jayanti celebrations
-
అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కూటమి కుట్ర
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడ సెంట్రల్)/డాబాగార్డెన్స్(విశాఖపట్నం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తులో సామాజిక, న్యాయ మహా శిల్పాన్ని నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.అంబేడ్కర్ చిత్రపటం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఆ మహానుభావుడి విగ్రహంతో చంద్రబాబు వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దళితులపై బాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహం జోలికి వెళ్లావో తగిన గుణపాఠం తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేద్దామన్నారు.మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దశ, దిశ చూపించిన అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ ఆసిఫ్, వేల్పుల రవికుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద ఘనంగా జయంతి విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుక ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, నాయకులు గౌతంరెడ్డి, శైలజారెడ్డి, బెల్లం దుర్గ, షేక్ ఆసిఫ్, ఎ.రవిచంద్ర, దొడ్డా అంజిరెడ్డి, పోతిన మహేశ్, ఎస్సీ సెల్ నాయకులు కాలే పుల్లారావు, శరత్ తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావ్?విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని ఇంకేం పరిపాలిస్తారని రాజ్యాసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు రవీంద్రబాబు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే మాకివ్వండి.. మేమే అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.సోమవారం విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో లేకుండా చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివరామకృష్ణ, నాయకులు బొల్లవరపు జాన్‌వెస్లీ, ద్రోణంరాజు శ్రీవత్సవ్ పాల్గొన్నారు. -
తాడేపల్లిలో బాబు జగ్ జీవన్ రామ్ జయంతి వేడుకలు
-
Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు? -
ఏయన్నార్ శత జయంతి సందర్భంగా కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రముఖ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు నూరవ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ఏయన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్‌స్క్రీన్’ పేరుతో ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీస్‌తో ΄ాటు వరంగల్, కాకినాడ, తుముకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 10 క్లాసిక్స్ చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్‌తో జరుపుకోనుండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గ దర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్ఎఫ్డీసీ–ఎన్ఎఫ్ఎఐ, పీవీఆర్–ఐనాక్స్కి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫెస్టివల్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ‘‘ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికే ఈ పండగ’’ అని తెలి΄ారు ఎన్ఎఫ్డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్. -
గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ దివిలో విరిసిన పారిజాతమోఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమోనా మదిలో నీవై నిండిపోయెనే...ఈ పాట ఉన్న సినిమా పేరు చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలయ్యిందని కూడా తెలియకపోవచ్చు. హీరో ఎవరో. హీరోయిన్ ఎవరో. కాని పాట నిలిచింది. రాసిన దాశరథి నిలిచారు. పాడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా. ‘నిదుర మబ్బును మెరుపు తీగవై కలను రేపినది నీవే’ అని ఇదే పాటలో రాశారు దాశరథి. సినిమా సంగీత ఆకాశంలో కొన్ని నిదుర మబ్బులను తన రాకతో దాశరథి చెదరగొట్టారు. కొన్ని దివ్య పద ద్వారాలను తెరిచారు.దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చెపారిజాతమే నీవై నీవైఇది ‘తేనె మనసులు’ కోసం దాశరథి రాశాక కె.వి.మహదేవన్ ట్యూన్ చేసిన పాట. కాని ‘ఇద్దరు మిత్రులు’ కోసం సాలూరి రాజేశ్వరరావు హార్మోనియం పెట్టెను ముందరేసుకుని ‘మీరు ట్యూన్‌కి రాస్తారా, రాస్తే నన్ను ట్యూన్ చేయమంటారా?’ అని అడిగారు దాశరథిని. బహుశా దాశరథి ఆ క్షణంలో నవ్వుకుని ఉంటారు. నిజాము మీద యుద్ధగళం విప్పి వరంగల్ జైలులో బందీ అయినపుడు ఒక రాత్రి ఆయనను ఉన్నట్టుండి ఇతర రాజకీయ ఖైదీలతో కలిపి నిజామాబాద్ జైలుకు బయలుదేరదీశారు పోలీసులు.అది డిసెంబర్ నెల. రాత్రి. భయంకరమైన చలి. ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియని అయోమయం. దాశరథి ఆ చలిలో, బిక్కచచ్చిన తోటి రాజకీయ ఖైదీలను ఉత్తేజపరుస్తూ కవిత్వం అందుకున్నారు. ఆశువుగా. తెగిపడే కంఠంతో. ఒక్కో కవితా కాగడ. వెచ్చదనం రాజేస్తున్న నెగడు.అలాంటి దాశరథికి– పళ్లు తోముకోవడానికి బొగ్గుముక్క ఇస్తే జైలు గోడలను కవిత్వంతో నింపిన దాశరథికి– ట్యూన్ ఇస్తే ఎంత. నేరుగా రాయమంటే ఎంత. ‘ఎలాగైనా పర్వాలేదండీ’ అన్నారు దాశరథి. సాలూరు ట్యూన్ ఇచ్చారు. ‘నేను తాంబూలం వేసుకు వస్తాను. ఆలోచిస్తూ ఉండండి’ అని బయటకు వెళ్లి వచ్చిన ఆయన ఎర్రబడ్డ నోటిని ఆశ్చర్యంతో తెరిచారు. పల్లవి రెడీ!ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూహుషారు గొలిపేవెందుకే నిషా కనులదానాఈ ఖుషీ ఆ నిషా అప్పటి వరకూ తెలుగు పాట ఎరగదు. ఇది దాశరథి ఇచ్చిన హైదరాబాద్ టచ్. దక్కనీ మిఠాస్. పాట హిట్ అయ్యింది. దాశరథి నుంచి ‘గాలిబ్ గీతాల’ సంపుటిని అంకితం తీసుకున్నందుకు అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ ద్వారా ఇచ్చిన అవకాశం కవికి విజయావకాశంగా మారింది. తెలుగు పాట దాశరథిని చూసి ఇలా అంది –నా కంటి పాపలో నిలిచిపోరానీ వెంట లోకాల గెలవనీరాఇద్దరు హైదరాబాద్ కవులు ఒక సంవత్సరం తేడాలో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదట అక్కినేని ద్వారా దాశరథి (1961). తర్వాత ఎన్టీఆర్ ద్వారా సి. నారాయణ రెడ్డి (1962). దాశరథిది మొదటి నుంచి పోరుగీతం. ఆయన స్వయంగా నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. అజ్ఞాతంలో ఉన్నారు. జైలులో బాధలు పడ్డారు. ఆల్ ఇండియా రేడియోలో 1956 నుంచి ’71 వరకూ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ సినిమా కవిగా అవకాశాలు ఉపయోగించుకున్నారు.1977 నుంచి ’83 వరకు అంటే ఎన్టీఆర్ వచ్చి రద్దు చేసే దాకా దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరు ఆస్థానకవి. ఆ పదవిలో ఉండగా సినిమా గీతాలు ఆయన పెద్దగా రాయలేదు. దానికి తోడు 1987లో 62 ఏళ్ల వయసులో ఎదురైన అకాల మరణం దాశరథికి సుదీర్ఘ సినిమా కెరీర్ లేకుండా చేసింది. ఆయన సుమారు 620 పాటలు రాసి ఉండవచ్చు. రాసింది తక్కువైనా హిట్ అయినవి ఎక్కువ. చెట్టు పిట్ట కూడా పాడుకున్న పాట ఆయనది.గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుందిసెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముందిఅన్నపూర్ణ, ఆదుర్తి ఇలా ఒకటి రెండు అనుబంధాలు తప్ప దాశరథి ప్రత్యేకంగా ఏదో ఒక గ్రూప్‌తో లేదా సంస్థతో కలిసి ఉన్నట్టు లేదు. సినిమా రంగంలో ప్రతిభతో పాటు పి.ఆర్ కూడా ముఖ్యం. తిరగబడే కవికి అలాంటి స్వభావం తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత ఉడుకునెత్తురు కవికి సినిమాలో ఆవేశ కావేశాల పాటలు ఏమాత్రం దక్కలేదు. చాలా మటుకు ప్రేమగీతాలు, ఎన్నటికీ మాయని యుగళగీతాలు.ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదిఎన్నటికీ మాయని మమత నాది నీదిదాశరథి కుటుంబ అనుబంధాలను రాశారు. ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ ఆయనదే. ‘బాబూ వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’.... అలాగే కవ్వింతలూ రాశారు... ‘అది ఒక ఇదిలే అతనికి తగులే’... భార్య అలక భర్త వేడుకోలు... ‘ఓ చెలి కోపమా... అంతలో తాపమా’... ఊరడింపు ‘గోరొంక గూటికే చేరావు చిలక... భయమెందుకే నీకు బంగారు మొలక’... దరఖాస్తు... ‘విన్నవించుకోనా... చిన్న కోరిక’... ‘కాజల్’ సినిమా కోసం సాహిర్ రాసిన ‘ఛూలేనేదో నాజూక్ హోటోంకో’ విఖ్యాత గీతాన్ని దాశరథి ఎంత కోమలంగా తెలుగు చేశారో చూడండి. ‘తాగాలి’ కాదు ‘తాకాలి’ అన్నారు.నీ లేత గులాబి పెదవులతోకమ్మని మధువును తాకాలిదాశరథికి కృష్ణ అనుబంధం ఉంది. దైవబంధం ఉంది. ఆయన పాటలు ఆలయాల్లో నేటికీ సుప్రభాత గీతాలు. ‘పాడెద నీ నా నామమే గోపాల’... ‘రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య’, ‘కన్నయ్యా... నల్లని కన్నయ్య’... ‘మనసే కోవెలగా... మమతలు మల్లెలుగా... నిన్నే కొలిచెదరా... కృష్ణా’... ‘నేనె రాధనోయి గోపాలా’... ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో’... ‘మము పాలింపగ నడిచి వచ్చితివా’... వాణి జయరామ్‌కు దాశరథి వల్ల దక్కిన పూలసజ్జ వంటి గీతం చూడండి.పూజలు చేయ పూలు తెచ్చానునీ గుడి ముందే నిలిచానుతీయరా తలుపులను రామా...దాశరథికి వీణ ఇష్టం. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. సినిమా గీతాల్లో కూడా ఆయన ఈ వీణానాదాన్ని పలికించారు. ‘మదిలో వీణలు మ్రోగె’... ‘నీవు రావు నిదుర రాదు’.. ‘వేణుగాన లోలునిగన వేయి కనులు చాలవులే’.... ఇక ఈ పాట?మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనాఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే....నేటి నుంచి దాశరథి శతజయంతి సంవత్సర వేడుకలు మొదలుకానున్నాయి. సినిమా రంగం, సినీ సంగీత రంగం, సినీ గేయకర్తలు, అభిమానులు సమావేశాలు, సంగీత విభావరులు నిర్వహించుకుని దాశరథి పాటలను మళ్లీ తలుచుకుని పాడుకోవాల్సిన సందర్భం ఇది. అయితే మన సినిమా రంగానికి పెద్దగా ఇటువంటి వాటికి సమయం ఉండదు. కాని ప్రజల వద్ద శ్రోతల వద్ద ఉంటుంది. సత్కవిని తమ నాల్కల యందు నుంచి కడిగేసే మూర్ఖులు ఎంతమాత్రం కారు వారు. పాడుకుంటూ ఉంటారు. పాడుతూనే ఉంటారు. వారికి తనివి తీరదు.తనివి తీరలేదే నా మనసు నిండలేదేఏనాటి బంధమీ అనురాగం – కె -
ఘనంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు !
హైదరాబాద్: ఆర్య వైశ్య సంఘం ఇసామియా బజార్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా శనివారం నిర్వహించారు. ఇది ఇసామియా బజార్‌లోని నరసింహాస్వామి ఆలయం దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం ఫలహారం, అభిషేకం, సహస్త్ర నామార్చనతోపాటు హోమము నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి సంఘం సభ్యులందరికీ పగడి కట్టడం జరిపారు. ఈ సమయంలోనే సామూహిక కుంకుమార్చన సంఘంలోని మహిళ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం, అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సంఘం సభ్యులంతా దాండియా ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొమిరిశెట్టి అనిల్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఆలంపల్లి రవికుమార్, ట్రెజరర్ ఎర్రం లక్ష్మణ్, ఐపిపి మ్యాడమ్ అశోక్. ప్రాజెక్ట్ కన్వీనర్ హరినాతినీ శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ కల్వకుంట్ల శ్రీనివాస్. కోకన్వీనర్స్: పారెపల్లి మల్లేష్, పల్లెర్ల హరీష్ కుమార్, చీకటిమర్ల సంగయ్య. కో చైర్మన్: ముర్కి చంద్రమౌళి, రెగొండ చంద్రశేఖర్, నూనె నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు -
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
ట్యాంక్ బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర మహనీయుల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహనీయుల చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ విషయంపై మంత్రిమండలిలో చర్చించి, ప్రకటన చేస్తామని వెల్లడించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంథని నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వంటి ఎంతో మంది అగ్ర నాయకులతో కలసి శ్రీపాదరావు పనిచేశారని గుర్తుచేశారు. స్పీకర్‌గా శ్రీపాదరావు ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని కొనియాడారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు, ఆయన కుమారుడు శ్రీధర్‌బాబుతో కలసి పనిచేసిన వ్యక్తిగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లా డుతూ తన తండ్రి శ్రీపాదరావు ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు రంగాలలో సేవలందిస్తున్నవారికి అవార్డులను అందజేశారు. శ్రీపాదరావుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రాజ్‌ఠాకూర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌లతో పాటు శ్రీపాదరావు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నందికాదు కానీ.. గద్దర్ అవార్డులు
గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజున ప్రభుత్వం తరపున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ఇటీవల సినీ ప్రముఖులు నన్ను కలిశారు. గత ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చాయని, వాటిని పునరుద్ధరించాలని అడిగారు. నంది అవార్డులు కాదుగానీ, మా ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇస్తుంది..బాహుబలిలో శివగామి శాసనం మాదిరి ఈ వేదికగా చెబుతున్న ఈ ప్రకటనే శాసనం, జీఓ’అని సీఎం తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమకు స్ఫూర్తి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జెకట్టి గళం విప్పిన గొప్పవ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ఆయనతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలను బద్ధలు కొట్టామని తెలిపారు. దళితుడిని సీఎంను చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని, ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావుపూలే విగ్రహం కోసం ఎమ్మెల్సీ కవిత వచ్చి ఆ దళితుడికే వినతిపత్రం ఇచ్చిందన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయమై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు కలలు కంటున్నారు ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి ఆలోచన చేసేవారికి తెలంగాణ ప్రజలే ఘోరీ కడతారని స్పష్టం చేశారు. అది వారి ఒంటికి, ఇంటికి మంచిది కాదని హితవు పలికారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఐదు సంవత్సరాల పాటు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమపై ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్‌ను అవమానించిన ప్రగతిభవన్ గేట్లను బద్ధలు కొట్టామని, దానిని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజాభవన్‌గా మార్చామన్నారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, అందరం కలిసి నడుద్దామని, సామాజిక ప్రగతిశీలరాష్ట్రాన్ని నిర్మి ద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ‘పాటకు జీవకణం’, ‘తరగని ఘని’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గద్దర్ సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్, కూతురు వెన్నెలఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్యతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. -
Janjatiya Gaurav Divas: గిరిజనుల రుణం తీర్చుకుంటా..
కుంతీ: సమాజంలో అణగారిన వర్గమైన గిరిజనులకు న్యాయం చేకూర్చడానికి తమ ప్రభుత్వం ‘మిషన్ మోడ్’లో పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గిరిపుత్రులకు తాను రుణపడి ఉన్నానని, ఆ రుణ తీర్చుకుంటానని తెలిపారు. గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ‘జన జాతీయ గౌరవ్ దివస్’లో మోదీ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజనుల సంక్షేమం కోసం రూ.24,000 వేల కోట్లతో అమలు చేసే ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభించారు. పలు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుంతీలోని ఫుట్‌బాల్ మైదానంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దేశ అభివృద్ధికి మహిళలు, రైతులు, యువత, మధ్యతరగతి–పేదలు అనే నాలుగు వర్గాలను బలోపేతం చేయడం చాలా కీలకమని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జన్మించిన గడ్డకు గిరిజనుల రుణం తీర్చుకోవడానికి వచ్చానని అన్నారు. పౌరులపై అన్ని రకాల వివక్షను తొలగించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లు భావించాలని స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా.. అడవులు, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న గిరిజనుల కోసం ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ పథకం కింద ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కలి్పంచనున్నట్లు వివరించారు. రోడ్లు, టెలికాం వ్యవస్థ, విద్యుత్, గృహనిర్మాణం, సురక్షిత తాగు నీరు, పారిశుధ్య వసతులు, విద్యా, వైద్యం, జీవనోపాధి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా 22,000 గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న 75 గిరిజన జాతులను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. గిరిపుత్రుల బాగు కోసం గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. వారి అభివృద్ధే ధ్యేయంగా ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద రూ.24,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు. బిర్సా ముండాకు నివాళులు.. కుంతీ జిల్లాలోని ఉలీహతులో ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మ స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సందర్శించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా జన్మించి నేలపై మట్టిని తీసుకొని మోదీ తిలకంగా ధరించారు. ఆయన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఉలీహతులో స్థానికులు మోదీకి సాదర స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా గిరిజనులతో కలిసి మోదీ నృత్యం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందనివారికి ఆయా పథకాల గురించి ఈ యాత్ర ద్వారా వివరిస్తారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి 25 వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి విడుదల పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 15 విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18,000 కోట్ల నిధులను ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని మోదీ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మళ్ళీ పెళ్లి కృష్ణగారికి అంకితం
‘‘రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణగారు, విజయ నిర్మలగారు. వాళ్ల రథం మళ్లీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్‌ని మళ్లీ ప్రారంభించడం గర్వంగా ఉంది. సూపర్‌స్టార్ కృష్ణగారి 81వ జయంతి (మే 31) సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాను’’ అని వీకే నరేష్ అన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (26) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ నేను బతికున్నంత కాలం నటిస్తాను. అలాగే సమాజ సేవ చేస్తా’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వీకే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్’ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు. సంగీత దర ్శకుడు సురేష్ బొబ్బిలి, నటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. -
సింగపూర్‌లో వాసవి జయంతి సంబరాలు
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఇక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వాసవి జయంతితో పాటు VCMS దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆద్యంతమం ఆసక్తికరంగా జరిగాయి. కార్యక్రమాల్లో సుమారు 350 మందికి పైగా ఆర్య వైశ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా తెలుగు సంప్రదాయ భోజనాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో అలరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ మరియమ్మన్ ఆలయం వైస్ చైర్మన్ బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్ వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన VCMS పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు రంగా రవికి చిరు సత్కారం జరిగింది. 'గణానాం త్వ గణపతిం' అంటూ చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన రుగ్వేదం లోని గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారధ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ, కూర్పు, సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకుర్చారు. కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు. యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ మేడం, చిరంజీవి ఉమా మోనిష నంబూరిల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, కొండేటి ఈశాన్ కృష్ణ తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ అనంతర జరిగిన రథయాత్రలో భాగంగా శ్రీమతి గాదంశెట్టి నాగ సింధు గారి నేతృత్వంలో 16 మంది కళాకారిణులు చేసిన కోలాటం ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇదే సందర్భంగా VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను ప్రకటించారు. ప్రెసిడెంట్ గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్‌లను ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం సంస్థ అభివృద్ధికి చేసిన ఇతోధిక కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టికి ‘వాసవి సేవా కుసుమ’గా సత్కరించారు. సింగపూర్‌లో గత పది సంవత్సరాలుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్ లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్, సహ వ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి వ్యవహరించారు. కార్యనిర్వాహక బృందం, దాతలు, సేవాదళ సభ్యుల అంకితభావం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి పేర్కొంటూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
‘చంద్రబాబుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు లేదు’
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబు లేదంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు షోలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. తనను వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని సీనియర్ ఎన్టీఆరే చెప్పారు. స్వయానా ఎన్టీఆర్.. చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ చెప్పారు. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబు లేదు. చంద్రబాబు నిర్వహిస్తున్న మీటింగ్‌లకు జనం రావడం లేదు. చంద్రబాబువన్నీ అట్టర్ ఫ్లాప్ షోలే అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
తెలుగువారికి గర్వకారణం
‘‘మూకీల సమయంలోనే తెలంగాణ ప్రాంతం నుండి బాలీవుడ్‌కి వెళ్లి, హీరోగా నిలదొక్కుకున్న పైడి జయరాజ్‌గారి జీవితం నేటి తరాలకు స్ఫూర్తి’’ అని నిర్మాత శ్రావణ్ గౌడ్ అన్నారు. బాలీవుడ్లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకున్నారు దివంగత తెలుగు నటుడు పైడి జయరాజ్. సెప్టెంబర్ 28న ఆయన 113వ జయంతి. ఈ సందర్భంగా ‘సర్దార్ పాపన్న’ హీరో పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో పైడి జయరాజ్ జయంతి వేడుకలు జరిగాయి. ‘‘కరీంనగర్‌కు పైడి జయరాజ్‌గారి పేరు ప్రకటించాలి.. అలాగే పైడి జయరాజ్ పేరుతో అవార్డ్స్ ఇవ్వాలి’’ అన్నారు జైహింద్ గౌడ్ . -
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా సీఎం జగన్ పాలన
-
నిజాం వ్యతిరేక ఉద్యమనిర్మాత ఐలమ్మ
కవాడిగూడ(హైదరాబాద్): నిజాం నవాబుకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మహిళా సంక్షేమం కోసం పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకుని లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ రజక ధోబీ అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని యాదవ్, రజక ధోబీ అభివృద్ధి జాతీయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ఎం. అంజయ్య, తెలంగాణ రాష్ట్ర రజక ధోబీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. బహుళజాతి కంపెనీలు రజక వృత్తిని సొంతం చేసుకుని వారికి అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా రజకుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కల్పించేందుకు చాకలి ఐలమ్మ చేసిన స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ప్రొటోకాల్ వివాదం.. వేడుకల్లో ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫొటో లేదంటూ టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ జి.రచనశ్రీ ఫొటో లేదంటూ బీజేపీ నేతలు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇరుపార్టీల నేతలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే నిర్వాహకులు ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఫొటోను ఫ్లెక్సీపై అతికించడం కొసమెరుపు. పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం: మంత్రి తలసాని పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక భూపోరాటాలు, పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఆమె జయంతి, వర్ధంతులను ప్రజలందరూ పండుగలా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
బాలసుబ్రహ్మణ్యం కారణజన్ముడు
జూన్ 4న దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా తెలుగు చిత్రసీమ ‘స్వర నీరాజన ం’ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని 12 గంటల పాటు లైవ్‌లో చూపించారు. ఈ సందర్భంగా జూమ్‌లో పలువురు ప్రముఖులు ఎస్పీబీ గురించి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. నేను మళ్లీ సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు? అనిపించే లోటును సృష్టించిన మహావ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు’’ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘బాలుగారు చిత్ర పరిశ్రమలో తొలిసారి నా చిత్రం ‘నేనంటే నేనే’కు పూర్తి పాటలు పాడారు. ఆ తర్వాత నా అన్ని సినిమాలకు ఆయనే పాడారు. 16 భాషల్లో పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలు మన తెలుగువాడు అవడం మన అదృష్టం’’ అన్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘బాలు ఎంత గొప్పవాడు అంటే దేశమంతా ఆయన పాటలు విని సంతృప్తిపడినవారు ఉన్నారు’’ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ‘‘అన్నయ్య బాలుతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. బాలూగారు అని నేను ఆయన్ని పిలిస్తే, అన్నయ్యా అని పిలవమన్నారు. సంగీతం ఉన్నంతవరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు’’ అన్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలూగారి గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు ఆయన’’ అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు. అందరూ ఇలా కలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. నాన్నగారు పై నుంచి మనకు ఆశీర్వాదాలు అందిస్తుంటారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్, సాయికుమార్, జీవితారాజశేఖర్, ఆర్పీ పట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్. శంకర్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, జేకే భారవి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీరం పాటలు బాలూకి అంకితం ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు మా ‘తీరం’ చిత్రంలో ‘అసలేంటీ ప్రేమ..’ పాట పాడారు. ఆయన పాడిన చివరి పాట మా సినిమానే కావడంతో చిత్రంలోని మిగిలిన 8 పాటలను ఆయనకు అంకితం ఇస్తున్నాం. ఈ పాటలను బాలూగారి ఫ్యాన్స్ కోసం ఉచితంగా ‘ఫ్రీ టు ఎయిర్’గా రిలీజ్ చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత అనిల్ ఇనమడుగు. శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి నటించిన చిత్రం ‘తీరం’. ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా నిర్మాత శ్రీలత, చిత్రసంగీత దర్శకుడు ప్రశాంత్ బి.జె, పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘురాం పాల్గొన్నారు. -
దృఢ భారత్.. నేతాజీకి గర్వకారణం
కోల్‌కతా/సాక్షి, న్యూఢిల్లీ: బలమైన భారతదేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగు జాడల్లో నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ ఇప్పుడు జీవించి ఉంటే అన్ని విధాలా బలోపేతమైన భారత్‌ను చూసి గర్వపడేవారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి మనమే సొంతంగా టీకాలు అభివృద్ధి చేసుకోవడం, ఇతర దేశాలకు సైతం టీకాలను అందజేయడం, మన దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడు దీటుగా జవాబు ఇవ్వడం చూసి నేతాజీ ఎంతగానో గర్వపడేవారని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎల్ఏసీ నుంచి ఎల్ఓసీ వరకు బలమైన భారత్ రూపుదిద్దుకోవాలని నేతాజీ కలలుగన్నారని, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామని తెలిపారు. అజేయమైన సైనిక శక్తి మన సొంతమని చెప్పారు. తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకున్నామని వివరించారు. దీవికి బోస్ పేరుపెట్టడం నా అదృష్టం ఆత్మనిర్భర్ భారత్, సోనార్ బంగ్లాను(బంగారు బెంగాల్) కలగనడానికి నేతాజీ గొప్ప స్ఫూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు. బోస్ పేరు విన్నప్పుడల్లా తాను ఎంతగానో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ఆయన స్వాతంత్య్రం కోసం అర్థించలేదని, దాని కోసం పోరాటం సాగించారని శ్లాఘించారు. 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బోస్‌కు సంబంధించిన ఫైళ్లను ప్రజల ముందుంచామని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు బోస్‌కు రుణపడి ఉన్నాడని ఉద్ఘాటించారు. 130 కోట్ల మందిలోని ప్రతి రక్తం చుక్క బోస్‌కు రుణపడి ఉంటుందన్నారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొనే ముందు సుభాష్ చంద్రబోస్ తన మేనల్లుడు శిశిర్ బోస్‌ను ‘నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా?’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. గుండెపై చెయ్యి వేసుకొని, నేతాజీ సమక్షంలో ఉన్నట్లు ఊహించుకుంటే అదే ప్రశ్న వినిపిస్తుందన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించినట్లుగానే ఆత్మనిర్భర్ భారత్‌లోనూ బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జైశ్రీరామ్‌లో తప్పేముంది?: బీజేపీ మమతా బెనర్జీ తీరు పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జైశ్రీరామ్ నినాదంలో తప్పేముందని నిలదీశారు. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నినాదంలో ఎలాంటి తప్పు లేదని, నేతాజీ జయంతిని రాజకీయం చేయొద్దని నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ సూచించారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించారని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ఒక మహిళను పది మందిలో అవమానించడం దారుణమన్నారు. ఈ ఘటన తమ రాష్ట్రానికే అవమానమని సీపీఎం సీనియర్ నేత బిమన్ బోస్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా నినాదాలు చేయడాన్ని టీఎంసీ ముఖ్య అధికార ప్రతినిధి డెరెక్ ఓ బ్రెయిన్ తప్పుపట్టారు. బోస్ నివాసంలో మోదీ కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. అక్కడ కళాకారులు, ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నన్ను పిలిచి అవమానిస్తారా? బెంగాల్ సీఎం మమత విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రసంగించేందుకు ఆమె ఉద్యుక్తురాలు కాగానే కొందరు ప్రధాని సమక్షంలో జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినదించారు. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. తనను ఈ వేడుకకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇలాంటి చోట మర్యాద పాటించాలన్నారు. పిలిచి అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను ఇక మాట్లాడబోనని, జై బంగ్లా, జైహింద్ అంటూ ముగించారు. -
నాన్నగారు మా తరతరాలకు గుర్తింపునిచ్చారు
తెలుగు తెరపై హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య. ఆయన మన మధ్య లేకున్నా ఆయన వదిలిన పదాలు, బాడీ లాంగ్వేజ్ మరువలేని జ్ఞాపకాలు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించడంతో పాటు చివరి శ్వాస వరకూ నటించి, సినిమాపై తన ప్రేమని చాటుకున్నారు అల్లు రామలింగయ్య. నటుడుగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన వృత్తి హోమియోపతిని మాత్రం వదల్లేదు. నిర్మాతగా మారి, గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అనేక సూపర్‌హిట్స్ కూడా అందించారు. అలాంటి మహానటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ 1న. ఈ సంవత్సరం ఆయన 99వ జయంతి. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య తనయుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ –‘‘మా నాన్న తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయిలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం. ఈ మధ్య నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళితే అక్కడ ఒకావిడ నన్ను చూసి, ‘నమస్కారం అరవింద్‌గారు’ అని పలకరించారు. అక్కడే ఉన్న వాళ్ల అమ్మకి అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అని పరిచయం చేశారావిడ. నాన్నగారు తరతరాలకు మా ఫ్యామిలీకి గుర్తింపునిచ్చారు’’ అన్నారు. అల్లు స్టూడియో అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు వెంకటేష్, అల్లు అర్జు¯Œ , అల్లు శిరీష్‌ల నిర్వహణలో అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్లు స్టూడియోలో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉండబోతుంది? ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? అనే విషయాలు త్వరలో తెలియజేస్తారు. -
పైడి జయరాజ్ సేవలు మరువలేనివి
‘‘తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తరం ఇండియన్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత పైడి జయరాజ్ భారతీయ సినిమాకు అందించిన సేవలు మరువలేనివి. ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారుమ్రోగేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పైడి జయరాజ్ 111వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ‘జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ’ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సారధ్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ లో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్ పేరిట ఇవ్వాలి. అంతేకాకుండా హైదరాబాద్–కరీంనగర్ హైవేకి పైడి జయరాజ్ హైవేగా నామకరణం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్.వి. సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, నటుడు బాబూమోహన్, ‘తెలుగు నిర్మాతల మండలి’ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షులు మోహన్ గౌడ్, హీరో పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అంతటి చరిష్మా ఏ దర్శకుడికీ లేదు
‘‘నేడు ఆ మహనీయుడి 90వ పుట్టినరోజు. ఆయన లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’’ అంటున్నారు రజనీకాంత్. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ను ఉద్దేశించి ఆయన ఈ విధంగా అన్నారు. జూలై 9 బాలచందర్ జయంతి. ఈ సందర్భంగా రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ –‘‘ఆ రోజు నన్ను ఆయన చేరదీసి సినిమాల్లో పరిచయం చేయకపోయుంటే ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. కన్నడ సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ ఏదో కొన్ని సినిమాలు చేసి ఉండేవాడినేమో. ఆయన నాకు అవకాశం ఇవ్వడంతోపాటు నా పేరు మార్చి (రజనీ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్), నా బలహీనతల్ని తొలగించి, నా బలాన్ని చాటి చెప్పారు. నన్ను పూర్తి స్థాయి నటునిగా తీర్చిదిద్దారు. తమిళ చిత్రపరిశ్రమలో స్టార్‌గా నిలబెట్టారు. నా తల్లిదండ్రులు, నా సోదరుడు, బాలచందర్‌గారు.. ఈ నలుగురూ నా జీవితానికి దేవుళ్లు. నాతో పాటు ఎంతోమంది నటీనటుల్ని తీర్చిదిద్దారాయన. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. కానీ బాలచందర్‌గారు సెట్లోకి రాగానే లైట్‌బాయ్ నుండి ముఖ్య టెక్నీషియన్ల వరకూ అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసేవారు. అంతటి చరిష్మా ఉన్న దర్శకుడు కేబీగారు ఒక్కరే. వేరే ఎవరికీ ఆ చరిష్మా లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన నా గురువు అని నేనీ మాటలు చెప్పటంలేదు. నిజంగా గొప్ప మహనీయుడు’’ అన్నారు. తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ (1975) ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్ పరిచయం చేశారు. కమల్‌హాసన్, శ్రీవిద్య, సౌందరరాజన్, రజనీ, జయసుధ తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. తొలి చిత్రంతోనే నటుడిగా రజనీకి మంచి పేరు వచ్చింది. తమిళ పరిశ్రమకు సూపర్ స్టార్‌ని ఇచ్చిన సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’గా దాసరి నారాయణరావు రీమేక్ చేశారు. తమిళంలో కీలక పాత్ర చేసిన శ్రీవిద్య తెలుగులోనూ నటించగా, ఇతర కీలక పాత్రల్లో తెలుగు తారలు నరసింహరాజు, కైకాల సత్యనారాయణ, మాధవి నటించారు. -
రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్
‘‘రామానాయుడుగారంటే మాకు ఓ హీరో, రోల్‌మోడల్. దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తులు. సినీ పరిశ్రమ, దాని అనుబంధ కార్యాలయాలన్నీ అభివృద్ధి కావడానికి రామానాయుడుగారే కారణం. ఆయన జయంతిని మేం గొప్పగా జరుపుకుంటాం. ఆయన్ను తలచుకునే సినిమా స్టార్ట్ చేస్తాం. రామానాయుడుగారి వారసుడిగా అభిరామ్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడు’’ అని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ –‘‘రామానాయుడుగారు లేకుంటే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ, ఫిలిం నగర్, హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు. రామానాయుడుగారి పేరుతో ఏది మొదలుపెట్టినా అది సక్సెస్. చెన్నారెడ్డి, దాసరి నారాయణరావు, రామానాయుడుగార్లు ఫిలింనగర్‌కు దేవుళ్లులాంటి వారు’’ అని అన్నారు. ‘‘నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్ఫూర్తి. వారి ఫాలోయర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్లో మంచి సినిమాలు రావడానికి నాయుడుగారి ప్రోత్సాహం ఉంది’’ అన్నారు నిర్మాత కేఎస్ రామారావు. ‘‘మా తాతగారు భౌతికంగా లేకున్నా మానసికంగా నాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు’’ అన్నారు అభిరామ్. ఈ కార్యక్రమంలో రామానాయుడు పెద్ద కుమారుడు, నిర్మాత డి. సురేష్‌బాబు, సి.కల్యాణ్, కేఎస్ రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్య నారాయణ, జె. బాలరాజు రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
యువతకు స్ఫూర్తిప్రదాత నేతాజీ
నాంపల్లి: యువతరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ గురువారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’ముగింపు వేడుకలు, యువజన అవార్డుల ప్రదానోత్సవం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాట్లాడుతూ...నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికీ స్వాతంత్య్రోద్యమంలో పనిచేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదులుకున్న గొప్ప మహనీయుడు నేతాజీ అని కీర్తించారు. యువజన అవార్డులు గెలుపొందిన వారికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశా రు. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా ఫ్రెండ్స్ యూత్ క్లబ్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రూ.1లక్ష చెక్కుతో పాటుగా రాష్ట్రస్థాయి యువజన పురస్కారాన్ని అందజేశారు. -
బాపూ నీ బాటలో..
ఐక్యరాజ్యసమితి: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ స్టాంపుని ప్రపంచదేశాల అధినేతల సమక్షంలో బుధవారం విడుదల చేశారు. ఇదే సందర్భంగా ‘‘నాయకత్వ లక్షణాలు సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’’అనే అంశంపై మోదీ మాట్లాడారు. సమష్టి పోరాటం, సంయుక్త లక్ష్యాలు, నైతిక ప్రమాణాలు, ప్రజా ఉద్యమాలు, వ్యక్తిగత బాధ్యత వంటి అంశాలపై గాంధీజీకి ఎనలేని విశ్వాసం ఉందని సమకాలీన ప్రపంచానికి కూడా అవి వర్తిస్తాయని అన్నారు.హింసాత్మక ఘర్షణలు, ఆర్థిక అసమానతలు, సామాజిక ఆర్థిక అణచివేత, వాతావరణంలో అనూహ్య మార్పులు వంటివి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రభావితం చూపిస్తున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని ఎదుర్కోవడానికి నాయకత్వ లక్షణాలే అత్యంత ముఖ్యమని గాంధీ విలువలు, పాటించిన సిద్ధాంతాలే నాయకత్వ లక్షణాల్ని పెంపొందిస్తాయని అన్నారు. ‘‘గాంధీజీ భారతీయుడే. కానీ కేవలం ఆయన భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఎందరో ప్రపంచ అధినేతలపై గాంధీజీ ప్రభావం ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి నేతలు గాంధీ సిద్ధాంతాలు, ఆశయాలతో స్ఫూర్తి పొందారు. గాంధీతో వ్యక్తిగత పరిచయం లేని వారు కూడా ఆయనకు ఆకర్షితులయ్యారంటే ఆయన ఔన్నత్యం ఎలాంటితో అర్థమవుతుంది’’అని మోదీ అన్నారు. అందరినీ ఎలా ఆకట్టుకోవాలో అన్న ప్రపంచంలో మనం ఇప్పుడు బతికేస్తున్నాం కానీ గాంధీజీ అందరిలోనూ ఎలా స్ఫూర్తి నింపాలో అన్న ఆశయంతో జీవించారు అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతకాలంలో ప్రజాస్వామ్యానికి అర్థం కుచించుకుపోతోంది. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ప్రభుత్వం వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలి. కానీ గాంధీ మాత్రం ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వావలంబన సాధించాలని కోరుకున్నారని మోదీ గుర్తు చేశారు. ఇదే కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ మాట్లాడుతూ అంటరాని వారు అంటూ సమాజం హేళన చేసిన వర్గాల్ని హరిజనులు, దేవుని పిల్లలంటూ గాంధీజీ అక్కున చేర్చుకున్న విధానం అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తుందని అన్నారు. నిమ్న వర్గాల దృష్టి కోణం నుంచే సమాజాన్ని చూసి గొప్ప నాయకుడిగా అవతరించారని, ఆయన ఆదర్శాలు ప్రపంచానికే పాఠాలు నేర్పుతాయని అంటోనియో గుటరెస్ అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితికి భారత్ కానుకగా ఇచ్చిన సోలార్ పార్క్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఖాదీ కర్చీఫ్ కానుక ఇదే సందర్భంలో గాంధీ ఇచ్చే కానుకల గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ను మోదీ కలిసినప్పుడు ఆమె ఖాదీతో చేసిన చిన్న రుమాలుని చూపించారట. రాణి వివాహ సమయంలో గాంధీ స్వయంగా ఆ ఖాదీ కర్చీఫ్ ఆమెకి కానుకగా ఇచ్చారని రాణి చెప్పారట. ఈ విషయాన్ని చెబుతూ రాణి ఎలిజబెత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని మోదీ వెల్లడించారు. ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం న్యూయార్క్: మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతీ ఏడాది ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు మోదీకి దక్కింది. భారత్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ సర్కార్ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ఐక్యరాజ్య సమితి విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ‘మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ అవార్డు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకం’ అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకోనున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందనున్నాడు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ జాతీయ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నేడు అల్లూరి జయంతి : జ్ఞాపకాలు అక్కడ పదిలం
సాక్షి, రంపచోడవరం(రాజమండ్రి) : తూర్పు మన్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం ఇప్పటికీ గిరిజనాల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది. అల్లూరి సీతారామరాజును ఏజెన్సీ గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఆదివాసీల తరఫున బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యం చేసి అల్లూరి పోరాడారు. అల్లూరి రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తికెళ్లిన భవనాలు నేటికీ పదిలంగా ఉంచారు. అల్లూరి జరిపిన పోరాటాలకు జ్ఞాపకాలుగా ఉంచారు. రంప గిరిజనుల తరఫున అల్లూరి చేసిన రంప పితూరి చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అప్పట్లో అల్లూరి అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో రెండేళ్లు వ్యవసాయం చేశారు. ఏజెన్సీలో ఏటా గిరిజనులు అల్లూరి జయంతి, వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు. పైడిపుట్టలో వ్యవసాయం అడ్డతీగల మండలం పైడిపుట్ట గ్రామంలో అల్లూరి సీతారామరాజు కొంతకాలం వ్యవసాయం చేశారు. విప్లవ భావాలతో ఉన్న ఆయన దృష్టిని మార్చాలని అల్లూరి తండ్రి స్నేహితుడు, పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజుల్లాఖాన్ సీతారామరాజును పైడిపుట్ట పంపించి 30 ఎకరాల భూమి ఇచ్చారు. తల్లి సూర్యనారాయణమ్మ, తమ్ముడు సత్యనారాయణరాజులో కలిసి వ్యవసాయం చేశారు. మూలికా వైద్యం చేసే అల్లూరి వద్దకు గిరిజనులు ఎక్కువగా వచ్చే వారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని, ఉద్యమాలపై వెళ్లవద్దని చెప్పారు. ఫజుల్లాఖాన్ చనిపోయాక అల్లూరి విప్లవోద్యమ బాట పట్టారు. పైడిపుట్ట గ్రామం తల్లిని, తమ్ముడిని ఎడ్లబండిపై భీమవరం పంపించి తాను మాత్రం అడవుల్లోకి వెళ్లిపోయారు. పైడిపుట్టలో నివాసం ఉన్న సీతారామరాజు రోజూ అడ్డతీగల సైకిల్‌పై వెళ్లి పత్రికలు చదివేవారు. సీతారామరాజుపై నిఘా ఉంచి బ్రిటిష్ వారు రామరాజు దినచర్య రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆయన ఉద్యమంలోకి వెళ్లే ముందు పైడిపుట్టలో భూమి ఇచ్చిన దుశ్చర్తి ముఠాదారు చెక్కా లింగన్నదొరకు తిరిగి భూమిని ఇచ్చి రాసిన లేఖ నేటికీ పదిలంగా ఉంది. రంప రాజ్యాన్ని మునసబుదారు భూపతి పాలనలో ఉండేది. తరువాత అతడి వారసులు పాలించారు. వారు పంట, తాటిచెట్లపై పన్నుల భారం మోపారు. అది తట్టుకోలేక గిరిజనులు తిరగబడ్డారు. గిరిజనులు జరిపిన రంప పితూరీకి అల్లూరి అండగా నిలిచారు. ఏజెన్సీలో పోలీస్స్టేషన్లపై అల్లూరి దాడి బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు సాయుధ పోరాటమే మార్గమని భావించిన అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు.1922లో విశాఖ జిల్లా చింతపల్లి, 23న కేడీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేసి ఆయుధాలు కొల్లాగొట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనికులను రంగంలో దింపింది. కొంత కాలం వ్యవధి తరువాత 1922 అక్టోబర్ 15న అడ్డతీగల, 19న రంపచోడవరం పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరులతో దాడి చేసిన అల్లూరి సీతారామరాజు తాను గతంలో నివాసం ఉన్న పైడిపుట్ట వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది. అక్కడ కొంత సమయం గిరిజనులతో అల్లూరి మాట్లాడారు. అక్కడి నుంచి గంగవరం మండలం మోహనాపురం మీదుగా రంప గ్రామానికి వచ్చారు. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి అల్లూరి నడయాడిన మన్యం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి అల్లూరి దాడి చేసిన పోలీస్స్టేషన్లు, ఆయన నివాసం, వ్యవసాయం చేసిన పైడిపుట్ట, బ్రిటిష్ వారి చేతిలో చనిపోయిన కొయ్యూరు, అల్లూరి సమాధి ఉన్న కేడీ పేట వరకు పర్యాటకులు తిలకించేలా అభివృద్ది చేయాల్సి ఉంది. కృత్తివెంటి స్కూల్లో అల్లూరి విద్యాభ్యాసం రామచంద్రపురం : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగిన అల్లూరి సీతారామరాజు ప్రాథమిక విద్యాభ్యాసం ఏడాది పాటు రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు స్కూల్లో సాగింది. ప్రముఖ న్యాయవాది కృత్తివెంటి పేర్రాజు పంతులు వంద ఎకరాల భూమిని దానం చేసి పట్టణంలో 1905లో జాతీయ పాఠశాల అనే నామకరణం చేసి మిడిల్ స్కూల్‌ను స్థాపించారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఈ పాఠశాలను మొదట్లో స్థాపించారు. సమర వీరుడు అల్లూరి సీతారామరాజు రామచంద్రపురం కృత్తివెంటి మిడిల్ స్కూల్లో 6వ తరగతి విద్యను అభ్యసించినట్టు చెబుతున్నారు. నాలుగో తరగతిని తుని రాజావారి పాఠశాలలో 1913 జూలై 25న (అడ్మిషన్ నంబర్797) చేరినట్టు అప్పట్లో వార్తాపత్రికల ద్వారా తెలిసింది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నడయాడిన కృత్తివెంటి స్కూల్ 1915–16లో సీకే గోవిందరాజు ప్రధానోపాధ్యాయుడిగా ఉండగా కృత్తివెంటి మిడిల్ స్కూల్లో అల్లూరి సీతారామరాజు ఆరో తరగతి చదివినట్టు స్పష్టమవుతోంది. అనంతరం ఆయన కాకినాడ పీఆర్ హైస్కూల్లో, నర్సాపురంలో చదివినట్టు తెలుస్తోంది. అల్లూరి నడయాడిన పాఠశాలగా నేటికీ పలు సందర్భాల్లో పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో వక్తలు చెబుతుంటారు. 2006 జనవరి 9న పాఠశాల శత జయంతి ఉత్సవాల్లో కూడా అల్లూరిని పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కొనియాడారు. -
మావో వేడుకలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: స్వతంత్ర చైనా తొలి చైర్మన్ మావో జెండాంగ్ 125వ జయంతి వేడుకలపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్ సొసైటీ చీఫ్ క్వీ హంక్సువాన్ను అరెస్ట్ చేసింది. పెకింగ్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ‘నేను క్వీ హాంక్సువాన్ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు. -
వైఎస్ఆర్సీపీ ఆద్వర్యంలో వావిలాల జయంతి వేడుకలు
-
ఒక్క పేజీకి మూడున్నర కోట్లు
వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను ఆర్థికరంగంతో ముడిపెట్టి దోపిడీ గుట్టువిప్పిన కారల్ మార్క్స్ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్ కాపిటల్ రాతప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది. ఈ నెల 3న బీజింగ్‌లో మార్క్స్ రాసిన దాస్ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్లకు పైగా ధర పలికింది. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య కాలంలో లండన్‌లో దాస్ కాపిటల్ రాయడం కోసం ఆయన తయారుచేసుకున్న 1,250 పేజీల నోట్సులోనిదే ఈ పేజీ అని భావిస్తున్నారు. చైనాకి చెందిన ఫెంగ్ లుంగ్ అనే వ్యాపారవేత్త బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ వేలం కార్యక్రమంలో 5,23,000 డాలర్లకు ఈ పేజీ అమ్ముడయ్యింది. 3 లక్షల యువాన్లతో ప్రారంభమైన ఈ వేలం ముగిసేసరికి 3.34 మిలియన్ యువాన్లు అంటే 5,23000 డాలర్లు పలికింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మానిఫెస్టో పుస్తక సహ రచయిత, మార్క్స్ సహచరుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాత ప్రతిని సైతం వేలం వేసారు. 1862 నవంబర్‌లో ఓ పత్రిక కోసం ఎంగెల్స్ దాన్ని రాసినట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. అయితే ఎంగెల్స్ రాత ప్రతి 1.67 మిలియన్ యువాన్లకు అమ్ముడపోయింది. -సాక్షి నాల్డెజ్ సెంటర్ -
ఘనంగా నృసింహ స్వామి జయంతోత్సవాలు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం దిగువ అహోబిలంలో వెలసిన ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తిరమంజనం నిర్వహించి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్లను కొలువుంచి మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈనెల 9వ తేదీ వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
భక్త రామదాసు జయంత్యుత్సవాలు ప్రారంభం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాముడి ప్రీతిపాత్రుడైన భక్త రామదాసు 384వ జయంత్యుత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం అభిషేకం అనంతరం సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చారు. మంగళహారతులు ఇచ్చిన అనంతరం జయంత్యుత్సవాలను ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత కార్యక్రమాలు ఉంటాయని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు, కళాకారులు భక్త రామదాసు కీర్తనలను భక్తిభావంతో ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు శ్రీ చక్ర సిమెంట్స్ అధినేత నెంద్రగంటి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
24వ తేదీ వరకు గ్రామోదయ్ సే..
♦ అంబేడ్కర్ ఆశయాలపై గ్రామీణులకు అవగాహన ♦ ప్రతి పల్లెలో ప్రభాత భేరీలు.. పథకాలపై చైతన్యం ♦ 24న పీఎం సభకు జిల్లా నుంచి నలుగురు సర్పంచ్‌లు ♦ ‘సాక్షి’తో జిల్లా పంచాయతీ అధికారి అరుణ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 24వ తేదీవరకు ‘గ్రామోదయ్ సే.. భారత్ ఉదయ్ అభియాన్’ను చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జే.అరుణ తెలిపారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీ వరకు ‘గ్రామోదయ్‌సే.. భారత్ ఉదయ్ అభియాన్’ను నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జే.అరుణ తెలిపారు. అంబేడ్కర్ సంస్మరణ సభలు, పంచాయతీరాజ్ వ్యవస్థ విశిష్టత, పల్లెల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై ఈ పది రోజుల్లో అవగాహన సదస్సులు, ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 16వ తేదీవరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాలు, అంటరానితనం నిర్మూలన, కుల, మత సామరస్యంపై అంబేడ్కర్ ఆశయాలను గ్రామీణులకు వివరించనున్నట్లు కల్పించనున్నట్లు తెలిపారు. 17 నుంచి 20వ తేదీవరకు రైతు సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్‌కార్డు తదితర అంశాలపై రైతులను చైతన్యం చేయనున్నట్లు స్పష్టంచేశారు. 21 నుంచి 24వ తేదీవరకు గ్రామాల్లో ‘ప్రభాతభేరీ’ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా సర్పంచ్ అధ్యక్షతన ప్రతి గ్రామంలో ర్యాలీలు తీస్తామని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆఖరి రోజు (24న) పంచాయతీరాజ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జంషెడ్‌పూర్‌లో జరిగే సభ ద్వారా సందేశం వినిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి నలుగురు సర్పంచ్‌లు (చీమలదరి, శామీర్‌పేట, మణికొండ, కీసర ) హాజరుకానున్నట్లు అరుణ వివరించారు. కేంద్రం నుంచి పరిశీలకుడు... గ్రామోదయ్‌సే భారత్ ఉదయ్ అభియాన్ కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం.. జిల్లాకు ప్రత్యేక పరిశీలకుడిని పంపింది. తమిళనాడుకు చెందిన చిన్నదురై 24వ తేదీవర కు ఇక్కడ పర్యటించి అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోనున్నారు.