తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ఏడో విడత భూపంపిణీలో భాగంగా తాండూరు నియోజకవర్గ్గంలో 221 ఎకరాల ప్రభుత్వ భూమిని 172 మంది రైతులకు పంపిణీ చేశామని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. గురువారం సాయంత్రం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాలుగు మండలాల రెవెన్యూ అధికారులతో సబ్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ పంపిణీలో భాగంగా గ్రామాల్లో ఉన్న నిరుపేద రైతులకు అసైన్డ్ భూమిని పంపిణీ చేశామని చెప్పారు. తాండూరు మండలంలోని 9 గ్రామాల్లో 9 మంది లబ్ధిదారులకు 14 ఎకరాల 4 గుంటలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
యాలాల మండలంలోని 4 గ్రామాల్లో 21 మంది లబ్దిదారులకు 13 ఎకరాల 19 గుంటలు, పెద్దేముల్ మండలంలోని 10 గ్రామాల్లో 69 మంది లబ్ధిదారులకు 104 ఎకరాల 12 గుంటలు, బషీరాబాద్ మండలంలోని 10 గ్రామాల్లో 73 మంది లబ్ధిదారులకు 90 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూమిని పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలో దీనికి సంబంధించి రైతులకు పట్టాలు ఇస్తామని సబ్ క లెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు త్వరలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిద్వారా రైతులు బ్యాంక్‌లో రుణాలు తీసుకునేందుకు వీలుందని చెప్పారు.
అడవుల్లో రైతులు సాగు చేసిన భూమికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చేవిధంగా తాను అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. ఈవిషయమై త్వరలో కలెక్టర్‌తో మాట్లాడనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మహేష్‌గౌడ్, సత్యనారాయణ, స్థానిక నాయకులు కరణం పురుషోత్తంరావు, సురేందర్‌రెడ్డి, రాందాస్, అజయ్‌ప్రసాద్, సంజీవరెడ్డిలు ఉన్నారు.