కనపడిన కష్టం...
కాసేపు కష్టం ఆవహించి... ఆ వెంటనే తొలగిపోతే..?
మనమైతే... దేవుడికి ముడుపు కడతాం.. గుడికెళ్లి టెంకాయ కొడ్తాం...
పూర్వజన్మ సుకృతమని అనుకుంటాం!
కానీ... యాదేశ్వరి తనకు కనపడిన కష్టాన్ని
ఎవరికీ కనపడకుండా చేద్దామనుకుంది.
చీకటిలో వెలుతురు కనిపించదు. చీకటి కమ్ముకున్నప్పుడు దారి దొరుకుతుందన్న ఆశా ఉండదు.కానీ ఆమె ఆ వెలుతురును చూడగలిగింది. ఒక దారిని కనుగొనగలిగింది.మనిషికి ఎదురయ్యే సమస్యే ఆ మనిషిని ఉన్నతస్థానంలో నిలబెడుతుందనడానికి ఈ కథనమే ఒక ఉదాహరణ.1987 సంవత్సరం.. మహబూబ్‌నగర్ టౌన్. ఆ టీచరమ్మ పేరు యాదేశ్వరి. అప్పుడు ఆమెకు పద్దెనిమిదేళ్లు! పెళ్లై, ఆర్నెల్ల బాబు ఉన్నాడు. టీచరు కావాలనే కోరికతో బాబును చూసుకుంటూనే టీటీసీ చేస్తోంది. భర్త జయశంకర్ కూడా టీచరే. అక్కడకి దగ్గర్లోని ఊళ్లో ఉద్యోగం.
ఎప్పటిలాగే ఒకరోజు...
కాలేజ్‌కి టైమ్ అవుతోంది. ఓ వైపు వంట చేస్తూ కాలేజ్‌కి రెడీ అవుతోంది. కిరోసిన్ స్టవ్ మీద కూర రెడీ అవుతోంది. అక్కడే నేల మీద ఆడుకుంటున్న బాబును నీలరంగు మంటతో వెలుగుతున్న స్టవ్ ఆకట్టుకుంది. కేరింతలు కొడుతూ చకచకా స్టవ్ వైపు పాకడం మొదలుపెట్టాడు. యాదేశ్వరి దాన్ని గమనించలేదు. స్టవ్‌కి దగ్గరైన బాబు సంతోషం ఎక్కువైంది. కేరింతల శ్రుతీ పెరిగింది. ఇప్పటిదాకా తన వెనకే వినిపించి బాబు అరుపులు కాస్త దూరంగా వినిపిస్తున్నాయేంటని యథాలాపంగా వెనక్కి తిరిగి చూసింది యాదేశ్వరి. అంతే గుండె ఆగినంత పనైంది ఆమెకు. చిట్టి చేయి ముందుకు చాపితే చాలు స్టవ్‌కి తగులుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మెరుపు వేగంతో పరిగెత్తితింది. బాబును వెనక్కి లాగింది. కానీ ఆ హడావిడిలో ఆమె చేయి స్టవ్‌కి తగిలి స్టవ్ నేలమీద పడిపోయింది. దాని మీదున్న గిన్నె పక్కకు జరిగిపోయి మంట భగ్గున పైకిలేచింది. ఆ సెగ యాదేశ్వరి కళ్లను తాకింది. మంట... అంతా చీకటి.. ఏమైందో అర్థమయ్యేలోపే అంతా అయిపోయిన బాధ!
బ్లాక్ అండ్ వైట్
మూడు రోజులు హాస్పిటల్లో ఉంది. ఏమీ కనిపించక నరకయాతన అనుభవించింది. నాలుగో రోజుకి కాస్త కళ్లు తెరవగలిగింది. అయినా చుట్టూ నల్లటి రంగు తప్ప తెల్లటి వెలుగే లేదు. ఆమె కళ్లను పరీక్షించిన డాక్టర్.. ఇప్పుడు నయమవుతుంది. కానీ భవిష్యత్‌లో అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని చెప్పాడు. ఆ మాట యాదేశ్వరి నెత్తిమీద పిడుగే అయింది. మూడు రోజుల గుడ్డితనానికే ఇంత బాధ ఉంటే ఇక భవిష్యత్తులో శాశ్వతంగా చూపుండదంటే ఇంకెంత వేదనపడాలో అని ఒక్కసారిగా కుంగిపోయింది. అప్పుడు ఆమె మనసులో అంధులు మెదిలారు. జీవితంలో వెలుతురు రంగే చూడకుండా నలుపుతోనే ఎలా వెళ్లదీస్తున్నారు? తెల్లని వెన్నెల.. నీలి ఆకాశం.. పచ్చని ప్రకృతి వీళ్లకు తెలిసే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు ఆమె మస్తిష్కాన్ని ముసురుకోవడం మొదలుపెట్టాయి.
కాలం గడుస్తోంది...
1987 పోయి, 88 గడిచి 89 వచ్చింది. టీటీసీ పూర్తయ్యి టీచర్ కొలువూ దొరికింది. బాబూ పెరుగుతున్నాడు. కాని ఆమె లోలోపల మాత్రం దిగులు తన ఛాయల్ని పరుస్తూనే ఉంది. భవిష్యత్‌లో చూపు పోవచ్చు.. అనే మాటతో భయపెడుతూనే ఉంది. జీతం ఉన్నప్పుడే డబ్బులు ఆదా చేసుకుంటాం.. ముదిమిలో ఆదుకుంటాయని. చూపున్నప్పుడే బ్రెయిలీ నేర్చుకోవాలి.. అంధత్వం వచ్చాక ఆసరా అవుతుంది. ఆ ఆలోచన వచ్చాక మరి మార్చుకోలేదు యాదేశ్వరి!
ఇన్‌సర్వీస్ క్యాండిడేట్‌గా..
హైదరాబాద్‌లోని విజువల్లీ హ్యాండీక్యాప్డ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. బ్రెయిలీలో డిప్లొమా కోర్స్ చేసింది. ఏడాది పాటు ఇంటికి దూరంగా ఉంది. ఇంట్లోవాళ్ల నుంచి అభ్యంతరమేమీ రాలేదు. ముందు ముందు ఉపయోగపడ్తుంది అని వాళ్లూ ఒప్పుకున్నారు. ముందు యాదేశ్వరి బ్రెయిలీ తనకోసమే నేర్చుకున్నా.. నేర్చుకున్నాక మాత్రం అంధుల కోసం ఉపయోగపడాలని నిర్ణయించుకుంది. తాను చూసిన లోకాన్ని.. చదివిన సాహిత్యాన్ని అంధులకూ అందివ్వాలని సంకల్పించింది. ఇక సమయాన్ని వృథాచేసుకోలేదు. పుస్తకాలు చదివింది. మరాఠీ, కన్నడ, గుజరాతీ, రష్యన్, జర్మన్, జపానీస్, స్పానిష్ భాషలు నేర్చుకుంది. 2002 నుంచి తన రచనాయజ్ఞం ప్రారంభించింది.
గురుగీతతో...
