Four persons died
-
మృత్యు పీడనం
కష్టాన్నే నమ్ముకున్న కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు.. పొద్దంతా కష్టిస్తేనే కడుపుకింత తిండి దొరికే కష్ట జీవులు పనులు చేస్తూనే ప్రాణాలొదిలారు. మొక్కజొన్న ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ భారీ శబ్దంతో పేలుడు ధాటికి పిట్టల్లా రాలిపోయారు. తునా తునకలైన శరీర భాగాలు.. విసిరేసినట్లుగా పడిన క్షతగాత్రులు.. రక్తమోడుతూనే ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఎవరెక్కడున్నారో.. కటిక చీకట్లో ఎవరు మృతిచెందారో.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో అర్థంకాని పరిస్థితి. పగిలిపోయిన ఫ్యాక్టరీ గోడలు.. పరిసరాల్లో ధ్వంసమైన కార్లు, లారీల అద్దాలు. రాష్ట్రాలు దాటొచ్చినవారు కొందరైతే.. ఉన్న ఊరిలో పని చేసుకుంటున్న వారు మరికొందరు. భయానక వాతావరణాన్ని తలపించేలా మారింది బయ్యన్నగూడెంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ ప్రాంతం. నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెనుబల్లి: మండలంలోని బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 10 మీటర్ల నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లా చెదురుగా పడిపోయారు. మూడు మృతదేహాలు భయానక పరిస్థితుల్లో కనిపించాయి. పదిమందికి తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కార్మికులంతా బిహార్ వాసులా? స్థానికులా? అనేది ఇంకా నిర్ధారించలేదు. సత్తుపల్లికి చెందిన మురళీకృష్ణ అనే వ్యాపారి నెల రోజుల క్రితమే మొక్కజొన్న ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభించారు. కంకుల నుంచి విత్తనాలను వేరుచేశాక బెండులను బాయిలర్‌లో వేడి చేస్తారు. ఈ బాయిలర్ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి, ప్యాకింగ్ చేసి తరలిస్తారు. అయితే..ఈ బాయిలర్ వద్ద పీడనం పెరిగి రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకోవడంతో 5 కిలోమీటర్ల మేర భారీ శబ్దం వినిపించి జనం ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కుప్పకూలాయి. కర్మాగారం చట్టుపక్కల ఉన్న కార్లు, లారీల అద్దాలు పగిలి ధ్వంసమయ్యాయి. క్షత గాత్రులను పెనుబల్లి, సత్తుపల్లి వైద్యశాలలకు తరలించారు. పేలుడు రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో అప్పటికే కొందరు కార్మికులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోవడంతో భారీగా ప్రాణనష్టం తగ్గింది. సంఘటనా స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, కల్లూరు ఆర్డీఓ బి.శివాజీ, సత్తుపల్లి రూరల్ సీఐ టి.రవికుమార్, వీఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు, కల్లూరు ఎస్సై మేడ ప్రసాద్, తహసీల్దార్ వై.శ్రీనివాసులు సందర్శించి, సహాయక చర్యలు ప్రారంభించారు. జనరేటర్ వెలుగుల్లో అర్ధరాత్రి దాకా సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి 9వరకు సహాయక చర్యల్లేవ్.. మూడు షిఫ్టులు..బిహార్ కార్మికులని నిర్ధారణ బాయిలర్ పేలుడు సంఘటనలో మృత దేహాలను వెలికితీసే పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రాత్రి 7 గంటలప్పుడు బాయిలర్ విధ్వంసం జరగ్గా ఆ తర్వాత సంఘటనా స్థలానికి కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, ఆర్డీఓ శివాజీ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. అయితే..సత్తుపల్లి నుంచి ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది వచ్చినప్పటికీ సింగరేణి రెస్క్యూ సిబ్బంది మాత్రం రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ చేరుకోలేదు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ చేరుకుని అప్రమత్తం చేశారు. ఈ ఫ్యాక్టరీలో బిహార్‌కు చెందిన కార్మికులతో పాటు స్థానిక కార్మికులు ఒక్కొక్క షిప్టుకు 50 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 150 మంది పనిచేస్తున్నారు. సాయంత్రం వేళ చాలామంది ఇళ్లకు వెళ్లడంతో..పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ సిబ్బంది చేరని కారణంగా సహాయక చర్యలు వేగవంతం కాలేదు. శిథిలాల కింద మృతదేహాలు, క్షతగాత్రులకు సంబంధించిన స్పష్టత రాలేదు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సీపీ తఫ్సీర్ మొక్కజొన్న ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో యాజమాన్యంపై చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన బయ్యన్నగూడెం వద్ద ప్రమాదస్థలాన్ని సందర్శించి..పేలుడు సంభవించిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యజమానులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టాలని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులను ఆదేశించారు. -
పంజా విసిరిన మృత్యువు
మంచాల: కారు రూపంలో మృత్యువు పంజా విసిరింది. ఆకుకూరలు విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్తుండగా ఐదుగురి ప్రాణాలు హరించింది. అమితవేగంతో దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సహా నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి కాన్వాయ్‌పై బాధిత కుటుంబీకులు, స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌కు వెళుతుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడకు చెందిన చీమల సుజాత(44), చీమల మమత(35), ఆంబోత్ మారు(50), ఆంబోత్ హంస్లీ(56)తోపాటు కాట్రోత్ అచ్చాలి, కాట్రోత్ కమిలి, కాట్రోత్ కైలాబ్, సంకటి లక్ష్మమ్మ, ఆంబోత్ సోన, చీమల పద్మజ, ఆంబోత్ రజిత గ్రామంలోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వీరంతా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అదే గ్రామానికి చెందిన వంగలి శ్రీనివాస్(20) ఆటో(టీఎస్ 05యూవో 2614)లో ఆకుకూరల మూటలు పెట్టుకుని ఇబ్రహీంపట్నం మార్కెట్లో విక్రయించేందుకు బయలుదేరారు. లింగంపల్లి గేట్ సమీపంలోకి చేరుకున్న వీరి ఆటోను ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన కారు(ఏపీ 9ఏక్యూ 5395) ఢీకొట్టింది. ప్రమాదంలో చీమల సుజాత, చీమల మమత, ఆంబోత్ మారు, ఆంబోత్ హస్లీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు మిగతా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే శ్రీనివాస్ కన్నుమూశాడు. లక్ష్మమ్మ కోమాలోకి వెళ్లగా.. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు స్వల్పంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. బంధువులు, స్థానికుల ఆందోళన మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ప్రకటించాలని, జిల్లా మంత్రి ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికు లు రోడ్డుపై బైఠాయించారు. వారికి సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయంతోపాటు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా హామీ ఇవ్వాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. మంత్రి సర్దిచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయన తిరుగు పయనమయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలకు ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పది నిమిషాల్లో మార్కెట్‌కు వెళతామనగా.. వీఎంఆర్ కన్వెన్షన్ నుంచి కారులో మంచాల రావడానికి అరగంట పడుతుంది. ఘటనాస్థలం నుంచి మంచాల 3 కిలోమీటర్లు.. ఇబ్రహీంపట్నం మార్కెట్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాల్లో ఆటోలో మార్కెట్‌కు చేరుకునేవారు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. కాగా, ఆపద్బంధు పథకం కింద ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ సుచరిత మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కారులో మద్యం సీసాలు.. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మంచాల గ్రామానికి చెందిన కొందరు హైదరాబాద్ సమీపంలోని వీఎంఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహ విందులో పాల్గొన్నారు. తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారేవరకు వేడుకల్లో పాల్గొనడం.. నిద్రలేకపోవడం, మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు -
గోడను ఢీకొన్న కారు– నలుగురు మృతి
బళ్లారి రూరల్ : బళ్లారి తాలూకా సోమసముద్రం సమీపంలో కారు అదుపు తప్పి గోడకు ఢీకొనడంతో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కురుగోడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీదర్ జిల్లా భాల్కికి చెందిన డాక్టర్ సంతోష్ కుటుంబం బీదర్ నుంచి బెంగుళూరుకు కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో బళ్లారి తాలూకా సోమసముద్రం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న గోడను కారు ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కారును డాక్టర్ సంతోష్ నడుపుతుండగా, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, కారులో ఉన్న డాక్టర్ సంతోష్(35), భార్య డాక్టర్ అర్చన(30), తండ్రి సిద్దరామప్ప(58) కూతురు లక్ష్మి(3)లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. డాక్టర్ సంతోష్ తల్లి లీలావతి(50), కొడుకు తనూష్(7)లు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కురుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మరో ఇద్దరికి గాయాలు -
జల్లికట్టులో 4కు పెరిగిన మృతుల సంఖ్య
మధురై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జల్లికట్టు, మంజవిరట్టు వేడుకల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. శివగంగ జిల్లాకు పొరుగున ఉన్న సిరవాయల్‌లో జరుగుతున్న మంజవిరట్టు(జల్లికట్టుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది) వేడుకను చూసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అలాగే తిరుచురాపల్లి జిల్లా ఆవారంగాడులో సోలై పాండియన్ అనే వ్యక్తి జల్లికట్టులో ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనతో కలిపి ఈ సీజన్లో ఈ వేడుకల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. సోమవారం పాలమేడులో జల్లికట్టు చూసేందుకు వచ్చిన 19ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఎంతో ప్రఖ్యాతి చెందిన అలగనల్లూరు జల్లికట్టులో మంగళవారం 25మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించిన ఈ వేడుకలో 1100 ఎడ్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
కుటుంబాన్ని బలి తీసుకున్న బస్సు!
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. పొదిలి అగ్రహారం వద్ద రిక్షాను ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిక్షాలో వెళుతున్న నలుగురూ మృతి చెందారు. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించినవారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. **