తొలియత్నం: క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశాం | We cried while narrating the Bommarillu climax scene , says Bhaskar | Sakshi
Sakshi News home page

తొలియత్నం: క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశాం

Published Sun, Nov 10 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

తొలియత్నం: క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశాం

తొలియత్నం: క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశాం

దారం పూలను కలిపినట్టుగా బంధం మనుషుల్ని కట్టిపడేస్తుంది.బాధ్యత పరిధులు దాటినప్పుడు బంధం ఒక్కోసారి బంధనమవుతుంది.సున్నితమైన రేకులతో అందంగా అమరిన సంబంధాలు ఏమాత్రం కదిలినా ముళ్లలా తాకి మనసును గాయపరుస్తాయి.ఎగిరే రెక్కలను ప్రేమతో కట్టిపడేసి, పరిగెత్తే పాదాలకు పరిమితులు గీసినప్పుడు అందమైన బొమ్మరిల్లు లాటి ఊహలు ఎలా కుప్పకూలుతాయో,అనుబంధాలు ఎలా ముక్కలవుతాయో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు భాస్కర్. ఆయన తొలియత్నం తాలూకు అనుభవాల పరంపర ఆయన మాటల్లోనే.
 
 కధ చెప్పడం మొదలుపెట్టాను. దిల్ రాజు గారు నిశితంగా నాకేసి చూస్తూ,ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఒక్కో సీన్ చెప్పుకుంటూ పోతున్నాను. ఒక్కసారిగా ఆయన  ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటిదాకా కళ్లమాటున దాగిన కన్నీళ్లు కనురెప్పల కట్టల్ని తెంచుకుని దూకాయి. నా పరిస్ధితీ అంతే. ఒక్కసారిగా ఏడ్చేశాను. సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే.  చివరకు సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు.
 
 ఇతమందిని కదిలించిన కధ ఊహల్లోంచి ఊడిపడలేదు. జీవితంలోంచి ఉబికివచ్చింది. నాతో పాటు,నా చుట్టూ మనుషుల జీవితాల్లోంచి. కథ, పాత్రలు వాటి చుట్టూతా అల్లుకున్న భావోద్వేగాలు ఇవన్నీ రక్తమాంసాలతో మనందరి చుట్టూ తిరుగాడేవే. చెన్నైలో అడయార్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడు మొదటిసారిగా బొమ్మరిల్లు కధ నా మనసును తట్టింది. ఎప్పటినుంచో నా మనసులో మెదలుతున్న రకరకాల భావాలు కథకు బీజం వేశాయి. తండ్రీ కొడుకుల మధ్య సహజంగా ఉండే కమ్యూనికేషన్ గ్యాప్, తరువాత ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉండటం, టైటిల్స్ ప్రెజెంటేషన్... లోపల విడివిడిగా ఉన్న ఆలోచనలు ఒక స్పష్టమైన కథారూపం తీసుకోసాగాయి. ఐతే, మొదటి దశ అక్కడికే ఆగిపోయింది. దాన్ని స్క్రిప్ట్‌గా మలచాలన్న సీరియస్‌నెస్ లేకపోవడంతో కథ అక్కడితో ఆగింది. కానీ నా మిత్రుడు, దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ గురించి అప్పుడప్పుడూ గుర్తుచేసేవాడు. కొంత కాలం తరువాత తట్టిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తిరిగి, నన్ను స్క్రిప్ట్‌వైపు పురిగొల్పింది.
 
 స్క్రిప్ట్ రాస్తున్న క్రమంలో వినాయక్ కో-డెరైక్టర్ వాసు చాలా హెల్ప్ చేశాడు. బొమ్మరిల్లులో ప్రకాష్‌రాజ్‌కి, మా నాన్నకు పెద్ద తేడా లేదు. ఒక మంచి నాన్నగా తను నాకు కావలసినవన్నీ సమకూర్చేవాడు. నేను నాకు నప్పే డ్రెస్‌లు వేసుకోవాలనుకునేవాణ్ని. కానీ మా నాన్న నాతో షాపింగ్‌కు వచ్చి, నాకు నచ్చని కలర్స్ సెలక్ట్ చేసేవాడు.  నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక, తను సెలక్ట్ చేసిన డ్రెస్‌లు వేసుకునేవాణ్ని. తన సంతోషం కోసం నా ఇష్టాలు చంపుకునేవాడిని. ఇది అంతర్గతంగా నా మీద ప్రభావం చూపించింది. నాతో పాటు కొంతమంది మిత్రుల నాన్నల నుంచి ప్రకాష్‌రాజ్ పాత్ర రాసుకున్నాను.
 
 జెనీలియా పాత్ర కూడా నిజ జీవితంలోంచి వచ్చిందే. ఒకసారి పొరబాటున నా తల ఒకమ్మాయి తలకు తాకింది. నేను వెంటనే సారీ చెప్పాను. ఆ అమ్మాయి మళ్లీ నా దగ్గరకు వచ్చింది. మళ్లీ సారీ చెప్పాను. మరి కొమ్ములు అంది అమ్మాయి. నాకర్థం కాలేదు. కొమ్ములు రాకుండా ఉండటం కోసం తల మరోసారి తాకించాలని చెప్పింది. ఇదే సీన్ జెనీలియా ఇంట్రడక్షన్‌కు వాడుదామనుకున్నాను. కానీ వాసు అలా కాకుండా దీన్ని సినిమా అంతటా ఒక థ్రెడ్‌లా వాడుకుంటే బావుంటుందనడంతో అలాగే చేశాం. హీరో చెల్లెలు బ్యూటీషియన్ క్యారెక్టర్ మా సిస్టర్‌ను చూసే రాసుకున్నాను. ఎప్పుడైనా ఇంటికెళ్లాలంటే తను చేసే ఫేషియల్ గుర్తొచ్చి, భయమేసేది. ఫేషియల్ చేసి మా దగ్గర వంద రూపాయలు వసూలు చేసేది. హీరో తల్లి క్యారెక్టర్‌ను మా ఫ్రెండ్ మదర్ నుంచి తీసుకున్నాను.  కిచెన్‌లో పాటలు పాడుతూ వంట చేయడం, ప్రేమగా కుటుంబానికి వడ్డించే తీరు ఇవన్నీ జయసుధ క్యారెక్టర్‌కు ఆపాదించాను.
 
 ఈ కథ మా అమ్మకు వినిపించినప్పుడు, అసలు తల్లిదండ్రులు పిల్లలకు ఎందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అంది. దాంతో ఎవరికైనా కొన్ని పరిమితులకు లోబడే స్వేచ్ఛ ఉండటమే సబబు అనుకున్నాను. అందుకే కొన్ని పరిమితులతో కూడిన స్వేచ్ఛ అవసరాన్ని తండ్రిగా కోట మనోభావాలను ప్రతిఫలించే డైలాగ్స్‌ను చివర్లో రాశాను. కథ పూర్తయ్యాక హీరో పాత్రకు సిద్ధార్ధ్ అయితేనే బాగుంటుందనుకున్నాను. ఇక హీరోయిన్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. ఈ పాత్రకు జెనీలియా న్యాయం చేస్తుందనుకుని, తనను ఎంచుకున్నాం. తండ్రి పాత్రకు ప్రకాష్‌రాజ్‌ను కథ రాస్తున్నప్పుడే నిర్ణయించుకున్నాను.
 
 కథ విన్నాక, చాలా ఇష్టంగా, తన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా బాడీ ల్యాంగ్వేజ్‌ను మలుచుకున్నారు. తల్లి పాత్రకు జయసుధగారే కరెక్ట్ అని దిల్‌రాజుగారిని ఒప్పించి తీసుకున్నాను. కోట శ్రీనివాసరావుగారు తన నటనతో పాత్రను చాలా మెరుగుపరిచారు. సినిమా షూటింగ్‌లో కొన్ని సన్నివేశాల్లో నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఒక రచయితగా తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు రాయాల్సివచ్చినప్పుడు, కొడుకువైపు నిలబడి చాలా ఆవేశంగా డైలాగ్స్ రాశాను. షూట్ చేస్తున్నప్పుడు చివరలో కొడుకు మాటలు విని నిస్సహాయంగా కుప్పకూలిన ప్రకాష్‌రాజ్‌ను చూశాక, తండ్రిపట్ల నాకు సానుభూతి కలగడం మొదలుపెట్టింది. తండ్రిని తప్పుగా ప్రెజెంట్ చేస్తున్నానేమోనన్న గిల్టీ ఫీలింగ్ రావడం మొదలుపెట్టింది. ఈ సీన్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. ఇదొక్కటే కాదు, చాలా సీన్స్‌లో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ ఇంట్లోంచి జెనీలియా వెళ్లిపోయేటప్పుడు చెప్పిన కారణాలు మేం చాలా కన్విన్సింగ్‌గా రాయగలిగామనిపించింది. చివరి సీన్ విషయంలో నిర్మాత దిల్ రాజుగారితో చిన్నపాటి వాదన జరిగింది.
 
 టైటిల్స్ రోల్ అయ్యేటప్పుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో సీన్స్ ఉంచుదామని నేను గట్టిగా వాదించాను. ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రేక్షకులు థియేటర్‌ను వదిలి వెళ్లరనే నమ్మకంతో ఉండేవాణ్ని. నా నమ్మకం నిజమైంది. నిజానికి క్లైమాక్స్ కోసం చాలా సీన్స్ రాసుకున్నాను. కానీ కొన్ని ప్రాక్టికల్ కారణాల వల్ల, వాటన్నింటినీ షూట్ చేయలేకపోయాను. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్ సినిమాలో ఏం ఉండాలనుకున్నానో అవన్నీ షూట్ చేయి, నిడివి గురించి నీ ఆలోచనలతో రాజీపడకు అని మొదటినుంచీ చివరిదాకా నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చారు. చివరకు సినిమా 16,200 అడుగులు అంటే దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలు వస్తే, ఆయన ఎమోషనల్ కనెక్షన్స్ ఏమాత్రం దెబ్బతినకుండా, రెండు గంటల యాభై నిమిషాలకు కుదించారు.
 
 మా టీమ్ అందించిన సహకారం కూడా బొమ్మరిల్లును అందమైన కుటుంబ కథాచిత్రంగా మలిచింది. సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి ఫిలిం స్కూల్‌లో నా సీనియర్. లైటింగ్, కలర్స్ విషయంలో ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డెరైక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ ముగ్గురి మధ్యా ఒక అద్భుతమైన సమన్వయం కుదిరింది. డైలాగ్స్ చాలా సహజంగా, సంభాషణల్లా ఉండాలనుకున్నాం. మా ఆలోచనలకు తగ్గట్టుగా రచయిత అబ్బూరి రవి డైలాగ్స్ చాలా సరళంగా రాశారు. సునీల్ క్యారెక్టర్‌ను తను చాలా చక్కగా మలిచారు. ఎక్కడా కృత్రిమ హాస్యం చొప్పించకుండా సన్నివేశాలకనుగుణంగా హాస్యం పండించే ప్రయత్నం చేశాం. ఇక దేవిశ్రీ ప్రసాద్‌కు కథ చెప్పి, స్వేచ్ఛగా వదిలేశాం. దాంతో అద్భుతమైన సంగీతం అందించారు.
 
 సినిమాలో నేను చిన్న చిన్న డీటెయిల్స్ పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాను. అవి సినిమా క్వాలిటీని మరింత పెంచుతాయనేది మొదటినుంచీ నా అభిప్రాయం. ఈ విషయంలో మణిరత్నం నాకు స్ఫూర్తి.
  బొమ్మరిల్లు ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ప్రయాణంలో మనుషులు, బంధాలు, భావోద్వేగాలు ఒకదానికొకటి అల్లుకుని, ప్రతి ఒక్కరికీ ఇది మాకు తెలిసిన జీవితం అన్న భావనను కలుగజేశాయి.సినిమా విడుదలయ్యాక నాకు తెలిసిన చాలామంది తండ్రులు తాము పిల్లలతో వ్యవహరించే విధానంలో చాలా తేడా వచ్చింది.
 సినిమా విడుదలయ్యాక, మొదట రాజమౌళిగారు ఫోన్ చేసి, క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా డిజైన్ చేశావని ప్రసంశించి, పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆ తరువాత తెలుగునాట ప్రతి ఇంటా బొమ్మరిల్లు గురించి చర్చ జరిగింది. అప్పటినుంచి ఆ సినిమా పేరే నా ఇంటిపేరుగా మారిపోయింది.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement