Sunita Mahender Reddy
-
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్‌క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్‌కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్‌లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్‌వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్‌నగర్‌లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్‌కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్‌కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
విఐపి రిపోర్టర్ - పట్నం సునీతామహేందర్ రెడ్డి
-
పోరాటయోధుడు జయశంకర్ సార్...
తాండూరు టౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బుధవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జేఏసీ, టీవీవీ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాచౌక్‌లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని కోదండరాం, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ‘జీవితం నీది.. బ్రతుకంతా దేశానిది’ అని కవి కాళోజి చెప్పినట్లుగా జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ పోరాటానికే అంకితమిచ్చారన్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొనాల్సి ఉండగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు పాడైపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయినట్లు చెప్పేవారన్నారు. నాడు అక్కడ జరిగిన కాల్పుల్లో పలువురు విద్యార్థులు అమరులయ్యారన్నారు. ఆనాడు ఆయన వె ళ్లకపోవడం వల్లే నేటివరకు మనకు దారి చూపుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యారన్నారు. 1969లో జరిగిన ఉద్యమానికి ప్రాణంపోసి ఆంధ్రుల ఆధిపత్యానికి ఎదురెళ్లారన్నారు. 1996 ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి మొలకనాటి నీరుపోసి పోరాటాన్ని ఉధృతం చేయించారన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారన్నారు. వికారాబాద్‌ను జిల్లాగా చేసి, ఇక్కడి సంపదను స్థానికులకే దక్కేలా నాయకులు చూడాలన్నారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, జేఏసీ నాయకులు కనకయ్య, రంగారావు, టీవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదయ్య, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, నాయకులు బైండ్ల విజయ్‌కుమార్, ఆర్.విజయ్, కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, విజయాదేవి, సునీతాసంపత్, సుమిత్, శోభారాణి, రజాక్, పరిమళ, నీరజ, అనసూయ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల జీవనచిత్రం మారుస్తా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సున్నిత మనస్తత్వం, ముక్కుసూటితనం ఆమె సొంతం. నిర్మొహమాటంగా మాట్లాడటం ఆమె నైజం. ఆమె ఎవరో కాదు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి. వరుసగా రెండోసారి జెడ్పీ సారథ్యం లభించడం అరుదైతే... రెండుసార్లు వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె వచ్చే ఐదేళ్లలో చేపట్టే పనులు, ప్రాధమ్యాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే... పల్లెల బాగుకు ప్రత్యేక ప్రణాళిక {పత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. కనీస సౌకర్యాల కల్పనపై కూడా యంత్రాంగం దృష్టిసారించలేదు. తెలంగాణ ఉద్యమం కూడా అభివృద్ధి పనులపై ప్రభావం చూపింది. మూడేళ్ల క్రితం నా హయాంలో మంజూరు చేసిన పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేటాయించిన నిధులను కూడా వినియోగించుకోకపోవడం దురదృష్టకరం. అభివృద్ధి అసమానతలకు తావివ్వకుండా ప్రతి పల్లెకు ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల ఆధారంగా నిధుల కేటాయింపులను చేస్తాం. అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యానికి పెద్దపీట {పతి వాడను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తాం. జిల్లాకు కేటాయించిన రూ.28 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, దళితబస్తీల్లో మౌలిక సౌకర్యాలను పెంపొందిస్తాం. గ్రామీణుల జీవనశైలిలో మార్పు, సురక్షిత జీవ నం సాగించేందుకు అనువుగా పారిశుద్ధ్యానికి అధిక నిధులు వెచ్చిస్తాం. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందించాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సంబంధిత అధికారులను ఆదేశించా. అంగన్వాడీలకు సొంత భవనాలు.. గతంలో మంజూరు చేసిన 800 అంగన్వాడీ కేంద్రాలు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో చాలా అంగన్వాడీలు పక్కనే ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్నాయి. పక్కాభవనాలు త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఈసమస్య తలెత్తింది. యుద్ధప్రాతిపదికన అంగన్వాడీ భవనాలు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. నగర శివార్లలో అవసరానికి మించి ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. విద్యాప్రమాణాలు మెరుగుపరిచే దిశగా.. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి కనీస అవసరాలకు అధిక నిధులు మంజూరు చేయనున్నాం. ఏడాదిన్నరలో కల సాకారం.. పంతాలు, పట్టింపులతో 11 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న జిల్లా పరిషత్ భవన సముదాయం మరో ఏడాదిన్నరలో అందుబాటులోకి తెస్తాం. నిర్మాణ పనులు శరవేగంగా చేసేందుకు మరో రూ.25 లక్షల అంచనా వ్యయాన్ని కూడా పెంచాం. గత పాలకవర్గంలోనే ఈ భవనాన్ని ప్రారంభించాలనే నా కోరిక నెరవేరలేదు. త్వరలోనే కల సాకారం కానుంది. మంచితనానికే మద్దతు జిల్లా అభివృద్ధిలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తా. రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తా. మంచితనం చూసే నాకు టీడీపీ మద్దతు ఇచ్చింది. దీన్ని రాజకీయకోణంలో చూడాల్సిన పనిలేదు. అన్నిపార్టీల సభ్యులను సమదృష్టితో చూస్తా. నిర్మాణాత్మకంగా వ్యవహరించడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలబెడుతా. -
టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా సునీత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సునీతా మహేందర్‌రెడ్డి మరోసారి నిలిచారు. 2006లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుఫున గెలిచిన ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బంట్వారం జెడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసిన ఆమె... మహిళా(జనరల్) కోటాలో జెడ్పీ పీఠాన్ని అధిష్టించారు. ఇటీవల ఆమె భర్త, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో సునీత కూడా ఆయన బాటను అనుసరించారు. తాజాగా యాలాల జిల్లా ప్రాదేశిక స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి జిల్లా పరిషత్ రిజర్వేషన్ జనరల్‌కు ఖరారు కావడంతో కాంగ్రెస్, టీడీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. ఈ క్రమంలోనే నవాబ్‌పేట మండలం నుంచి కొం పల్లి ఆనంతరెడ్డిని నిలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ కూడా జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరును ప్రకటించడం, ఆయనా ఇదే మండలం నుంచి పోటీకి దిగడంతో ఆనంతరెడ్డి వెనక్కితగ్గారు. స్థానిక టీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపులు కూడా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న తరుణంలో సునీతను చైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా ప్రకటించేందుకు టీఆర్ఎస్ సుముఖత చూపుతోంది. శనివారం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్యుల సమావేశంలో ఈమె పేరును అధికారికంగా ఖరారు చేసే అవకాశముంది.