సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సున్నిత మనస్తత్వం, ముక్కుసూటితనం ఆమె సొంతం. నిర్మొహమాటంగా మాట్లాడటం ఆమె నైజం. ఆమె ఎవరో కాదు.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి. వరుసగా రెండోసారి జెడ్పీ సారథ్యం లభించడం అరుదైతే... రెండుసార్లు వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె వచ్చే ఐదేళ్లలో చేపట్టే పనులు, ప్రాధమ్యాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
వివరాలు ఆమె మాటల్లోనే...
పల్లెల బాగుకు ప్రత్యేక ప్రణాళిక
{పత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. కనీస సౌకర్యాల కల్పనపై కూడా యంత్రాంగం దృష్టిసారించలేదు. తెలంగాణ ఉద్యమం కూడా అభివృద్ధి పనులపై ప్రభావం చూపింది. మూడేళ్ల క్రితం నా హయాంలో మంజూరు చేసిన పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేటాయించిన నిధులను కూడా వినియోగించుకోకపోవడం దురదృష్టకరం. అభివృద్ధి అసమానతలకు తావివ్వకుండా ప్రతి పల్లెకు ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల ఆధారంగా నిధుల కేటాయింపులను చేస్తాం.
అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యానికి పెద్దపీట
{పతి వాడను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తాం. జిల్లాకు కేటాయించిన రూ.28 కోట్ల బీఆర్‌జీఎఫ్ నిధులతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, దళితబస్తీల్లో మౌలిక సౌకర్యాలను పెంపొందిస్తాం. గ్రామీణుల జీవనశైలిలో మార్పు, సురక్షిత జీవ నం సాగించేందుకు అనువుగా పారిశుద్ధ్యానికి అధిక నిధులు వెచ్చిస్తాం. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందించాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సంబంధిత అధికారులను ఆదేశించా.
అంగన్‌వాడీలకు సొంత భవనాలు..
గతంలో మంజూరు చేసిన 800 అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో చాలా అంగన్‌వాడీలు పక్కనే ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్నాయి. పక్కాభవనాలు త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఈసమస్య తలెత్తింది. యుద్ధప్రాతిపదికన అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. నగర శివార్లలో అవసరానికి మించి ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. విద్యాప్రమాణాలు మెరుగుపరిచే దిశగా.. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి కనీస అవసరాలకు అధిక నిధులు మంజూరు చేయనున్నాం.
ఏడాదిన్నరలో కల సాకారం..
పంతాలు, పట్టింపులతో 11 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న జిల్లా పరిషత్ భవన సముదాయం మరో ఏడాదిన్నరలో అందుబాటులోకి తెస్తాం. నిర్మాణ పనులు శరవేగంగా చేసేందుకు మరో రూ.25 లక్షల అంచనా వ్యయాన్ని కూడా పెంచాం. గత పాలకవర్గంలోనే ఈ భవనాన్ని ప్రారంభించాలనే నా కోరిక నెరవేరలేదు. త్వరలోనే కల సాకారం కానుంది.
మంచితనానికే మద్దతు
జిల్లా అభివృద్ధిలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తా. రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తా. మంచితనం చూసే నాకు టీడీపీ మద్దతు ఇచ్చింది. దీన్ని రాజకీయకోణంలో చూడాల్సిన పనిలేదు. అన్నిపార్టీల సభ్యులను సమదృష్టితో చూస్తా. నిర్మాణాత్మకంగా వ్యవహరించడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలబెడుతా.
పల్లెల జీవనచిత్రం మారుస్తా...
Published Sat, Jul 19 2014 12:35 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement