తాండూరు: లారీ అదుపు తప్పి రోడ్డు మీద అడ్డదిడ్డంగా ప్రయాణించి కాసేపు కలకలం సృష్టించింది. ఆ మార్గంలో వాహనచోదకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు ఓ ఆటోను ఢీకొట్టిన లారీ అదే వేగంతో వెళ్లి పాఠశాల గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురు గాయపడ్డారు.
తాండూరు అర్భన్ ఎస్‌ఐ నాగార్జున కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ(కెఏ.39-5278) హైదరాబాద్ నుంచి తాండూరుకు సిమెంట్ లోడింగ్‌తో బుధవారం బయలుదేరింది. రాత్రి సుమారు 11గంటల సమయంలో తాండూరు పట్టణానికి ఈ లారీ చేరుకుంది. అయితే తాగిన మత్తులో డ్రైవర్ రవీందర్ లారీని అతి వేగంగా అజాగ్రత్తగా నడిపాడు. దీంతో లారీ రోడ్డు మీద అటూఇటూ తిరుగుతూ విలియంమూన్ చౌరస్తా నుంచి పోలీసుస్టేషన్ సమీపం వరకు వచ్చింది.
ఈక్రమంలో లారీని చూసిన వాహనదారులు ముందు జాగ్రత్త పడి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. చివరకు పోలీసుస్టేషన్ సమీపానికి రాగానే ముందుగా వెళుతున్న ఆటో ట్రాలీని లారీ ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో సమీపంలోని శివం గ్రామర్ స్కూల్ గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి గురైన ఆటోలో సెల్ టవర్లకు బ్యాటరీలు ఏర్పాటు చేసి రిలయన్స్ టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. వారిలో తాండూరులోని గాంధీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్(19), హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనారాజ్(26)లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్వన్నకట్టకు చెందిన అరవింద్‌కుమార్, ఆటో డ్రైవర్ శివారెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి.
బాధితులను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై సంఘటన రాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే చాలా మంది ప్రాణాలు పోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ శివారెడ్డి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ రవీందర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి తాండూరులో లారీ బీభత్సం
Published Thu, Nov 6 2014 11:33 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement
Advertisement