తొలియత్నం: అనుకున్నవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి! | More happens in my life what i determined, says Ravi Babu | Sakshi
Sakshi News home page

తొలియత్నం: అనుకున్నవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి!

Published Sun, Dec 1 2013 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

తొలియత్నం: అనుకున్నవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి!

తొలియత్నం: అనుకున్నవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి!

ఈ ప్రపంచంలో అన్నింటికన్నా బలమైంది సంకల్పం. ఒకసారి ఇది నేను చేయాలి, చేయగలను అనుకున్నప్పుడు దాని ముందు నిలబడటానికి ఇంకేదీ సాహసించదు. సంకల్పం ముందు శిఖరమంత సమస్యైనా చిన్నబోతుంది. నడుస్తున్న దారిలో ముళ్లు తొలిగి పూలు పరుచుకుంటాయి. ఆకాశంలో ఎండ తీక్షణత తగ్గి మేఘాలు ముసురుకుంటాయి.  అలిసిపోయినప్పుడు నక్షత్రాలు నేలకొరిగి ముచ్చట్లాడతాయి. అందుకే మనిషికో కల ఉండాలి. అది సాధించాలన్న సంకల్పం ఉండాలి. అలా దర్శకుడవ్వాలనుకున్న ఒక యువకుడు, తన కలను రగిలించి వెండితెరపై పరిచిన తొలి రవి కిరణాల వెలుగే ఈ వారం తొలియత్నం... అతడి మాటల్లోనే...
 
 యాడ్ ఫిలింస్ సక్సెస్ అయిన తరువాత ఒకడుగు ముందుకు వేయాలనుకున్నాను. సినిమా దర్శకుడవ్వాలన్న నా కల నిజం చేసుకోవడానికి అదే సరైన సమయం అనిపించింది. ముందుగా ఒక కథ తయారుచేసుకుని, అది కొంతమంది ప్రొడ్యూజర్లకు వినిపించాను. వాళ్లు కొన్ని నెలల పాటు నన్ను వెయిటింగ్‌లో పెట్టారు. దానికి ఒక కాలేజ్ సెట్, పెద్ద బడ్జెట్ అవసరమవుతుంది. దాని పేరు అల్లరి.స్క్రిప్ట్ పట్టుకుని తిరిగితే పనికాదని అర్థమైంది. నేనే సొంతంగా తీయాలని ఒక చిన్నకథ కోసం ఆలోచన చేశాను. చిన్నప్పటినుంచి చూసిన హాలీవుడ్ సినిమాల ఇన్‌స్పిరేషన్‌తో ఒక టీనేజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ముందు కథ టైటిల్ తీసి దీనికి పెట్టాను. అలా అల్లరి మొదలైంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి, ఆర్టిస్టులను కొత్తవాళ్లను తీసుకోవాలనుకున్నాం. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకు నరేష్ సరిపోతాడనిపించింది.
 
 తను నాకు ముందు నుంచే పరిచయం. అయితే, తనకు అప్పటికి హీరో కావాలన్న ఆలోచన లేదు. నేను అడగ్గానే తను చాలా సర్‌ప్రైజ్ అయ్యాడు. హీరోయిన్స్‌ను మోడల్ కో-ఆర్డినేటర్ల ద్వారా సెలక్ట్ చేసుకున్నాం. ఇందులో మా నాన్నకు పెయిర్‌గా ఉండే ఆర్టిస్ట్ కోసం కొంచెం ఇబ్బందిపడ్డాను. ఆ ఆర్టిస్టు క్యారెక్టర్ నల్లగా, కొంచెం భారీగా, కళ్లు ఎర్రగా ఉండాలని డిజైన్ చేసుకున్నాను. మరుసటిరోజు షూటింగ్ స్టార్ట్ చేయాలి. కానీ, ఎంత వెదికినా ఆర్టిస్ట్ దొరకలేదు. అంతలో మా నాన్నగారు రేపు కాకినాడ నుంచి ఒక స్టేజీ ఆర్టిస్ట్ వస్తుంది, చూడు అన్నారు. ఆ దేవుడి మీద భారం వేసి, తనకోసం చూస్తుండగా ఆటోలో దిగింది. ఆశ్చర్యం. నేను ఆ క్యారెక్టర్‌కు ఎలాంటి మనిషి కావాలనుకున్నానో తనే నా ఎదురుగా వచ్చి నిలుచున్నట్టుంది. అంతకుముందు రాత్రి ప్రయాణం వల్ల జుట్టు చెదిరి, ఎర్రటి కళ్లతో నాముందుకు వచ్చింది. వెంటనే డ్రెస్ మార్చి, కెమెరా ముందు నిలబెట్టాం.
 
 షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నీ మాయలా జరిగిపోయాయి. అనుకున్నదే తడవుగా షూట్ టైమ్‌కు వాటంతటవే అమరిపోయేవి. నా రాజీపడని తత్వానికి కావలసినవన్నీ సమకూరడం అదృష్టమే అనుకుంటా.  హీరోయిన్ రూమ్‌లో ఒక మ్యాక్ కంప్యూటర్ ఉండాలి. కొనాలంటే, ఆ రోజు ఆదివారం. షెడ్యూల్‌ప్రకారం షూట్ జరగాలి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. కానీ, అక్కడ దొరకలేదు. నిరాశగా వెనుదిరగ్గానే బయట ఒక ఫ్రెండ్ కలిశాడు. ఏమిటిక్కడ అని అడిగాను. తను కొత్తగా మ్యాక్ కంప్యూటర్స్ డీలర్‌షిప్ తీసుకున్నానని చెప్పాడు. అదృష్టం అనుకుని, విషయం చెప్పా. తను వెంటనే ఒక సిస్టమ్ అరేంజ్ చేశాడు.
 
 మరోసారి ఒక వైట్ కార్డ్‌లెస్ ఫోన్ కావలసి వచ్చింది. ఆ రోజు ఆదివారం. ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు. రోడ్డుమీద కలిసిన ఒక ఫ్రెండ్ ఏంటంత టెన్షన్‌గా ఉన్నావని అడిగాడు. విషయం చెప్పగానే అతను హెల్ప్ చేశాడు. నేను కలర్స్ స్కీమ్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. హీరోయిన్ రూమ్‌లో మ్యాచింగ్ కలర్స్ కర్టెన్స్ కావాలి. కావల్సినవి దొరకడం లేదు. నెక్స్‌డే షూటింగ్. ఏం చేయాలి. అంతకుముందే మా ఫ్రెండ్ ఇంట్లో నేననుకున్న కర్టెన్స్ చూసినట్టు గుర్తు. వెంటనే పది గంటల రాత్రి వేళ స్క్రూడ్రైవర్ తీసుకుని వాళ్లింటికి బయలుదేరాను. నన్నలా చూసి మావాడు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా, తనే నెమ్మదిగా ఊడదీసి ఇచ్చాడు. మళ్లీ షూటింగ్ అవగానే తీసుకెళ్లి అలాగే పెట్టేశాను.
 
 షూటింగ్ గొరిల్లా ఫిలిం మేకింగ్‌లా ఎక్కడ పడితే అక్కడ, ఎలా వీలైతే అలా చేసేశాం. ఒకరోజు పొద్దున్నే తొమ్మిదిన్నరకు ఖైరతాబాద్ జంక్షన్‌లో షూట్ చేయాల్సి వచ్చింది. నరేశ్ హీరోయిన్‌తో బైక్ మీద ఫ్లై ఓవర్ మీదుగా రాంగ్ రూట్‌లో రావాలి. అటు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వచ్చే సమయం కూడా అదే. ఏమైనా సరే అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తిచేయాలి. అందుకోసం ఓ స్కెచ్ వేశాం. ట్రాఫిక్ రిలీజ్ అవగానే, నరేశ్ రాంగ్ రూట్‌లో వెళ్లాలి. ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మా ఆర్టిస్ట్ వాళ్లకు అడ్డంగా వెళ్లి పట్టుకోవాలి. అప్పుడు మా వెహికిల్స్ వచ్చి కెమెరాను, ఆర్టిస్టులను తీసుకుని వెళ్లాలి. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అసలు అక్కడ ఉన్న నిజమైన పోలీసులకు కూడా మేం షూట్ చేసిన విషయం తెలియదు. అంతా గప్‌చుప్‌గా అయిదు నిమిషాల్లో జరిగిపోయింది.
 
 సినిమా చాలావరకు ఒక అపార్ట్‌మెంట్‌లోనే జరిగింది. మారేడ్‌పల్లిలో మాకు తెలిసినవాళ్ల అపార్ట్‌మెంట్‌లో షూటింగ్ చేశాం. పదిహేను రోజులకు కేవలం ఇరవై ఐదు వేలు తీసుకున్నారు. ఇప్పుడైతే అలా చేయలేమేమో!  ఇక క్లైమాక్స్ ఒకే ఒక రోజులో షూట్ చేయాలనుకున్నాం. అందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఒక రైలు అద్దెకు తీసుకున్నాం. ఏమీ తినకుండా కేవలం జ్యూసులతోనే అందరం తెగ కష్టపడుతున్నాం. సాయంత్రం అయిదవగానే, రైల్వే అఫిషియల్ వచ్చి మీ టైమ్ అయిపోయింది, క్లోజ్ చేయండి అన్నాడు. ఒకే ఒక్క షాట్ బ్యాలన్స్ ఉంది అని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడికి వేరే ట్రైన్ వస్తుంది కాబట్టి, మరో ప్లాట్‌ఫామ్ మీద షూట్ చేసుకోమన్నారు. ఈ లొకేషన్‌ను, ఆ లొకేషన్‌ను ఎలా మ్యాచ్ చేయాలి అని ఆలోచనలో పడ్డాను. కెమెరా యాంగిల్స్ ద్వారా మేనేజ్ చేద్దాం అని నిర్ణయించుకునేలోపు భారీ వర్షం. ఏం చేయాలో అర్థం కాలేదు. పదిహేను నిమిషాల తరువాత వర్షం వెలిసి ఎండ వచ్చేసింది. హడావుడిగా షాట్ పూర్తిచేసేసి కారులో కూర్చోగానే, మళ్లీ వర్షం. ఇలా ఎన్నో అవాంతరాలు అధిగమించి, షూటింగ్ పూర్తిచేశాం.
 
 నా అన్ని సినిమాల్లో చాలా పద్ధతిగా జరిగిన సినిమా అల్లరి. సినిమా అంతా నా కంట్రోల్‌లోనే తీయగలిగాను. సినిమా స్కోప్ పాపులర్‌గా ఉన్న టైమ్‌లో బడ్జెట్ తగ్గించుకోవటానికి 35 ఎం.ఎం.లో తీయాలనుకున్నాను. మేం ఎనభై లక్షల బడ్జెట్‌లో సినిమా తీయాలనుకుంటే, ఎనభై నాలుగు లక్షలైంది. యాభై వేల అడుగుల్లో తీయాలనుకుంటే, యాభై వేల నాలుగు వందల అడుగుల్లో తీశాం. నలభై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తిచేయాలనుకుంటే, అలాగే జరిగింది.
 
 సినిమాటోగ్రాఫర్ నాతో పాటు యాడ్ ఫిలింస్‌లో చేశాడు కాబట్టి, నేననుకున్నట్టు ఎంటీవీ స్టైల్లో చాలా డిఫరెంట్ యాంగిల్స్‌లో తీయగలిగాం. మ్యూజిక్ డెరైక్టర్ కూడా మాతో యాడ్ ఫిలింస్‌కు పనిచేసినవాడే. అతను పదిహేను సెకన్లు, ముప్ఫై సెకన్ల ఫిలిమ్స్‌కు అలవాటుపడ్డాడు కాబట్టి, మన తరహా నాలుగైదు నిమిషాల పాటలకు, రీ-రికార్డింగ్‌కు కొంత ట్యూన్ చేయాల్సి వచ్చింది. ‘అల్లరి’ విడుదలైన తరువాత ప్రేమకథల్లో ఒక కల్ట్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత లవ్‌స్టోరీలు తీసే విధానం, చూసే విధానం కూడా మారింది.
 -కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement