సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అన్నదమ్ములు రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఎన్నికల్లో పోటీ చేశారు.
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అన్నదమ్ములు రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో బాబాయ్ నారాయణరావు కాంగ్రెస్ నుంచి, అబ్బాయి నరేష్ (నారాయణరావు సోదరుడు చంద్రశేఖర్ కుమారుడు) టీడీపీ నుంచి ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇంత కాలం ఒకే పార్టీ (కాంగ్రెస్) ..ఒకే కుటుంబంగా ఉన్న మహరాజ్‌లు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఎన్నికల సమరంలో బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
2009 సార్వత్రిక ఎన్నికల తరువాత మాజీ ఎమ్మెల్యే నారాయణరావు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో ఆయన రాజకీయ పునరాగమనం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని వీడిన నరేష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు నారాయణరావు, నరేష్‌లకు సోమవారం టికెట్లను ఖరారు చేశాయి. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌కు అధిష్టానం మరో అవకాశాన్ని ఇచ్చినా ఆయన సుముఖత చూపలేదు. తనకు బదులు బాబాయ్ నారాయణరావుకు టికెట్ ఇవ్వాలని విన్నవించారు.
చివరికి రమేష్ విన్నపాన్ని అధిష్టానం ఆమోదించింది. దాంతో నారాయణరావు తెరపైకి వచ్చారు. ఇదే విధంగా 1994లో నారాయణరావు, ఆయన సోదరుడు మాణిక్‌రావు కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు పోటీ చేశారు. దాదాపు 20ఏళ్ల తరువాత ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం గమనార్హం. ఈనేపథ్యంలో వీరి కుటుంబసభ్యులు ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలబడతారనే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.