Jayashanker
-
సార్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ సిటీ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని జయశంకర్‌సార్ కోరుకున్నారని అన్నారు. దాని సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్లలో సార్ ముందుంటారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ స్ఫూర్తినిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, ఎడ్ల సుగుణాకర్, ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, జి.రఘువీర్‌సింగ్, దూలం సంపత్ పాల్గొన్నారు. -
తెలంగాణ నిరంతర స్ఫూర్తి
సందర్భం ఆగస్టు 6న ప్రొఫెసర్ జయ శంకర్ జయంతిని జరుపు కోవడం తెలంగాణ చారిత్రక కర్తవ్యం. గాంధీ, అంబేడ్కర్ జయంతులకు కేంద్రం సెల వులు ప్రకటించి ఉత్సవాలను నిర్వహిస్తుంది. తెలంగాణ సమాజానికీ తెలంగాణ ఆవి ర్భావానికీ అంతే స్ఫూర్తిని కలిగించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆకాంక్షిస్తున్నాయి. సంపూర్ణంగా కాకపోయినా దశాబ్దాల తెలంగాణ ఆకాంక్ష ఆకృతి దాల్చి రెండేళ్లు దాటింది. ప్రభుత్వం తన విజయాలను చెప్పుకుంటున్నది. అనేక ప్రజా సంఘాలు, పౌర వేదికలు దశాబ్దాల పోరాటాల ప్రస్థానాన్ని, త్యాగాలను, నిర్వేదంలో కూరుకుపోయిన క్షణాలను త్రవ్విపోసుకుంటున్నాయి. సాధించుకున్న తెలంగాణను సారంలో ప్రజాపక్షం చేయవలసిన బాధ్యత అందరిపైన ఉన్నదనే అంశాన్ని గుర్తుచేసుకోవడమే జయశంకర్ జయంతిని నిర్వహించుకోవడం వెనుక ఉన్న అసలు ఆశయం.తెలంగాణ ప్రజలందరి సంఘటిత పోరాట ఫలితం. ఆ ప్రజా ఉద్యమానికి తాత్విక పునాదిని, సైద్ధాంతిక భూమికను అందించిన వారిలో అగ్రస్థానం జయశంకర్ సార్‌దే. జీవితకాలం తెలంగాణను స్వప్నించిన వారాయన. సీమాంధ్ర పాలనలో నీళ్లు, నిధులతో పాటు ఉద్యో గాలను దోచుకున్న కుట్రలను బహిర్గతపరిచి స్వరా ష్ట్రంలో నిరుద్యోగులైన యువజనులకు ఉపాధి లభించే విధంగా తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో జయశంకర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన స్వప్నం సాకారం కావాలని నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్షా ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అర కొర ఉద్యోగాల ప్రకటనలతో సగం రోజులు గడిపేి సింది. కానీ పదివేల ఉద్యోగాలు కూడా కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి నుండి పీహెచ్.డీ. వరకు చదువుకున్న యువకులు (18 నుండి 40 సంవత్సరాలలోపు) సుమారుగా 50 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యో గాలు ఇచ్చినా ఇంకా మిగిలి ఉండే 49 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉన్నది. జయశంకర్ సార్ చెప్పినట్లు అభివృద్ధి అంటే వనరులు (బొగ్గు, ఖనిజాలు, నీళ్లు, భూమి వంటివి), పరిశ్రమలు కొద్దిమంది కంట్రాక్టర్లు, కార్పొరేట్ల చేతిలోకి వెళ్లడం కాదు. హైదరాబాద్ అభివృద్ధే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ (జిల్లాలు) జరిగినపుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆయనను స్మరించుకోవడమంటే సమ న్యాయంతో కూడిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవడం కూడా. జయశంకర్ సార్ జయంతి వారోత్సవం సందర్భంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలపైన, కేజీ టు పీజీ విద్యపైన సమగ్ర విధానం ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రజా ప్రయోజనాల కోణం నుంచి విశ్లేషించాలని పిలుపునిస్తున్నది. (ఆగస్టు 6 ప్రొ॥జయశంకర్ జయంతి) ( వ్యాసకర్త:గురిజాల రవీందర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక మొబైల్ః 9949994509 ) -
కనపడిన కష్టం...
కాసేపు కష్టం ఆవహించి... ఆ వెంటనే తొలగిపోతే..? మనమైతే... దేవుడికి ముడుపు కడతాం.. గుడికెళ్లి టెంకాయ కొడ్తాం... పూర్వజన్మ సుకృతమని అనుకుంటాం! కానీ... యాదేశ్వరి తనకు కనపడిన కష్టాన్ని ఎవరికీ కనపడకుండా చేద్దామనుకుంది. చీకటిలో వెలుతురు కనిపించదు. చీకటి కమ్ముకున్నప్పుడు దారి దొరుకుతుందన్న ఆశా ఉండదు.కానీ ఆమె ఆ వెలుతురును చూడగలిగింది. ఒక దారిని కనుగొనగలిగింది.మనిషికి ఎదురయ్యే సమస్యే ఆ మనిషిని ఉన్నతస్థానంలో నిలబెడుతుందనడానికి ఈ కథనమే ఒక ఉదాహరణ.1987 సంవత్సరం.. మహబూబ్‌నగర్ టౌన్. ఆ టీచరమ్మ పేరు యాదేశ్వరి. అప్పుడు ఆమెకు పద్దెనిమిదేళ్లు! పెళ్లై, ఆర్నెల్ల బాబు ఉన్నాడు. టీచరు కావాలనే కోరికతో బాబును చూసుకుంటూనే టీటీసీ చేస్తోంది. భర్త జయశంకర్ కూడా టీచరే. అక్కడకి దగ్గర్లోని ఊళ్లో ఉద్యోగం. ఎప్పటిలాగే ఒకరోజు... కాలేజ్‌కి టైమ్ అవుతోంది. ఓ వైపు వంట చేస్తూ కాలేజ్‌కి రెడీ అవుతోంది. కిరోసిన్ స్టవ్ మీద కూర రెడీ అవుతోంది. అక్కడే నేల మీద ఆడుకుంటున్న బాబును నీలరంగు మంటతో వెలుగుతున్న స్టవ్ ఆకట్టుకుంది. కేరింతలు కొడుతూ చకచకా స్టవ్ వైపు పాకడం మొదలుపెట్టాడు. యాదేశ్వరి దాన్ని గమనించలేదు. స్టవ్‌కి దగ్గరైన బాబు సంతోషం ఎక్కువైంది. కేరింతల శ్రుతీ పెరిగింది. ఇప్పటిదాకా తన వెనకే వినిపించి బాబు అరుపులు కాస్త దూరంగా వినిపిస్తున్నాయేంటని యథాలాపంగా వెనక్కి తిరిగి చూసింది యాదేశ్వరి. అంతే గుండె ఆగినంత పనైంది ఆమెకు. చిట్టి చేయి ముందుకు చాపితే చాలు స్టవ్‌కి తగులుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మెరుపు వేగంతో పరిగెత్తితింది. బాబును వెనక్కి లాగింది. కానీ ఆ హడావిడిలో ఆమె చేయి స్టవ్‌కి తగిలి స్టవ్ నేలమీద పడిపోయింది. దాని మీదున్న గిన్నె పక్కకు జరిగిపోయి మంట భగ్గున పైకిలేచింది. ఆ సెగ యాదేశ్వరి కళ్లను తాకింది. మంట... అంతా చీకటి.. ఏమైందో అర్థమయ్యేలోపే అంతా అయిపోయిన బాధ! బ్లాక్ అండ్ వైట్ మూడు రోజులు హాస్పిటల్లో ఉంది. ఏమీ కనిపించక నరకయాతన అనుభవించింది. నాలుగో రోజుకి కాస్త కళ్లు తెరవగలిగింది. అయినా చుట్టూ నల్లటి రంగు తప్ప తెల్లటి వెలుగే లేదు. ఆమె కళ్లను పరీక్షించిన డాక్టర్.. ఇప్పుడు నయమవుతుంది. కానీ భవిష్యత్‌లో అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని చెప్పాడు. ఆ మాట యాదేశ్వరి నెత్తిమీద పిడుగే అయింది. మూడు రోజుల గుడ్డితనానికే ఇంత బాధ ఉంటే ఇక భవిష్యత్తులో శాశ్వతంగా చూపుండదంటే ఇంకెంత వేదనపడాలో అని ఒక్కసారిగా కుంగిపోయింది. అప్పుడు ఆమె మనసులో అంధులు మెదిలారు. జీవితంలో వెలుతురు రంగే చూడకుండా నలుపుతోనే ఎలా వెళ్లదీస్తున్నారు? తెల్లని వెన్నెల.. నీలి ఆకాశం.. పచ్చని ప్రకృతి వీళ్లకు తెలిసే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు ఆమె మస్తిష్కాన్ని ముసురుకోవడం మొదలుపెట్టాయి. కాలం గడుస్తోంది... 1987 పోయి, 88 గడిచి 89 వచ్చింది. టీటీసీ పూర్తయ్యి టీచర్ కొలువూ దొరికింది. బాబూ పెరుగుతున్నాడు. కాని ఆమె లోలోపల మాత్రం దిగులు తన ఛాయల్ని పరుస్తూనే ఉంది. భవిష్యత్‌లో చూపు పోవచ్చు.. అనే మాటతో భయపెడుతూనే ఉంది. జీతం ఉన్నప్పుడే డబ్బులు ఆదా చేసుకుంటాం.. ముదిమిలో ఆదుకుంటాయని. చూపున్నప్పుడే బ్రెయిలీ నేర్చుకోవాలి.. అంధత్వం వచ్చాక ఆసరా అవుతుంది. ఆ ఆలోచన వచ్చాక మరి మార్చుకోలేదు యాదేశ్వరి! ఇన్‌సర్వీస్ క్యాండిడేట్‌గా.. హైదరాబాద్‌లోని విజువల్లీ హ్యాండీక్యాప్డ్ ఇన్స్టిట్యూట్లో చేరింది. బ్రెయిలీలో డిప్లొమా కోర్స్ చేసింది. ఏడాది పాటు ఇంటికి దూరంగా ఉంది. ఇంట్లోవాళ్ల నుంచి అభ్యంతరమేమీ రాలేదు. ముందు ముందు ఉపయోగపడ్తుంది అని వాళ్లూ ఒప్పుకున్నారు. ముందు యాదేశ్వరి బ్రెయిలీ తనకోసమే నేర్చుకున్నా.. నేర్చుకున్నాక మాత్రం అంధుల కోసం ఉపయోగపడాలని నిర్ణయించుకుంది. తాను చూసిన లోకాన్ని.. చదివిన సాహిత్యాన్ని అంధులకూ అందివ్వాలని సంకల్పించింది. ఇక సమయాన్ని వృథాచేసుకోలేదు. పుస్తకాలు చదివింది. మరాఠీ, కన్నడ, గుజరాతీ, రష్యన్, జర్మన్, జపానీస్, స్పానిష్ భాషలు నేర్చుకుంది. 2002 నుంచి తన రచనాయజ్ఞం ప్రారంభించింది. గురుగీతతో... శ్రీ సూర్య అని తన కలానికి పేరు పెట్టుకుంది. ముందు రాసిన పుస్తకం శ్రీగురు గీత. దీన్ని మాజీ రాష్ట్రపతి దివంగత ఆర్. వెంకటరామన్ ఆవిష్కరించారు. తర్వాత ఒకటవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో రాసింది. ఇక ఆ రచనా ప్రవాహం ఆగలేదు. కాళోజీ నారాయణరావు, కొమురం భీమ్ వంటి మహోన్నతుల జీవిత చరిత్రలను బ్రెయిలీలోకి మార్చింది. జర్మనీ భాషలో మూడు నీతి కథల పుస్తకాలను రాసింది. అలాగే జపానీస్, రష్యన్, స్పానిష్‌లో భాషల్లోని పుస్తకాలను బ్రెయిలీలోకి మార్చింది. అంధులను ఐఏఎస్‌లుగా చూడాలన్న తాపత్రయంతో ఇప్పుడు వివిధ భాషల్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను బ్రెయిలీలో రాసేందుకు శ్రమిస్తోంది. ఇంకా ఎన్నో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలను బ్రెయిలీకి మార్చింది. మొన్నటి వరకు వీటన్నిటినీ చేతి ద్వారే రాసింది యాదేశ్వరి. ఆమె శ్రమను గుర్తించిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మెచ్చుకోలుగా ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను ఆమెకు ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మరింత వేగంగా పుస్తకాలను అచ్చువేసే పనిలో ఉంది. దాశరథి రంగాచార్య, కృష్ణారెడ్డి రచించిన వేదాలను బ్రెయిలీ లిపిలో మార్చాలనేది ఆమె లక్ష్యం. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ నిర్మాత ఒకరు ఆ వేదాలను తనకు అంకితం ఇస్తే ఒక్కోదానికి మూడు లక్షల రూపాయలిస్తానని అడిగారు. దానికి ఆమె ‘బ్రెయిలీలో పుస్తకాలు రాయడం అంధులకు నేను చేస్తున్న సేవ తప్ప వాళ్ల పేరుతో వ్యాపారం’ కాదు అని సున్నితంగా తిరస్కరించింది. వేదాల తర్జుమా పూర్తి కావాల్సి ఉంది. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన అయుత చండీయాగాన్నీ బ్రెయిలీలో రాసి అంధులకూ అందుబాటులోకి తెచ్చింది. సొంత ఖర్చుతోనే... యాదేశ్వరి ఈ పనులన్నీ దాతల ద్వారా అందిన డబ్బుతో చేయట్లేదు. తన జీతంలోని మూడొంతులు ఖర్చుపెట్టి మరీ రాస్తోంది. ఆ సేవాధృక్పథాన్ని తన కొడుకు నరేంద్రనాథ్కూ అలవర్చింది.‘అంధుల బాధ ముందు నేను చేస్తున్న శ్రమ పెద్ద గొప్పదేం కాదు. ఎన్ని కష్టాలొచ్చినా ఈ ప్రయత్నం మానను. వేదాలనూ త్వరలోనే పూర్తి చేస్తా. వాటిని మా పుట్టింటి వాళ్లకు, అత్తింటి వాళ్లకు, గణపతి సచ్చిదానంద స్వామికి, ఉపాధ్యాయ వృత్తికీ అంకితమిస్తా’ అంటుంది మహబూబ్‌నగర్ జిల్లా, బొక్కలోనిపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్న యాదేశ్వరి. బ్రెయిలీలో యాదేశ్వరి చేస్తున్న సాహిత్య సేవకు ఎన్నో అవార్డులతోపాటు గణపతిసచ్చిదానంద స్వామి ఆస్థాన విదుషీమణి గౌరవాన్నీ అందుకుంది. - వేణుగోపాల్‌రావు మాటేటి, సాక్షి ప్రతినిధి మహబూబునగర్ శ్రీగురు గీతను మాజీ రాష్ట్రపతి దివంగత ఆర్. వెంకటరామన్ ఆవిష్కరించారు. తర్వాత ఒకటవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో రాసింది. ఇక ఆ రచనా ప్రవాహం ఆగలేదు. కాళోజీ నారాయణరావు, కొమురం భీమ్ వంటి మహోన్నతుల జీవిత చరిత్రలను బ్రెయిలీలోకి మార్చింది. జర్మనీ భాషలో మూడు నీతి కథల పుస్తకాలను రాసింది. అలాగే జపానీస్, రష్యన్, స్పానిష్‌లో భాషల్లోని పుస్తకాలను బ్రెయిలీలోకి మార్చింది. -
ట్వంటీఫస్ట్‌న ఏంటి?
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్వంటీఫస్ట్’. వెంకట్, వింధ్య, నవీన్ ముఖ్య పాత్రల్లో జయశంకర్ దర్శకత్వంలో యాదగిరి నిర్మిస్తున్నారు. అభిషేక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాద్‌లో విడుదల చేసి దర్శకుడు రఫీకి అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుంది. అసలు ట్వంటీఫస్ట్ అనే టైటిల్ ఈ సినిమాకు బాగా సరిపోతుంది. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
వ్యవసాయంలోకి యువత రావాలి
కామారెడ్డిటౌన్ : అన్నిరంగాల్లో లాగే వ్యవసాయ రంగంలో కూడా యువత ప్రధానపాత్ర పోషిస్తే ఈ రంగం అభివృద్ధి చెందుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి.రాజిరెడ్డి అన్నారు. కామారెడ్డి డెయిరీ కళాశాలలో సోమవారం ఆకాశవాణి ప్రజాసేవా ప్రసార దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేడియో ప్రచారసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగంలో యువకులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆకాశవాణి రేడియో ప్రసారాల ద్వారా రైతులకు పూర్తిగా పరిజ్ఞానం అందుతుందన్నారు. టీవీలకన్నా, రేడియోలే మిన్నా అని చెప్పారు. రేడియోను పొలానికి, ఎక్కడికైనా తీసుకెళ్లి కార్యక్రమాలను వినవచ్చన్నారు. వ్యవసాయం లాభదాయకం కావాలంటే పశుపోషణ, ఉద్యానవన, చేపల పెంపకం, తదితర రంగాలపైనా రైతులు దృష్టి పెట్టాలన్నారు. అవగాహనలోపంతో రైతులు చాలా వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పరిశోధన కేంద్రాలను సద్వినియోగం చేసుకుని, సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలపై బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ సైకాలాజీ ఉస్మానియా యూనివర్సిటీ చైర్పర్సన్ డాక్టర్ ఏ. అనుపమ అవగాహన కల్పించారు. రైతే దేశానికి వెన్నుముక అని, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యఅతిథులుగా ఆకాశవాణి అసిస్టెంట్ డెరైక్టర్ ఉదయశంకర్, తిరుపతి డెయిరీ కళాశాల డీన్ డాక్టర్ ఎస్.రవికుమార్, అసోసియేట్ డీన్ ఆర్.చంద్రశేఖర్, రైతునేస్తం, పశునేస్తం సంపాదకులు వెంకటేశ్వర్ హాజరయ్యారు. కార్యక్రమంలో డెయిరీ కళాశాల సిబ్బంది రాజ్‌గోపాల్, ఉమాపతి, శ్రీపాద్, రాజశేఖర్, విజయ్గీతా, శాలిని, రవీందర్‌రెడ్డి, మాధవి, లింగం, డెయిరీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
పోరాటయోధుడు జయశంకర్ సార్...
తాండూరు టౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బుధవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జేఏసీ, టీవీవీ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాచౌక్‌లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని కోదండరాం, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ‘జీవితం నీది.. బ్రతుకంతా దేశానిది’ అని కవి కాళోజి చెప్పినట్లుగా జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ పోరాటానికే అంకితమిచ్చారన్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొనాల్సి ఉండగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు పాడైపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయినట్లు చెప్పేవారన్నారు. నాడు అక్కడ జరిగిన కాల్పుల్లో పలువురు విద్యార్థులు అమరులయ్యారన్నారు. ఆనాడు ఆయన వె ళ్లకపోవడం వల్లే నేటివరకు మనకు దారి చూపుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యారన్నారు. 1969లో జరిగిన ఉద్యమానికి ప్రాణంపోసి ఆంధ్రుల ఆధిపత్యానికి ఎదురెళ్లారన్నారు. 1996 ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి మొలకనాటి నీరుపోసి పోరాటాన్ని ఉధృతం చేయించారన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారన్నారు. వికారాబాద్‌ను జిల్లాగా చేసి, ఇక్కడి సంపదను స్థానికులకే దక్కేలా నాయకులు చూడాలన్నారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, జేఏసీ నాయకులు కనకయ్య, రంగారావు, టీవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదయ్య, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, నాయకులు బైండ్ల విజయ్‌కుమార్, ఆర్.విజయ్, కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, విజయాదేవి, సునీతాసంపత్, సుమిత్, శోభారాణి, రజాక్, పరిమళ, నీరజ, అనసూయ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.