తాండూరు టౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బుధవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జేఏసీ, టీవీవీ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాచౌక్‌లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని కోదండరాం, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ‘జీవితం నీది.. బ్రతుకంతా దేశానిది’ అని కవి కాళోజి చెప్పినట్లుగా జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ పోరాటానికే అంకితమిచ్చారన్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొనాల్సి ఉండగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు పాడైపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయినట్లు చెప్పేవారన్నారు. నాడు అక్కడ జరిగిన కాల్పుల్లో పలువురు విద్యార్థులు అమరులయ్యారన్నారు. ఆనాడు ఆయన వె ళ్లకపోవడం వల్లే నేటివరకు మనకు దారి చూపుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యారన్నారు.
1969లో జరిగిన ఉద్యమానికి ప్రాణంపోసి ఆంధ్రుల ఆధిపత్యానికి ఎదురెళ్లారన్నారు. 1996 ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి మొలకనాటి నీరుపోసి పోరాటాన్ని ఉధృతం చేయించారన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారన్నారు. వికారాబాద్‌ను జిల్లాగా చేసి, ఇక్కడి సంపదను స్థానికులకే దక్కేలా నాయకులు చూడాలన్నారు. జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.
అనంతరం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, జేఏసీ నాయకులు కనకయ్య, రంగారావు, టీవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదయ్య, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, నాయకులు బైండ్ల విజయ్‌కుమార్, ఆర్.విజయ్, కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, విజయాదేవి, సునీతాసంపత్, సుమిత్, శోభారాణి, రజాక్, పరిమళ, నీరజ, అనసూయ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
పోరాటయోధుడు జయశంకర్ సార్...
Published Thu, Aug 7 2014 12:30 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement