తాండూరు రూరల్, పరిగి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విభాగం అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. సోమవారం తాండూరు మండల పరిషత్‌లోని హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో, పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయంలో అధికారులు వివరాలు సేకరించారు. తాండూరు డివిజన్ కార్యాలయం నుంచి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు.
క్రిమినల్ కేసులు పెడతాం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. తాండూరు హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో డీఈ సీతారామమ్మను విచారించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు కట్టకుండా బిల్లులు కాజేసిన వారితోపాటు మధ్యవర్తులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. సీఐడీ విచారణ ప్రారంభమైందని, ముఖ్యంగా బషీరాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో రూ.కోటి వరకు అవినీతి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
బషీరాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నామని, త్వరలో విచారణచేసి అక్రమార్కులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా పెద్దేముల్ మండలం రేగొండిలో 291 కుటుంబాలకు గానూ 290 ఇళ్లు నిర్మించారని హౌసింగ్ అధికారులు చెప్పారని, దీనిపై విచారణ చేస్తామని అన్నారు. దోషులుగా తేలితే అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు. అయితే విచారణకు వచ్చిన అధికారులు తమ పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు.
అక్రమాల్లో బషీరాబాద్ నంబర్ వన్..!
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బషీరాబాద్ మండలం ప్రథమ స్థాయంలో ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దాదాపు 479 ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగాయన్నారు. వంద శాతానికి వంద శాతం ఇళ్లు ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల్లో తిరిగి తాండూరుకు వచ్చి విచారణను పూర్తిస్థాయిలో చేపడుతామన్నారు.
ఇప్పాయిపల్లి, చిన్నవార్వాల్ గ్రామాల్లో ఎక్కువ అవినీతి
పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయాన్ని సందర్శించిన అధికారులు.. తమకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా హౌసింగ్ డీఈ సంగప్పను కోరారు. వివరాల సేకరణకు రెండు మూడు రోజుల సమయం కావాలని కోరడంతో ఓ ప్రొఫార్మాను అందజేస్తూ.. దాని ప్రకారం వివరాలు ఇవ్వాలని సూచించారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తామని, లబ్ధిదారుల ఎంపిక, ఒకే వ్యక్తి రెండు మూడు ఇళ్లు తీసుకోవడం, ఇళ్ల మంజూరులో పైరవీలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు.
పరిగి నియోజకవర్గ పరిధిలోని ఇప్పాయిపల్లి, చిన్నవార్వాల్ గ్రామాల్లో ఎక్కువ అవినీతి జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు ముందుగా ఆ రెండు గ్రామాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందిరమ్మ ఇళ్లకోసం లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులు సైతం కావాలని హౌజింగ్ అధికారులను అడిగారు. విచారణకు వచ్చిన బృందంలో ఓ డీఎస్పీ, ముగ్గురు ఇన్స్‌పెక్టర్లు, ఓ సబ్‌ఇన్స్‌పెక్టర్ ర్యాంకు అధికారులున్నారు.
తీగ లాగుతున్నారు!
Published Tue, Aug 12 2014 12:11 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM