ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో
మంచాల: కారు రూపంలో మృత్యువు పంజా విసిరింది. ఆకుకూరలు విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్తుండగా ఐదుగురి ప్రాణాలు హరించింది. అమితవేగంతో దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సహా నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి కాన్వాయ్‌పై బాధిత కుటుంబీకులు, స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
మార్కెట్‌కు వెళుతుండగా..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడకు చెందిన చీమల సుజాత(44), చీమల మమత(35), ఆంబోత్ మారు(50), ఆంబోత్ హంస్లీ(56)తోపాటు కాట్రోత్ అచ్చాలి, కాట్రోత్ కమిలి, కాట్రోత్ కైలాబ్, సంకటి లక్ష్మమ్మ, ఆంబోత్ సోన, చీమల పద్మజ, ఆంబోత్ రజిత గ్రామంలోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వీరంతా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అదే గ్రామానికి చెందిన వంగలి శ్రీనివాస్(20) ఆటో(టీఎస్ 05యూవో 2614)లో ఆకుకూరల మూటలు పెట్టుకుని ఇబ్రహీంపట్నం మార్కెట్‌లో విక్రయించేందుకు బయలుదేరారు.
లింగంపల్లి గేట్ సమీపంలోకి చేరుకున్న వీరి ఆటోను ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన కారు(ఏపీ 9ఏక్యూ 5395) ఢీకొట్టింది. ప్రమాదంలో చీమల సుజాత, చీమల మమత, ఆంబోత్ మారు, ఆంబోత్ హస్లీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు మిగతా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే శ్రీనివాస్ కన్నుమూశాడు. లక్ష్మమ్మ కోమాలోకి వెళ్లగా.. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు స్వల్పంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది.
బంధువులు, స్థానికుల ఆందోళన
మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ప్రకటించాలని, జిల్లా మంత్రి ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికు లు రోడ్డుపై బైఠాయించారు. వారికి సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు. ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయంతోపాటు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా హామీ ఇవ్వాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. మంత్రి సర్దిచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయన తిరుగు పయనమయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలకు ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
పది నిమిషాల్లో మార్కెట్‌కు వెళతామనగా..
వీఎంఆర్ కన్వెన్షన్ నుంచి కారులో మంచాల రావడానికి అరగంట పడుతుంది. ఘటనాస్థలం నుంచి మంచాల 3 కిలోమీటర్లు.. ఇబ్రహీంపట్నం మార్కెట్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాల్లో ఆటోలో మార్కెట్‌కు చేరుకునేవారు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. కాగా, ఆపద్బంధు పథకం కింద ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ సుచరిత మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
కారులో మద్యం సీసాలు..
ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మంచాల గ్రామానికి చెందిన కొందరు హైదరాబాద్ సమీపంలోని వీఎంఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహ విందులో పాల్గొన్నారు. తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారేవరకు వేడుకల్లో పాల్గొనడం.. నిద్రలేకపోవడం, మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment