Dharmavarapu Subramanyam Birth Anniversary: వెండితెరపై కొందరు పంచిన నవ్వులు ఎల్లకాలం గుర్తిండిపోతాయి. ఆ లిస్ట్‌లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘అబ్బా.. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. ఏంది నువ్వు..’ అంటూ చేతులు పిసుక్కుంటూ ఆయన నోటి నుంచి జారే మాటల విరుపులు ప్రేక్షకుల పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పాత్ర ఏదైనా పెద్దగా కష్టపడకుండా బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో అలరించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా లెక్చరర్ పాత్రల్లో ఆయన పంచిన నవ్వుల్ని అంత ఈజీగా మనం మరిచిపోగలమా?
ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి ఇవాళ..
►ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారాయన.
► విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం సైతం చేశారాయన. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో పరిచయం ధర్మవరపు జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.
► కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ ఆయన నటన కెరీర్‌లో ప్రముఖంగా చెప్పుకోదగింది. అందులో నటించడమే కాదు.. కొన్ని ఎపిసోడ్స్‌ను సైతం డైరెక్ట్ చేశారాయన. 80వ దశకంలో దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ సెన్సేషన్ హిట్‌గా నిలిచింది.
► ఆనందో బ్రహ్మ ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి పేరుతో పాటు సినిమా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి అడుగుపెట్టారాయన. అందులో కొడుకు, స్నేహితుడితో వైరం పెట్టుకునే తిక్క లెక్కల మాష్టార్ క్యారెక్టర్‌లో ధర్మవరపు నటన అలరిస్తుంది.
► బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్ గప్‌చుప్, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్, నీ స్నేహం, సొంతం, నువ్వే నువ్వే, జయం, మన్మథుడు, ఒక్కడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దొంగోడు, రెఢీ, వసంతం, వర్షం, వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, జై చిరంజీవా, డార్లింగ్, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, జల్సా, చిరుత, మహేష్ ఖలేజా, లీలా మహల్ సెంటర్.. ఇలా ఎన్నో చిత్రాలతో అలరించారు.
► క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ స్కోప్ ఉన్న పాత్రల్లో ఆయన నటనా ప్రస్థానం కొనసాగింది. ఈ క్రమంలో అగ్రహీరోల సరసన సైతం ఆయన నటించారు.
► మణ్ణిన్ మెయింధాన్, చెన్నై కాదల్.. తమిళ చిత్రాల్లోనూ నటించారాయన.
► ‘యజ్ఞం’, ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు.
► జంధ్యాల, తేజ తీసిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లు ప్రత్యేకంగా నిలిచాయి.
► ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తోకలేనిపిట్ట’
► రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్‌గానూ ఈయన పనిచేశారు.
► సాక్షి టీవీలో ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్ డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
► 2013 డిసెంబర్ 7న 59 ఏళ్ల వయసులో కాలేయ కేన్సర్‌తో ఆయన కన్నుమూశారు. తెలుగు ఆడియొన్స్‌కు మరిచిపోలేని హస్యానుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.
- సాక్షి, వెబ్‌స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment