తొలియత్నం: ఆ సినిమా క్రెడిట్ ‘అతనొక్కడి’దే! | Surender reddy's first success `Athanokkade` Movie | Sakshi
Sakshi News home page

తొలియత్నం: ఆ సినిమా క్రెడిట్ ‘అతనొక్కడి’దే!

Published Sun, Oct 13 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

తొలియత్నం: ఆ సినిమా క్రెడిట్ ‘అతనొక్కడి’దే!

తొలియత్నం: ఆ సినిమా క్రెడిట్ ‘అతనొక్కడి’దే!

అందరికీ ఒకేలా కనిపించే ప్రపంచం నీకు మాత్రమే విభిన్నంగా కనిపించినప్పుడు,
నీ ఆలోచనకు మాత్రమే వేరుగా అనిపించినప్పుడు... ఈ ప్రపంచానికి
నువ్వు కొత్తగా పరిచయమవుతావు.
ఆ క్రమంలో నీ దృక్కోణమే నీ అస్తిత్వం అవుతుంది.
అస్తిత్వానికి ఆధారభూతంగా నిలిచిన ఆలోచన...
 ఆలోచనలను అనుసంధించిన చైతన్యం...
 నిన్ను సృజన శిఖరాలపై నిలబెడుతుంది.
 అలా విభిన్నంగా ఆలోచిస్తూ,  నిత్యనూతనంగా పురోగమిస్తూ,
 సినీ ప్రపంచంలో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీని
 క్రియేట్ చేసుకున్న క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ సురేందర్‌రెడ్డి.
 మొదటి సినిమా ‘అతనొక్కడే’తోనే అందరి దృష్టినీ
 తన వైపుకు తిప్పుకున్న డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తొలియత్నం ఈవారం...

 
 జర్మనీలో సాంగ్ తీస్తున్నప్పుడు మధ్యలో ఒక పనిమీద మిత్రుడితో కలిసి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాను. తను లోపలికి వెళితే, నేను బయటే ఉండిపోయాను. అంతలో కస్టమ్స్‌వాళ్లు వచ్చి,  నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా దగ్గర పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్స్ ఏమీ లేవు. నా భాష వాళ్లకు, వాళ్ల భాష నాకు అర్థం కాలేదు. ఆ కాస్సేపూ నాకు  నరకంలా అనిపించింది. మ్యూజిక్ ఒక్కసారే జరుగుతుంది. అనుకుని, ప్లాన్ చేస్తే జరగదు. అతనొక్కడే ఒక మ్యాజిక్ అంతే. నా కెరీర్‌లో అల్టిమేట్ సినిమా అది. దానికి కర్త, కర్మ, క్రియ... హీరో కళ్యాణ్‌రామ్.  ఏ విషయాన్నైనా  కొత్తగా చూడటం, కొత్తగా ఆలోచించటం మొదటినుంచీ నాకిష్టం. అలా ఆలోచిస్తున్న క్రమంలో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోల చుట్టూ కథ అనుకున్నాను.
 
 అప్పటికి నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా టి.ప్రభాకర్ దగ్గర పనిచేస్తున్నాను. వెంటనే డెరైక్టర్ అయిపోవాలన్న ఆలోచనేమీ ఉండేది కాదు. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉండేవాణ్ని.  నేను ఈ కథ అనుకున్న ఆరు నెలలకు ‘ప్రేమదేశం’ విడుదలైంది. ఆ సినిమా చూసి నేను షాకయ్యాను. నా థాట్స్‌కు దగ్గరగా ఉన్న కథ. పర్లేదు, మనం కూడా సినిమా చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తరువాత క్రాంతికుమార్ గారి దగ్గర మూడు సినిమాలకు పని చేశాను. ఆయనతో జరిపిన డిస్కషన్‌‌స వల్లే సినిమా గురించి పూర్తిగా తెలిసింది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు.
 
  నీ దగ్గర ఏమైనా కథలుంటే చెప్పరా అనేవారు. నా ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నా కథలు తనకు కచ్చితంగా నచ్చవని అనుకునేవాణ్ని. ఒక మంచి ప్రేమకథ చేయాలన్న ఆలోచనలతో కథ రాసుకుని ఒకరికి వినిపించాను. బాగుంది, కానీ లవ్‌స్టోరీ కాదు, యాక్షన్ సినిమా కావాలన్నారు. కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. ఒకరోజు కాదల్‌కొట్టై అనే తమిళ్ (తెలుగులో ప్రేమలేఖలు) సినిమా చూస్తుండగా నాకో ఐడియా వచ్చింది. అందులో హీరో, హీరోయిన్ పక్కపక్కనే ఉంటారు. కానీ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారు. పక్కపక్కనే ఉన్నా తాము ప్రేమిస్తున్నది వీళ్లనే అని ఒకరికొకరికి తెలియదు. ఈ పాయింట్ నన్ను పట్టేసింది.
 
 దీన్ని యాక్షన్ సినిమాగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. చాలా స్పీడ్‌గా కథ అల్లుకున్నాను. హీరో హీరోయిన్స్ ఒకే ఇంటి నుంచి వస్తారు. ఒకే లక్ష్యంతో ఉంటారు. కానీ, ఒకరికొకరికి పరిచయం ఉండదు. కథ మీద నాకో క్లారిటీ వచ్చాక దిల్ రాజుగారిని కలిశాను. అప్పుడాయన ‘దిల్’ షూటింగ్‌లో ఉన్నారు. కథ విని బాగుంది, తరువాత చేద్దామన్నారు. అప్పటికే ఆయన సుకుమార్‌కు మాటిచ్చారు. అదయితే కానీ నా సినిమా మొదలు కాదు. అప్పటికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి, నేనే వెనక్కి వచ్చేశాను.
 
 ఈ కథకు ఒక యంగ్ హీరో కావాలి, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు కళ్యాణ్‌రామ్ మనసులో మెదిలాడు. అప్పటికి తన మొదటి సినిమా పూర్తయింది కానీ ఇంకా రిలీజ్ అవలేదు. కథ చెప్పగానే తనకు చాలా నచ్చింది. ఇద్దరం కలిసి చాలామంది దగ్గరికి తిరిగాం. అందరూ చేద్దాం, చూద్దామనేవారే తప్ప ప్రాజెక్ట్ ఇంచి కూడా ముందుకు కదలలేదు. ఎక్కడ మొదలైన సీన్ అక్కడే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నా గుండె ధైర్యం చెదరకుండా వెన్నుతట్టి కళ్యాణ్‌రామ్ తానే సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. కళ్యాణ్‌రామ్ హీరోతో పాటు ఈ సినిమాకి నిర్మాత కూడా అవడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాని నేనే నిర్మిస్తాను అని ఆయన ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ క్షణం నుంచీ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
 
 ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేనే ప్రాణంగా భావించాను నేను. అందులో చాలా ప్రయోగాలు చేశాను. అయితే ఫండమెంటల్స్ విషయంలో రైటర్స్‌కు, నాకు మధ్య చాలా అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎవరేం చెప్పినా వినకూడదని ముందు ఫిక్సయ్యాను కాబట్టి, నా ఆలోచనలను అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించాను. చివరకు వాళ్లు కన్విన్స్ అయ్యారు. కెమెరామెన్ రాంప్రసాద్ చాలా సీనియర్. మొదటిరోజు మొదటి షాట్ తీయగానే ఆయనేంటో నాకు అర్థమైంది. నా ఆలోచనలను అర్థం చేసుకుని చాలాసార్లు నేననుకున్నదాని కంటే బెటర్ అవుట్‌పుట్ ఇచ్చేవారాయన.
 
 ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం నేను చాలా ఇబ్బంది పడిపోయాను. పాటల కోసం ఆస్ట్రియా వెళ్లినప్పుడు, చలి మైనస్‌లలో ఉండటంతో చాలా కష్టమనిపించింది. తరువాత జర్మనీలో సాంగ్ తీస్తున్నప్పుడు మధ్యలో ఒక పనిమీద మిత్రుడితో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాను. తను లోపలికి వెళితే, నేను బయటే ఉండిపోయాను. అంతలో కస్టమ్స్‌వాళ్లు వచ్చి, నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా దగ్గర పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్స్ ఏమీ లేవు. నా భాష వాళ్లకు, వాళ్ల భాష నాకు అర్థం కాలేదు. ఆ కాస్సేపూ నాకు నరకంలా అనిపించింది. వాళ్లు హైదరాబాద్‌కు ఫోన్‌చేసి క్లారిఫికేషన్ తీసుకుని, రెండు గంటల పాటు ఇంటరాగేషన్ తరువాత విడిచిపెట్టారు. నేను బయటికి వచ్చే సమయానికి నా ఫ్రెండ్ తన పని పూర్తి చేసుకుని వచ్చాడు. తనకు జరిగిన విషయమంతా తెలీదు.
 
 సినిమా ట్రావెలింగ్‌లో నాకు, కళ్యాణ్‌రామ్‌కి మధ్య ఒక అందమైన బంధం ఏర్పడింది. దాంతో ఒక్క షాట్ విషయంలో కూడా రాజీపడకుండా సినిమా పూర్తిచేశాను. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటర్ గౌతంరాజుగారు చాలా కో-ఆపరేట్ చేశారు. నా ఆలోచనలకనుగుణంగా ఆయన ఎడిటింగ్‌లో సహకరించారు. ఎందుకంటే అప్పటికి మన సినిమాల్లో అడ్వాన్స్ కటింగ్, రివర్‌‌స కటింగ్ లాంటివి లేవు. ఆ తరువాత చాలామంది ‘అతనొక్కడే’లో చేసిన కటింగ్ కావాలని తనను అడిగారని గౌతంరాజు చాలాసార్లు చెప్పారు.
 
 సినిమా ఫస్ట్ కాపీ చూశాక, మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. గౌతంరాజు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. సినిమా విడుదలయ్యాక, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసిన చాలామంది నేను ఇలాంటి సినిమా తీస్తానని, తీయగలనని అనుకోలేదని ఫోన్ చేసి మరీ అభినందించారు. అంతకంటే గొప్ప ప్రశంస ఇంకేముంటుంది!  అనుకోనంత వేగంగా దర్శకుడి ని అయ్యాను. అంతే వేగంగా సినిమాని పూర్తి చేయగలిగాను. రెస్పాన్‌‌స చూశాక ఎంతో తృప్తిగా అనిపించింది.  ఇదంతా కళ్యాణ్‌రామ్ వల్లనేనని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. నేనీ రోజు ఇలా ఉన్నానంటే, కారణం కళ్యాణ్‌రామ్. అతను ప్రొడ్యూసర్ అవడం వల్లే ఈ సినిమాను అనుకున్నట్టుగా తీయగలిగాను.
-  కె.క్రాంతికుమార్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement