మూడు నెలల్లో మూడు విషాదాలు..!
Published Mon, Dec 9 2013 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
*అక్టోబర్ 9న రియల్ స్టార్ శ్రీహరి కన్నుమూత.
*నవంబర్ 8న హాస్యనటుడు ఏవీఎస్ మృతి.
*డిసెంబర్ 7న మరో మేటి హాస్యనటుడు ధర్మవరపు మరణం.
మూడు నెలల కాలంలో ముగ్గురు సినీ ప్రముఖుల అకాల మరణం వారి కుటుంబ సభ్యులతోబాటు తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద లోటే! ముగ్గురూ కెరీర్ పరంగా ఇంకా ఉచ్చ స్థాయిలోనే ఉన్నారు. రకరకాల కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అనారోగ్యం చుట్టుముట్టినా కూడా చివరిక్షణం వరకూ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. వీటిల్లో కొన్ని సినిమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో, నిజంగా ఆయా దర్శక నిర్మాతలకు టెన్షనే. ఇంకొందరేమో వాళ్లని మైండ్‌లో పెట్టుకుని పాత్రలను సృష్టించుకున్నారు. వాళ్లకి కూడా ఇది మింగుడు పడని పరిణామమే.
శ్రీహరి చనిపోయే సమయానికి ఆయన చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. మహేశ్‌బాబు ‘ఆగడు’ సినిమాలో కీలకపాత్రను శ్రీహరితోనే చేయించాలనుకున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పుడా పాత్రకు సాయికుమార్‌ను ఎంచుకున్నట్లు వినికిడి. హిందీలో శ్రీహరి చేసిన ‘రాంబో రాజ్‌కుమార్’ గత వారమే విడుదలైంది. తెలుగులో ఆయన నటించిన వీకెండ్ లవ్, జాబిల్లి కోసం ఆకాశమల్లె, శివకేశవ్, పోలీస్ గేమ్, యుద్ధం, రఫ్ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా శ్రీహరి వర్క్ పూర్తయిపోవడంతో ఆయా దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్ లేనట్టే. ‘వీకెండ్ లవ్’ దర్శకుడు గవర నాగు మాట్లాడుతూ-
‘‘ఈ సినిమాలో శ్రీహరిదే కీలకపాత్ర. ఒకే ఒక్క సన్నివేశం మినహా ఆయన వెర్షన్ చిత్రీకరణ అంతా పూర్తయింది. షూటింగ్ సమయంలోనే ఆయన వాయిస్ కరెక్ట్‌గా రికార్డ్ కావడంతో దాన్నే సినిమాలో ఉపయోగిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట మిమిక్రీ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్‌లో మేనేజ్ చేయాలనుకుంటున్నాం’’అని చెప్పారు. శ్రీహరి నటించిన ఆఖరి చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ అని దర్శక, నిర్మాతలు రాజ్ నరేంద్ర, గుగ్గిళ్ల శివప్రసాద్ వెల్లడించారు. ‘‘శ్రీహరి పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. ఆయన ప్రోత్సాహంతోనే మేమీ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలిగాం. ఈ క్రిస్మస్‌కి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని వారు తెలిపారు.
చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా... నువ్వు లేని జీవితం’లో శ్రీహరిదే మెయిన్‌రోల్. శ్రీహరి మృతి చెందే సమయానికి ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దాంతో జగపతిబాబుతో ఆ పాత్ర మొత్తం రీషూట్ చేస్తున్నారు. ఒక్క ‘ఇంటింటా అన్నమయ్య’ మినహా ఏవీఎస్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా విడుదలైపోయాయి. కొత్త కమిట్‌మెంట్స్ కొన్ని ఉన్నా కూడా ఏవీ ఇంకా షూటింగ్‌కి వెళ్లకపోవడంతో పెద్ద ఇబ్బంది లేదు. ధర్మవరపుది కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఆయన సినిమాల వర్కులన్నీ పూర్తయిపోయాయి. ప్రేమా గీమా జాన్తానహీ, హమ్ తుమ్ చిత్రాల్లో ఆయన వర్క్ మొత్తం పూర్తయింది. కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదాయన.
చివరిగా చెప్పేదేంటంటే... సినిమా అనేది కథా కథనాలు, స్టార్ వ్యాల్యూతోపాటు లక్‌తో కూడా కూడుకున్న వ్యవహారం. కేవలం సినిమా జయాపజయాలే నిర్మాత భవితవ్యాన్ని నిర్దేశించవు. ఆరంభం నుంచీ చివరి వరకూ.. నిర్మాణంలో ఉండే ప్రతిరోజూ నిర్మాత భవిష్యత్తుకి కీలకమే. ప్రస్తుతం సినిమాల్లోని ప్రతి చిన్న విషయాన్నీ ప్రేక్షకులు సునిశితంగా చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు సంభవించే ఆర్టిస్టుల మరణాలు ఉన్నట్టుండి కథలో మార్పులకు కారణమవుతున్నాయి. చనిపోయిన నటుడు డబ్బింగ్ చెప్పడం పూర్తి కాకపోయినా ఇక్కడ ఇబ్బందే. మిమిక్రీ ఆర్టిస్టులను సంప్రదించాల్సిన పరిస్థితి. చివరకు సినిమా దెబ్బతినడానికి అదే కారణం కూడా కావచ్చు. చిన్న నిర్మాతలకు ఇది నిజంగా శరాఘాతమే. ఎంత పెద్ద నిర్మాత అయినా రీషూట్ కి వెళ్లడమనేది ఆర్థికంగా పెనుభారమే! కానీ అనుకోకుండా జరిగే ఈ హఠాత్‌పరిణామాలను ఎవరూ ఆపలేరు కదా. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ... ఈ మూడునెలల్లో సంభవించిన పరిణామాలు ఇకముందు ఎన్నడూ తెలుగు సినిమాకు ఎదురు కాకూడదని కోరుకుందాం.
‘పిల్లా... నువ్వులేని జీవితం’ సినిమాకు శ్రీహరి పాత్ర వెన్నెముక లాంటిది. ఆయన వెర్షన్ 80 శాతం పూర్తయింది. ఈ లోగా ఘోరం జరిగిపోయింది. ఆయన చేసినన్నాళ్లూ ఎంత బాగా సహకరించారో. ఆయన పాల్గొన్న ఆఖరి తెలుగు సినిమా షూటింగ్ మాదే. ఆర్‌ఎఫ్‌సీలో యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నాం. ఆయన కారు డ్రైవ్ చేస్తూ, వేరే కారుని గుద్దేయాలి. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. శ్రీహరికి పెద్ద ప్రమాదమే జరిగిందనుకున్నాం. కంగారుగా పరిగెత్తుకెళ్లి ‘అన్నా... ఏం కాలేదుగా...’ అంటే ‘ముందు షాట్ బాగా వచ్చిందా లేదా చెప్పు’ అనడిగారు. అదీ ఆయన డెడికేషన్. ఇప్పుడా పాత్రను జగపతిబాబుతో రీషూట్ చేస్తున్నాం’’
-రవికుమార్ చౌదరి, దర్శకుడు
Advertisement