ అంతా కలిసే సీన్ షూట్ చేశాను. ఆ సీన్ అవగానే, వర్షం తగ్గిపోయింది. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. కానీ అంతలోనే మరో టెన్షన్. నాని, ఆశిష్ విద్యార్థిల సీన్ తీస్తున్నప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నెగెటివ్ ఒక క్లాన్ మాత్రమే ఉందని చెప్పాడు. అంటే నాలుగు వందల ఫీట్ ఫిలింతో ఆ సీన్ పూర్తి చేయాలి. ఇద్దరి డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ తీసుకోవాలి. కానీ ఫిలిం సరిపోయేలా లేదు. ముందు ఆశిష్ విద్యార్థి డైలాగ్స్ ఫినిష్ చేద్దామనుకున్నాం. అప్పుడు నాని, ఆశిష్ విద్యార్థి మొత్తం డైలాగ్స్ అవసరం లేదు, తను మధ్యమధ్యలో మాట్లాడితే చాలు. నేను ఒకేసారి డైలాగ్స్ చెప్పేస్తానని అన్నాడు. కంటిన్యూస్‌గా కెమెరా రోల్ అవుతూనే ఉంది. నాని డైలాగ్స్ చెబుతుండగా, సడన్‌గా రీల్ అయిపోయింది. నేననుకున్నది మొత్తం వచ్చిందో లేదోనని ఎడిట్ రూమ్‌కు వెళ్లేవరకు ఒకటే టెన్షన్. అలా ఎన్నో ఒడిదుడుకులతో షూటింగ్ పూర్తయింది. నిత్యామీనన్, రోహిణి, స్నేహ ఉల్లాల్... ఆర్టిస్టులందరూ ఇది మాది అనుకుని సహకరించారు కాబట్టే, సినిమా సజావుగా జరిగింది. నాని అందించిన సహకారం స్నేహితురాలిగా ఎప్పటికీ మరిచిపోలేను. క్లైమాక్స్‌లో నాని నిత్యకు తన ప్రేమను చెప్పేటప్పుడు రాసిన డైలాగ్‌లు తనవే. చాలా న్యాచురల్‌గా వచ్చాయి. అసలు క్లైమాక్స్ సీన్లో అన్ని పాత్రలను హ్యాండిల్ చేయడానికి నేను ఇబ్బంది పడినప్పుడు రచయిత అనిల్ రావిపూడి నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కారణం పాత్రల సహజత్వమే. నాని ముందుగానే తెలుసు కాబట్టి తన బాడీ ల్యాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రను డిజైన్ చేశాను. నిత్య పరిచయమైన తరువాత తన ఆలోచనలు, హావభావాలు దృష్టిలో ఉంచుకుని పాత్రలో ముప్ఫై శాతం మార్పులు చేశాను. నాని, నిత్యల మధ్య వాదనలు జరిగినప్పుడు వాళ్ల నిజ జీవితంలో ఎదురైన పరిస్థితులకు దగ్గరగా ప్రవర్తించారు. అలా సినిమా అంతా పాత్రలు తమ అసలు స్వభావంతోనే ప్రవర్తిస్తాయి. అది కూడా సినిమాను బలోపేతం చేయడంలో తోడ్పడింది. ఈ సినిమాకు సంబంధించి, చివరగా మొదటగా చెప్పుకోవలసింది ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గురించి. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఫైనాన్షియర్స్ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆయన వెనక్కు తగ్గలేదు. ‘అలా మొదలైంది’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు, టైటిల్ క్యాచీగా లేదని డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఒత్తిడి చేసినా, అంతిమంగా ఆయన నా అభిప్రాయానికే విలువిచ్చారు. టైటిల్ సజెస్ట్ చేసినందుకు సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్‌కు థ్యాంక్స్ చెప్పాలి. తరానికీ తరానికీ విలువలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ విలువల్లో వచ్చిన మార్పులు, సంబంధాల్లో వచ్చిన తేడాల్ని ఈ చిత్రంలో చెప్పాలనుకున్నాను. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. ఈ విజయం ఆ సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిదీ. -కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశాం
దారం పూలను కలిపినట్టుగా బంధం మనుషుల్ని కట్టిపడేస్తుంది.బాధ్యత పరిధులు దాటినప్పుడు బంధం ఒక్కోసారి బంధనమవుతుంది.సున్నితమైన రేకులతో అందంగా అమరిన సంబంధాలు ఏమాత్రం కదిలినా ముళ్లలా తాకి మనసును గాయపరుస్తాయి.ఎగిరే రెక్కలను ప్రేమతో కట్టిపడేసి, పరిగెత్తే పాదాలకు పరిమితులు గీసినప్పుడు అందమైన బొమ్మరిల్లు లాటి ఊహలు ఎలా కుప్పకూలుతాయో,అనుబంధాలు ఎలా ముక్కలవుతాయో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు భాస్కర్. ఆయన తొలియత్నం తాలూకు అనుభవాల పరంపర ఆయన మాటల్లోనే. కధ చెప్పడం మొదలుపెట్టాను. దిల్ రాజు గారు నిశితంగా నాకేసి చూస్తూ,ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఒక్కో సీన్ చెప్పుకుంటూ పోతున్నాను. ఒక్కసారిగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటిదాకా కళ్లమాటున దాగిన కన్నీళ్లు కనురెప్పల కట్టల్ని తెంచుకుని దూకాయి. నా పరిస్ధితీ అంతే. ఒక్కసారిగా ఏడ్చేశాను. సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే. చివరకు సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. ఇతమందిని కదిలించిన కధ ఊహల్లోంచి ఊడిపడలేదు. జీవితంలోంచి ఉబికివచ్చింది. నాతో పాటు,నా చుట్టూ మనుషుల జీవితాల్లోంచి. కథ, పాత్రలు వాటి చుట్టూతా అల్లుకున్న భావోద్వేగాలు ఇవన్నీ రక్తమాంసాలతో మనందరి చుట్టూ తిరుగాడేవే. చెన్నైలో అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు మొదటిసారిగా బొమ్మరిల్లు కధ నా మనసును తట్టింది. ఎప్పటినుంచో నా మనసులో మెదలుతున్న రకరకాల భావాలు కథకు బీజం వేశాయి. తండ్రీ కొడుకుల మధ్య సహజంగా ఉండే కమ్యూనికేషన్ గ్యాప్, తరువాత ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉండటం, టైటిల్స్ ప్రెజెంటేషన్... లోపల విడివిడిగా ఉన్న ఆలోచనలు ఒక స్పష్టమైన కథారూపం తీసుకోసాగాయి. ఐతే, మొదటి దశ అక్కడికే ఆగిపోయింది. దాన్ని స్క్రిప్ట్‌గా మలచాలన్న సీరియస్‌నెస్ లేకపోవడంతో కథ అక్కడితో ఆగింది. కానీ నా మిత్రుడు, దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ గురించి అప్పుడప్పుడూ గుర్తుచేసేవాడు. కొంత కాలం తరువాత తట్టిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తిరిగి, నన్ను స్క్రిప్ట్వైపు పురిగొల్పింది. స్క్రిప్ట్ రాస్తున్న క్రమంలో వినాయక్ కో-డెరైక్టర్ వాసు చాలా హెల్ప్ చేశాడు. బొమ్మరిల్లులో ప్రకాష్‌రాజ్‌కి, మా నాన్నకు పెద్ద తేడా లేదు. ఒక మంచి నాన్నగా తను నాకు కావలసినవన్నీ సమకూర్చేవాడు. నేను నాకు నప్పే డ్రెస్‌లు వేసుకోవాలనుకునేవాణ్ని. కానీ మా నాన్న నాతో షాపింగ్‌కు వచ్చి, నాకు నచ్చని కలర్స్ సెలక్ట్ చేసేవాడు. నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక, తను సెలక్ట్ చేసిన డ్రెస్‌లు వేసుకునేవాణ్ని. తన సంతోషం కోసం నా ఇష్టాలు చంపుకునేవాడిని. ఇది అంతర్గతంగా నా మీద ప్రభావం చూపించింది. నాతో పాటు కొంతమంది మిత్రుల నాన్నల నుంచి ప్రకాష్‌రాజ్ పాత్ర రాసుకున్నాను. జెనీలియా పాత్ర కూడా నిజ జీవితంలోంచి వచ్చిందే. ఒకసారి పొరబాటున నా తల ఒకమ్మాయి తలకు తాకింది. నేను వెంటనే సారీ చెప్పాను. ఆ అమ్మాయి మళ్లీ నా దగ్గరకు వచ్చింది. మళ్లీ సారీ చెప్పాను. మరి కొమ్ములు అంది అమ్మాయి. నాకర్థం కాలేదు. కొమ్ములు రాకుండా ఉండటం కోసం తల మరోసారి తాకించాలని చెప్పింది. ఇదే సీన్ జెనీలియా ఇంట్రడక్షన్‌కు వాడుదామనుకున్నాను. కానీ వాసు అలా కాకుండా దీన్ని సినిమా అంతటా ఒక థ్రెడ్‌లా వాడుకుంటే బావుంటుందనడంతో అలాగే చేశాం. హీరో చెల్లెలు బ్యూటీషియన్ క్యారెక్టర్ మా సిస్టర్ను చూసే రాసుకున్నాను. ఎప్పుడైనా ఇంటికెళ్లాలంటే తను చేసే ఫేషియల్ గుర్తొచ్చి, భయమేసేది. ఫేషియల్ చేసి మా దగ్గర వంద రూపాయలు వసూలు చేసేది. హీరో తల్లి క్యారెక్టర్‌ను మా ఫ్రెండ్ మదర్ నుంచి తీసుకున్నాను. కిచెన్‌లో పాటలు పాడుతూ వంట చేయడం, ప్రేమగా కుటుంబానికి వడ్డించే తీరు ఇవన్నీ జయసుధ క్యారెక్టర్‌కు ఆపాదించాను. ఈ కథ మా అమ్మకు వినిపించినప్పుడు, అసలు తల్లిదండ్రులు పిల్లలకు ఎందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అంది. దాంతో ఎవరికైనా కొన్ని పరిమితులకు లోబడే స్వేచ్ఛ ఉండటమే సబబు అనుకున్నాను. అందుకే కొన్ని పరిమితులతో కూడిన స్వేచ్ఛ అవసరాన్ని తండ్రిగా కోట మనోభావాలను ప్రతిఫలించే డైలాగ్స్‌ను చివర్లో రాశాను. కథ పూర్తయ్యాక హీరో పాత్రకు సిద్ధార్ధ్ అయితేనే బాగుంటుందనుకున్నాను. ఇక హీరోయిన్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. ఈ పాత్రకు జెనీలియా న్యాయం చేస్తుందనుకుని, తనను ఎంచుకున్నాం. తండ్రి పాత్రకు ప్రకాష్‌రాజ్‌ను కథ రాస్తున్నప్పుడే నిర్ణయించుకున్నాను. కథ విన్నాక, చాలా ఇష్టంగా, తన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా బాడీ ల్యాంగ్వేజ్‌ను మలుచుకున్నారు. తల్లి పాత్రకు జయసుధగారే కరెక్ట్ అని దిల్‌రాజుగారిని ఒప్పించి తీసుకున్నాను. కోట శ్రీనివాసరావుగారు తన నటనతో పాత్రను చాలా మెరుగుపరిచారు. సినిమా షూటింగ్లో కొన్ని సన్నివేశాల్లో నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఒక రచయితగా తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు రాయాల్సివచ్చినప్పుడు, కొడుకువైపు నిలబడి చాలా ఆవేశంగా డైలాగ్స్ రాశాను. షూట్ చేస్తున్నప్పుడు చివరలో కొడుకు మాటలు విని నిస్సహాయంగా కుప్పకూలిన ప్రకాష్‌రాజ్‌ను చూశాక, తండ్రిపట్ల నాకు సానుభూతి కలగడం మొదలుపెట్టింది. తండ్రిని తప్పుగా ప్రెజెంట్ చేస్తున్నానేమోనన్న గిల్టీ ఫీలింగ్ రావడం మొదలుపెట్టింది. ఈ సీన్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. ఇదొక్కటే కాదు, చాలా సీన్స్‌లో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ ఇంట్లోంచి జెనీలియా వెళ్లిపోయేటప్పుడు చెప్పిన కారణాలు మేం చాలా కన్విన్సింగ్‌గా రాయగలిగామనిపించింది. చివరి సీన్ విషయంలో నిర్మాత దిల్ రాజుగారితో చిన్నపాటి వాదన జరిగింది. టైటిల్స్ రోల్ అయ్యేటప్పుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో సీన్స్ ఉంచుదామని నేను గట్టిగా వాదించాను. ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రేక్షకులు థియేటర్‌ను వదిలి వెళ్లరనే నమ్మకంతో ఉండేవాణ్ని. నా నమ్మకం నిజమైంది. నిజానికి క్లైమాక్స్ కోసం చాలా సీన్స్ రాసుకున్నాను. కానీ కొన్ని ప్రాక్టికల్ కారణాల వల్ల, వాటన్నింటినీ షూట్ చేయలేకపోయాను. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్ సినిమాలో ఏం ఉండాలనుకున్నానో అవన్నీ షూట్ చేయి, నిడివి గురించి నీ ఆలోచనలతో రాజీపడకు అని మొదటినుంచీ చివరిదాకా నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చారు. చివరకు సినిమా 16,200 అడుగులు అంటే దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలు వస్తే, ఆయన ఎమోషనల్ కనెక్షన్స్ ఏమాత్రం దెబ్బతినకుండా, రెండు గంటల యాభై నిమిషాలకు కుదించారు. మా టీమ్ అందించిన సహకారం కూడా బొమ్మరిల్లును అందమైన కుటుంబ కథాచిత్రంగా మలిచింది. సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి ఫిలిం స్కూల్లో నా సీనియర్. లైటింగ్, కలర్స్ విషయంలో ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డెరైక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ ముగ్గురి మధ్యా ఒక అద్భుతమైన సమన్వయం కుదిరింది. డైలాగ్స్ చాలా సహజంగా, సంభాషణల్లా ఉండాలనుకున్నాం. మా ఆలోచనలకు తగ్గట్టుగా రచయిత అబ్బూరి రవి డైలాగ్స్ చాలా సరళంగా రాశారు. సునీల్ క్యారెక్టర్‌ను తను చాలా చక్కగా మలిచారు. ఎక్కడా కృత్రిమ హాస్యం చొప్పించకుండా సన్నివేశాలకనుగుణంగా హాస్యం పండించే ప్రయత్నం చేశాం. ఇక దేవిశ్రీ ప్రసాద్‌కు కథ చెప్పి, స్వేచ్ఛగా వదిలేశాం. దాంతో అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాలో నేను చిన్న చిన్న డీటెయిల్స్ పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాను. అవి సినిమా క్వాలిటీని మరింత పెంచుతాయనేది మొదటినుంచీ నా అభిప్రాయం. ఈ విషయంలో మణిరత్నం నాకు స్ఫూర్తి. బొమ్మరిల్లు ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ప్రయాణంలో మనుషులు, బంధాలు, భావోద్వేగాలు ఒకదానికొకటి అల్లుకుని, ప్రతి ఒక్కరికీ ఇది మాకు తెలిసిన జీవితం అన్న భావనను కలుగజేశాయి.సినిమా విడుదలయ్యాక నాకు తెలిసిన చాలామంది తండ్రులు తాము పిల్లలతో వ్యవహరించే విధానంలో చాలా తేడా వచ్చింది. సినిమా విడుదలయ్యాక, మొదట రాజమౌళిగారు ఫోన్ చేసి, క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా డిజైన్ చేశావని ప్రసంశించి, పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆ తరువాత తెలుగునాట ప్రతి ఇంటా బొమ్మరిల్లు గురించి చర్చ జరిగింది. అప్పటినుంచి ఆ సినిమా పేరే నా ఇంటిపేరుగా మారిపోయింది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
తొలియత్నం: ఆ సినిమా క్రెడిట్ ‘అతనొక్కడి’దే!
అందరికీ ఒకేలా కనిపించే ప్రపంచం నీకు మాత్రమే విభిన్నంగా కనిపించినప్పుడు, నీ ఆలోచనకు మాత్రమే వేరుగా అనిపించినప్పుడు... ఈ ప్రపంచానికి నువ్వు కొత్తగా పరిచయమవుతావు. ఆ క్రమంలో నీ దృక్కోణమే నీ అస్తిత్వం అవుతుంది. అస్తిత్వానికి ఆధారభూతంగా నిలిచిన ఆలోచన... ఆలోచనలను అనుసంధించిన చైతన్యం... నిన్ను సృజన శిఖరాలపై నిలబెడుతుంది. అలా విభిన్నంగా ఆలోచిస్తూ, నిత్యనూతనంగా పురోగమిస్తూ, సినీ ప్రపంచంలో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ సురేందర్‌రెడ్డి. మొదటి సినిమా ‘అతనొక్కడే’తోనే అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తొలియత్నం ఈవారం... జర్మనీలో సాంగ్ తీస్తున్నప్పుడు మధ్యలో ఒక పనిమీద మిత్రుడితో కలిసి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాను. తను లోపలికి వెళితే, నేను బయటే ఉండిపోయాను. అంతలో కస్టమ్స్‌వాళ్లు వచ్చి, నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా దగ్గర పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్స్ ఏమీ లేవు. నా భాష వాళ్లకు, వాళ్ల భాష నాకు అర్థం కాలేదు. ఆ కాస్సేపూ నాకు నరకంలా అనిపించింది. మ్యూజిక్ ఒక్కసారే జరుగుతుంది. అనుకుని, ప్లాన్ చేస్తే జరగదు. అతనొక్కడే ఒక మ్యాజిక్ అంతే. నా కెరీర్లో అల్టిమేట్ సినిమా అది. దానికి కర్త, కర్మ, క్రియ... హీరో కళ్యాణ్‌రామ్. ఏ విషయాన్నైనా కొత్తగా చూడటం, కొత్తగా ఆలోచించటం మొదటినుంచీ నాకిష్టం. అలా ఆలోచిస్తున్న క్రమంలో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోల చుట్టూ కథ అనుకున్నాను. అప్పటికి నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా టి.ప్రభాకర్ దగ్గర పనిచేస్తున్నాను. వెంటనే డెరైక్టర్ అయిపోవాలన్న ఆలోచనేమీ ఉండేది కాదు. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉండేవాణ్ని. నేను ఈ కథ అనుకున్న ఆరు నెలలకు ‘ప్రేమదేశం’ విడుదలైంది. ఆ సినిమా చూసి నేను షాకయ్యాను. నా థాట్స్‌కు దగ్గరగా ఉన్న కథ. పర్లేదు, మనం కూడా సినిమా చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తరువాత క్రాంతికుమార్ గారి దగ్గర మూడు సినిమాలకు పని చేశాను. ఆయనతో జరిపిన డిస్కషన్స వల్లే సినిమా గురించి పూర్తిగా తెలిసింది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నీ దగ్గర ఏమైనా కథలుంటే చెప్పరా అనేవారు. నా ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నా కథలు తనకు కచ్చితంగా నచ్చవని అనుకునేవాణ్ని. ఒక మంచి ప్రేమకథ చేయాలన్న ఆలోచనలతో కథ రాసుకుని ఒకరికి వినిపించాను. బాగుంది, కానీ లవ్‌స్టోరీ కాదు, యాక్షన్ సినిమా కావాలన్నారు. కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. ఒకరోజు కాదల్కొట్టై అనే తమిళ్ (తెలుగులో ప్రేమలేఖలు) సినిమా చూస్తుండగా నాకో ఐడియా వచ్చింది. అందులో హీరో, హీరోయిన్ పక్కపక్కనే ఉంటారు. కానీ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారు. పక్కపక్కనే ఉన్నా తాము ప్రేమిస్తున్నది వీళ్లనే అని ఒకరికొకరికి తెలియదు. ఈ పాయింట్ నన్ను పట్టేసింది. దీన్ని యాక్షన్ సినిమాగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. చాలా స్పీడ్‌గా కథ అల్లుకున్నాను. హీరో హీరోయిన్స్ ఒకే ఇంటి నుంచి వస్తారు. ఒకే లక్ష్యంతో ఉంటారు. కానీ, ఒకరికొకరికి పరిచయం ఉండదు. కథ మీద నాకో క్లారిటీ వచ్చాక దిల్ రాజుగారిని కలిశాను. అప్పుడాయన ‘దిల్’ షూటింగ్లో ఉన్నారు. కథ విని బాగుంది, తరువాత చేద్దామన్నారు. అప్పటికే ఆయన సుకుమార్‌కు మాటిచ్చారు. అదయితే కానీ నా సినిమా మొదలు కాదు. అప్పటికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి, నేనే వెనక్కి వచ్చేశాను. ఈ కథకు ఒక యంగ్ హీరో కావాలి, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు కళ్యాణ్‌రామ్ మనసులో మెదిలాడు. అప్పటికి తన మొదటి సినిమా పూర్తయింది కానీ ఇంకా రిలీజ్ అవలేదు. కథ చెప్పగానే తనకు చాలా నచ్చింది. ఇద్దరం కలిసి చాలామంది దగ్గరికి తిరిగాం. అందరూ చేద్దాం, చూద్దామనేవారే తప్ప ప్రాజెక్ట్ ఇంచి కూడా ముందుకు కదలలేదు. ఎక్కడ మొదలైన సీన్ అక్కడే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నా గుండె ధైర్యం చెదరకుండా వెన్నుతట్టి కళ్యాణ్‌రామ్ తానే సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. కళ్యాణ్‌రామ్ హీరోతో పాటు ఈ సినిమాకి నిర్మాత కూడా అవడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాని నేనే నిర్మిస్తాను అని ఆయన ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ క్షణం నుంచీ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేనే ప్రాణంగా భావించాను నేను. అందులో చాలా ప్రయోగాలు చేశాను. అయితే ఫండమెంటల్స్ విషయంలో రైటర్స్‌కు, నాకు మధ్య చాలా అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎవరేం చెప్పినా వినకూడదని ముందు ఫిక్సయ్యాను కాబట్టి, నా ఆలోచనలను అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించాను. చివరకు వాళ్లు కన్విన్స్ అయ్యారు. కెమెరామెన్ రాంప్రసాద్ చాలా సీనియర్. మొదటిరోజు మొదటి షాట్ తీయగానే ఆయనేంటో నాకు అర్థమైంది. నా ఆలోచనలను అర్థం చేసుకుని చాలాసార్లు నేననుకున్నదాని కంటే బెటర్ అవుట్‌పుట్ ఇచ్చేవారాయన. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం నేను చాలా ఇబ్బంది పడిపోయాను. పాటల కోసం ఆస్ట్రియా వెళ్లినప్పుడు, చలి మైనస్‌లలో ఉండటంతో చాలా కష్టమనిపించింది. తరువాత జర్మనీలో సాంగ్ తీస్తున్నప్పుడు మధ్యలో ఒక పనిమీద మిత్రుడితో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాను. తను లోపలికి వెళితే, నేను బయటే ఉండిపోయాను. అంతలో కస్టమ్స్‌వాళ్లు వచ్చి, నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా దగ్గర పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్స్ ఏమీ లేవు. నా భాష వాళ్లకు, వాళ్ల భాష నాకు అర్థం కాలేదు. ఆ కాస్సేపూ నాకు నరకంలా అనిపించింది. వాళ్లు హైదరాబాద్‌కు ఫోన్‌చేసి క్లారిఫికేషన్ తీసుకుని, రెండు గంటల పాటు ఇంటరాగేషన్ తరువాత విడిచిపెట్టారు. నేను బయటికి వచ్చే సమయానికి నా ఫ్రెండ్ తన పని పూర్తి చేసుకుని వచ్చాడు. తనకు జరిగిన విషయమంతా తెలీదు. సినిమా ట్రావెలింగ్‌లో నాకు, కళ్యాణ్‌రామ్‌కి మధ్య ఒక అందమైన బంధం ఏర్పడింది. దాంతో ఒక్క షాట్ విషయంలో కూడా రాజీపడకుండా సినిమా పూర్తిచేశాను. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటర్ గౌతంరాజుగారు చాలా కో-ఆపరేట్ చేశారు. నా ఆలోచనలకనుగుణంగా ఆయన ఎడిటింగ్‌లో సహకరించారు. ఎందుకంటే అప్పటికి మన సినిమాల్లో అడ్వాన్స్ కటింగ్, రివర్స కటింగ్ లాంటివి లేవు. ఆ తరువాత చాలామంది ‘అతనొక్కడే’లో చేసిన కటింగ్ కావాలని తనను అడిగారని గౌతంరాజు చాలాసార్లు చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ చూశాక, మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. గౌతంరాజు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. సినిమా విడుదలయ్యాక, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసిన చాలామంది నేను ఇలాంటి సినిమా తీస్తానని, తీయగలనని అనుకోలేదని ఫోన్ చేసి మరీ అభినందించారు. అంతకంటే గొప్ప ప్రశంస ఇంకేముంటుంది! అనుకోనంత వేగంగా దర్శకుడి ని అయ్యాను. అంతే వేగంగా సినిమాని పూర్తి చేయగలిగాను. రెస్పాన్స చూశాక ఎంతో తృప్తిగా అనిపించింది. ఇదంతా కళ్యాణ్‌రామ్ వల్లనేనని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. నేనీ రోజు ఇలా ఉన్నానంటే, కారణం కళ్యాణ్‌రామ్. అతను ప్రొడ్యూసర్ అవడం వల్లే ఈ సినిమాను అనుకున్నట్టుగా తీయగలిగాను. - కె.క్రాంతికుమార్‌రెడ్డి