పచ్చలహారంగా రింగ్ రోడ్డు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఆయన పర్యటన కొనసాగింది. హైదరాబాద్‌కు మణిహారమైన రింగ్‌రోడ్డును సుందరంగా తీర్చిదిద్దాలంటే విరివిగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. కండ్లకోయ, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా ఘట్‌కేసర్, మేడ్చల్ వరకు సీఎం పర్యటన కొనసాగింది. మేడ్చల్ మండలం కండ్లకోయ నుంచి పారిశ్రామిక వాడ వెనుక వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంత ంతో ఓ చోట కారు దిగి ఐదు నిమిషాల పాటు అధికారులతో అటవీ ప్రాంతం గురించి చర్చించారు.
అటవీ విస్తీర్ణం, ఏఏ రకాల చెట్లు పెంచుతున్నారు, పరిరక్షణ చర్యలు ఏవిధంగా ఉన్నాయి వంటి విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంత మ్యాప్‌ను పరిశీలించారు. 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో అన్ని రకాల చెట్లు పెంచుతున్నామని, చుట్టూ ప్రహరీ నిర్మించి మొక్కలను పరిరక్షిస్తున్నామని, వర్షాలు లేని సమయంలో ఎండిపోయే మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ముందస్తు షెడ్యూల్‌లో లేకున్నా మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీఎం కండ్లకోయకు చేరుకోవడంతో అధికారులు ఉన్న కొద్ది సమయంలోనే ఏర్పాట్లు చేశారు.
గత డిసెంబర్‌లో సీఎం ఈ అడవీ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. పర్యటన ముగిసిన అనంతరం సీఎం ప్రత్యేక బస్సులో ఘట్‌కేసర్ వెళ్లారు. సీఎం వెంట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , అటవీశాఖ అధికారులు శ్రీనివాస్, శోభ, మిశ్రా, నాగభూషణం, స్థానిక అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
రద్దయిన శంషాబాద్ పర్యటన
శంషాబాద్ : శంషాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. మండలంలోని కొత్వాల్‌గూడ, హుడాకాలనీ, గండిగూడలోని నర్సరీలను సందర్శించే కార్యక్రమాన్ని అటవీశాఖ, హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్వాల్‌గూడ నర్సరీకి ముఖ్యమంత్రి చేరుకోనున్నట్లు సమాచారం అందింది. శంషాబాద్ పంచాయతీ పరిధి హుడాకాలనీలోని హెచ్‌ఎండీఏ నర్సరీని కూడా సందర్శిస్తారని సమాచారం అందడంతో అప్పటికప్పుడే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ దిగడానికి సరైన రూట్‌మ్యాప్‌ను వేసుకోకపోవడంతో సీఎం కాన్వాయ్ కిషన్‌గూడ ఔటర్ జంక్షన్‌కు వరకు వెళ్లింది.
కిషన్‌గూడ వద్ద ఔటర్ రింగురోడ్డు దిగిన సీఎం కాన్వాయ్ పట్టణంలోని ఆర్‌జీఐఏ పీఎస్ వరకు వచ్చి అక్కడ తిరిగి యూ టర్స్ తీసుకుని ఔటర్ రింగురోడ్డు మీదకి చేరుకుని నేరుగా బొంగులూరు వైపు వెళ్లింది. దీంతో సీఎం పర్యటన రద్దయినట్టు సమాచారం అందడంతో అధికారులు, అక్కడికి చేరుకున్న ప్రజలు నిరుత్సాహంతో తిరుగుముఖం పట్టారు. ఆర్‌జీఐఏ పీఎస్ వరకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్.. నేరుగా మిషన్ కంపౌండ్ మీదుగా హుడా కాలనీకి చేరుకునేందుకు అవకాశమున్నప్పటికీ.. ముందస్తుగా ఆ రూట్ సమాచారం లేకపోవడంతో కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.
నర్సరీని సందర్శించిన సీఎం కేసీఆర్
ఘట్‌కేసర్ టౌన్, ఘట్‌కేసర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఘట్‌కేసర్‌ను సందర్శించారు. మండలంలోని కొర్రెముల్ గ్రామం సమీపంలోని మూసీ కాల్వను, పట్టణ సమీపంలోని నర్సరీని సందర్శించారు. నర్సరీలో గల వివిధ రకాల మొక్కలను సీఎం పరిశీలించారు. మొక్కలు పెంచే విధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, కీసర ఎంపీపీ రామారం సుజాత సీఎం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా సుమారుగా గంటసేపు జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేయడంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జాం అయింది.
వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఏసీపీ రవిచందన్‌రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కల్వకుంట్ల శోభ, తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ స్టీవెన్, ఎంపీటీసీలు నర్రి శ్రీశైలం, నాథంగౌడ్, మంకం, రైతు సేవా సహకార సంఘం డెరైక్టర్లు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బైరు రాములు పాల్గొన్నారు.