తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే డ్రా పద్ధతిలో విజేతను ఎంపిక చేస్తామని తాండూరు మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లకు నమూనా కంట్రోల్ యూనిట్ ద్వారా ఈనెల 12న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి విలేకరులతో మాట్లాడారు. ఏదైన వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చినప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తామని వివరించారు.
పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారి నమోదు చేసిన ఓట్ల వివరాలకు ఓట్ల లెక్కింపు రోజు ఓట్ల వివరాలకు తేడా ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థికి ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారని తెలిపారు. మొత్తం 31 వార్డుల ఓట్ల లెక్కింపును మూడు రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు. మొదటి, రెండో రౌండ్‌కు పది వార్డుల చొప్పున, మూడో రౌండ్‌లో 11వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థి లేదా అతని తరపున ఎన్నికల/కౌంటింగ్ ఏజెంట్‌లలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు.
ఓట్ల లెక్కింపునకు వ్యవసాయ,విద్యాశాఖ, గనులు, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులు మొత్తం 43మందిని నియమించామన్నారు. పది మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు మరో పది మంది అసిస్టెంట్లు, ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపునకు ఇద్దరు ఇన్‌చార్జిలు ఉంటారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా ఇద్దరు ఇన్‌చార్జిలతోపాటు నలుగురు అసిస్టెంట్‌లను నియమించనున్నట్టు చెప్పారు. ఓట్ల లెక్కింపు వివరాలను రౌండ్ల వారీగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్న మీడియా పాయింట్‌లో విలేకరులకు అందజేస్తామని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల అధికారి గోపయ్య, ఇంజనీర్ సత్యనారాయణ, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
ఓట్లు సమానంగా వస్తే డ్రా పద్ధతిలో విజేత ఎంపిక
Published Sat, May 10 2014 12:31 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement