Minister mahendarreddy
-
పంజా విసిరిన మృత్యువు
మంచాల: కారు రూపంలో మృత్యువు పంజా విసిరింది. ఆకుకూరలు విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్తుండగా ఐదుగురి ప్రాణాలు హరించింది. అమితవేగంతో దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సహా నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి కాన్వాయ్‌పై బాధిత కుటుంబీకులు, స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌కు వెళుతుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడకు చెందిన చీమల సుజాత(44), చీమల మమత(35), ఆంబోత్ మారు(50), ఆంబోత్ హంస్లీ(56)తోపాటు కాట్రోత్ అచ్చాలి, కాట్రోత్ కమిలి, కాట్రోత్ కైలాబ్, సంకటి లక్ష్మమ్మ, ఆంబోత్ సోన, చీమల పద్మజ, ఆంబోత్ రజిత గ్రామంలోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వీరంతా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అదే గ్రామానికి చెందిన వంగలి శ్రీనివాస్(20) ఆటో(టీఎస్ 05యూవో 2614)లో ఆకుకూరల మూటలు పెట్టుకుని ఇబ్రహీంపట్నం మార్కెట్లో విక్రయించేందుకు బయలుదేరారు. లింగంపల్లి గేట్ సమీపంలోకి చేరుకున్న వీరి ఆటోను ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన కారు(ఏపీ 9ఏక్యూ 5395) ఢీకొట్టింది. ప్రమాదంలో చీమల సుజాత, చీమల మమత, ఆంబోత్ మారు, ఆంబోత్ హస్లీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు మిగతా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే శ్రీనివాస్ కన్నుమూశాడు. లక్ష్మమ్మ కోమాలోకి వెళ్లగా.. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు స్వల్పంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. బంధువులు, స్థానికుల ఆందోళన మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ప్రకటించాలని, జిల్లా మంత్రి ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికు లు రోడ్డుపై బైఠాయించారు. వారికి సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయంతోపాటు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా హామీ ఇవ్వాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. మంత్రి సర్దిచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయన తిరుగు పయనమయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలకు ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పది నిమిషాల్లో మార్కెట్‌కు వెళతామనగా.. వీఎంఆర్ కన్వెన్షన్ నుంచి కారులో మంచాల రావడానికి అరగంట పడుతుంది. ఘటనాస్థలం నుంచి మంచాల 3 కిలోమీటర్లు.. ఇబ్రహీంపట్నం మార్కెట్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాల్లో ఆటోలో మార్కెట్‌కు చేరుకునేవారు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. కాగా, ఆపద్బంధు పథకం కింద ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ సుచరిత మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కారులో మద్యం సీసాలు.. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మంచాల గ్రామానికి చెందిన కొందరు హైదరాబాద్ సమీపంలోని వీఎంఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహ విందులో పాల్గొన్నారు. తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారేవరకు వేడుకల్లో పాల్గొనడం.. నిద్రలేకపోవడం, మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు -
టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నాయకులు
మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో చేరిక వికారాబాద్ రూరల్ : టీడీపీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు అనసూయ, రాజమల్లయ్య, సంగీత, స్వరూప, దమయంతితో సంజీవరావు ఆధ్వర్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే అందరూ టీఆర్ఎస్ వైపు రావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు దాదాపు కనుమరుగయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దశల వారీ గా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. మరో 20 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్, నాయకులు నవీన్, ఆయా మండలాల నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, జెడ్పీటీసీ ముత్తార్ షరీఫ్ తదితరులు ఉన్నారు. -
పచ్చలహారంగా రింగ్ రోడ్డు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఆయన పర్యటన కొనసాగింది. హైదరాబాద్‌కు మణిహారమైన రింగ్‌రోడ్డును సుందరంగా తీర్చిదిద్దాలంటే విరివిగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. కండ్లకోయ, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా ఘట్కేసర్, మేడ్చల్ వరకు సీఎం పర్యటన కొనసాగింది. మేడ్చల్ మండలం కండ్లకోయ నుంచి పారిశ్రామిక వాడ వెనుక వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంత ంతో ఓ చోట కారు దిగి ఐదు నిమిషాల పాటు అధికారులతో అటవీ ప్రాంతం గురించి చర్చించారు. అటవీ విస్తీర్ణం, ఏఏ రకాల చెట్లు పెంచుతున్నారు, పరిరక్షణ చర్యలు ఏవిధంగా ఉన్నాయి వంటి విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంత మ్యాప్‌ను పరిశీలించారు. 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో అన్ని రకాల చెట్లు పెంచుతున్నామని, చుట్టూ ప్రహరీ నిర్మించి మొక్కలను పరిరక్షిస్తున్నామని, వర్షాలు లేని సమయంలో ఎండిపోయే మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ముందస్తు షెడ్యూల్లో లేకున్నా మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీఎం కండ్లకోయకు చేరుకోవడంతో అధికారులు ఉన్న కొద్ది సమయంలోనే ఏర్పాట్లు చేశారు. గత డిసెంబర్లో సీఎం ఈ అడవీ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. పర్యటన ముగిసిన అనంతరం సీఎం ప్రత్యేక బస్సులో ఘట్కేసర్ వెళ్లారు. సీఎం వెంట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , అటవీశాఖ అధికారులు శ్రీనివాస్, శోభ, మిశ్రా, నాగభూషణం, స్థానిక అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. రద్దయిన శంషాబాద్ పర్యటన శంషాబాద్ : శంషాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. మండలంలోని కొత్వాల్‌గూడ, హుడాకాలనీ, గండిగూడలోని నర్సరీలను సందర్శించే కార్యక్రమాన్ని అటవీశాఖ, హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్వాల్‌గూడ నర్సరీకి ముఖ్యమంత్రి చేరుకోనున్నట్లు సమాచారం అందింది. శంషాబాద్ పంచాయతీ పరిధి హుడాకాలనీలోని హెచ్ఎండీఏ నర్సరీని కూడా సందర్శిస్తారని సమాచారం అందడంతో అప్పటికప్పుడే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ దిగడానికి సరైన రూట్‌మ్యాప్‌ను వేసుకోకపోవడంతో సీఎం కాన్వాయ్ కిషన్‌గూడ ఔటర్ జంక్షన్‌కు వరకు వెళ్లింది. కిషన్‌గూడ వద్ద ఔటర్ రింగురోడ్డు దిగిన సీఎం కాన్వాయ్ పట్టణంలోని ఆర్జీఐఏ పీఎస్ వరకు వచ్చి అక్కడ తిరిగి యూ టర్స్ తీసుకుని ఔటర్ రింగురోడ్డు మీదకి చేరుకుని నేరుగా బొంగులూరు వైపు వెళ్లింది. దీంతో సీఎం పర్యటన రద్దయినట్టు సమాచారం అందడంతో అధికారులు, అక్కడికి చేరుకున్న ప్రజలు నిరుత్సాహంతో తిరుగుముఖం పట్టారు. ఆర్జీఐఏ పీఎస్ వరకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్.. నేరుగా మిషన్ కంపౌండ్ మీదుగా హుడా కాలనీకి చేరుకునేందుకు అవకాశమున్నప్పటికీ.. ముందస్తుగా ఆ రూట్ సమాచారం లేకపోవడంతో కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. నర్సరీని సందర్శించిన సీఎం కేసీఆర్ ఘట్కేసర్ టౌన్, ఘట్కేసర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఘట్‌కేసర్‌ను సందర్శించారు. మండలంలోని కొర్రెముల్ గ్రామం సమీపంలోని మూసీ కాల్వను, పట్టణ సమీపంలోని నర్సరీని సందర్శించారు. నర్సరీలో గల వివిధ రకాల మొక్కలను సీఎం పరిశీలించారు. మొక్కలు పెంచే విధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, కీసర ఎంపీపీ రామారం సుజాత సీఎం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా సుమారుగా గంటసేపు జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేయడంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జాం అయింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఏసీపీ రవిచందన్‌రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కల్వకుంట్ల శోభ, తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ స్టీవెన్, ఎంపీటీసీలు నర్రి శ్రీశైలం, నాథంగౌడ్, మంకం, రైతు సేవా సహకార సంఘం డెరైక్టర్లు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బైరు రాములు పాల్గొన్నారు.