తాండూరు: జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రమైన తాండూరు పట్టణంలో చోరీలు పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో రెండు నగల దుకాణాల్లో దొంగతనాలు జరగడంతో వ్యాపారులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చోరీలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. రాత్రి పూట పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా మరోవైపు చోరీలు జరుగుతున్నాయి.
ఇటీవల ముఖ్యంగా తాండూరులోని నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును అపహరించుకుపోయారు. దీంతో వ్యాపార వర్గాలు భయాందోళనకు గురవుతున్నాయి. నిత్యం రాత్రిపూట 6-7 బీట్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, దానిని ఓ ఎస్‌ఐ పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సంఖ్యాపరంగా బీట్లు బాగున్నా పెట్రోలింగ్ మాత్రం నామమాత్రంగా మారిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.
గత నెల 16న రాత్రి పట్టణంలోని గాంధీనగర్‌లోని శ్రీరంజన్ జ్యువెలరీ దుకాణంలో, ఈనెల 1న రాత్రి బాలాజీ బ్రదర్స్ నగల దుకాణంలో చోరీలు జరిగాయి. గుర్తుతెలియని దుండగులు రెండు వారాల వ్యవధిలో రెండు నగల దుకాణాల్లో సుమారు రూ.6 లక్షల సొత్తు అపహరించుకుపోయారు. ఈ రెండు ఘటనల్లో దుండగులు దుకాణాల పైకప్పులు తొలగించి షాపుల్లోకి చొరబడ్డారు. చోరీల తీరు దాదాపు ఒకేవిధంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక ముఠాకు చెందిన దుండగలు ఈ చోరీలు చేశారా?, స్థానికుల హస్తం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాయిపూర్‌లోని ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో ఇటీవల దుండగులు చోరీకి పాల్పడి రూ.లక్ష వరకు నగదు అపహరించుకుపోయారు. కాగా ఈ విషయం వెలుగులోకి రాలేదు. పెట్రోలింగ్ కేవలం రాత్రివేళల్లో నడిచే హోటళ్లను మూయించడానికే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో గస్తీ వంతుగా మారిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.
అర్థరాత్రి దాటిన తరువాత రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల వద్ద అనుమానితులపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడింది. తాండూరు పట్టణం కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం, రైలు సౌకర్యం ఉండటంతో ఆ రాష్ర్ట ముఠాలు ఇక్కడ చోరీలకు పాల్పడుతూ సులువుగా ఇక్కడి నుంచి పారిపోతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు పటిష్టంగా గస్తీలు నిర్వహించి చోరీల పరంపరకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముమ్మరంగా దర్యాప్తు..
చోరీ కేసులను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యా ప్తు చేస్తున్నట్లు తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాత్రివేళల్లో పటిష్టంగా గస్తీలు నిర్వహిస్తున్నట్లు డీస్పీ పేర్కొన్నారు.
తాండూరులో చోరీల పరంపర..
Published Mon, Jan 5 2015 4:41 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement