తాండూరు: పేరుకుపోయిన ఆస్తి(ఇంటి) పన్ను వసూలుకు తాండూరు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. మూడేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని భవన యజమానులకు నేటి నుంచి ‘రెడ్ నోటీసు’ జారీ చేయాలని నిర్ణయించారు. బకాయిల జాబితాలో పలు ప్రభుత్వ కార్యాలయాలూ ఉన్నాయి. ఆస్తి పన్ను వసూలుపై ఆయా శాఖలకు మున్సిపల్ అధికారులు లేఖలు పంపించనున్నారు.
భవన యజమానులు రెడ్ నోటీసు అందుకున్న మూడు రోజుల్లో బకాయి మొత్తం చెల్లించని పక్షంలో పురపాలక చట్టం 1965 అండర్ సెక్షన్-90, 91 షెడ్యూల్-2 రూల్(30) ప్రకారం స్థిరాస్తులు జప్తు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తాండూరు పురపాలక సంఘం పరిధిలో సుమారు 7,500 అసెస్‌మెంట్ గృహాలు, వ్యాపార సముదాయులు, సినిమా హాళ్లు ఉన్నాయి. రూ.50.56 లక్షల పాత బకాయితోపాటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.96.50 లక్షల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది.
అయితే ఈ ఏడాది ఆగస్టు వరకు పాత బకాయిలో రూ.5.69 లక్షలు, సాధారణ వసూళ్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ.25.83 లక్షలు కలుపుకుని మొత్తం రూ.31.52లక్షలు మాత్రమే ఆస్తిపన్ను వసూలైంది. ఇంకా సుమారు రూ.కోటీ 14 లక్షల 48 వేల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో సాగునీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, అటవీ శాఖ నుంచి సుమారు రూ.35లక్షల వరకు రావాలి. మూడేళ్లుగా మొండి బకాయి రూ.30లక్షల వరకు ఉందని అంచనా. ఇందులో పట్టణంలోని మూడు సినిమా హాళ్లు సుమారు రూ.9 లక్షల వరకు, నేషనల్ గార్డెన్ నుంచి రూ.లక్ష బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక ఆస్తిపన్ను బకాయిదారులందరికీ శుక్రవారం నుంచి రెడ్‌నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే పురపాలక చట్టం ప్రకారం టీవీ, ప్రిజ్ తదితర తరలించే వీలున్న వస్తువులను జప్తు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాండూరులోని 8 రెవెన్యూ బ్లాక్‌ల పరిధిలో సుమారు రెండు వేల మందికి రెడ్ నోటీసులను సిద్ధం చేసినట్ట్టు అధికార వర్గాల సమాచారం. నేటి నుంచి బిల్ కలెక్టర్‌లు బకాయిదారులకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సదరు బకాయిదారుడి ఇంటికి నల్లా కనెక్షన్ కట్ చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
బకాయిదారులకు ‘రెడ్‌నోటీస్’
Published Fri, Sep 26 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement