
ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఆయన సజీవంగా లేకపోయినా వెండితెరపై ఆయన పంచిన నవ్వులు మాత్రం కలకాలం గుర్తుండిపోతాయి. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. అంటూ ఆయన నోటి నుంచి జారిన మాటల విరుపులు చాలు పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడానికి! ఎక్కువగా లెక్చరర్ పాత్రల్లో కామెడీ పండించిన ఆయన యజ్ఞం, ఆలస్యం అమృతం సినిమాలకు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డులు అందుకున్నారు. 1954లో జన్మించిన ఆయన 2013లో కాలేయ క్యాన్సర్‌తో కన్నుమూశారు. తాజాగా ఆయన తనయుడు రవి బ్రహ్మ తేజ.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
(మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం.. నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ నాన్న!)
'మా నాన్న కష్టమనేది తెలియకుండా పెంచారు. ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేమిప్పటికీ సంతోషంగా ఉన్నాం. ఇదంతా ఆయనిచ్చిందే! 2001లో 'నువ్వు నేను' సక్సెస్ పార్టీకి వెళ్లొస్తున్న సమయంలో నాన్నకు యాక్సిడెంట్ అయింది. బస్సు నాన్న కారు మీదకు ఎక్కి దిగింది. అక్కడున్నవాళ్లు నాన్నను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన బతికిబట్టకట్టారు. నాన్న తలపై 21 కుట్లు, కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్ వేశారు. ఆ తర్వాత 2005లో నాన్న ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనయ్యారు. సిగరెట్‌కు బానిస కావడంతో లంగ్స్ పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. పదిరోజులపాటు కోమాలో ఉన్నారు. అలా రెండుసార్లు నాన్నను కాపాడుకున్నాం, కానీ మూడోసారి కాపాడుకోలేకపోయాం.
2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం దిగజారింది. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజీ అని చెప్పారు. 11 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. బ్రహ్మానందం నాన్నకు తరచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కసారి ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు. నన్ను చూస్తే తట్టుకోలేవు, ఆరు నెలలు ఆగు, నేనే వస్తా, మళ్లీ షూటింగ్ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే 2013 డిసెంబర్ 7న ఆయన చనిపోయారు. నాన్న చనిపోయినప్పుడు బ్రహ్మానందం ఇంటికి రాలేదు కానీ ఫిలించాంబర్‌లో చాలా ఏడ్చారు' అని చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ తేజ.
Comments
Please login to add a commentAdd a comment