శ్రీ సూర్య అని తన కలానికి పేరు పెట్టుకుంది. ముందు రాసిన పుస్తకం శ్రీగురు గీత. దీన్ని మాజీ రాష్ట్రపతి దివంగత ఆర్. వెంకటరామన్ ఆవిష్కరించారు. తర్వాత ఒకటవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో రాసింది. ఇక ఆ రచనా ప్రవాహం ఆగలేదు. కాళోజీ నారాయణరావు, కొమురం భీమ్ వంటి మహోన్నతుల జీవిత చరిత్రలను బ్రెయిలీలోకి మార్చింది. జర్మనీ భాషలో మూడు నీతి కథల పుస్తకాలను రాసింది. అలాగే జపానీస్, రష్యన్, స్పానిష్‌లో భాషల్లోని పుస్తకాలను బ్రెయిలీలోకి మార్చింది. అంధులను ఐఏఎస్‌లుగా చూడాలన్న తాపత్రయంతో ఇప్పుడు వివిధ భాషల్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను బ్రెయిలీలో రాసేందుకు శ్రమిస్తోంది. ఇంకా ఎన్నో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలను బ్రెయిలీకి మార్చింది. మొన్నటి వరకు వీటన్నిటినీ చేతి ద్వారే రాసింది యాదేశ్వరి. ఆమె శ్రమను గుర్తించిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మెచ్చుకోలుగా ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను ఆమెకు ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మరింత వేగంగా పుస్తకాలను అచ్చువేసే పనిలో ఉంది. దాశరథి రంగాచార్య, కృష్ణారెడ్డి రచించిన వేదాలను బ్రెయిలీ లిపిలో మార్చాలనేది ఆమె లక్ష్యం. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ నిర్మాత ఒకరు ఆ వేదాలను తనకు అంకితం ఇస్తే ఒక్కోదానికి మూడు లక్షల రూపాయలిస్తానని అడిగారు. దానికి ఆమె ‘బ్రెయిలీలో పుస్తకాలు రాయడం అంధులకు నేను చేస్తున్న సేవ తప్ప వాళ్ల పేరుతో వ్యాపారం’ కాదు అని సున్నితంగా తిరస్కరించింది. వేదాల తర్జుమా పూర్తి కావాల్సి ఉంది. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన అయుత చండీయాగాన్నీ బ్రెయిలీలో రాసి అంధులకూ అందుబాటులోకి తెచ్చింది.
సొంత ఖర్చుతోనే...
యాదేశ్వరి ఈ పనులన్నీ దాతల ద్వారా అందిన డబ్బుతో చేయట్లేదు. తన జీతంలోని మూడొంతులు ఖర్చుపెట్టి మరీ రాస్తోంది. ఆ సేవాధృక్పథాన్ని తన కొడుకు నరేంద్రనాథ్‌కూ అలవర్చింది.‘అంధుల బాధ ముందు నేను చేస్తున్న శ్రమ పెద్ద గొప్పదేం కాదు. ఎన్ని కష్టాలొచ్చినా ఈ ప్రయత్నం మానను. వేదాలనూ త్వరలోనే పూర్తి చేస్తా. వాటిని మా పుట్టింటి వాళ్లకు, అత్తింటి వాళ్లకు, గణపతి సచ్చిదానంద స్వామికి, ఉపాధ్యాయ వృత్తికీ అంకితమిస్తా’ అంటుంది మహబూబ్‌నగర్ జిల్లా, బొక్కలోనిపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్న యాదేశ్వరి. బ్రెయిలీలో యాదేశ్వరి చేస్తున్న సాహిత్య సేవకు ఎన్నో అవార్డులతోపాటు గణపతిసచ్చిదానంద స్వామి ఆస్థాన విదుషీమణి గౌరవాన్నీ అందుకుంది.
- వేణుగోపాల్‌రావు మాటేటి,
సాక్షి ప్రతినిధి మహబూబునగర్
శ్రీగురు గీతను మాజీ రాష్ట్రపతి దివంగత ఆర్. వెంకటరామన్ ఆవిష్కరించారు. తర్వాత ఒకటవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో రాసింది. ఇక ఆ రచనా ప్రవాహం ఆగలేదు. కాళోజీ నారాయణరావు, కొమురం భీమ్ వంటి మహోన్నతుల జీవిత చరిత్రలను బ్రెయిలీలోకి మార్చింది. జర్మనీ భాషలో మూడు నీతి కథల పుస్తకాలను రాసింది. అలాగే జపానీస్, రష్యన్, స్పానిష్‌లో భాషల్లోని పుస్తకాలను బ్రెయిలీలోకి మార్చింది.