Real Star Srihari
-
రియల్ స్టార్ శ్రీహరి నెరవేరని కలలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రియల్ స్టార్, విలక్షణతకు పెట్టింది పేరైన శ్రీహరి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన నటుడుశ్రీహరి. మంచి మనిషిగా కూడా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు. పేదరికం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా తన సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఆదుకున్న ఆప్తుడుగా నిలిచాడు. కరియర్ సాఫీగా పోతున్న తరుణంగా తీవ్ర అనారోగ్యంతో 2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 1964 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు శ్రీహరి. యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఆసక్తినిపెంచుకున్న శ్రీహరి అనేక పోటీల్లో పాల్లొనడంతో పాటు ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచు కున్నాడు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర చాంపియన్ అయిన శ్రీహరి మంచి అథ్లెట్ అవ్వాలనుకున్నారట. ఈ క్రమంలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా నటనపై మక్కువ సినిమాలవైపు నడిపించింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా తీరలేదట. అలాగే పాలిటిక్స్ అన్నా కూడా చాలా అసక్తి ఉండేది. కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనీ, తద్వారా నలుగురికీ సహాయం చేయాలని ఆయన అనుకునేవారట.(అప్పుడు ఎంత అంటే అంత!) 1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి ఆ తరువాత నటుడుగా తన కరియర్‌కు బలమైన పునాదులు వేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 900 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా దాదాపు 28 చిత్రాల్లో హీరోగా చిత్రాల్లో రాణించారు. వీటితోపాటు బావగారు బావున్నారా, వీడెవండిబాబూ, తాజ్ మహల్, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం సినిమాల్లో ఆయన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చెల్లెలి కోసం ఆరాటపడే అన్నగా తన నటనతో నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశారు. రాంచరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ డూపర్ మగధీరలో షేర్ ఖాన్ పాత్ర, ఆయన కరియర్ గొప్ప మైలురాయి లాంటిది. ఒక విధంగా ఈ సినిమాకు ఆయన నటన పెద్ద హైలెట్. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అదే ఏడాదికి ఇదే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు శ్రీహరి. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్, మేఘాంశ్ ఉన్నారు. హీరోగా రాణించానేది మేఘాంశ ఆకాంక్ష. అయితే నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం శ్రీహరిని మానసికంగా కృంగదీసింది. అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ అభివృద్ధికి కృషి చేయడం విశేషంగా నిలిచింది. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూసారు. -
నవ్వులే నవ్వులు
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న కథానాయకులుగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. ఎమ్ఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మించనున్నారు. ఆగస్టు 15న డా. శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ –‘‘వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘శతమానం భవతి’ సినిమా నా మనసుకి బాగా నచ్చింది. సతీష్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎమ్ఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు). -
అప్పుడు ఎంత అంటే అంత!
శశాంక్.. మేఘాంశ్.. ‘రియల్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శ్రీహరి కుమారులు. ‘రాజ్‌దూత్’ చిత్రం ద్వారా మేఘాంశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. శశాంక్‌కి డైరెక్టర్ అవ్వాలనే ఆశయం ఉంది. ఈ ఇద్దరూ తమ తండ్రి శ్రీహరి గురించి పంచుకున్న విశేషాలు. ► హీరోగా పరిచయమవుతున్న ఈ సమయంలో నాన్న పక్కన ఉంటే అనే ఫీలింగ్ రాక మానదు.. మేఘాంశ్: కచ్చితంగా. నాన్న ఉండి ఉంటే పక్కనే ఉండి నడిపించేవారు. ఒక భరోసా ఉండేది. అది మిస్సవుతున్నాం. సినిమా కమిట్ అయ్యే ముందు ఆర్టిస్ట్‌గా నాన్నకు వచ్చిన దాంట్లో ఓ 5 శాతం వచ్చినా చాలు అనుకున్నాను. నాన్న పేరు చెడగొట్టకూడదు అనే బాధ్యతతో చేశాను. ► నాన్న ఉన్నప్పుడే హీరో అవ్వాలనే టాపిక్ మీ మధ్య వచ్చిందా? మేఘాంశ్: మేం ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనుకున్నారు. కానీ హీరోనా? డైరెక్టర్‌గానా? అనే డిస్కషన్ అయితే ఎప్పుడూ రాలేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా. ► మీ నాన్నగారు ఫిట్‌గా ఉండేవారు. మీరు కూడా అదే అలవర్చుకున్నట్టున్నారు? మేఘాంశ్: ఆయన్ను చూసే జిమ్ చేయడం స్టార్ట్ చేశాం. నాన్నకి ఫిట్‌గా ఉండటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకది ఇన్స్పైరింగ్గా ఉండేది. మా జిమ్‌లో నాన్న ఫొటోలు ఉంటాయి. జిమ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఫొటోలు చూస్తుంటాం. ► శ్రీహరిగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు.. మేఘాంశ్: అందరికీ హెల్ప్ చేయడం. శశాంక్: హంబుల్‌గా ఉండటం. మేఘాంశ్: హంబుల్‌గా ఉంటూనే రాయల్‌గా ఉండటం. ► ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేవారా? ఏదైనా గిఫ్ట్ ఇచ్చేవారా? ఇద్దరూ: ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజూ మాకు సెలబ్రేషనే. శశాంక్: ఓ రోజు ఆమ్లెట్ చేసి ఇచ్చా. మస్త్ ఉంది అన్నారు. మేఘాంశ్: నేను నాన్నతో చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. శశాంక్: వీడు డాడీ పెట్. ► నాన్న వెళ్లిపోయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? శశాంక్: లైఫ్‌స్టైల్ మారిపోయింది. అప్పుడు బాధ్యతలు లేవు. ఇలా అంటే (చిటికేస్తూ) అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు కొంచెం చూసి ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్షియల్‌గా చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాం. ► స్కూల్‌కి వెళ్లను అన్నప్పుడు నాన్న కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేఘాంశ్: మమ్మీ కొట్టేది. కానీ డాడీ ఎప్పుడూ కొట్టలేదు. స్కూల్ బంక్ కొడితే డాడీ దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం. ► డాడీ ఏ విషయంలోనూ కోప్పడలేదా? మేఘాంశ్: ఎప్పుడూ లేదు. శశాంక్: ఒకే ఒక్కసారి నన్ను కోప్పడ్డారు. ఆయన్ను చూడటానికి ఫ్యాన్స్ వచ్చారు. నేను పటాసులు కాలుస్తున్నాను. గేట్ దగ్గర రాకెట్ పేలిస్తే ఓ అభిమాని మీదకు వెళ్లింది. అప్పుడు కోప్పడ్డారు. ఇంకోసారి కార్ విండోలో నుంచి మేఘాంశ్ చేయి బయటపెడితే అద్దం పైకి ఎత్తేశా. అప్పుడు తిట్టారు. ► బిజీ ఆర్టిస్ట్ అయినా మీతో టైమ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారా? ఇద్దరూ: రోజూ కలసి భోజనం చేసేవాళ్లం. అప్పుడు మమ్మీ మా అల్లరి గురించి చెబుతుండేది. వాళ్ల గురించి ఇప్పుడెందుకు? హ్యాపీగా తిననివ్వు అని మమ్మీనే తిట్టేవాళ్లు. మాకు ఒక్క తిట్టు కూడా పడేది కాదు. ► మీ ప్రోగ్రెస్ కార్డ్ ఎవరు సైన్ చేసేవాళ్లు? మేఘాంశ్: మమ్మీనే. అప్పుడప్పుడు పాస్ అయ్యేవాణ్ణి, అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యేవాణ్ణి. శశాంక్: కానీ వాడి తిట్లన్నీ నాకు పడేవి. ఎందుకంటే ముందు నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి నన్ను తిట్టేది. మళ్లీ వాడిని ఏం తిడతాంలే అనుకునేదేమో. నన్ను తిడుతూనే ఉండేది. ► మీ ఇద్దర్లో టామ్ ఎవరు? జెర్రీ ఎవరు? మేఘాంశ్: వాడే. (శశాంక్ని చూపిస్తూ) వాడు కొట్టేటోడు.. నేను పడేటోడ్ని. (నవ్వుతూ ) ► మీ తమ్ముడు హీరో అవుతున్నాడు కదా. ఏమనిపిస్తుంది? మేఘాంశ్: మంచిగా చెప్పురా ప్లీజ్. శశాంక్: అలా చెప్పాలనే ఆలోచిస్తున్నా. ఫస్ట్ నాకు నవ్వొచ్చింది. బచ్చాగాడు హీరో అయిపోయాడు అనుకున్నాను. అయితే నేను చెప్పేదొక్కటే. హిట్ అయినా ఫట్ అయినా హంబుల్‌గా ఉండాలి. ► మీ నాన్నగారు ఉన్నప్పుడు ఓసారి పదివేలకు చాక్లెట్లు కొన్నారట? శశాంక్: నాన్నగారి కార్డ్ తీసుకెళ్లాడు. అక్కడున్న చాక్లెట్లు అన్నీ కొన్నాడు. రేయ్.. మేఘాంశ్ పదివేలు అయిందీ అంటే ఓ చాక్లెట్ పక్కన పెట్టి ఇప్పుడు 9 వేలే కదా తీసుకో అన్నాడు (నవ్వుతూ). మేఘాంశ్: మాకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. పాకెట్‌మనీ ఇచ్చేవాళ్లు కాదు. ఎవరికైనా డబ్బులిచ్చి మాతో పాటు పంపేవాళ్లు. మేం కొనుక్కునేవాళ్లం. అప్పుడు ఎంత అంటే అంత. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంత. ► యాక్టర్ అవుతున్నారు. హోమ్ వర్క్ కోసం నాన్న సినిమాలేమైనా చూశారా? మేఘాంశ్: అలా ఏం చూడలేదు. అయితే నాన్నని చూడటం కోసమే ఆయన సినిమాలు చూస్తుంటాను. ► మీ నాన్నగారికి తీరని కోరిక ఏదైనా మిగిలిపోయిందా? శశాంక్: పాలిటిక్స్. ఇంకో సంవత్సరం ఉండి ఉంటే కచ్చితంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేవారు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. సహాయం చేయాలని అనుకుంటారు. ► మరి మీలో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉందా? మేఘాంశ్: ఇంట్రెస్ట్, నాలెడ్జ్ రెండూ లేవు. ► నాన్న యాక్ట్ చేసిన సినిమాల్లో బాగా నచ్చినవి? ఇద్దరూ: కింగ్, ఢీ, భద్రాచలం, విజయరామరాజు... ఇలా చాలా ఉన్నాయి. ► తమ్ముడు హీరో అయ్యాడు.. మరి అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడు? శశాంక్: షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. శశాంక్, మేఘాంశ్ -
మూడు నెలల్లో మూడు విషాదాలు..!
*అక్టోబర్ 9న రియల్ స్టార్ శ్రీహరి కన్నుమూత. *నవంబర్ 8న హాస్యనటుడు ఏవీఎస్ మృతి. *డిసెంబర్ 7న మరో మేటి హాస్యనటుడు ధర్మవరపు మరణం. మూడు నెలల కాలంలో ముగ్గురు సినీ ప్రముఖుల అకాల మరణం వారి కుటుంబ సభ్యులతోబాటు తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద లోటే! ముగ్గురూ కెరీర్ పరంగా ఇంకా ఉచ్చ స్థాయిలోనే ఉన్నారు. రకరకాల కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. అనారోగ్యం చుట్టుముట్టినా కూడా చివరిక్షణం వరకూ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. వీటిల్లో కొన్ని సినిమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో, నిజంగా ఆయా దర్శక నిర్మాతలకు టెన్షనే. ఇంకొందరేమో వాళ్లని మైండ్‌లో పెట్టుకుని పాత్రలను సృష్టించుకున్నారు. వాళ్లకి కూడా ఇది మింగుడు పడని పరిణామమే. శ్రీహరి చనిపోయే సమయానికి ఆయన చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. మహేశ్‌బాబు ‘ఆగడు’ సినిమాలో కీలకపాత్రను శ్రీహరితోనే చేయించాలనుకున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పుడా పాత్రకు సాయికుమార్‌ను ఎంచుకున్నట్లు వినికిడి. హిందీలో శ్రీహరి చేసిన ‘రాంబో రాజ్‌కుమార్’ గత వారమే విడుదలైంది. తెలుగులో ఆయన నటించిన వీకెండ్ లవ్, జాబిల్లి కోసం ఆకాశమల్లె, శివకేశవ్, పోలీస్ గేమ్, యుద్ధం, రఫ్ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా శ్రీహరి వర్క్ పూర్తయిపోవడంతో ఆయా దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్ లేనట్టే. ‘వీకెండ్ లవ్’ దర్శకుడు గవర నాగు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో శ్రీహరిదే కీలకపాత్ర. ఒకే ఒక్క సన్నివేశం మినహా ఆయన వెర్షన్ చిత్రీకరణ అంతా పూర్తయింది. షూటింగ్ సమయంలోనే ఆయన వాయిస్ కరెక్ట్‌గా రికార్డ్ కావడంతో దాన్నే సినిమాలో ఉపయోగిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట మిమిక్రీ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్లో మేనేజ్ చేయాలనుకుంటున్నాం’’అని చెప్పారు. శ్రీహరి నటించిన ఆఖరి చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ అని దర్శక, నిర్మాతలు రాజ్ నరేంద్ర, గుగ్గిళ్ల శివప్రసాద్ వెల్లడించారు. ‘‘శ్రీహరి పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. ఆయన ప్రోత్సాహంతోనే మేమీ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలిగాం. ఈ క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని వారు తెలిపారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా... నువ్వు లేని జీవితం’లో శ్రీహరిదే మెయిన్‌రోల్. శ్రీహరి మృతి చెందే సమయానికి ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దాంతో జగపతిబాబుతో ఆ పాత్ర మొత్తం రీషూట్ చేస్తున్నారు. ఒక్క ‘ఇంటింటా అన్నమయ్య’ మినహా ఏవీఎస్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా విడుదలైపోయాయి. కొత్త కమిట్మెంట్స్ కొన్ని ఉన్నా కూడా ఏవీ ఇంకా షూటింగ్‌కి వెళ్లకపోవడంతో పెద్ద ఇబ్బంది లేదు. ధర్మవరపుది కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఆయన సినిమాల వర్కులన్నీ పూర్తయిపోయాయి. ప్రేమా గీమా జాన్తానహీ, హమ్ తుమ్ చిత్రాల్లో ఆయన వర్క్ మొత్తం పూర్తయింది. కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదాయన. చివరిగా చెప్పేదేంటంటే... సినిమా అనేది కథా కథనాలు, స్టార్ వ్యాల్యూతోపాటు లక్‌తో కూడా కూడుకున్న వ్యవహారం. కేవలం సినిమా జయాపజయాలే నిర్మాత భవితవ్యాన్ని నిర్దేశించవు. ఆరంభం నుంచీ చివరి వరకూ.. నిర్మాణంలో ఉండే ప్రతిరోజూ నిర్మాత భవిష్యత్తుకి కీలకమే. ప్రస్తుతం సినిమాల్లోని ప్రతి చిన్న విషయాన్నీ ప్రేక్షకులు సునిశితంగా చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు సంభవించే ఆర్టిస్టుల మరణాలు ఉన్నట్టుండి కథలో మార్పులకు కారణమవుతున్నాయి. చనిపోయిన నటుడు డబ్బింగ్ చెప్పడం పూర్తి కాకపోయినా ఇక్కడ ఇబ్బందే. మిమిక్రీ ఆర్టిస్టులను సంప్రదించాల్సిన పరిస్థితి. చివరకు సినిమా దెబ్బతినడానికి అదే కారణం కూడా కావచ్చు. చిన్న నిర్మాతలకు ఇది నిజంగా శరాఘాతమే. ఎంత పెద్ద నిర్మాత అయినా రీషూట్ కి వెళ్లడమనేది ఆర్థికంగా పెనుభారమే! కానీ అనుకోకుండా జరిగే ఈ హఠాత్పరిణామాలను ఎవరూ ఆపలేరు కదా. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ... ఈ మూడునెలల్లో సంభవించిన పరిణామాలు ఇకముందు ఎన్నడూ తెలుగు సినిమాకు ఎదురు కాకూడదని కోరుకుందాం. ‘పిల్లా... నువ్వులేని జీవితం’ సినిమాకు శ్రీహరి పాత్ర వెన్నెముక లాంటిది. ఆయన వెర్షన్ 80 శాతం పూర్తయింది. ఈ లోగా ఘోరం జరిగిపోయింది. ఆయన చేసినన్నాళ్లూ ఎంత బాగా సహకరించారో. ఆయన పాల్గొన్న ఆఖరి తెలుగు సినిమా షూటింగ్ మాదే. ఆర్ఎఫ్సీలో యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నాం. ఆయన కారు డ్రైవ్ చేస్తూ, వేరే కారుని గుద్దేయాలి. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. శ్రీహరికి పెద్ద ప్రమాదమే జరిగిందనుకున్నాం. కంగారుగా పరిగెత్తుకెళ్లి ‘అన్నా... ఏం కాలేదుగా...’ అంటే ‘ముందు షాట్ బాగా వచ్చిందా లేదా చెప్పు’ అనడిగారు. అదీ ఆయన డెడికేషన్. ఇప్పుడా పాత్రను జగపతిబాబుతో రీషూట్ చేస్తున్నాం’’ -రవికుమార్ చౌదరి, దర్శకుడు